2010–2019
నేనేలాగు గ్రహించగలను?
2019 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము.


2:3

నేనేలాగు గ్రహించగలను?

యేసు క్రీస్తు సువార్తను మనఃపూర్వకముగాను హృదయపూర్వకముగాను స్థిరముగాను మరియు త్రికరణశుద్ధితో నేర్చుకొని ఒకరికొకరు బోధించినప్పుడు, ఈ బోధనలు హృదయాలను పరివర్తింపజేస్తాయి.

నా ప్రియమైన సహోదర, సహోదరీలారా, మన ప్రియమైన ప్రవక్త అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ దర్శకత్వములో యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సర్వ సభ్య సమావేశములో మళ్ళీ ఇక్కడ ఉండుట ఎంత గొప్ప ఆనందము. మన కాలములో ఉన్న అవసరతల గురించి ఈ సమావేశములో ప్రార్థించి, పాడి, మాట్లాడేవారి బోధనల ద్వారా మన రక్షకుడైన యేసు క్రీస్తు స్వరమును వినే విశేషాధికారము మనం కలిగియుంటామని నేను సాక్ష్యమిస్తున్నాను.

అపొస్తలుల కార్యములలో లిఖించబడినట్లుగా, సువార్తికుడైన ఫిలిప్పు మంత్రియును, ఐతియొపీయుల రాణి ధనాగారమంతటి మీదనున్న ఐతియొపీయుడైన నపుంసకునికి సువార్త బోధించెను.1 యెరూషలేములో తన ఆరాధన ముగించుకొని తిరిగి వెళ్ళుచుండగా యెషయా గ్రంథమును చదివెను. ఆత్మచేత బలవంతము చేయబడిన ఫిలిప్పు ఆయన దగ్గరకు వచ్చి, “నీవు చదువునది గ్రహించుచున్నావా?” అని అడిగెను.

“మరియు [ఆ నపుంసకుడు] ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలను?” అని అడిగెను. . .

“అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను.”2

ఐతియొపీయుడు అడిగిన ప్రశ్న అభ్యసించుట కొరకు మరియు ఒకరికొకరు బోధించుకొనుటకు ప్రయత్నించుటకు మనందరము కలిగియున్న దివ్యమైన శాసనమును మనకు గుర్తుచేయును.3 వాస్తవానికి, సువార్తను నేర్చుకోవడానికి, బోధించడానికి గల సందర్భములో కొన్నిసార్లు మనం ఐతియొపీయుని వలె ఉన్నాము-విశ్వాసముగా, ప్రేరేపించబడిన బోధకుని సహాయము మనకు కావలెను; మనము కొన్నిసార్లు ఫిలిప్పువలె ఉన్నాము-ఇతరులకు బోధించి వారి పరివర్తనలో వారిని మనం బలపరచాలి.

యేసు క్రీస్తు యొక్క సువార్తను అభ్యసించుటకు మరియు దానిని బోధించుటకు ప్రయత్నించుటకు గల మన ఉద్దేశమేమనగా దేవునియందు, ఆయన దివ్యమైన సంతోషకర ప్రణాళికయందు, యేసు క్రీస్తునందు, ఆయన ప్రాయశ్చిత్త త్యాగమునందు విశ్వాసమును వృద్ధిచేయుట మరియు శాశ్వతమైన పరివర్తనను సాధించుట. అటువంటి వృద్ధిచెందిన విశ్వాసము, పరివర్తన దేవునితో నిబంధనలు చేసుకొని, గైకొనుటలో మనకు సహాయపడుతుంది, తద్వారా యేసును అనుసరించుటకు మన కోరికను బలపరచి, నిష్కపటమైన ఆత్మీయ రూపాంతరమును మనలో తీసుకొనివస్తుంది-అనగా, అపొస్తలుడైన పౌలు తన పత్రికలో కొరింథీయులకు బోధించినట్లుగా మనలను నూతన సృష్టిగా మార్చుతుంది. 4 ఈ రూపాంతరము మనలో మరింత సంతోషకరమైన, ఫలవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇస్తుంది, ఒక నిత్య దృక్పథమును మనం కలిగియుండేలా చేస్తుంది. ఐతియొపీయుడైన ఆ నపుంసకుడు రక్షకుని గురించి నేర్చుకొని, ఆయన సువార్తకు పరివర్తన చెందినప్పుడు వానికి ఖచ్చితముగా జరిగింది ఇది కాదా? “అతడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను”5 అని లేఖనాలు తెలియజేస్తున్నాయి.

సువార్తను నేర్చుకొని, ఒకరికొకరు బోధించుకొనుడనే ఆజ్ఞ కొత్తదేమీ కాదు; మనుష్య చరిత్ర ఆరంభము నుండి అది స్థిరముగా పునరావృతమౌతూ వచ్చింది.6 ఒక నిర్థిష్టమైన సందర్భములో వాగ్దాన దేశమునకు ప్రవేశింపకముందు మోషే, అతని జనులు మోయాబు మైదానములో ఉన్నప్పుడు, ప్రభువు నుండి వారు పొందిన కట్టడలను, నిబంధనలను నేర్చుకొని, వాటిని వారి సంతతికి 7బోధించమని తన జనులకు ఉపదేశించాలని ప్రభువు అతనిని ప్రేరేపించెను, వారిలో అనేకులు ఎర్ర సముద్రమును దాటుటను లేదా సీనాయి పర్వతము మీద ఇవ్వబడిన బయల్పాటును అనుభూతిచెందలేదు.

మోషే తన ప్రజలకు ఉపదేశించెను:

“కాబట్టి ఇశ్రాయేలీయులారా, వినుడి, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను. . .

“. . . నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించుము 8

మోషే ఇలా చెప్పి ముగించెను, “నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను.” 9

మన కుటుంబాలను “ప్రభువు యొక్క పోషణలోను, ఉపదేశములోను ” 10, “వెలుగులోను సత్యములోను”11 పెంచాలని దేవుని ప్రవక్తలు స్థిరముగా ఉపదేశించారు. అధ్యక్షులు నెల్సన్ ఇటీవల చెప్పారు, “ప్రభలుచున్న అవినీతి, వ్యసనకరమైన అశ్లీలచిత్రాలుగల ఈ కాలములో, తల్లిదండ్రులు తమ పిల్లలకు వారి జీవితాలలో దేవుడు [ మరియు యేసు క్రీస్తు] యొక్క ప్రాముఖ్యతను బోధించవలసిన పరిశుద్ధమైన బాధ్యతను కలిగియున్నారు. ”12

సహోదర సహోదరీలారా, పరలోక తండ్రి ఒకరు ఉన్నారని ఆయన మనలను ప్రేమిస్తున్నారని, తన పిల్లల కొరకు దివ్యమైన సంతోషకర ప్రణాళికను అభివృద్ధి చేసారని; ఆయన కుమారుడైన యేసు క్రీస్తు లోక విమోచకుడని; ఆయన నామమందు విశ్వాసముంచుట ద్వారా రక్షణ కలుగునని మనం నేర్చుకొని మరియు మన కుటుంబాలకు బోధించుటకు ప్రయత్నించుట మన వ్యక్తిగత బాధ్యత అని మన ప్రియమైన ప్రవక్త యొక్క హెచ్చరిక మనకు మళ్ళీ గుర్తుచేయునదిగా ఉన్నది. 13 మన విమోచకుడైన యేసు క్రీస్తు అనే బండపై మన జీవితాలు కట్టబడి, మన హృదయాలలో మన స్వంత ఆత్మీయభావనలు వ్యక్తిగతంగా, కుటుంబాలుగా చెక్కబడేలా మనకు సహాయం చేయును.14

బాప్తీస్మమిచ్చు యోహాను- యేసు దేవుని గొర్రెపిల్లయని, మెస్సీయా అని సాక్ష్యము చెప్పగా విని ఆయన శిష్యులలో ఇద్దరు యేసు క్రీస్తును అనుసరించారని మీరు జ్ఞాపకము చేసుకోవచ్చును. “వచ్చి చూడుడి”15 అని యేసు ఇచ్చిన ఆహ్వానమును అంగీకరించి, వారు ఆ దినము ఆయన యొద్ద బసచేసిరి. యేసే మెస్సీయా అని, దేవుని కుమారుడని వారు తెలుసుకొని తమ శేష జీవితమంతా ఆయనను వెంబడించిరి.

అదేవిధంగా, మనం రక్షకుడు ఇచ్చిన “వచ్చి చూడుడి” అనే ఆహ్వానము అంగీకరించినప్పుడు, ఆయనయందు మనం నిలిచియుండి, లేఖనాలలో మనల్ని మనం నిమగ్నము చేసుకొని, వాటియందు ఆనందించి, ఆయన సిద్ధాంతమును నేర్చుకొని, ఆయన జీవించిన విధముగా జీవించుటకు శ్రమపడాలి. అప్పుడు మాత్రమే ఆయనను మనం తెలుసుకుని, ఆయన స్వరమును గుర్తుపడతాము, మనం ఆయన యొద్దకు వచ్చి, ఆయన యందు నమ్మికయుంచినప్పుడు మనం ఎప్పటికి ఆకలిగొనక, దప్పికలేక యుందుమని తెలుసుకొందుము. 16 యేసు క్రీస్తుతో బసచేసిన ఆ ఇద్దరి శిష్యులకు జరిగినట్లుగా అన్ని వేళలా మనం సత్యమును వివేచించగలుగుతాము.

సహోదర సహోదరులారా అది ఏ ప్రయత్నము లేకుండా జరగదు. దైవత్వము యొక్క అత్యున్నత ప్రభావమును స్వీకరించే విధంగా మనల్ని మనం మలుచుకొనుట సాధారణమైన విషయం కాదు; అందుకు దేవునికి ప్రార్థన చేయుట, యేసు క్రీస్తు సువార్తను మన జీవితాలలో కేంద్రముగా చేసుకొనుట అవసరము. ఆ విధంగా మనం చేసినట్లైతే, పరిశుద్ధాత్మ ప్రభావము సత్యమును మన హృదయాలకు, మనస్సులకు చేర్చి, దాని గురించి సాక్ష్యము చెప్పి17 సమస్త విషయాలను బోధించును.18

“ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు [గ్రహింపగలను]?” అన్న ఆ ఐతియొపీయుని ప్రశ్న మనం నేర్చుకొన్న సువార్త సూత్రాలను మన జీవితాలలో ఆచరణలో పెట్టుటకు మనకు గల బాధ్యత అనే సందర్భములో ప్రత్యేకమైన అర్థము కూడా కలిగియున్నది. ఉదాహరణకు, ఐతియొపీయుని విషయములో, ఫిలిప్పు నుండి తాను నేర్చుకొనిన సత్యమును అతడు ఆచరణలో పెట్టెను. బాప్తీస్మము పొందవలెనని అతడు అడుగబడెను. యేసే దేవుని కుమారుడని అతడు తెలుసుకొనెను.19

సహోదర సహోదరీలారా, మనం ఏమి నేర్చుకొనుచున్నామో, ఏమి బోధిస్తున్నామో అనే వాటిని మన చర్యలు ప్రతిబింబించాలి. మనం జీవించే విధానము ద్వారా మన నమ్మకాలను చూపించవలసిన అవసరమున్నది. అత్యుత్తమమైన బోధకుడు మంచి ఆదర్శవంతుడు. మనం నిజంగా జీవించే దానిని బోధించడం మనం బోధించే వారి హృదయాలలో తప్పకుండా ప్రభావాన్ని చూపించగలదు. లేఖనాలను, సజీవులైన అపొస్తలులు, ప్రవక్తల బోధనలను జనులు-వారు కుటుంబస్థులైనా, కాకపోయినా- వాటిని ఆనందముగా భద్రపరుచుకోవాలని మనం కోరుకుంటే, వాటియందు మన ఆత్మలు ఆనందించుటను వారు చూడాలి. అదేవిధంగా, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ప్రవక్త, దీర్ఘ దర్శి, బయల్పాటు దారుడు అని వారు తెలుసుకోవాలని మనం కోరుకుంటే, ఆయనను బలపరచుటకు మనం చేతులెత్తగా వారు చూడడమే కాక, ఆయన ప్రేరేపిత బోధనలను మనం అనుసరిస్తున్నామని వారు చూడవలసిన అవసరమున్నది. అమెరికాలో ప్రాచుర్యము పొందిన ఒక నానుడి ఇలా చెప్పుతుంది “మాటలకంటే చేతలు గట్టిగా పలుకుతాయి.”

ఈ క్షణమందే మీలో కొందరు ఇలా ప్రశ్నించుకోవచ్చును, “ఎల్డర్ సోరెస్, వీటన్నిటిని నేను చేస్తున్నాను, ఈ నమూనాను వ్యక్తిగతముగా, కుటుంబముగా నేను అనుసరిస్తున్నాను కాని దురదృష్టవశాత్తు, నా స్నేహితులలో, నా ప్రియమైన వారిలో కొందరు ప్రభువు నుండి తమను తాము దూరం చేసుకొన్నారు. నేనేమి చెయ్యాలి?” ఇక్కడున్న మీలో ఎవరైనా ఇప్పడే అటువంటి విచారకరమైన, దుఃఖకరమైన లేదా చింతగల భావాలను అనుభవిస్తున్నట్లైతే, వారు పూర్తిగా తప్పిపోలేదని దయచేసి తెలుసుకోండి, ఎందుకంటే వారెక్కడ ఉన్నారో ప్రభువుకు తెలుసు, ఆయన వారిని కనిపెట్టుకొని యుండును. వారు కూడా ఆయన పిల్లలని గుర్తుంచుకోండి!

కొంతమంది వేరొక మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటారో వాటికి గల కారణాలన్నీ అర్థం చేసుకోవడం కష్టం. ఇటువంటి పరిస్థితులలో మనం చెయ్యగలిగిన ఉత్తమమైన పని ఏమిటంటే వారిని ప్రేమించి, హత్తుకొని, వారి సంక్షేమము కొరకు ప్రార్థించి, ఏమి చెయ్యాలో, ఏమి మాట్లాడాలో తెలుసుకొనుటకు ప్రభువు సహాయాన్ని కోరాలి. వారి విజయములో వారితో కలిసి నిష్కపడముగా ఆనందించండి; వారి స్నేహితులుగా ఉండి వారిలో ఉన్న మంచి కొరకు వెతకండి. వారిని ఈ విషయంలో ఎప్పటికి విడిచిపెట్టకూడదు కాని మన సంబంధాలు పట్టువిడువకుండా ఉండాలి. వారిని ఎప్పటికి తిరస్కరించవద్దు లేదా తప్పుగా తీర్పుతీర్చవద్దు. కేవలం వారిని ప్రేమించండి! పిల్లలు కొన్ని పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు వారు తరచు ఇంటికి రావాలని కోరుకుంటారని తప్పిపోయిన కుమారుని ఉపమానము మనకు బోధిస్తుంది. మీకు ప్రియమైన వారికి అది జరిగినట్లైతే, ఆ తప్పిపోయిన కుమారుడు చేసిన విధంగా మీ హృదయాలను జాలితో నింపండి, వారి యొద్దకు పరుగెత్తండి, వారి మెడపై పడి, ముద్దుపెట్టండి. 20

చివరకు, ఒక యోగ్యకరమైన జీవితాన్ని జీవించండి, మీరు వేటిని నమ్ముచున్నారో వాటి విషయంలో వారికి మంచి మాదిరిగా ఉండండి, మన రక్షకుడైన యేసు క్రీస్తునకు దగ్గరవ్వండి. మన తీవ్ర వేదనలు, బాధలు ఆయనకు తెలుసు మరియు అర్థము చేసుకొనును, మీ ప్రియమైన వారి యెడల మీరు చేయు ప్రయత్నాలు, అంకిత భావమును ఈ జీవితంలో కాకపోతే వచ్చే జీవితంలో నైనా ఆయన దీవించును. సహోదర, సహోదరీలారా సువార్త ప్రణాళికలో నిరీక్షణ అనేది ముఖ్యమైన భాగము అని గుర్తుంచుకోండి.

సంఘములో నేను సేవ చేసిన అనేక సంవత్సరాలలో, ఈ సూత్రములను తమ జీవితాలలో స్థిరముగా అన్వయించుకొన్న విశ్వాసులైన సంఘ సభ్యులను నేను చూసాను. “మేరీ” అని నేను సంబోధించు ఒక ఒంటరి తల్లి విషయంలో ఇదే జరిగింది. విచారకరముగా, మేరీ దుఃఖకరమైన విడాకుల అనుభవము కలిగియుండెను. తన జీవితములో ఈ నిర్థిష్టమైన సమయములో, ఆమె కుటుంబమునకు సంబంధించి ఆమె తీసుకొనే ముఖ్యమైన నిర్ణయాలు ఆత్మీయమైనవని మేరీ గుర్తించింది. ప్రార్థించుట, లేఖన పఠనము, ఉపవాసము, సంఘము మరియు దేవాలయమునకు హాజరగుట ఇకపైన కూడా ఆమెకు ముఖ్యమైనవిగా కొనసాగుతాయా?

మేరీ ఎల్లప్పుడు విశ్వాసముగా ఉండెను మరియు ఈ సంక్లిష్టమైన సమయములో, ఆమెకు అప్పటికే సత్యమని తెలిసిన దానికి లోబడియుండాలని ఆమె నిర్ణయించుకుంది. “కుటుంబము: లోకమునకు ఒక చాటింపు” లో ఆమె బలాన్ని పొందింది, అనేక అద్భుతమైన సూత్రాలలో ఒకటైన అది “తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమలో, నీతిలో పెంచుటకు పవిత్రమైన బాధ్యత కలిగియున్నారని” మరియు దేవుని ఆజ్ఞలు గైకొనాలని ఎల్లప్పుడు వారికి బోధించాలని బోధిస్తుంది.21 ఆమె ప్రభువు యొద్దనుండి సమాధానాల కొరకు ఎడతెగక వెతికెను మరియు వాటిని తన నలుగురు పిల్లలతో కుటుంబ కూడికలలో పంచుకుంది. వారు తరచు సువార్త గురించి చర్చించుకొని, తమ అనుభవాలను, సాక్ష్యాలను ఒకరితో ఒకరు పంచుకొన్నారు.

వారు అనుభవించిన వేదనలకు అతీతముగా, ఆమె పిల్లలు క్రీస్తు సువార్త పట్ల ప్రేమను, ఇతురలకు సేవచేసి, వారితో పంచుకోవాలన్న కోరికను పెంపొందించుకొన్నారు. వారిలో ముగ్గురు నమ్మకముగా పూర్తి కాల సువార్త పరిచర్య చేసారు, కనిష్ఠుడు ఉత్తర అమెరికాలో సేవ చేయుచుండెను. ఆమె పెద్ద కుమార్తె, ఇప్పుడు ఆమె వివాహము చేసుకొని, తన విశ్వాసములో బలముగా ఉండి, ఇలా చెప్పెను, “నా తల్లి మమ్మల్ని ఒంటరిగా పెంచిందని నేనెప్పుడు భావించలేదు ఎందుకంటే ప్రభువు ఎల్లప్పుడు మా గృహములో ఉన్నారు. ఆయన గురించి తాను కలిగియున్న సాక్ష్యమును ఆమె మాతో చెప్పినప్పుడు, మాలో ప్రతి ఒక్కరు మా స్వంత ప్రశ్నలతో ఆయన వైపుకు తిరుగుటకు మొదలుపెట్టాము. సువార్తకు ఆమె జీవము పోసినందుకు నేను చాలా కృతజ్ఞత కలిగియున్నాను.”

ఈ మంచి తల్లి తన గృహమును ఆత్మీయ అభ్యాసమునకు కేంద్రముగా చెయ్యగలిగెను. ఆ ఐతియొపీయుని ప్రశ్న వలె, మేరీ అనేక సార్లు తనను తాను ప్రశ్నించుకొనెను, “ఒక తల్లి వారిని నడిపించకపోతే నా పిల్లలు ఏవిధంగా నేర్చుకోగలరు?”

సువార్తలో నా సహచరులారా, మనఃపూర్వకముగాను, హృదయపూర్వకముగాను, స్థిరముగాను మరియు త్రికరణశుద్ధితో యేసు క్రీస్తు యొక్క సువార్తను నిజమైన ఉద్దేశముతో, ఆత్మ యొక్క ప్రభావములో బోధించినట్లైతే, ఈ బోధనలు హృదయాలను పరివర్తింపజేసి, దేవుని యొక్క సత్యాలకు అనుగుణంగా జీవించాలనే కోరికను ప్రేరేపిస్తాయని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను.

యేసు క్రీస్తు లోక రక్షకుడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన విమోచకుడు మరియు ఆయన సజీవుడై యున్నాడు. ఆయన తన అపొస్తలులు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారుల ద్వారా తన సంఘాన్ని నడిపిస్తున్నారని నేనెరుగుదును. దేవుడు సజీవుడని, మనల్ని ప్రేమిస్తున్నారని కూడా నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. మనందరము కూడా-ఆయన సన్నిధికి తిరిగి రావాలని ఆయన కోరుచున్నారు. ఆయన మన ప్రార్థనలను ఆలకించును. ఈ సత్యముల గురించి నా సాక్ష్యమును యేసు క్రీస్తు నామములో ఇస్తున్నాను, ఆమేన్.