“నా సువార్త సూత్రములు”
(సిద్ధాంతము మరియు నిబంధనలు 42:12)
సువార్త సూత్రమనేది నైతిక స్వేచ్ఛ యొక్క ధర్మబద్ధమైన సాధనకు సిద్ధాంతపరమైన మార్గదర్శకం.
1849 అక్టోబరులో యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క సర్వసభ్య సమావేశములో, యేసు క్రీస్తు సువార్తను ప్రకటించుటకు ఫ్రాన్స్ దేశమును తెరువమని పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క ఎల్డర్ జాన్ టేలర్ పిలువబడ్డారు. ఆ దేశంలో మొదటి అధికారిక సంఘ పత్రికకు సంపాదకత్వం వహించుట ఆయన సేవలో భాగమైంది. సంఘము గురించి తరచూ అడుగబడిన ప్రశ్నలకు సమాధానంగా ఎల్డర్ టేలర్ 1851లో ఒక కథనాన్ని తయారు చేసి ప్రచురించారు. ఆ వ్యాసం ముగింపులో, ఈ క్రింది విషయాన్ని ఎల్డర్ టేలర్ గుర్తుచేసుకొన్నారు:
“కొన్ని సంవత్సరాల క్రితం, నావూలో నేను వినుచుండగా శాసనసభ సభ్యుడైన ఒక పెద్దమనిషి, చాలా మంది ప్రజలను పరిపాలించడం మరియు అలాంటి పరిపూర్ణ క్రమాన్ని కాపాడడం ఆయనకు ఎలా సాధ్యమైనదని జోసెఫ్ స్మిత్‌ను అడిగాడు; మరెక్కడైనా ఆవిధంగా చేయడం వారికి అసాధ్యమని కూడా అతడు వ్యాఖ్యానించాడు. అలా చేయడం చాలా సులభం అని స్మిత్ గారు వ్యాఖ్యానించారు. ‘ఎలా?’ అని పెద్దమనిషి స్పందించాడు; ‘మాకైతే ఇది చాలా కష్టం.’ ‘నేను వారికి సరైన సూత్రాలను నేర్పుతాను, వారు తమనుతాము పరిపాలించుకుంటారు’” అని స్మిత్ గారు సమాధానమిచ్చారు.1
పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు సువార్తలో సూత్రాల యొక్క ముఖ్యమైన పాత్రను నేను నొక్కిచెప్తుండగా పరిశుద్ధాత్మ మనలో ప్రతి ఒక్కరికీ బోధించి, ఆత్మీయాభివృద్ధిని కలిగించాలని ప్రార్థిస్తున్నాను.
సూత్రములు
“ఈ సంఘ పెద్దలు, యాజకులు, బోధకులు బైబిలు మరియు మోర్మన్ గ్రంథములోనున్న నా సువార్త సూత్రములను బోధించవలెను, వాటియందు నా సంపూర్ణ సువార్త ఉన్నది”2 అని ప్రభువు ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కు బోధించెను. కడవరి-దిన పరిశుద్ధులు “సూత్రమందు, నియమమందు, సిద్ధాంతమందు, సువార్త నియమమందు, దేవుని రాజ్యమునకు సంబంధించి మీరు గ్రహించుటకు యుక్తమైన అన్ని విషయములందు మరింత పరిపూర్ణముగా ఉపదేశమును పొందవలెను”3 అని కూడా ఆయన ప్రకటించెను.
క్లుప్తంగా చెప్పాలంటే, సువార్త సూత్రమనేది నైతిక స్వేచ్ఛ యొక్క ధర్మబద్ధమైన సాధనకు సిద్ధాంతపరమైన మార్గదర్శకం. సూత్రాలు విస్తృత సువార్త సత్యాల నుండి ఉద్భవిస్తాయి మరియు మనము నిబంధన మార్గములో ముందుకు వెళ్ళేటప్పుడు దిశను, ప్రమాణాలను అందిస్తాయి.
ఉదాహరణకు, మొదటి మూడు విశ్వాస ప్రమాణాలు యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క సిద్ధాంతంలోని ప్రాథమిక అంశాలను గుర్తిస్తాయి: మొదటి విశ్వాస ప్రమాణంలో దైవ సమూహము యొక్క స్వభావం, రెండవ విశ్వాస ప్రమాణంలో ఆదాము హవ్వల పతనం యొక్క ప్రభావాలు, మూడవ విశ్వాస ప్రమాణంలో యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా సాధ్యమైన దీవెనలు. 4 మరియు నాలుగవ విశ్వాస ప్రమాణం మొదటి సూత్రాలను—యేసు క్రీస్తుపై విశ్వాసం మరియు పశ్చాత్తాపాన్ని సాధన చేయడానికి మార్గదర్శకాలను—మరియు యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం మన జీవితాల్లో సమర్థవంతంగా ఉండడానికి వీలు కల్పించే మొదటి యాజకత్వ విధులను వివరించును.5
సూత్రము ఒక మార్గదర్శకము అనుటకు జ్ఞానవాక్యము మరొక ఉదాహరణ. సిద్ధాంతము మరియు నిబంధనలు 89వ ప్రకరణము యొక్క పరిచయ వచనమును గమనించండి.
“వాగ్దానముతో కూడిన సూత్రముగా ఇవ్వబడి, పరిశుద్ధులందరిలో బలహీనులు, మిక్కిలి బలహీనులుగానుండి, పరిశుద్ధులుగా పిలువబడు లేదా పిలువబడగలిగిన వారి సామర్థ్యమునకు సవరించబడెను.
“ఇదిగో, నిశ్చయముగా ప్రభువు మీతో ఈలాగు సెలవిచ్చుచున్నాడు: చివరి దినములలో రహస్యముగా దుష్టాలోచనలు చేయు మనుష్యుల హృదయాలలో ఉండు, ఉండబోవు దుష్టత్వము మరియు ప్రణాళికలకు పర్యవసానముగా బయల్పాటు ద్వారా ఈ జ్ఞానవాక్యమును ఇచ్చుట ద్వారా నేను మిమ్ములను హెచ్చరించితిని మరియు ముందుగా హెచ్చరించుచున్నాను.”6
ఈ పరిచయము తరువాత వచ్చే ప్రేరేపిత సూచన శారీరక మరియు ఆత్మీయ శ్రేయస్సు కోసం శాశ్వతమైన మార్గదర్శకాలను అందిస్తుంది మరియు సూత్రంపట్ల మన విశ్వసనీయత మూలంగా సంభవించే నిర్దిష్ట ఆశీర్వాదాల సాక్ష్యాలను అందిస్తుంది.
నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం మరియు సువార్త సూత్రాలు అనుసరించి జీవించడం రక్షకుడిపై మన విశ్వాసాన్ని బలపరుస్తాయి, ఆయన పట్ల మనకున్న భక్తిని మరింత పెంచుతాయి, అనేక ఆశీర్వాదాలను మరియు ఆత్మీయ బహుమానాలను మన జీవితాల్లోకి ఆహ్వానిస్తాయి. వేర్వేరు పరిస్థితులు, సవాళ్ళు, నిర్ణయాలు మరియు మర్త్య అనుభవాలను మనం అనుభవిస్తున్నప్పుడు నిత్య సత్యం యొక్క విలువైన దృక్పథాన్ని అందించడం ద్వారా మన వ్యక్తిగత ప్రాధాన్యతలను మరియు స్వీయ-కేంద్రీకృత కోరికలను మించి చూడడానికి కూడా నీతి సూత్రాలు మనకు సహాయపడతాయి.
సరైన సూత్రాలను బోధించడానికి సమకాలీన ఉదాహరణలు
సరైన సూత్రాలను బోధించడం గురించి ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ చేసిన ప్రకటన బహుశా ఆయన తరచుగా ఉదహరించిన బోధనలలో ఒకటి. నేడు ప్రభువు యొక్క అధీకృత సేవకుల ప్రకటనలలో ఈ ప్రేరేపిత బోధనా విధానానికి శక్తివంతమైన ఉదాహరణలు మనకు కనిపిస్తాయి.
పరధ్యానం లేకుండా ఉండడం అనే సూత్రం
1998లో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ సంస్కారమును సిద్ధపరడచడం మరియు నిర్వహించడంలో అహరోను యాజకత్వము కలిగిన వారి విధుల గురించి మాట్లాడారు. ఆయన పరధ్యానం లేకుండా ఉండడం అనే సూత్రాన్ని వివరించారు మరియు అహరోను యాజకత్వము కలిగినవాడు సంఘములోని ఏ సభ్యుడైనా లేదా సభ్యురాలైనా తమ ఆరాధన మరియు నిబంధనలను నూతనపరచుకొనుట నుండి దృష్టి మరల్చుకొనేలా తన రూపము లేదా ప్రవర్తన ఉండాలని ఎప్పటికీ కోరుకోడు అని సూచించారు. అధ్యక్షులు ఓక్స్ క్రమబద్ధత, పరిశుభ్రత, భక్తితో కూడిన గౌరవం, హుందాతనం యొక్క సంబంధిత సూత్రాలను కూడా నొక్కి చెప్పారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అధ్యక్షులు ఓక్స్ యువకులకు చేయవలసిన మరియు చేయకూడని పనుల యొక్క సుదీర్ఘ జాబితాను అందించలేదు. బదులుగా ఆయన, యువకులు, వారి తల్లిదండ్రులు మరియు బోధకులు మార్గదర్శకాన్ని అనుసరించడానికి వారి స్వంత తీర్పు మరియు ప్రేరణను ఉపయోగించగలరనే అంచనాతో సూత్రాన్ని వివరించారు.
ఆయన ఇలా వివరించారు: “నేను ప్రపంచవ్యాప్త సంఘములోని వివిధ వార్డులు మరియు శాఖలలోని పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నందున, వివరణాత్మక నియమాలను నేను సూచించను, ఒక స్థలంలో అవసరమయ్యేట్లుగా అనిపించే ఒక నిర్దిష్ట నియమం మరొక స్థలంలో అనుచితంగా ఉండవచ్చు. బదులుగా, నేను సిద్ధాంతాల ఆధారంగా ఒక సూత్రాన్ని సూచిస్తాను. అందరూ ఈ సూత్రాన్ని అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా వ్యవహరిస్తే, నియమాల అవసరం తక్కువగా ఉంటుంది. వ్యక్తుల విషయాల్లో నియమాలు లేదా సలహా అవసరమైతే, సిద్ధాంతాలకు మరియు వాటికి సంబంధించిన సూత్రాలకు అనుగుణంగా స్థానిక నాయకులు వాటిని అందించవచ్చు.”7
ఒక సంకేతంగా విశ్రాంతిదినము అనే సూత్రం
2015 ఏప్రిల్ సర్వసభ్య సమావేశంలో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ “విశ్రాంతిదినము చాలా ఆనందకరమైనది”8 అని మనకు నేర్పించారు. విశ్రాంతిదినమును గౌరవించడం గురించి ఒక ప్రాథమిక సూత్రాన్ని వ్యక్తిగతంగా ఎలా అర్థం చేసుకున్నారో కూడా ఆయన వివరించారు:
“మనం విశ్రాంతిదినమును పవిత్రముగా ఎలా ఆచరించగలము? నా చిన్న వయస్సులో, విశ్రాంతిదినమున చేయవలసిన మరియు చేయకూడని పనుల జాబితాలను సంకలనం చేసిన ఇతరుల పనిని నేను అధ్యయనం చేసాను. చాలాకాలం తర్వాత, నా ప్రవర్తన మరియు విశ్రాంతి దినమును గూర్చిన నా వైఖరి నాకు మరియు నా పరలోక తండ్రికి మధ్య ఒక సంకేతమును కలిగియుందని నేను లేఖనముల నుండి తెలుసుకున్నాను. ఆ అవగాహనతో, నాకు ఇకపై చేయవలసిన మరియు చేయకూడని పనుల జాబితాలు అవసరం లేదు. ఒక కార్యక్రమం విశ్రాంతిదినమునకు తగినదా కాదా అనే నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు, ‘నేను దేవునికి ఏ సంకేతం ఇవ్వాలనుకుంటున్నాను’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఆ ప్రశ్న విశ్రాంతిదినము గురించి నా ఎంపికలను సుస్పష్టం చేసింది.”9
అధ్యక్షులు నెల్సన్ యొక్క సరళమైనదే కానీ శక్తివంతమైన ప్రశ్న విశ్రాంతిదినము యొక్క అర్థము మరియు దానిని గౌరవించడానికి మనం ఏమి చేయాలి అనే దానిపై ఏదైనా అనిశ్చితి ఉంటే దానిని తగ్గించే ఒక సూత్రాన్ని నొక్కి చెబుతుంది. ఆయన ప్రశ్న మన వైవిధ్య పరిస్థితులలో మనందరినీ ఆశీర్వదించగల మార్గదర్శకం మరియు ప్రమాణాన్ని క్లుప్తీకరిస్తుంది.
దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి సమ్మతించడం అనే సూత్రం
ఆరునెలల క్రితం సర్వసభ్య సమావేశంలో, అధ్యక్షులు నెల్సన్ ఇశ్రాయేలు అనే పదం యొక్క అర్థం గురించి కొత్త అంతరార్థమును పొందినందుకు తన వ్యక్తిగత ఆనందాన్ని వివరించారు. “ఇశ్రాయేలు అనే పేరు దేవునికి తన జీవితంలో మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి సమ్మతించు వ్యక్తిని సూచిస్తుంది”10 అని తాను తెలుసుకున్నప్పుడు తన ఆత్మ కదిలించబడిందని ఆయన మనకు చెప్పారు. తరువాత అధ్యక్షులు నెల్సన్ ఈ అంతరార్థము నుండి ఉత్పన్నమయ్యే అనేక ముఖ్యమైన అంతర్భావములను గుర్తించారు.
దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి సమ్మతించడం గురించి ఆయన సందేశం మనల్ని మనం నియంత్రించుకొనేలా సరైన సూత్రాలను మనకు బోధించడానికి ఒక గొప్ప ఉదాహరణ. విశ్రాంతిదినమును ఆహ్లాదకరంగా మార్చడం గురించి ఆయన తన సందేశంలో చేసినట్లే, అధ్యక్షులు నెల్సన్ మనలో ప్రతి ఒక్కరికి మార్గదర్శకులుగా మరియు ప్రమాణాలుగా పనిచేసే సూత్ర-ఆధారిత ప్రశ్నలను వేశారు.
మీ జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి మీరు సమ్మతిస్తున్నారా? దేవుడిని మీ జీవితాల్లో అత్యంత ముఖ్యమైన ప్రభావంగా ఉండనివ్వడానికి మీరు సమ్మతిస్తున్నారా?
ఆయన ఇలా కొనసాగించారు:
“అటువంటి సమ్మతి మిమ్మల్ని ఏవిధంగా దీవించగలదో ఆలోచించండి. మీరు అవివాహితులైయుండి, శాశ్వతమైన సహచరుడిని కోరుకుంటే, ‘ఇశ్రాయేలుకు చెందినవారు’ కావాలనే మీ కోరిక ఎవరితో మరియు ఎలా డేటింగ్ చేయాలో నిర్ణయించుకొనుటకు మీకు సహాయపడుతుంది.
“తన నిబంధనలను అతిక్రమించిన సహచరుడిని లేదా సహచారిణిని వివాహం చేసుకుంటే, మీ జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి మీరు అంగీకరించడం దేవునితో మీ నిబంధన చెక్కుచెదరకుండా ఉండటానికి అనుమతిస్తుంది. విరిగిన హృదయముగల వారిని రక్షకుడు బాగుచేస్తాడు. ఎలా ముందుకు సాగాలో తెలుసుకోవడానికి మీరు వెదికినప్పుడు పరలోకాలు తెరుచుకుంటాయి. మీరు తిరుగులాడనవసరం లేదు, ఆశ్చర్యపడనవసరం లేదు.
“దేవునికి ప్రాధాన్యతనివ్వడానికి మీరు ఎంచుకొనినప్పుడు సువార్త లేక సంఘం గురించి మీకు నిజాయితీగల ప్రశ్నలున్నట్లయితే, ఖచ్ఛితమైన నిత్య సత్యాలను కనుగొని గ్రహించడానికి మీరు నడిపించబడతారు, అవి మీ జీవితానికి దారిచూపి నిబంధన మార్గములో స్థిరంగా ఉండేందుకు మీకు సహాయపడతాయి.
“మీరు శోధనను ఎదుర్కొన్నప్పుడు—మీరు అలసిపోయినప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు లేదా తప్పుగా అర్ధం చేసుకోబడినప్పుడు శోధనలు వచ్చినప్పుడు కూడా—మీ జీవితంలో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి మీరు ఎన్నుకున్నప్పుడు మరియు మిమ్మల్ని బలోపేతం చేయమని ఆయనను వేడుకున్నప్పుడు మీరు సమీకరించగల ధైర్యాన్ని ఊహించండి.
దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడం, ఇశ్రాయేలులో భాగమవ్వడమే మీ ముఖ్యమైన కోరికైనప్పుడు, అనేక నిర్ణయాలు సులువవుతాయి. అనేక సంగతులు అప్రాధాన్యమవుతాయి! మిమ్మల్ని మీరు మంచిగా ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుస్తుంది. ఏది చూడాలో, ఏది చదవాలో, ఎక్కడ మీ సమయాన్ని గడపాలో, ఎవరితో సహవాసం చేయాలో మీకు తెలుస్తుంది. మీరు ఏం సాధించాలని కోరుకుంటున్నారో మీకు తెలుస్తుంది. నిజంగా మీరు ఎలాంటి వ్యక్తిగా అవ్వాలనుకుంటున్నారో మీకు తెలుస్తుంది.”11
దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి సమ్మతించడం: అనే సూత్రం ద్వారా ఎన్ని కీలకమైన నిర్ణయాలు మరియు జీవిత అనుభవాలు ప్రభావితమవుతాయో గమనించండి: డేటింగ్ మరియు వివాహం, సువార్త ప్రశ్నలు మరియు చింతలు, శోధన, వ్యక్తిగత అలంకరణ, ఏమి చూడాలి మరియు చదవాలి, ఎక్కడ సమయం గడపాలి, ఎవరితో సహవాసం చేయాలి వంటి అనేకానేక విషయాలు ప్రభావితమవుతాయి. అధ్యక్షులు నెల్సన్ యొక్క ప్రేరేపిత ప్రశ్నలు మన జీవితంలోని ప్రతి అంశానికి దిశను అందించే ఒక సాధారణ సూత్రాన్ని నొక్కి చెబుతాయి మరియు మనల్ని మనం పరిపాలించుకోవడానికి వీలు కల్పిస్తాయి.
చాలా చిన్న చుక్కాని
జోసెఫ్ స్మిత్ లిబర్టీ చెరసాలలో ఖైదు చేయబడినప్పుడు, “తుఫాను వచ్చినప్పుడు అతి పెద్ద ఓడ గాలి అలలతో సరైన దిశలో ముందుకు సాగుటకు మిక్కిలి చిన్నదైన చుక్కాని వలన త్రిప్పబడునని”12 ఆయన సంఘ సభ్యులకు మరియు నాయకులకు బోధనా లేఖలు రాశారు.
“చుక్కాని” అనేది ఒక చక్రం లేదా మీట మరియు ఓడ లేదా పడవను నడిపించడానికి ఉపయోగించే పరికరము. మరియు “గాలి అలలతో సరైన దిశలో ముందుకు సాగుట” అనేది ఓడను తిప్పడాన్ని సూచిస్తుంది, తద్వారా అది దాని సమతుల్యతను కాపాడుతుంది మరియు తుఫాను సమయంలో మునిగిపోదు.
ఓడను చుక్కాని ఏవిధంగా నడిపిస్తుందో, అదేవిధంగా సువార్త సుత్రాలు మిమ్మల్ని, నన్ను నడిపిస్తాయి. సరైన సూత్రాలు మన మార్గాన్ని కనుగొనటానికి మరియు దృఢంగా, బలంగా మరియు స్థిరంగా నిలబడటానికి వీలు కల్పిస్తాయి, తద్వారా మన సమతుల్యతను కోల్పోకుండా, చీకటి మరియు గందరగోళం అనే కడవరి-దిన తుఫానులలో పడిపోకుండా చేస్తాయి.
ప్రభువు యొక్క అధీకృత సేవకుల నుండి నిత్య సూత్రాల గురించి తెలుసుకోవడానికి ఈ సర్వసభ్య సమావేశంలో మనము పుష్కలంగా ఆశీర్వదించబడ్డాము. ఇప్పుడు, మన వ్యక్తిగత బాధ్యత ఏమిటంటే, వారు సాక్ష్యమిచ్చిన సత్యాల ప్రకారం మనల్నిమనం పరిపాలించుకోవడం.13
సాక్ష్యము
అధ్యక్షులు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ ఇలా బోధించారు, “రాబోయే ఆరు నెలలు, [లియహోనా ] యొక్క మీ సర్వసభ్య సమావేశ సంచిక మీ ప్రామాణిక రచనల పక్కన ఉంచబడాలి మరియు తరచూ చదవబడాలి.”14
నా ఆత్మ యొక్క శక్తి అంతటితో, నీతి సూత్రాలను నేర్చుకోవడానికి, జీవించడానికి మరియు ప్రేమించడానికి మనందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. సువార్త సత్యాలు మాత్రమే నిబంధన బాటలో ముందుకు సాగడానికి మరియు “దేవుని రక్షణను చూచుటకును, ఆయన బాహువు బయలుపరచబడుట కొరకు,” “మన సామర్థ్యము మేరకు అన్నిటిని సంతోషముతో చేయుటకు”15 సహాయపడతాయి.
యేసు క్రీస్తు సువార్త యొక్క సిద్ధాంతం మరియు సూత్రాలు మన జీవితాలకు దిశానిర్దేశం యొక్క ప్రాథమిక మూలాలు అని, మర్తత్వంలో మరియు నిత్యత్వంలో శాశ్వత ఆనందానికి మూలం అని నేనెరుగుదును. మరియు ఈ మహిమకరమైన ఈస్టర్ ఆదివారమున, ఈ సత్యాలు ప్రవహించే ఊట సజీవుడైన మన రక్షకుడేనని నేను సంతోషంగా సాక్ష్యమిస్తున్నాను. ఆవిధంగా నేను ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.