సర్వసభ్య సమావేశము
మన జీవితాల్లో యేసు క్రీస్తు యొక్క దీవెనలను మరింతగా చూడడం
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


10:16

మన జీవితాల్లో యేసు క్రీస్తు యొక్క దీవెనలను మరింతగా చూడడం

మన జీవితాల్లో ఆయనను ఎక్కువగా చూసేందుకు, ఆయన ద్వారా మన జీవితాలను చూడమని రక్షకుడు మనలను ఆహ్వానిస్తున్నారు.

సహోదర సహోదరీలారా, ఈ ఉదయం మీ ముందు నేను ఎంతో వినమ్రంగా నిలబడ్డాను. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ, ప్రవక్తలు, అపొస్తలులు, దీర్ఘదర్శులు, బయల్పాటుదారులు మరియు దేవుని రాజ్యములో నాయకుల నుండి సందేశాలను వినడానికి సమకూడిన మీ హృదయాలతో నా హృదయాన్ని కృతజ్ఞతలో ముడివేస్తున్నాను. ఉపమానరీతిగా మనం రాజైన బెంజమిన్ రోజులలోని జనుల వలె అయ్యాము, మన గుడారపు ద్వారాలు తెరువబడి, భూమిపై దేవుని ప్రవక్తయైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి వైపు మళ్ళునట్లు మన గుడారాలను వేసుకున్నాము.1

నాకు జ్ఞాపకమున్నంత వరకు నాకు దృష్టిలోపం ఉండేది, దానిని సరిచేసుకోవడానికి ఎల్లప్పుడూ సూచించబడిన అద్దాల సహాయం అవసరమయ్యేది. ప్రతీ ఉదయం నేను కళ్ళు తెరిచినప్పుడు, లోకమంతా దిక్కుతోచనట్లు కనిపించేది. ప్రతీది దృష్టిమరలినట్లు, అస్పష్టంగా, వంకరగా ఉండేది. ప్రియమైన నా భర్త కూడా ఆయన నిజంగా ఉన్నట్లు బాగా ప్రేమించి, ఓదార్పునిచ్చే వ్యక్తిగా కంటే ఎక్కువగా గూఢమైన చిత్తరువుగా కనిపిస్తారు. నా రోజు ప్రారంభమైన వెంటనే, అన్నిటికన్నా ముందుగా ఆలోచించకుండా సహజసిద్ధంగా నేను చేసేది ఏమంటే, నా పరిసరాలు చూడగలిగేలా నా కళ్ళద్దాలు వెదకడం మరియు వాటి సహాయంతో రోజంతా మరింత చైతన్యవంతమైన అనుభవాన్ని ఆనందించడం.

సంవత్సరాలుగా, ఈ ప్రవర్తన నేను రోజూ ఆధారపడే రెండు విషయాలను వివరిస్తుందని నేను గుర్తించగలిగాను: మొదటిది, స్పష్టంగా, దృష్టిసారిస్తూ, నా చుట్టూ ఉన్న లోకాన్ని ఉన్నదున్నట్లుగా చూసేందుకు నాకు సహాయపడే సాధనం; రెండవది, నిరంతరం నన్ను సరైన దిశలో నడిపించేందుకు కావలసిన స్పష్టమైన మార్గదర్శకత్వం. ఈ సరళమైన, అనుదిన అభ్యాసం మన రక్షకుడైన యేసు క్రీస్తుతో మన సంబంధం గురించి నాకు ఒక ముఖ్యమైన పరిశీలనకు అద్దం పడుతుంది.

తరచు ప్రశ్నలు, చింతలు, ఒత్తిళ్ళు, అవకాశాలతో నిండిన మన జీవితాల్లో ఆయన బోధనలు మరియు చట్టాలతోపాటు, వ్యక్తిగతంగా మరియు ఆయన నిబంధన సంతానంగా మన కొరకు మన రక్షకుని ప్రేమ అనుదినం లభ్యమయ్యే వనరు, అది “[మన] కన్నులకు జ్ఞానవృద్ధి కలిగించి , [మన] అవగాహనలను వేగవంతం చేయుచు … ప్రకాశించుచున్న వెలుగు”, దానిపై మనం ఆధారపడగలము.2 మన జీవితాల్లో మనం ఆత్మ యొక్క దీవెనల కొరకు వెదకినప్పుడు, జేకబ్ బోధించినట్లుగా, “విషయములను గూర్చి అవి వాస్తవముగా ఉన్నట్లు, … వాస్తవముగా ఉండబోవునట్లు” మనం చూడగలము.3

దేవుని యొక్క నిబంధన సంతానముగా మనము, మన ఆత్మీయ దృష్టిని మెరుగుపరచుకోవడానికి దైవికంగా నియమించబడిన సాధనాల గొప్ప సరఫరాతో ప్రత్యేకంగా దీవించబడ్డాము. లేఖనంలో నమోదు చేయబడినట్లుగా యేసు క్రీస్తు యొక్క మాటలు, బోధనలు మరియు ఆయన ఏర్పరిచిన ప్రవక్తల నుండి సందేశాలు, అనుదిన ప్రార్థన ద్వారా పొందబడిన ఆయన ఆత్మ, క్రమంగా దేవాలయానికి హాజరవడం మరియు ప్రతీవారం జరిగే సంస్కారపు విధి మన జీవితపు మూలల్లోకి మరియు ఆత్మీయంగా అంధకారమైన ప్రపంచంలోకి క్రీస్తు యొక్క వెలుగును, ఆయన గ్రహింపును తెచ్చే శాంతిని పునఃస్థాపించడానికి సహాయపడగలవు మరియు అవసరమైన వివేచన వరాన్ని అందించగలవు. జీవితం యొక్క ప్రశాంతమైన మరియు అల్లకల్లోలమైన ప్రవాహం గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు రక్షకుడు మన దిక్సూచి మరియు నావికుడు కూడా కాగలరు. మన నిత్య గమ్యానికి మనల్ని నడిపించే సరైన మార్గాన్ని ఆయన స్పష్టం చేయగలరు. కాబట్టి, మనం ఏమి చూడాలని ఆయన కోరుతున్నారు మరియు మనం ఎక్కడికి వెళ్ళాలని ఆయన కోరుతున్నారు?

“మన దృష్టి రక్షకునిపైకి, ఆయన సువార్తపైకి తప్పక మరల్చబడాలి” మరియు “ప్రతి ఆలోచనలో ఆయన వైపు చూడడానికి మనం తప్పక ప్రయత్నించాలి” అని మన ప్రియమైన ప్రవక్త బోధించారు.4 “యేసు క్రీస్తుపై మీ దృష్టిని కేంద్రీకరించడం కంటే మరేదీ ఆత్మను ఆహ్వానించదు. … మీ జీవితంలో ప్రతీరోజు మీరు ఆయన కోసం సమయం కేటాయించినట్లయితే, ఆయన మీ వ్యక్తిగత జీవితంలో మిమ్మల్నినడిపిస్తారు మరియు మీకు మార్గనిర్దేశం చేస్తారు” అని కూడా అధ్యక్షులు నెల్సన్ వాగ్దానం చేసారు.5 మిత్రులారా, మన దృష్టి యొక్క ఉద్దేశ్యము మరియు మన గమ్యం యొక్క ఉద్దేశ్యము రెండూ యేసు క్రీస్తే. స్థిరంగా ఉండి, సరైన దిశలో ముందుకెళ్ళడానికి మనకు సహాయపడేందుకు మన జీవితాల్లో యేసు క్రీస్తు యొక్క దీవెనలను మరింతగా చూడడానికి మన జీవితాలను ఆయన దృష్టితో చూడమని రక్షకుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు. పాత నిబంధనను అధ్యయనం చేయడం ద్వారా ఈ ప్రత్యేక ఆహ్వానం గురించి నేను మరింతగా నేర్చుకున్నాను.

తొలి ఇశ్రాయేలీయులకు సిద్ధపరచు సువార్తగా మోషే ధర్మశాస్త్రము ఇవ్వబడింది, అది యేసు క్రీస్తు ద్వారా దేవునితో ఉన్నతమైన నిబంధన సంబంధం కొరకు జనులను సిద్ధం చేయడానికి రూపొందించబడింది.6 యేసు క్రీస్తు యొక్క “రాకడ కొరకు మరియు ఆయన ప్రాయశ్చిత్తము కొరకు ఎదురు చూడమని”7 విశ్వాసులకు సూచిస్తున్న ప్రతీకవాదంతో సంపన్నమైన ధర్మశాస్త్రానికి అర్థము, వారి జీవితాల్లో ఆయనపై, ఆయన త్యాగంపై, ఆయన చట్టాలు మరియు ఆజ్ఞలపై విశ్వాసాన్ని సాధన చేయడం ద్వారా రక్షకునిపై దృష్టి పెట్టడానికి ఇశ్రాయేలీయులకు సహాయపడడం8—ఇది వారి విమోచకుని గురించి వారిని గొప్ప అవగాహనకు తీసుకురావడానికి ఉద్దేశించబడింది.

ఈరోజు మనం ఆహ్వానించబడినట్లే, దేవుని యొక్క ప్రాచీన జనులు తమ జీవితాల్లో యేసు క్రీస్తు యొక్క దీవెనలను మరింతగా చూడడానికి తమ జీవితాలను ఆయన దృష్టితో చూడాలని ఆహ్వానించబడ్డారు. రక్షకుడు పరిచర్య చేసే సమయానికి ఇశ్రాయేలీయులు వారి ఆచారాలలో క్రీస్తు యొక్క దృష్టిని కోల్పోయారు, ఆయనను ప్రక్కన పెట్టసాగారు మరియు ధర్మశాస్త్రానికి అనధికారిక మార్పులు చేసారు, అవి వారి రక్షణ మరియు విమోచనకు నిజమైన, ఏకైక మూలమైన యేసు క్రీస్తును సూచించే విధంగా ఎటువంటి బోధనాత్మక ప్రతీకవాదాన్ని కలిగిలేవు.9

ఇశ్రాయేలీయుల అనుదిన జీవితం గందరగోళంగా, అస్పష్టంగా మారింది. ఈ పరిస్థితిలో, ధర్మశాస్త్రము యొక్క పద్ధతులు మరియు ఆచారాలు వ్యక్తిగత రక్షణకు మార్గమని ఇశ్రాయేలు సంతతి నమ్మారు మరియు పౌర జీవితాన్ని పాలించడానికి నిర్వహించబడే నియమావళికి మోషే ధర్మశాస్త్రాన్ని కొంతవరకు కుదించారు.10 అందువలన రక్షకుడు వారి దృష్టిని, ఆయన సువార్త పట్ల స్పష్టతను పునరుద్ధరించవలసి వచ్చింది.

అంతిమంగా ఇశ్రాయేలీయులలో అధికభాగము ఆయన సందేశాన్ని నిరాకరించారు, ఎంతగానంటే రక్షకుడిని—ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, నేనే “ధర్మశాస్త్రమును, వెలుగునైయున్నాను” అని ప్రకటించిన ఆయన11—దానిని అతిక్రమించారని నిందించేవరకు కూడా వెళ్ళారు. అయినప్పటికీ, కొండమీద తన ప్రసంగంలో మోషే ధర్మశాస్త్రము గురించి మాట్లాడుతూ యేసు ఇలా ప్రకటించారు, “ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు.”12 తర్వాత రక్షకుడు, తన నిత్య ప్రాయశ్చిత్తము ద్వారా, ఆ సమయంలో ఇశ్రాయేలు జనులు పాటిస్తున్న సంకేతాలు, నిబంధనలు మరియు ఆచార పద్ధతులకు ముగింపు పలికారు. ఆయన అంతిమ త్యాగము దహనబలి అర్పణలను “విరిగిన హృదయము మరియు నలిగిన ఆత్మను”13 మనము అప్పగించుటగా మార్చడానికి, బలి యొక్క విధిని సంస్కారపు విధిగా మార్చడానికి దారితీసింది.

ఈ విషయం గురించి బోధిస్తూ అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ ఇలా అన్నారు, “ఒక భావనలో, బలి అర్పణ నుండి అర్పించేవాని వైపు మారింది.”14 మనం మన అర్పణను రక్షకుని వద్దకు తెచ్చినప్పుడు, తండ్రి చిత్తానికి ఆయన పరిపూర్ణ విధేయతను గుర్తించి, అర్థం చేసుకొని వినయంగా మన చిత్తాన్ని ఆయనకు సమర్పించినప్పుడు, మన జీవితాల్లో యేసు క్రీస్తు యొక్క దీవెనలను మరింతగా చూడడానికి మనం ఆహ్వానించబడుతున్నాము. మనం మన దృష్టిని యేసు క్రీస్తుపై నిలిపినప్పుడు, క్షమాపణను, విమోచనను మరియు నిత్యజీవాన్ని, మహోన్నతస్థితిని కూడా పొందడానికి ఏకైక మార్గం మరియు మూలం ఆయనే అని మనం గుర్తిస్తాము మరియు గ్రహిస్తాము.

సువార్త యొక్క ప్రారంభ అనుచరురాలిగా, నేను సంఘములో చేరిన తర్వాత నా ప్రవర్తన, అలవాట్లు మరియు ఎంపికలలో మార్పులను గమనించిన మరియు గ్రహించిన అనేకమందిని నేను ఎదుర్కొన్నాను. వారు చూస్తున్న వాటికి “కారణాల” గురించి— విశ్వాసుల సమూహములో, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో చేరడానికి, బాప్తిస్మము తీసుకోవడానికి నేను ఎందుకు ఎంచుకున్నాను; సబ్బాతునాడు కొన్ని అలవాట్లను నేను ఎందుకు మానుకున్నాను; జ్ఞానవాక్యాన్ని పాటించడంలో నేను ఎందుకు విశ్వాసంగా ఉన్నాను; నేను మోర్మన్ గ్రంథాన్ని ఎందుకు చదువుతాను; ఆధునిక ప్రవక్తలు మరియు అపొస్తలుల బోధనలను నేను ఎందుకు నమ్ముతాను మరియు నా జీవితంలో వాటిని ఎందుకు పొందుపరుస్తాను; ప్రతీవారం సంఘ సమావేశాలు నేను ఎందుకు హాజరవుతాను,;“వచ్చి చూడుము, వచ్చి సహాయము చేయుము,వచ్చి ఉండుము,” 15 మరియు “రండి, మాతో కలవండి”16 అని ఇతరులను నేను ఎందుకు ఆహ్వానిస్తాను అని తెలుసుకోవడానికి వారు ఆసక్తి కలిగి ఉన్నారు.

ఆ సమయంలో, ఆ ప్రశ్నలు విపరీతంగా, పారదర్శకంగా, కొన్నిసార్లు నిందారోపణలుగా అనిపించాయి. కానీ నా నిర్ణయాలను ప్రశ్నిస్తున్న జనులతో పెనుగులాడుతున్నప్పుడు, నిజానికి వారి పరిశీలన సువార్త అభ్యాసాలు, నియమాలకు కట్టుబడి ఉండేందుకు నన్ను ప్రేరేపించిన దానిని స్పష్టం చేసి, దృష్టి పెట్టి, పటిష్టం చేయడానికి ఒక జత ఆత్మీయ కళ్ళద్దాలను తీసుకొని, ధరించడానికి నా మొదటి ఆహ్వానమని నేను గ్రహించాను. నా సాక్ష్యానికి మూలం ఏది? ఆ అలవాట్లు “క్రీస్తునందు [నా] విశ్వాసాన్ని బలపరచడానికి”17 దేవుని చట్టాలతో సంబంధం కలిగియుండేందుకు అనుమతించకుండా నేను కేవలం “బహిరంగ ఆచరణలను” పాటిస్తున్నానా లేదా నా ఆచారాలలోని శక్తికి ఏకైక మూలం యేసు క్రీస్తు అనే అవగాహనను ప్రదర్శిస్తున్నానా?

నా ప్రతి ఆలోచనలో, క్రియలో యేసు క్రీస్తు వైపు చూడడానికి చేసే కఠినమైన ప్రయత్నం ద్వారా నా కళ్ళకు జ్ఞానోదయమైంది మరియు “ఆయన యొద్దకు రమ్మని” యేసు క్రీస్తు నన్ను పిలుస్తున్నారని గుర్తించడానికి నా అవగాహన వేగవంతం అయింది.18 నా యవ్వనంలో శిష్యత్వం యొక్క ప్రారంభ సమయం నుండి, సువార్తికులు నా వయస్సున్న యువతుల సమూహానికి సువార్తను బోధిస్తున్నప్పుడు వారితో చేరమని నన్ను ఆహ్వానించడాన్ని నేను జ్ఞాపకం చేసుకోగలను. ఒకరోజు సాయంకాలం, మేము ఈ యువతులలో ఒకరి ఇంటిలో కూర్చొని ఉన్నప్పుడు, నేను ఎందుకు నమ్ముతున్నాను అని వారు అడిగిన దయగల ప్రశ్న నా హృదయంలో గ్రుచ్చుకుంది మరియు నా శిష్యత్వం యొక్క ఆత్మీయ ప్రేరేపణల గురించి ప్రభువు యొక్క భావనపట్ల లోతైన అవగాహనతో వారికి సాక్ష్యమివ్వడానికి నన్ను అనుమతించింది మరియు అప్పటినుండి నా సాక్ష్యాన్ని శుద్ధిచేసింది.

మన రక్షకుడైన యేసు క్రీస్తు, ఆయన సంస్కారంలో పాలుపొందడానికి ప్రతీవారం సమావేశమందిరాలకు, ఆయనతో నిబంధనలు చేయడానికి ప్రభువు యొక్క మందిరానికి, ఆయన వాక్యము నేర్చుకోవడానికి లేఖనాలకు మరియు ప్రవక్తల బోధనలకు మనల్ని నడిపిస్తారని నేను ఇప్పుడు తెలుసుకున్నట్లుగా అప్పుడు నేను నేర్చుకున్నాను. ఆయన గురించి సాక్ష్యమివ్వడానికి మన నోటిని, ఆయన సహాయపడి, సేవ చేసినట్లుగా చేయడానికి మన చేతులను, ఆయన చూసినట్లుగా—“వాస్తవముగా ఉన్నట్లు … వాస్తవముగా ఉండబోవునట్లు” ఒకరినొకరిని, లోకాన్ని చూడడానికి మన కన్నులను ఆయన నిర్దేశిస్తారు.19 అన్ని విషయాలలో మనల్ని నడిపించడానికి మనం ఆయనను అనుమతించినప్పుడు, “సమస్తమును ఒక దేవుడున్నాడని సూచించుచున్నవి”20 అని మనం సాక్ష్యాన్ని పొందుతాము, ఎందుకంటే ప్రతీరోజు—మనం ఆయన కొరకు ఎక్కడ వెదకుతామో అక్కడ ఆయనను మనం కనుగొంటాము21. దీని గురించి యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.