సర్వసభ్య సమావేశము
ఆయన కాడి సుళువుగాను ఆయన భారము తేలికగాను ఉన్నవి
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


10:39

ఆయన కాడి సుళువుగాను ఆయన భారము తేలికగాను ఉన్నవి

ఈ భూమిపైనున్న ప్రతీ వ్యక్తి దేవుని యొక్క బిడ్డయని, ప్రతీఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నారని మనము జ్ఞాపకముంచుకుందాం.

పక్షులను వేటాడే కాస్సీ అనే ప్రియమైన కుక్కను కలిగియున్న జాక్ అనే వ్యక్తి గురించి ఈ కథ చెప్పబడింది. కాస్సీ గురించి జాక్ చాలా గర్వపడ్డాడు మరియు అది చాలా నైపుణ్యం కలిగిన కుక్క అని తరచుగా గొప్పగా చెప్పుకునేవాడు. దీనిని రుజువు చేయడానికి, కాస్సీ ప్రదర్శనను చూడడానికి కొందరు స్నేహితులను జాక్ ఆహ్వానించాడు. హంటింగ్ క్లబ్‌కు చేరుకున్న తర్వాత, తనిఖీ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు కాస్సీని చుట్టూ పరిగెత్తడానికి జాక్ అనుమతించాడు.

ప్రారంభించడానికి సమయం వచ్చినప్పుడు, కాస్సీ యొక్క అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి జాక్ ఆత్రుతగా ఉన్నాడు. ఏదేమైనా, కాస్సీ వింతగా ప్రవర్తించింది. సాధారణంగా జాక్ ఆదేశాలను ఇష్టపూర్వకంగా వినినట్లుగా, ఇప్పుడది దేనికీ లోబడలేదు. అది అతని ప్రక్కన నిలబడాలని మాత్రమే కోరుకుంది.

జాక్ విసుగు చెందాడు, సిగ్గుపడ్డాడు మరియు కాస్సీ మీద కోపగించాడు; వెంటనే వారిని వెళ్ళిపోమని సూచించాడు. కాస్సీ ట్రక్కు వెనుక ఎక్కడానికి కూడా దూకలేదు, కాబట్టి జాక్ అసహనంగా దానిని పైకెత్తి దాని గూటిలోకి తోసాడు. అతనితో ఉన్నవారు ఇంటికి వెళ్ళేంత వరకు అతని కుక్క ప్రవర్తనను ఎగతాళి చేయడంతో అతను మండిపడ్డాడు. కాస్సీ ఎందుకు తప్పుగా ప్రవర్తిస్తున్నదో జాక్‌కి అర్థం కాలేదు. అది బాగా శిక్షణ పొందింది మరియు గతంలో దాని కోరిక అంతా అతనిని సంతోషపెట్టి, అతనికి సేవ చేయడమే.

ఇంటికి చేరుకున్న తరువాత, అతను ఎప్పుడూ చేసే విధంగా జాక్ గాయాలు, అంటింతలు లేదా పేలు ఉన్నాయేమోనని కాస్సీని పరీక్షించడం ప్రారంభించాడు. అతను దాని ఛాతీపై చేయి వేసినప్పుడు, అతనికి ఏదో తడిగా అనిపించింది మరియు అతని చేయి రక్తంతో నిండిపోయింది. భయంతో అతను కాస్సీ ఛాతీ ఎముకకు కుడివైపున పొడవుగా గీయబడిన పెద్ద గాయం ఉందని కనుగొని, సిగ్గుపడ్డాడు. దాని కుడి ముందు కాలి మీద, ఎముక వరకు మరొక గాయాన్ని అతను కనుగొన్నాడు.

కాస్సీని తన చేతుల్లోకి తీసుకొని, జాక్ ఏడవడం ప్రారంభించాడు. దానిని తప్పుగా అంచనా వేసి చూసినందుకు అతడు ఎంతో సిగ్గుపడ్డాడు. కాస్సీ గాయపడినందున అంతకుముందు రోజు అసాధారణంగా ప్రవర్తించింది. దాని నొప్పి, బాధ మరియు గాయాల చేత దాని ప్రవర్తన ప్రభావితం చేయబడింది. జాక్‌కు లోబడాలనే కోరిక లేకపోవడం లేదా అతడి మీద ప్రేమ లేకపోవడంతో దానికి సంబంధం లేదు.1

నేన ఈ కథను చాలాకాలం క్రితం విన్నాను మరియు దానిని ఎన్నడూ మరచిపోలేదు. ఎంతమంది గాయపడిన వ్యక్తులు మన మధ్య ఉన్నారు? బాహ్య రూపం మరియు ప్రవర్తనలు లేదా క్రియ లేకపోవడం ఆధారంగా మనం ఎంత తరచుగా ఇతరులను విమర్శిస్తాము? ఒకవేళ మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే, మన విమర్శతో వారి భారాలను పెంచడానికి బదులుగా కనికరముతో మరియు సహాయపడే కోరికతో మనం ప్రతిస్పందిస్తాము.

నా జీవితంలో నేను దీనికి చాలాసార్లు దోషిగా ఉన్నాను, కానీ వ్యక్తిగత అనుభవాల ద్వారా మరియు అనేకమంది ఇతరుల జీవితానుభవాలను నేను వింటుండగా ప్రభువు నాకు ఓపికగా బోధించారు. ఆయన ప్రేమతో ఇతరులకు పరిచర్య చేయడానికి తన సమయంలో ఎక్కువ భాగాన్ని గడిపినప్పుడు, ప్రియమైన మన రక్షకుని మాదిరిని మరింత సంపూర్ణంగా నేను ప్రశంసించగలిగాను.

నా చిన్న కూతురి జీవితానుభవములో, ఆమె చిన్నతనం నుండి మానసిక ఆరోగ్య సమస్యలున్నాయి. ఆమె జీవితంలో తాను ఇక ముందుకు సాగలేనని భావించిన సమయాలు అనేకమున్నాయి. ఆ సమయములో అక్కడున్న భూలోక దూతలు: ఆమెతో కూర్చొని, ఆమె చెప్పింది విని, ఆమెతో పాటు ఏడ్చినవారు, అదేవిధంగా ప్రత్యేక బహుమానాలు, ఆత్మీయ అవగాహనలు మరియు ప్రేమ యొక్క పరస్పర సంబంధాన్ని కలిసి పంచుకొన్న వారిపట్ల మేము ఎప్పటికీ కృతజ్ఞత కలిగియున్నాము. అటువంటి ప్రేమగల పరిస్థితులందు, భారములు తరచుగా ఇరు వైపులా పైకెత్తబడతాయి.

ఎల్డర్ జోసెఫ్ బి. వర్త్లిన్, 1 కొరింథీయులను ఉదహరిస్తూ ఇలా చెప్పారు, “మనుష్యుల భాషలతోను, దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును.”2

ఆయన ఇలా కొనసాగించారు:

“ఈ క్రొత్త పరిశుద్ధులకు పౌలు యొక్క సందేశము సాధారణమైనది మరియు నేరుగా ఉన్నది: ప్రేమ లేని యెడల మీరు ఏమి చేసినను ప్రయోజనమేమియు లేదు. మీరు భాషలతో మాట్లాడవచ్చు, ప్రవచన వరము కలిగియుండవచ్చు, సమస్త మర్మములను గ్రహించవచ్చు మరియు సమస్త జ్ఞానము కలిగియుండవచ్చు; మీరు పర్వతములను కదిలించగల విశ్వాసమును కలిగియున్నప్పటికీ, ప్రేమ లేని యెడల మీరు ఏమి చేసినను ప్రయోజనమేమియు లేదు.

“‘దాతృత్వము క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమయైయున్నది’ [మొరోనై 7:47]. రక్షకుడు ఆ ప్రేమను ఉదహరించారు.”3

“మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు”4 అని యోహానులో మనము చదువుతాము.

మన సంఘ నాయకుల చేత దాతృత్వము, ఐక్యత, ప్రేమ, దయ, కనికరము, క్షమాపణ మరియు కృప గురించి అనేక ప్రసంగాలు ఇవ్వబడ్డాయి. రక్షకుడు ఉన్నతమైన, పరిశుద్ధమైన విధానములో జీవించమని మనల్ని ఆహ్వానిస్తున్నారని నేను నమ్ముతున్నాను5ఆయన ప్రేమ యొక్క విధానములో, అందరూ నిజముగా చెందియున్నామని మరియు కావలసినవారమని భావించగలరు.

ఇతరులను ప్రేమించాలని, 6 వారిని విమర్శించరాదని మనము ఆజ్ఞాపించబడ్డాము.7 ఆ భారమైన భారమును క్రింద పెడదాము; దానిని మోయడం మన పనికాదు.8 బదులుగా, మనము రక్షకుని యొక్క ప్రేమ మరియు కనికరము అనే కాడిని ఎత్తుకోవచ్చు.

“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును.

“మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి; …

“ఏలయనగా నా కాడి సుళువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి.”9

రక్షకుడు పాపమును క్షమించరు, కానీ మనము పశ్చాత్తాపపడినప్పుడు ఆయన ప్రేమను మరియు క్షమాపణను అందిస్తారు. వ్యభిచారములో పట్టబడిన స్త్రీతో ఆయన ఇలా చెప్పారు, “నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము.”10 ఆయన ఎవరిని తాకారో వారు ఆయన ప్రేమను అనుభవించారు, ఆ ప్రేమ వారిని స్వస్థపరచి, మార్చివేసింది. వారి జీవితాలను మార్చుకోవాలని కోరునట్లు ఆయన ప్రేమ వారిని ప్రేరేపించింది. ఆయన మార్గమునుబట్టి జీవించుట సంతోషమును, శాంతిని తెస్తుంది మరియు ఆ విధంగా జీవించడానికి ఇతరులను ఆయన మృదువుగా, దయతో మరియు ప్రేమతో ఆహ్వానించారు.

ఎల్డర్ గ్యారీ ఈ. స్టీవెన్‌సన్ ఇలా చెప్పారు: “జీవితంలో శ్రమలను, కష్టాలను, అనారోగ్యాన్ని, గాయాలను మనం ఎదుర్కొన్నప్పుడు, ప్రభువు—మన కాపరి—మన సంరక్షకుడు—మనల్ని ప్రేమతో, దయతో పోషిస్తారు. ఆయన మన హృదయాలను స్వస్థపరచి, మన ఆత్మలను పునరుద్ధరిస్తారు.”11. యేసు క్రీస్తు యొక్క అనుచరులుగా, మనము అదేవిధంగా చేయవద్దా?

ఆయనను గూర్చి నేర్చుకోవాలని12 మరియు ఆయన చేయగా చూసిన విషయాలను చేయాలని రక్షకుడు మనల్ని అడిగారు.13 ఆయన దాతృత్వము, శుద్ధమైన ప్రేమ యొక్క ప్రతిరూపము. విధి వలన లేదా మనము పొందగల దీవెనల కోసం కాదు, కానీ ఆయన పట్ల మరియు మన పరలోక తండ్రి పట్ల గల స్వచ్ఛమైన ప్రేమ కారణంగా14—ఆయన మన నుండి కోరుతున్నదానిని చేయడాన్ని క్రమంగా మనం నేర్చుకున్నప్పుడు, ఆయన ప్రేమ మన ద్వారా ప్రవహిస్తుంది మరియు ఆయన అడిగిన సమస్తమును సాధ్యం చేయడమే కాకుండా, చివరికి చాలా సులభంగా, తేలికగా 15 మరియు మనము ఎన్నటికీ ఊహించనంత ఎక్కువ ఆనందంగా చేస్తుంది. దానికి సాధన అవసరము; దానికి నాకు పట్టినట్లుగా సంవత్సరాలు పట్టవచ్చు, కానీ ప్రేమ మనల్ని ప్రేరేపించు శక్తిగా ఉండాలని మనం కోరుకున్నప్పుడు, ఆయన ఆ కోరికను,16 ఆ విత్తనమును తీసుకొని, చివరికి మధురమైన ఫలముతో నిండిన అందమైన వృక్షముగా దానిని మారుస్తారు.17

మన ప్రియమైన కీర్తనలలో ఒకదానిలో మనం ఇలా పాడతాము: “నేను అపరిపూర్ణంగా నడిచినప్పుడు మరొకరిని విమర్శించడానికి నేనెవరిని? నిశ్శబ్ద హృదయములో కంటికి కనిపించని దుఃఖము దాగియున్నది.”18 మన మధ్యలో దాచబడిన దుఃఖము గల వారెవరున్నారు? తిరుగుబాటు చేసే పిల్లలు లేదా యౌవనులు, విడాకులు తీసుకున్న పిల్లలు, ఒంటరి తల్లి లేదా తండ్రి, శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వారి విశ్వాసాన్ని ప్రశ్నించే వారు, జాతి వివక్ష లేదా సాంస్కృతిక పక్షపాతాన్ని అనుభవించే వారు, ఒంటరిగా భావించేవారు, వివాహం చేసుకోవాలని ఎదురుచూసే వారు, అవాంఛిత వ్యసనాలు గలవారు మరియు విభిన్న రకాల సవాళ్ళతో కూడిన జీవితానుభవాలతో వ్యవహరిస్తున్న అనేకమంది ఇతరులు —తరచుగా వారి జీవితాలు కూడా పైపైన పరిపూర్ణంగా కనిపిస్తాయి.

మనలో ఏ ఒక్కరు పరిపూర్ణమైన జీవితాలను లేదా పరిపూర్ణమైన కుటుంబాలను కలిగిలేము; నిశ్చయంగా నేను కలిగిలేను. కష్టాలు మరియు బలహీనతలను కూడా అనుభవించే ఇతరులపట్ల సానుభూతి చూపించాలని మనం కోరినప్పుడు, తమ ప్రయాసలందు వారు ఒంటరిగా లేరని భావించడానికి వారికది సహాయపడగలదు. ప్రతీఒక్కరు నిజంగా చెందియున్నామని మరియు క్రీస్తు యొక్క శరీరములో కావలసినవారమని భావించుట అవసరము.19 దేవుని పిల్లలను విడదీయడం సాతాను యొక్క గొప్ప కోరిక మరియు అతడు చాలా విజయవంతమయ్యాడు, కానీ ఐక్యతయందు ఎంతో శక్తి ఉన్నది. 20 ఈ కష్టమైన మర్త్య ప్రయాణములో మనము ఒకరికొకరం సహాయపడడం ఎంతో అవసరము!

మన ప్రవక్తయైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు: “జాతీయత, జాతి, లైంగిక ధోరణి, లింగబేధము, విద్యా సంబంధమైన డిగ్రీలు, సంస్కృతి లేదా ఇతర ముఖ్యమైన నిర్దేశకముల కారణంగా ఇతరుల పట్ల ఏదైనా దుర్భాష లేదా వివక్ష మన సృష్టికర్తకు అభ్యంతరకరమైనది! అటువంటి దుష్ప్రవర్తన ఆయన నిబంధన కుమారులు మరియు కుమార్తెలుగా మన స్థాయికి దిగువన మనము జీవించునట్లు చేస్తుంది.21

మన పరలోక తండ్రి వద్దకు తిరిగి నడిపించే నిబంధన మార్గంలో ప్రవేశించి, అక్కడే ఉండమని అధ్యక్షులు నెల్సన్ అందరినీ ఆహ్వానించినప్పుడు, ఆయన ఈ క్రింది సలహాను కూడా ఇచ్చారు: “స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు … సంఘమును విడిచి వెళ్ళినట్లయితే, వారిని ప్రేమించడం కొనసాగించండి. విశ్వాసులుగా నిలిచియున్నందుకు మీరు విమర్శించబడినట్లుగా ఇకపై మరొకరి ఎంపికను మీరు విమర్శించరాదు.”22

స్నేహితులారా, ఈ భూమిపైనున్న ప్రతీ వ్యక్తి దేవుని యొక్క బిడ్డయని23, ప్రతీఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నారని మనము జ్ఞాపకముంచుకుందాం.24 మీ మార్గములో మీరు విమర్శించాలని భావించిన జనులున్నారా? ఉన్నట్లయితే, రక్షకుడు ప్రేమించే విధంగా ప్రేమించడాన్ని సాధన చేయడానికి ఇవి మన కొరకు విలువైన అవకాశాలని గుర్తుంచుకోండి.25 మనము ఆయన మాదిరిని అనుసరించినప్పుడు, మనము ఆయనతో కాడిని మోయగలము మరియు మన తండ్రి యొక్క పిల్లలందరి హృదయాలలో ప్రేమ మరియు చెందియున్నామనే భావనను పెంపొందించడానికి సహాయపడగలము.

“ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కనుక, మనము ఆయనను ప్రేమిస్తాము.”26 మనము రక్షకుని ప్రేమతో నింపబడినప్పుడు, ఆయన కాడి నిజముగా సుళువుగా ఉండగలదు మరియు ఆయన భారము తేలికగా అనిపించగలదు.27 దీనిని గూర్చి నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.