అపవాదిని నిరోధించే జీవితమును నిర్మించుట
మన పరలోక తండ్రి చేత దైవికంగా రూపొందించబడిన ప్రణాళికలు మరియు సాంకేతిక నిర్దిష్టతలను అనుసరిస్తూ మన జీవితాలను నిర్మించుకోవడాన్ని మనము కొనసాగిస్తామని నేను ప్రార్థిస్తున్నాను.
అనేక సంవత్సరాలుగా, సమావేశ కేంద్రములో ఈ అందమైన వేదిక నుండి మనము అద్భుతమైన సలహా, ప్రేరేపణ, ఉపదేశము మరియు బయల్పాటును పొందాము. సందర్భానుసారంగా, ప్రసంగీకులు యేసు క్రీస్తు సువార్త యొక్క సూత్రమును స్పష్టంగా మరియు శక్తివంతంగా వివరించడానికి వారి జ్ఞానము మరియు అనుభవముతో సంబంధిత పోలికలను ఉపయోగించారు.
ఉదాహరణకు ఈ విధానములో, విమానాలు స్వల్పంగా దారితప్పడం మన అసలు గమ్యస్థానమునకు దూరముగా ఉన్న ప్రదేశానికి మనల్ని నడిపించవచ్చని మనము నేర్చుకున్నాము.1 మరియు ఈ విధానములో, ఆయనను అనుసరించమని ప్రభువు ఇచ్చిన ఆహ్వానానికి ప్రతిస్పందించడానికి అవసరమైన హృదయము యొక్క శక్తివంతమైన మార్పుతో మన భౌతిక హృదయం యొక్క పని తీరును పోల్చడం మనం నేర్చుకున్నాము.2
ఈసారి, నేను నా వృత్తిపరమైన సిద్ధపాటు రంగంలో ఒక ప్రాంతం నుండి ప్రేరేపణ పొందిన పోలికను వినయంగా జోడించాలనుకుంటున్నాను. నేను సివిల్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన దానిని సూచిస్తున్నాను. నా విశ్వవిద్యాలయ చదువు ప్రారంభం నుండి, “భూకంప నిరోధకాలుగా” పరిగణించబడే భవనాలను మరియు ఇతర కట్టడాలను ఎలా రూపకల్పన చేయాలనే దానిని బోధించే తరగతిలో చేరడానికి అర్హుడను కావడానికి తగిన అర్హతలను పూర్తి చేసే రోజు కోసం నేను కలలుగన్నాను.
చివరకు ఈ విషయముపై నా మొదటి తరగతికి వెళ్ళే రోజు వచ్చింది. ప్రొఫెసరు చెప్పిన మొదటి మాటలు క్రింది విధంగా ఉన్నాయి: “ఈ కోర్సు ప్రారంభించడానికి మరియు భూకంప నిరోధక కట్టడాలను ఎలా రూపకల్పన చేయాలో నేర్చుకోవడానికి నిశ్చయంగా మీరు ఆతృతగా ఉన్నారు,” దానికి మేమందరం ఆతృతగా తలలు ఊపాము. తరువాత ప్రొఫెసరు ఇలా చెప్పారు, “ఇది సాధ్యము కాదని మీకు చెప్పడానికి నేను విచారిస్తున్నాను, ఎందుకనగా భూకంపానికి ప్రతికూలమైనది, ‘వ్యతిరేకమైనది,’ లేదా నిరోధించే భవనాన్ని ఎలా రూపకల్పన చేయాలో నేను బోధించలేను. దీనికి అర్థము లేదు,” “ఎందుకనగా మనకిష్టమైనా, లేకపోయినా భూకంపాలు ఏవిధంగానైనా సంభవిస్తాయి” అని ఆయన అన్నారు.
“నేను మీకు భూకంప నిరోధక నిర్మాణాలను, భూకంపం నుండి వచ్చే శక్తులను నిరోధించగల నిర్మాణాలను ఎలా రూపొందించాలో, తద్వారా నిర్మాణం ఎటువంటి తీవ్రమైన నష్టాన్ని చవిచూడకుండా అలాగే నిలిచి ఉండి, అది ఉద్దేశించబడిన సేవను అందించడం కొనసాగించేలా కట్టడాలను ఎలా రూపొందించాలో బోధించగలను,” అని ఆయన కొనసాగించారు.
ఇంజనీరు పునాదుల కొలతలు, నాణ్యతలు మరియు లక్షణాలు, నిలువు వరుసలు, కలప దూలములు, కాంక్రీట్ స్లాబులు మరియు ఇతరత్రా రూపొందించబడిన నిర్మాణ మూలకాలను సూచించే లెక్కలను చేస్తాడు. మునుపటి విభాగంలో పేర్కొన్న లెక్కల ఫలితాల నుండి ప్రణాళికలు మరియు సాంకేతిక నిర్దిష్టతలు అభివృద్ధి చేయబడ్డాయి, అది ఉద్దేశించబడినట్లుగా చివరిగా కట్టబడిన నిర్మాణములో నిర్మాణదారుని చేత ప్రణాళికలు ఖచ్చితంగా అనుసరించబడాలి మరియు ఆవిధంగా అది రూపొందించబడిన, నిర్మించబడుతున్న ఉద్దేశ్యాన్ని నెరవేర్చాలి.
భూకంప నిరోధక ఇంజనీరింగ్‌లో మొదటి తరగతి జరిగినప్పటి నుండి 40 కంటే ఎక్కువ సంవత్సరాలు దాటినప్పటికీ, నా భవిష్యత్తు వృత్తి జీవితంలో నేను రూపొందించే కట్టడాలలో ఈ ఉద్దేశ్యము యొక్క ప్రాముఖ్యతను గూర్చి లోతైన మరియు సంపూర్ణమైన జ్ఞానాన్ని నేను పొందడం ప్రారంభించిన ఆ క్షణాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకున్నాను. అది మాత్రమే కాదు, కానీ మరింత ముఖ్యమైనది—అది నా స్వంత జీవితాన్ని మెరుగుపరచడంలో మరియు నేను సానుకూలమైన ప్రభావాన్ని చూపగల ఇతరులలో శాశ్వతంగా ఉంటుంది.
మన పరలోక తండ్రి చేత రూపొందించబడిన రక్షణ ప్రణాళికను గూర్చిన జ్ఞానముపై ఆధారపడడానికి, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తను కలిగియుండడానికి మరియు జీవిస్తున్న ప్రవక్తల యొక్క ప్రేరేపించబడిన నడిపింపుపై ఆధారపడడానికి మనము ఎంత గొప్పగా దీవించబడ్డాము! దైవికంగా రూపొందించబడిన మునుపటి “ప్రణాళికలు” మరియు “సాంకేతిక నిర్దిష్టతలు” అన్నీ సంతోషకరమైన జీవితాలను ఎలా నిర్మించుకోవాలో స్పష్టంగా బోధిస్తాయి—అవి పాపానికి లొంగని జీవితాలు, శోధనకు లొంగనివి, మన పరలోక తండ్రితో మరియు మన ప్రియమైన కుటుంబాలతో కలిసి ఉండాలనే మన నిత్య గమ్యమును నిరాశపరచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న సాతాను దాడులకు లొంగనివి.
రక్షకుడు తన పరిచర్య ప్రారంభంలో స్వయంగా, “అపవాదిచేత శోధింపబడుటకు విడువబడ్డాడు.”3 కానీ యేసు ఆ గొప్ప పరీక్షలో విజయం సాధించాడు. సాతాను వ్యతిరేక వైఖరి లేదా శోధనకు వ్యతిరేక వైఖరి కలిగియుండుట ఆయనకు ఎలా ఉపయోగపడింది? ఆ కష్టతరమైన క్షణాల నుండి యేసు విజయం సాధించేలా చేసింది ఆయన ఆత్మీయమైన సిద్ధపాటు, అది అపవాది యొక్క శోధనలను నిరోధించే స్థితిలో ఆయన ఉండడాన్ని సాధ్యపరచింది.
ఆ కీలకమైన క్షణము కొరకు సిద్ధపడడానికి రక్షకునికి సహాయపడిన కారకాలలో కొన్ని ఏవి?
మొదటిది, ఆయన 40 దినాలు, 40 రాత్రులు ఉపవాసమున్నాడు, ఆ ఉపవాసము నిరంతర ప్రార్థన చేత చేయబడియుండవచ్చు. కనుక, ఆయన శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ, ఆయన ఆత్మ చాలా బలంగా ఉన్నది. అదృష్టవశాత్తూ, మనము అంతకాలము ఉపవాసముండాలని అడగబడనప్పటికీ—దానికి బదులుగా నెలకు ఒకసారి, కేవలము 24 గంటలు—ఉపవాసము మనకు ఆత్మీయ బలమును తెస్తుంది మరియు ఈ జీవితంలోని శ్రమలను నిరోధించడానికి మనల్ని సిద్ధపరుస్తుంది.
రెండవ స్థానములో, రక్షకుడు అప్పగించబడిన శోధనల వృత్తాంతములో, ఆయన లేఖనాలను మనస్సులో ఉంచుకొని, వాటిని వ్యాఖ్యానిస్తూ, సరైన సమయంలో అన్వయిస్తూ ఎల్లప్పుడూ జవాబివ్వడం మనము చూస్తాము.
సుదీర్ఘమైన ఉపవాసము నుండి ఆయన ఆకలిని తృప్తిపరచునట్లు రాళ్ళను రొట్టెగా మార్చమని సాతాను ఆయనను శోధించినప్పుడు, ప్రభువు అతడితో ఇలా చెప్పారు, “మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును.”4 తరువాత, ప్రభువు దేవాలయ శిఖరమున ఉన్నప్పుడు, ఆయన శక్తిని రుజువు చేయమని అపవాది ఆయనను శోధించడానికి ప్రయత్నించాడు, దానికి ప్రభువు అధికారముతో ఇలా జవాబిచ్చారు, “ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నది.”5 సాతాను యొక్క మూడవ ప్రయత్నమునకు, ప్రభువు ఇలా జవాబిచ్చారు, “ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నది.”6
భూకంపం యొక్క సంఘటన ఫలితంగా సరిగ్గా రూపొందించబడిన మరియు నిర్మించబడిన నిర్మాణాలపై కూడా దాని ముద్ర వేయబడుతుంది—అటువంటి పరిణామాలలో బహుశా పగుళ్ళు, పడిపోయిన ఉపకరణాలు లేదా పైకప్పులు, విరిగిన కిటికీలు మొదలైనవి కొన్ని. కానీ చక్కగా రూపొందించబడిన మరియు చక్కగా నిర్మించబడిన ఈ భవనం దాని నివాసితులను రక్షించే ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తుంది మరియు కొన్ని మరమ్మత్తులతో, దాని అసలు స్థితికి సరిపోయేలా పునరుద్ధరించబడుతుంది.
అదే రీతిలో, మన జీవితాలను పరిపూర్ణమైన దైవిక రూపకల్పనకు అనుగుణంగా నిర్మించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, అపవాది యొక్క వేదన, హింసలు మన జీవితాల్లో “పగుళ్ళు,” లేదా కొంత పాక్షిక నష్టాన్ని కలిగించగలవు. ఈ “పగుళ్ళు” కొన్ని తప్పులు చేసినందుకు మరియు ప్రతీదాన్ని సరిగ్గా చేయనందుకు లేదా మనం కోరుకున్నంత మంచిగా లేమని భావించినందుకు విచారము లేదా పశ్చాత్తాపముగల భావాల ద్వారా వాటికవే ప్రత్యక్షపరచబడగలవు.
కానీ నిజంగా సంబంధితమైనది ఏమిటంటే, దైవికంగా రూపొందించబడిన ప్రణాళికలు మరియు నిర్దిష్టతలను, అనగా యేసు క్రీస్తు యొక్క సువార్తను అనుసరించినందుకు మనము ఇంకా నిలబడియున్నాము. అపవాది ప్రయత్నాల వలన లేదా మనము ఎదుర్కోవాల్సిన క్లిష్ట పరిస్థితుల కారణంగా మన జీవితాల నిర్మాణం కూల్చివేయబడలేదు; బదులుగా మనము ముందుకు వెళ్ళడానికి సిద్ధపడియున్నాము.
మన ఉనికి యొక్క ఉద్దేశ్యముగా లేఖనాలలో వాగ్దానము చేయబడిన ఆనందానికి అర్థము,7 మనకు ఏ కష్టాలు లేదా విచారాలు ఉండవని, శోధన, ప్రతికూలత లేదా మన భూలోక జీవితం యొక్క వాస్తవమైన శ్రమలకు పర్యవసానాలుగా మనము ఏ “పగుళ్ళు” కలిగి ఉండమని అనుకోరాదు.
“నా జీవిత కాలములో అనేక బాధలను చూచినప్పటికీ, నా దినములన్నిటిలో ప్రభువు చేత అధికముగా అనుగ్రహింపబడితిని,”8 అని అతడు చెప్పినప్పుడు, ఈ సంతోషము జీవితంపట్ల నీఫై యొక్క దృక్పథముతో సంబంధం కలిగియున్నది. అతడి దినములన్నిటిలో! నీఫై తన స్వంత అన్నల అపనమ్మకమును, తిరస్కారమును ఎదుర్కొన్నప్పుడు కూడా, వారు అతడిని ఓడలో కట్టివేసినప్పుడు, అతడి తండ్రి లీహై చనిపోయినప్పుడు కూడా, లేమన్ మరియు లెముయెల్ తన జనులకు శత్రువులుగా మారినప్పుడు కూడా. ఆ కష్టమైన దినాలలో కూడా, నీఫై ప్రభువు చేత అధికముగా అనుగ్రహింపబడిన వాడిగా భావించాడు.
మనము నిరోధించగలిగిన దానికంటే ఎక్కువగా శోధింపబడడానికి ప్రభువు మనల్ని ఎన్నటికీ అనుమతించడని తెలుసుకోవడం వలన మనం ప్రశాంతతను పొందవచ్చు. “[మనము] సహించగలిగిన దాని కంటే అధికముగా [మనము] శోధింపబడకుండునట్లు, మెలకువగా ఉండి నిరంతరము ప్రార్థించాలని మరియు ఆ విధముగా వినయముగలిగి సాత్వీకులుగా, లోబడువారిగా, సహనము గలవారిగా, ప్రేమతో నిండి సమస్త దీర్ఘశాంతము గలవారగునట్లు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడవలెనని,”9 ఆల్మా మనల్ని ఆహ్వానిస్తున్నాడు.
జీవితపు శ్రమలకు కూడా అదే అన్వయించబడవచ్చు. అమ్మోన్ ప్రభువు యొక్క మాటలను మనకు గుర్తు చేస్తున్నాడు: “వెళ్ళుము, … మీ శ్రమలను సహనముతో భరించుము, నేను మీకు విజయమునిచ్చెదను.”10
మనము ప్రతికూలత, శోధన, అపనమ్మకము, అంగవైకల్యములు, మరియు మరణమును ఎదుర్కొన్నప్పుడు కూడా దానిని మనము జయించడానికి ప్రభువు ఎల్లప్పుడూ సహాయము అందిస్తారు. ఆయన ఇలా అన్నారు, “ఇప్పుడు నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నేను ఒకనితో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను, చిన్నపిల్లలారా, సంతోషముగా నుండుడి; ఏలయనగా నేను మీ మధ్యనున్నాను, నేను మిమ్ములను విడిచిపెట్టలేదు.”11 ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టరు!
మన తండ్రి చేత దైవికంగా రూపొందించబడి, మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా సాధించబడిన ప్రణాళికలు మరియు సాంకేతిక నిర్దిష్టతలను అనుసరిస్తూ మన జీవితాలను నిర్మించుకోవడాన్ని మనము కొనసాగిస్తామని నేను ప్రార్థిస్తున్నాను. ఆవిధంగా, మన రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా మనల్ని చేరుకొనే కృప వలన, పాపమును నిరోధించి, శోధనను నిరోధించే జీవితమును నిర్మించడంలో మనము విజయవంతంగా ఉంటాము మరియు మన జీవితాలలోని విచారమును, కష్టమైన సమయాలను సహించడానికి బలపరచబడతాము. ఇంకా, మన తండ్రి మరియు మన రక్షకుని యొక్క ప్రేమ ద్వారా వాగ్దానము చేయబడిన దీవెనలన్నీ పొందే పరిస్థితిలో మనము ఉంటాము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.