బూడిదకు ప్రతిగా పూదండ: క్షమాపణ యొక్క స్వస్థపరచు దారి
మీ జీవితపు బూడిదకు ప్రతిగా మీరు పూదండ ఇచ్చే విధానములో జీవించుట రక్షకుని అనుసరించే విశ్వాసపు చర్య.
1 సమూయేలు గ్రంథము అంతగా తెలియని ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు రాజైన దావీదు మరియు అబీగయీలు అనే స్త్రీ గురించిన కథను కలిగియుంది.
సమూయేలు మరణము తరువాత, దావీదు మరియు అతడి మనుష్యులు దావీదు ప్రాణము తీయాలని కోరిన సౌలు రాజు నుండి దూరంగా వెళ్ళిపోయారు. వారు మోటువాడును, దుర్మార్గుడైన నాబాలు అనే పేరుగల ధనికుని మందలను మరియు సేవకులకు కావలి కాసారు. దావీదు నాబాలుకు నమస్కరించి, అత్యవసరమైన ఆహారము మరియు సరఫరాలను మనవి చేయడానికి తన మనుష్యులలో పదిమందిని పంపాడు.
నాబాలు దావీదు మనవిని అవమానించాడు మరియు అతడి సేవకులను వట్టి చేతులతో పంపేసాడు.
కోపగించిన దావీదు “ఉపకారమునకు నాకు అపకారము చేసియున్నాడే” అని చెప్పుచూ నాబాలు, అతడి ఇంటి వారికి వ్యతిరేకంగా వెళ్ళడానికి తన మనుష్యులను సిద్ధపరిచాడు.1 ఒక సేవకుడు, నాబాలు భార్యతో, ఆమె భర్త దావీదు మనుష్యులతో కఠినంగా మాట్లాడడం గురించి చెప్పాడు. అబీగయీలు త్వరగా ఆహారమును, సరఫరాలను సేకరించి, మధ్యవర్తిత్వము చేయడానికి వెళ్ళింది.
అబీగయీలు దావీదును కలుసుకొన్నప్పుడు, “దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి,
“అతని పాదములు పట్టుకొని, ఇట్లనెను--నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము. …
“కాబట్టి … ప్రాణ హాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు, నీ చెయ్యి నిన్ను సంరక్షించెనన్న మాట నిజము. …
“ … నా యేలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి. …
“నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. …
“అందుకు దావీదు అబీగయీలుతో చెప్పెను, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక:
“నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. …
“దావీదు తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసికొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించాను, … సమాధానముగా నీ యింటికి పొమ్మని ఆమెతో చెప్పెను.”2
వారిరువురు సమాధానముగా వెళ్ళిరి.
ఈ వృత్తాంతములో, అబీగయీలు యేసు క్రీస్తు యొక్క శక్తివంతమైన చిహ్నముగా లేదా గురుతుగా చూడబడవచ్చు.3 ఆయన ప్రాయశ్చిత్త త్యాగము ద్వారా, ఆయన మనల్ని పాపము నుండి, కోపము మరియు ద్వేష భావనల భారము నుండి విడిపించి మనకవసరమైన జీవనోపాధిని మనకు అందించగలరు.4
అబీగయీలు తనపై నాబాలు పాపమును తీసుకొనుటకు సమ్మతించినట్లుగా, రక్షకుడు—అర్థంకాని విధానములో—మన పాపములను మరియు మనల్ని గాయపరచిన లేదా అవమానపరచిన వారి పాపములను ఆయనపై తీసుకున్నారు.5 గెత్సేమనేలో మరియు సిలువపై, ఆయన ఈ పాపములను హక్కుగా పొందారు. ప్రతీకార భావాలు విడిచిపెట్టడానికి ఆయన మనకు ఒక మార్గమునిచ్చారు. ఆ “మార్గమే” క్షమించడం—అది మనము ఎప్పుడూ చేసే మిక్కిలి కష్టమైన విషయాలలో ఒకటి మరియు మనము ఎప్పుడూ అనుభవించే అత్యంత దైవిక విషయాలలో ఒకటి కాగలదు. క్షమాపణ బాటపై, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త శక్తి మన జీవితాలలోనికి సమృద్ధిగా ప్రవేశించగలదు మరియు హృదయము, ఆత్మ యొక్క బాధలను, ప్రయాసలను స్వస్థపరచుట ప్రారంభించగలదు.
క్షమించగల సామర్థ్యమును పరలోక తండ్రి మనకిస్తారని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు:
“ఆయన ప్రాయశ్చిత్త త్యాగము ద్వారా, మిమ్మల్ని గాయపరచిన వారిని మరియు మీపట్ల వారి క్రూరత్వము కోసం ఎన్నడూ బాధ్యతవహించని వారిని మీరు క్షమించగలరు.
“సాధారణంగా నిజాయితీతో, వినయముతో మీ క్షమాపణ కోరే వారిని క్షమించడం సులభము. కానీ ఏ విధంగానైనా మీ పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన వారెవరినైనా క్షమించే సామర్థ్యాన్ని రక్షకుడు మీకు దయచేస్తారు. అప్పుడు వారి హానికరమైన చర్యలు మీ ఆత్మను ఇకపై నష్టపరచలేవు.”6
అబీగయీలు సమృద్ధిగా ఆహారమును మరియు సరఫరాలను తెచ్చుట అనేది నొచ్చిన, గాయపడిన వారికి జీవనోపాధిని మరియు స్వస్థపరచబడుటకు, బాగు చేయబడుటకు మనకవసరమైన సహాయమును రక్షకుడు అందిస్తారని మనకు బోధించగలదు. 7 ఇతరుల చర్యల యొక్క పర్యవసానాలను మన స్వంతంగా ఎదుర్కోవడానికి మనము వదిలిపెట్టబడము; మనం కూడా సంపూర్ణం చేయబడగలము మరియు కోపము, ద్వేష భావాల భారమునుండి, దాని తరువాత జరిగే చర్యల నుండి రక్షింపబడే అవకాశం ఇవ్వబడగలము.
ప్రభువు ఇలా చెప్పారు, “ప్రభువైన నేను, ఎవరిని క్షమించెదనో వారిని క్షమించెదను, కానీ మీరైతే మనుష్యులందరిని క్షమించవలసిన అవసరమున్నది.”8 మన స్వయం హితం కోసం క్షమించమని ప్రభువు మనల్ని కోరుతున్నారు.9 కానీ ఆయన సహాయము, ఆయన ప్రేమ, ఆయన గ్రహింపు లేకుండా దానిని చేయమని ఆయన మనల్ని అడగరు. ప్రభువుతో మన నిబంధనల ద్వారా, మనలో ప్రతీఒక్కరూ క్షమించడానికి, క్షమించబడడానికి మనకవసరమైన బలపరచు శక్తిని, నడిపింపును మరియు సహాయమును పొందగలరు.
ఒకరిని క్షమించడం అంటే మిమ్మల్నిమీరు ఇంకా బాధపడుతూ ఉండే స్థితిలో ఉంచుకోవడం కాదని దయచేసి తెలుసుకోండి. “ఒకరిని క్షమించడానికి మనం శ్రమించగలము, అయినప్పటికీ వారి నుండి దూరంగా ఉండాలని ఆత్మ చేత ప్రేరేపించబడగలము.”10
దావీదు “మనోవిచారము”11 లేకుండా ఉండడానికి మరియు అతడికి అవసరమైన సహాయమును పొందడానికి అబీగయీలు సహాయపడినట్లుగా, రక్షకుడు మీకు సహాయపడతారు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, “తన రెక్కలయందు స్వస్థత కలిగి,”12 మీ బాటపై ఆయన మిమ్మల్ని కలుసుకుంటారు. ఆయన మీ శాంతిని కోరుతున్నారు.
కోపము, ద్వేషముగల నా హృదయాన్ని క్రీస్తు స్వస్థపరచిన అద్భుతాన్ని నేను వ్యక్తిగతంగా చూసాను. మా నాన్న అనుమతితో నేను పంచుకుంటున్నాను, భావోద్వేగాలు మరియు మాటల దుర్వినియోగం వలన నేను ఎన్నడూ సురక్షితంగా భావించని ఇంటిలో నేను పెరిగాను. నా యౌవనము మరియు యుక్తవయస్సులో, నేను మా నాన్నపై పగ పెంచుకున్నాను మరియు ఆ బాధ మూలంగా నా హృదయములో కోపము రగులుకుంది.
సంవత్సరాలుగా, క్షమాపణ యొక్క బాటపై సమాధానమును, స్వస్థతను కనుగొనాలనే నా ప్రయత్నాల్లో, నా పాపాల కొరకు ప్రాయశ్చిత్తము చేసిన దేవుని కుమారుడు, నన్ను తీవ్రంగా గాయపరచిన వారిని కూడా రక్షించే విమోచకుడని గంభీరమైన విధానములో నేను గ్రహించాను. రెండవ సత్యాన్ని నమ్మకుండా మొదటి దానిని నేను నిజంగా నమ్మలేను.
రక్షకుని కొరకు నా ప్రేమ పెరిగినప్పుడు, గాయాన్ని, కోపాన్ని ఆయన స్వస్థపరిచే ఔషధంతో భర్తీ చేయాలనే నా కోరిక కూడా పెరిగింది. అది అనేక సంవత్సరాల ప్రక్రియ, దానికి ధైర్యం, దుర్భలత్వము, పట్టుదల మరియు రక్షించి, స్వస్థపరిచే రక్షకుని దైవిక శక్తిపై నమ్మకముంచడాన్ని నేర్చుకోవడం అవసరము. నేనింకా చేయాల్సిన పని ఉంది, కానీ నా హృదయంలో కోపం మరియు ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలు లేవు. నా ప్రక్కన నిలిచియుండి, సరైన స్థలమునకు మృదువుగా, ఓపికగా నన్ను నడిపించి, నాతో దుఃఖించి, నా విచారమును ఎరిగిన, వ్యక్తిగత రక్షకుని యొక్క గాఢమైన, స్థిరమైన ప్రేమను అనుభవించిన ఒక—“నూతన హృదయము”43 నాకివ్వబడింది.
అబీగయీలు దావీదుకు అవసరమైనవి తెచ్చినట్లుగా ప్రభువు నాకు నష్టపరిహార దీవెనలు పంపించారు. ఆయన నా జీవితంలో బోధకులను పంపారు. అన్నిటికంటే మధురమైనది మరియు మిక్కిలి మార్పు చెందినది, నా పరలోక తండ్రితో నా అనుబంధము. ఆయన ద్వారా, నేను పరిపూర్ణుడైన తండ్రి యొక్క మృదువైన, రక్షణతో కూడిన, నడిపించే ప్రేమను కృతజ్ఞతాపూర్వకంగా తెలుసుకున్నాను.
ఎల్డర్ రిఛర్డ్ జి. స్కాట్ ఇలా అన్నారు: “జరిగిన దానిని మీరు చెరిపివేయలేరు, కానీ మీరు క్షమించగలరు.14 క్షమాపణ భయంకరమైన, విషాదకరమైన గాయాలను నయం చేస్తుంది, ఎందుకంటే అది మీ హృదయము మరియు మనస్సులోని ద్వేషపూరిత విషమును ప్రక్షాళన చేయడానికి దేవుని ప్రేమను అనుమతిస్తుంది. అది ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికగల మీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. అది ప్రభువు యొక్క శుద్ధి చేయు, స్వస్థపరచు, పునఃస్థాపించు ప్రేమకు చోటు కల్పిస్తుంది.”15
ఇటీవలి సంవత్సరాలలో నా ఇహలోక తండ్రి కూడా అద్భుతమైన మార్పును పొంది, ప్రభువు వైపు తిరిగారు—దానిని నేను ఈ జీవితంలో ఆశించలేదు. యేసు క్రీస్తు యొక్క సంపూర్ణమైన, పరివర్తనా శక్తికి ఇది నాకు మరొక సాక్ష్యము.
ఆయన పాపిని, పాపం చేసిన వారిని స్వస్థపరచగలడని నాకు తెలుసు. ఆయన లోకము యొక్క రక్షకుడు మరియు విమోచకుడు, మనము తిరిగి జీవించునట్లు ఆయన తన ప్రాణమును పెట్టారు. ఆయన ఇలా అన్నారు: “ప్రభువు ఆత్మ నామీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, విరిగి నలిగిన వారిని స్వస్థపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ఆయన నన్ను పంపియున్నాడు.”16
విరిగి నలిగిన వారు, చెరలో ఉన్నవారు, నలిగిన వారు మరియు గాయము లేదా పాపముచేత గ్రుడ్డివారైన వారందరికి ఆయన స్వస్థతను, ఆరోగ్య ప్రాప్తిని మరియు విడుదలను అందిస్తారు. ఆయన అందించే స్వస్థత మరియు ఆరోగ్య ప్రాప్తి నిజమైనవని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆ స్వస్థత యొక్క సమయము వ్యక్తిగతమైనది మరియు మరొకరి సమయాన్ని మనము విమర్శించలేము. స్వస్థపడడానికి మనకు అవసరమైన సమయాన్ని అనుమతించడం మరియు ప్రక్రియలో మనపట్ల మనం దయగా ఉండడం ముఖ్యమైనది. రక్షకుడు ఎప్పుడూ కనికరము, ఆసక్తి కలిగియున్నాడు మరియు మనకు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా నిలిచియున్నాడు.17
క్షమాపణ మరియు స్వస్థత బాటపై మన కుటుంబాల్లో లేదా మరెక్కడైనా అనారోగ్యకరమైన విధానాలు లేదా సంబంధాలను శాశ్వతం చేయకూడదనే ఎంపిక ఉంది. మన ప్రభావము లోపల ఉన్నవారందరికి, క్రూరత్వానికి బదులు దయను, ద్వేషానికి బదులు ప్రేమను, మొరటుతనానికి బదులు సౌమ్యతను, బాధకు బదులు భద్రతను, వాదనకు బదులు శాంతిని మనము ఇవ్వగలము.
మీకు నిరాకరించబడిన దానిని ఇచ్చుట, యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా సాధ్యమయ్యే దైవిక స్వస్థత యొక్క శక్తివంతమైన భాగము. మీరు ఇచ్చే విధంగా జీవించడం, యెషయా చెప్పినట్లుగా, మీ జీవితపు బూడిదకు ప్రతిగా పూదండ18 అనేది రక్షకుని యొక్క అత్యున్నతమైన మాదిరిని అనుసరించే విశ్వాసపు చర్య, ఆయన అందరికి సహాయం చేయగలుగునట్లు అన్ని బాధలు అనుభవించారు.
ఐగుప్తు యొక్క యోసేపు బూడిదగల జీవితాన్ని జీవించాడు. అతడు తన అన్నల చేత ద్వేషించబడ్డాడు, మోసగించబడ్డాడు, బానిసత్వములోనికి అమ్మబడ్డాడు, తప్పుగా చెరలో పెట్టబడ్డాడు మరియు సహాయము చేస్తానని చెప్పిన ఒకరి చేత మరిచిపోబడ్డాడు. అయినప్పటికీ అతడు ప్రభువునందు నమ్మకముంచాడు. “యెహోవా యోసేపునకు తోడైయుండెను” 19 మరియు అతడి శ్రమలను అతడి స్వంత దీవెనకు, అభివృద్ధికి—మరియు అతడి కుటుంబాన్ని, సమస్త ఐగుప్తును రక్షించడానికి అభిషేకించెను.
యోసేపు ఐగుప్తులో గొప్ప నాయకునిగా తన అన్నలను కలిసినప్పుడు, అతడి క్షమాపణ మరియు నిర్మలమైన దృక్పథము అతడు మాట్లాడిన కనికరముగల మాటలలో ప్రత్యక్షపరచబడ్డాయి:
“అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి: ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. …
“కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు.”20
రక్షకుని ద్వారా, యోసేపు జీవితము “బూడిదకు ప్రతిగా పూదండ”గా మారింది.12
బి వై యు అధ్యక్షుడైన కెవిన్ జె. వర్తెన్ ఇలా అన్నారు, దేవుడు “మన విజయాల నుండి మాత్రమే కాదు, కానీ మన వైఫల్యాలు మరియు మనకు బాధ కలిగించే ఇతరుల వైఫల్యాల నుండి కూడా … మంచి వచ్చేలా చేయగలడు. దేవుడు అంత మంచివాడు మరియు అంత శక్తిమంతుడు.”22
మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రేమ మరియు క్షమాపణ యొక్క గొప్ప మాదిరి అని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన బాధాకరమైన వేదనలో ఉండి ఇలా అన్నారు, “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము.”23
పరలోకమందున్న మన తండ్రి తన పిల్లలలో ప్రతీఒక్కరి కోసం మంచిని, నిరీక్షణను కోరుతున్నారని నాకు తెలుసు. యిర్మీయాలో మనము ఇలా చదువుతాము, “నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే, ఇదే యెహోవా వాక్కు.”24
యేసు క్రీస్తు మీ వ్యక్తిగత మెస్సీయ, మీ ప్రియమైన విమోచకుడు మరియు రక్షకుడు, మీ హృదయపు విజ్ఞాపనలను ఎరిగియున్నారు. ఆయన మీ స్వస్థతను, సంతోషమును కోరుతున్నారు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన మీ బాధల్లో మీతోపాటు దుఃఖిస్తున్నారు మరియు మిమ్మల్ని స్వస్థపరచడంలో ఆనందిస్తున్నారు. క్షమాపణ యొక్క స్వస్థపరిచే బాటపై మనము నడిచినప్పుడు, మనము హృదయపూర్వకంగా ఉండి, ఎప్పటికీ చాపబడిన ఆయన ప్రేమగల హస్తమును అందుకోవాలని25 యేసు క్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.