సర్వసభ్య సమావేశము
సంతోషంగా మరియు శాశ్వతంగా
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


13:21

సంతోషంగా మరియు శాశ్వతంగా

నిజం, శాశ్వతమైన ఆనందం మరియు మనం ప్రేమించే వారితో నిత్యత్వం అనేవి దేవుని యొక్క సంతోష ప్రణాళికలో అత్యంత ఆవశ్యకమైనవి.

మిత్రులారా, ప్రియమైన సహోదర సహోదరీలారా, ఎప్పటికీ సంతోషంగా అనేదానిలో నమ్మడం లేదా నమ్మాలని కోరుకోవడం మీకు గుర్తుందా?

అప్పుడు జీవితం మొదలవుతుంది. మనం “పరిపక్వమవుతాం.” అనుబంధాలు క్లిష్టంగా మారతాయి. ఈ ప్రపంచం దాని నటన మరియు తీరుతో సందడిగా, రద్దీగా, తోస్తున్నట్లు ఉంది. అయినప్పటికీ, మన “మనస్సు లోతుల్లో,”1 ఎక్కడో, ఎలాగో, శాశ్వతమైన సంతోషం నిజమని, సాధ్యమని మనం నమ్ముతాము లేదా నమ్మాలని కోరుకుంటాం.

“సంతోషంగా మరియు శాశ్వతంగా” అనేవి కల్పిత కథల్లో చదివే ఊహలు మాత్రమే కాదు. నిజం, శాశ్వతమైన ఆనందం మరియు మనం ప్రేమించే వారితో నిత్యత్వం అనేవి దేవుని యొక్క సంతోష ప్రణాళికలో అత్యంత ఆవశ్యకమైనవి. ప్రేమతో ఆయన సిద్ధపరచిన మార్గం మన నిత్య ప్రయాణాన్ని సంతోషంగా మరియు శాశ్వతంగా చేయగలదు.

మనకు వేడుక చేసుకొనేందుకు చాలా ఉంది మరియు దానికోసం కృతజ్ఞత కలిగియుండాలి. అయినా, మనలో ఎవ్వరూ పరిపూర్ణులు కారు లేదా ఏ కుటుంబము పరిపూర్ణము కాదు. మన అనుబంధాల్లో ప్రేమ, సామాజికత, వ్యక్తిత్వము ఉంటాయి, కానీ తరచు ఘర్షణ, గాయం, కొన్నిసార్లు తీవ్రమైన బాధ కూడా ఉంటుంది.

“ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.”2 యేసు క్రీస్తునందు బ్రదికింపబడుదురు అనేది అమర్త్యత్వాన్ని కలిపియుంది—అది ఆయన బహుమానమిచ్చిన మన శరీర పునరుత్థానము. మనం విశ్వాసంతో, విధేయతతో జీవించినప్పుడు, క్రీస్తునందు బ్రదికింపబడుదురు అనేది దేవునితో మరియు మనం ప్రేమించే వారితో ఆనందకరమైన సమృద్ధియైన నిత్యజీవమును కూడా కలిపియుండవచ్చు.

విశేషమైన విధానంలో, పవిత్రమైన దేవాలయ విధులు మరియు నిబంధనలు అనేక ప్రదేశాలలో మనకు దగ్గరగా రావడంతో సహా, ప్రభువు యొక్క ప్రవక్త మనల్ని మన రక్షకునికి దగ్గర చేస్తున్నారు. ఈ లోకములో, నిత్యత్వములో ఒకరిపట్ల ఒకరు మరియు మన కుటుంబాలలో క్రొత్త ఆత్మీయ గ్రహింపును, ప్రేమ, పశ్చాత్తాపము మరియు క్షమాపణను కనుగొనడానికి మనం గొప్ప అవకాశాన్ని, బహుమానాన్ని కలిగియున్నాము.

అనుమతితో, నేను రెండు పవిత్రమైన, అసాధారణంగా ఆత్మచేత నిర్దేశించబడిన అనుభవాలను పంచుకుంటాను, అవి తరతరాల వేదనను కూడా స్వస్థపరచడం ద్వారా యేసు క్రీస్తు కుటుంబాలను ఏకం చేయడం గురించి నా స్నేహితులు చెప్పినవి.3 “అనంతమైన నిత్యమైన,”4 “మరణపాశముల కంటె గొప్పదైన,”5 యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మన గతానికి శాంతిని, మన భవిష్యత్తుకు నిరీక్షణను తేవడంలో మనకు సహాయపడగలదు.

నా స్నేహితురాలు, ఆమె భర్త యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో చేరినప్పుడు, కుటుంబ సంబంధాలు “మరణం వరకు మాత్రమే” ఉండవలసిన అవసరం లేదని వారు ఆనందంగా నేర్చుకున్నారు. ప్రభువు మందిరములో, కుటుంబాలు శాశ్వతంగా ఏకం చేయబడగలవు (ముద్రించబడగలవు).

కానీ నా స్నేహితురాలు తన తండ్రితో ముద్రింపబడాలని కోరుకోలేదు. “అతడు నా తల్లికి మంచి భర్త కాదు. అతడు తన పిల్లలకు మంచి తండ్రి కూడా కాదు,” అని ఆమె చెప్పింది. “మా నాన్న వేచియుండాలి. ఆయన కోసం దేవాలయ కార్యము చేయాలని కాని, నిత్యత్వములో ఆయనతో ముద్రింపబడాలని కాని నాకు ఏ కోరిక లేదు.”

ఒక సంవత్సరం పాటు ఆమె తన తండ్రి గురించి ఉపవాసముండి, ప్రార్థించి, ప్రభువుతో చాలా మాట్లాడింది. చివరకు, ఆమె సిద్ధపడింది. ఆమె తండ్రి కొరకు దేవాలయ కార్యము పూర్తిచేయబడింది. తర్వాత ఆమె ఇలా అంది, “నేను నిద్రపోయినప్పుడు కలలో మా నాన్న తెల్లని దుస్తులు ధరించి కనిపించాడు. ఆయన మారాడు. ఆయన చెప్పాడు, ‘నన్ను చూడు. నేను అంతా శుభ్రంగా ఉన్నాను. నా కోసం దేవాలయ కార్యము చేస్తున్నందుకు ధన్యవాదాలు,’ అని అన్నారు.” ఆమె తండ్రి ఇంకా ఇలా అన్నారు, “లేచి, దేవాలయానికి తిరిగి వెళ్ళు; మీ అన్న బాప్తిస్మం తీసుకోవడానికి వేచియున్నాడు.”

“నా పూర్వీకులు మరియు మరణించిన ఇతరులు తమ కార్యము చేయబడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు,” అని నా స్నేహితురాలు చెప్పింది.

“నా దృష్టిలో, దేవాలయము స్వస్థత కలిగించే , నేర్చుకొనే ప్రదేశము మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తాన్ని అంగీకరించే ప్రదేశము” అని ఆమె అంది.

రెండవ అనుభవము. మరొక స్నేహితుడు తన కుటుంబ చరిత్రను శ్రద్ధగా పరిశోధించాడు. అతని ముత్తాతను గుర్తించాలని అతడు కోరుకున్నాడు.

ఒకరోజు ప్రొద్దున్నే, అతని గదిలో ఒక వ్యక్తి ఆత్మ రూపంలో ఉన్నట్లు అతనికి అనిపించిందని నా స్నేహితుడు చెప్పాడు. ఆ వ్యక్తి అతని కుటుంబం చేత కనుగొనబడి, తెలుసుకోబడాలని కోరుకున్నాడు. ఆ వ్యక్తి ఒక తప్పు చేసినందుకు దుఃఖించాడు, దానికోసం అతడు ఇప్పుడు పశ్చాత్తాపపడ్డాడు. నా స్నేహితుడు తన ముత్తాత అనుకున్న ఆ వ్యక్తికి, నా స్నేహితుడికి ఎటువంటి డిఎన్‌ఎ సంబంధం లేదని గ్రహించడానికిఆ వ్యక్తి సహాయపడ్డాడు. “మరొక విధంగా చెప్పాలంటే, నేను నా ముత్తాతను కనుగొన్నాను మరియు నా ముత్తాతగా మా కుటుంబ గ్రంథాలలో చెప్పబడిన వ్యక్తి ఆయన కాదని తెలుసుకున్నాను,” అని నా స్నేహితుడు చెప్పాడు.

అతని కుటుంబ సంబంధాలు స్పష్టమయ్యాయి, నా స్నేహితుడు ఇలా అన్నాడు, “నేన స్వేచ్ఛగా, , ప్రశాంతంగా భావిస్తున్నాను. ఎవరు నా కుటుంబమో తెలుసుకోవడం చాలా ముఖ్యము.” “కుటుంబంలో ఒకరు తప్పు చేసినంత మాత్రాన మొత్తం కుటుంబం చెడ్డది కాదు. మనం ఈ లోకంలోకి ఎలా వస్తామన్నది ముఖ్యం కాదు, ఈ లోకాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మనం ఎవరమనేది ముఖ్యం,” అని నా స్నేహితుడు గాఢాలోచన చేసాడు.

పరిశుద్ధ లేఖనాలు మరియు ఆత్మ లోకంలో జీవించియున్న వారితో సహా, వ్యక్తిగత స్వస్థత మరియు శాంతికి సంబంధించిన పవిత్రమైన అనుభవాలు ఐదు సిద్ధాంత సూత్రాలపై ఆధారపడతాయి.

మొదటిది: దేవుని యొక్క విమోచన మరియు సంతోష ప్రణాళికకు కేంద్రమైన యేసు క్రీస్తు, ఆయన ప్రాయశ్చిత్తం ద్వారా, “ఇక ఎన్నడూ వేరుకాకుండా మన శరీరము ఆత్మయు జతపరచబడునని, తద్వారా మనం సంపూర్ణ ఆనందమును పొందెదమని” వాగ్దానమిస్తున్నారు.6

రెండవది: ప్రాయశ్చిత్తము—క్రీస్తుతో ఏకం కావడం—అనేది మనం విశ్వాసాన్ని సాధన చేసి, మారుమనస్సునకు తగిన ఫలములు ఫలించినప్పుడు జరుగుతుంది.7 మర్త్యత్వంలో జరిగినట్లు, అమర్త్యత్వంలో జరుగుతుంది. దేవాలయ విధులు వాటంతట అవే మనల్ని లేదా ఆత్మ లోకంలో ఉన్నవారిని మార్చివేయవు. కానీ, ఈ దైవిక విధులు ప్రభువుతో పరిశుద్ధపరిచే నిబంధనలను సాధ్యం చేస్తాయి, అవి ఆయనతో మరియు ఒకరికొకరితో సామరస్యాన్ని తీసుకురాగలవు.

యేసు క్రీస్తు యొక్క కృపను, మన కొరకు క్షమాపణను మనం అనుభవించినప్పుడు, మన ఆనందం సంపూర్ణమవుతుంది. ఆయన కృప మరియు క్షమాపణ యొక్క అద్భుతాన్ని మనం ఒకరికొకరం అందించుకున్నప్పుడు, మనం పొందే దయ మరియు మనం అందించే దయ జీవితంలోని అన్యాయాలను న్యాయమైనవిగా చేయడానికి సహాయపడగలవు.8

మూడవది: దేవుడు మనల్ని సంపూర్ణంగా ఎరిగి ప్రేమిస్తున్నారు. “దేవుడు వెక్కిరింపబడడు,”9 లేదా ఆయన మోసగించబడడు. వినయం గలవారిని, పశ్చాత్తాపపడిన వారిని ఆయన పరిపూర్ణమైన దయతో, న్యాయంతో సురక్షితమైన తన బాహువులలో చుట్టుకుంటారు.

కర్ట్‌లాండ్ దేవాలయంలో, ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఒక దర్శనంలో తన అన్న ఆల్విన్ సిలెస్టియల్ రాజ్యంలో రక్షింపబడడాన్ని చూసారు. బాప్తిస్మము యొక్క రక్షించే విధిని పొందకుండా ఆల్విన్ మరణించినందున, ప్రవక్త జోసెఫ్ ఆశ్చర్యపోయారు.10 ఎందుకో, ప్రభువు ఓదారుస్తూ,వివరించారు: ప్రభువు “[మన] క్రియలను బట్టి, [మన] హృదయ వాంఛలను బట్టి [మనల్ని] తీర్పుతీరుస్తారు.”11 మన ఆత్మలు మన క్రియలను, కోరికలను నమోదు చేస్తాయి.

జీవించియున్నవారు మరియు “పశ్చాత్తాపపడు మృతులు దేవుని మందిరంలోని విధులకు విధేయత చూపుట ద్వారా మరియు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా విమోచింపబడుదురు”12 అని కృతజ్ఞతాపూర్వకంగా మనకు తెలుసు. ఆత్మ లోకంలో, పాపం మరియు అతిక్రమము చేసిన వారు కూడా పశ్చాత్తాపపడే అవకాశం కలిగియుంటారు.13

దానికి విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా దుష్టత్వాన్ని ఎంచుకొనేవారు, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపాన్ని వాయిదా వేసేవారు లేదా సులువైన పశ్చాత్తాపం కోసం ప్రణాళిక చేస్తూ, ముందుగా అనుకొని లేదా కావాలని ఆజ్ఞలను పాటించనివారు, “[తమ] సమస్త దోషము యొక్క స్పష్టమైన జ్ఞాపకము కలిగియుండి,”14 దేవుని చేత తీర్పుతీర్చబడతారు. తెలిసి మనం శనివారం పాపం చేసి, ఆదివారం సంస్కారంలో పాలుపంచుకోవడం ద్వారా యాంత్రికమైన క్షమాపణను ఆశించలేము. ఆత్మను అనుసరించడం అంటే అర్థము, సువార్త సేవా ప్రమాణాలకు లేదా ఆజ్ఞలకు విధేయులైయుండవలసిన అవసరం లేదని చెప్పే సువార్తికులు లేదా ఇతరులు దయచేసి గుర్తుంచుకోండి, సువార్త సేవా ప్రమాణాలకు మరియు ఆజ్ఞలకు విధేయులైయుండడం ఆత్మను ఆహ్వానిస్తుంది. మనలో ఎవ్వరూ తమ పశ్చాత్తాపాన్ని ఆలస్యం చేయకూడదు. మనం పశ్చాత్తాపపడడాన్ని ప్రారంభించినప్పుడు, పశ్చాత్తాపము యొక్క దీవెనలు ప్రారంభమవుతాయి.

నాల్గవది: ఇతరులకు అవసరమైయుండి, వారికైవారు చేసుకోలేని దేవాలయ రక్షణ విధులకు మనం ప్రాతినిధ్యం వహించినప్పుడు, ప్రభువు మనకు ఆయన వలె కావడానికి దైవిక అవకాశమిస్తారు. మనము “సీయోను కొండమీద … రక్షకులం”16 అయినప్పుడు, మనం మరింత సంపూర్ణులమై, పరిపూర్ణులుగా చేయబడతాము.15 మనం ఇతరులకు సేవ చేసినప్పుడు, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ విధులను ఆమోదించగలడు మరియు ఇచ్చేవారిని, అందుకొనేవారిని ఇద్దరిని శుద్ధిచేయగలడు. కాలక్రమేణా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేయబడిన దీవెనలను పొందుతూ, ఇచ్చేవారు అందుకొనేవారు ఇద్దరూ రూపాంతరం చెందే నిబంధనలను చేయగలరు మరియు వృద్ధిచేయగలరు.

చివరగా, ఐదవది: ఉత్తమమైన సూత్రం17 బోధించినట్లుగా, పశ్చాత్తాపం మరియు క్షమాపణలో పరిశుద్ధపరచబడిన సమరూపత మనకోసం మనం కావాలనుకున్న దానిని, కోరుకున్నదానినే ఇతరులకు అందించమని మనలో ప్రతీఒక్కరిని ఆహ్వానిస్తుంది.

కొన్నిసార్లు ఒకరిని క్షమించడానికి మన సమ్మతి మనం పశ్చాత్తాపపడగలమని, క్షమించబడగలమని నమ్మడాన్ని మనకు, వారికి కూడా సాధ్యం చేస్తుంది. కొన్నిసార్లు పశ్చాత్తాపపడడానికి సమ్మతించడం మరియు క్షమించగల సామర్థ్యం విభిన్న సమయాలలో వస్తాయి. మన రక్షకుడు దేవునితో మన మధ్యవర్తి, కానీ మనం ఆయన వద్దకు వచ్చినప్పుడు, మనం మన వద్దకు మరియు ఒకరి వద్దకు ఒకరు రావడానికి కూడా ఆయన సహాయపడతారు. ప్రత్యేకించి గాయం మరియు బాధ తీవ్రంగా ఉన్నప్పుడు, మన అనుబంధాలను బాగుచేసుకోవడం, మన హృదయాలను స్వస్థపరచుకోవడం కష్టం, మనకైమనం చేసుకోవడం బహుశా అసాధ్యం. కానీ ఎప్పుడు పట్టుకోవాలి, ఎలా వదిలివేయాలి అని తెలుసుకోవడానికి మన స్వంత దానిని మించిన బలాన్ని, జ్ఞానాన్ని పరలోకం మనకు ఇవ్వగలదు.

మనం ఒంటరివారము కాదని మనం గ్రహించినప్పుడు, మనం తక్కువ ఒంటరితనాన్ని భావిస్తాము. మన రక్షకుడు ఎల్లప్పుడూ అర్థం చేసుకుంటారు.18 మన రక్షకుని సహాయంతో, మనం మన గర్వాన్ని, మన గాయాలను, మన పాపాలను దేవునికి అప్పగించగలము. అయినప్పటికీ, మనం ప్రారంభించినప్పుడు, మన అనుబంధాలను బాగుచేయమని ఆయనను నమ్మినప్పుడు మనం మరింత సంపూర్ణంగా అవుతామని మనం భావించవచ్చు.

పరిపూర్ణంగా చూసి, అర్థం చేసుకునే ప్రభువు ఎవరిని క్షమిస్తారో వారిని క్షమిస్తారు; (అపరిపూర్ణులమైన) మనం అందరిని క్షమించవలసిన అవసరమున్నది. మనం మన రక్షకుని యొద్ద వచ్చినప్పుడు, మనపై మనం తక్కువగా దృష్టిపెడతాము. మనం తక్కువగా తీర్పుతీర్చి, ఎక్కువగా క్షమిస్తాము. ఆయన మంచితనము, కనికరము మరియు కృపను నమ్మడం19 మనల్ని వివాదం, కోపం, హింస, పరిత్యాగం, అన్యాయం మరియు కొన్నిసార్లు మర్త్యలోకంలో భౌతిక శరీరంతో పాటు వచ్చే శారీరక, మానసిక సవాళ్ళ నుండి విడిపించగలదు. శాశ్వతమైన సంతోషానికి అర్థం, ప్రతీ అనుబంధం సంతోషంగా మరియు శాశ్వతంగా ఉంటుందని కాదు. కానీ సాతాను బంధించబడినప్పుడు20, వెయ్యి సహస్రాబ్ది సంవత్సరాలు ప్రేమించడానికి, అర్థం చేసుకోవడానికి, నిత్యత్వము కొరకు మనం సిద్ధపడుతుండగా సమస్యలు పరిష్కరించుకోవడానికి మనకు కావలసిన సమయాన్ని మరియు ఆశ్చర్యకరమైన విధానాలను ఇవ్వవచ్చు.

మనం ఒకరిలో ఒకరం పరలోక సమాజ వ్యవస్థను కనుగొంటాము.21 దేవుని కార్యము మరియు మహిమ, శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వడాన్ని కలిపియుంది.22 దేవుడు మరియు యేసు క్రీస్తును తెలుసుకోవడమే నిత్యజీవము మరియు మహోన్నతస్థితి, కాబట్టి దేవుని శక్తి ద్వారా, వారు ఉన్నచోటే మనం ఉంటాము.23

ప్రియమైన సహోదర సహోదరీలారా, మన పరలోక తండ్రియైన దేవుడు మరియు ఆయన ప్రియ కుమారుడు జీవించియున్నారు. వారు మనలో ప్రతీక్కరికి, ప్రతీ బంధువుకు మరియు ప్రతీ నాలుకకు శాంతి, ఆనందం మరియు స్వస్థతను అందిస్తారు. ప్రభువు యొక్క ప్రవక్త దారి చూపుతున్నారు. కడవరి దిన బయల్పాటు కొనసాగుతుంది. ప్రభువు యొక్క పరిశుద్ధ మందిరంలో మన రక్షకునికి మనం చేరువవుదాము మరియు మన తరాలన్నిటిలో క్రీస్తువంటి కనికరము, సత్యము, దయతో మనం మన హృదయాలను కలిపి ముడివేసుకున్నప్పుడు—ఈ లోకంలో, నిత్యత్వములో సంతోషంగా మరియు శాశ్వతంగా ఆయన మనల్ని దేవునికి, ఒకరికొకరికి దగ్గరగా చేస్తారు. యేసు క్రీస్తు నందు, ఇది సాధ్యము; యేసు క్రీస్తు నందు, ఇది సత్యము. ఈవిధంగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.