ప్రేమ యొక్క నిత్య సూత్రము
మన పరలోక తండ్రికి తన ప్రతీ బిడ్డ పట్ల ఉన్న ప్రేమ నిజమైనది. ప్రతీఒక్కరి కోసం ఆయన ఉన్నారు.
రెండు గొప్ప ఆజ్ఞలను జీవించుట ద్వారా ప్రేమ యొక్క నిత్య సూత్రము ప్రత్యక్షపరచబడింది: దేవుడిని నీ పూర్ణ హృదయముతోను, పూర్ణశక్తితోను, పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెను మరియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.1
ఇక్కడ యుటాలో నా మొదటి చలికాలం నాకు గుర్తున్నది—ప్రతీచోట మంచు. సోనోరన్ ఎడారి నుండి వచ్చిన నేను మొదట్లో దానిని ఆనందించాను, కానీ కొన్నిరోజుల తర్వాత, నేను త్వరగా లేచి దారిలో ఉన్న మంచును తొలగించాలని నేను గ్రహించాను.
ఒకరోజు ప్రొద్దున, మంచు తుఫాను మధ్యలో నేను మంచును తొలగిస్తూ, చెమటలు కక్కుతుండగా మా పొరుగాయన వీధికి అవతల తన గ్యారేజీని తెరవడం చూసాను. అతడు నాకంటే పెద్దవాడు, కాబట్టి నేను త్వరగా పూర్తి చేస్తే అతనికి సహాయపడవచ్చని అనుకున్నాను. కనుక నా స్వరమును పైకెత్తి అతడిని అడిగాను, “సహోదరా, మీకు సహాయము కావాలా?”
అతను నవ్వి, “ధన్యవాదాలు, ఎల్డర్ మంతోయా” అన్నాడు. అప్పుడు అతను, తన గ్యారేజీ నుండి మంచు తొలగించే యంత్రాన్ని తీసి, ఇంజిన్‌ను ప్రారంభించి, కొద్ది నిమిషాల్లో తన ఇంటి ముందు ఉన్న మొత్తం మంచును తొలగించాడు. తర్వాత అతను తన యంత్రంతో వీధి దాటి, “ఎల్డర్, మీకెమైనా సహాయం కావాలా?” అని నన్ను అడిగాడు.
చిరునవ్వుతో నేను, “అవును, ధన్యవాదాలు” అని చెప్పాను.
మేము ఒకరినొకరం ప్రేమిస్తున్నాము, కాబట్టి మేము ఒకరికొకరం సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మరియు నా సోదరుడి అవసరాలు నావిగా మారాయి, నా అవసరాలు అతనివిగా మారాయి. నా సోదరుడు ఏ భాష మాట్లాడినా లేదా అతడు ఏ దేశము నుండి వచ్చినా మేము ఒకరినొకరం ప్రేమించుకుంటాము, ఎందుకంటే మేము సోదరులము, ఒకే తండ్రి పిల్లలము.
పరిచర్య ప్రకటించబడినప్పుడు, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు, “ఇతరులను సంరక్షించడానికి మరియు వారికి పరిచర్య చేయడానికి ఒక క్రొత్త, పరిశుద్ధమైన విధానమును మేము అమలు చేస్తాము.”2 నా దృష్టిలో, పరిశుద్ధమైనది అనగా ఎక్కువ వ్యక్తిగతమైనది, లోతైనది మరియు రక్షకుని యొక్క విధానము వలే ఎక్కువగా ఉన్నది: ఒక్కొక్కరుగా “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమ గలవారైయుండుడి.”3
ఇతరులకు ఆటంకంగా ఉండకపోవడం మాత్రమే సరిపోదు; రోడ్డుపై అవసరతలో ఉన్నవారిని చూసి కూడా తప్పుకోవడం తగదు. ఈ జీవితంలో వారిని మొదటిసారి మరియు ఒకేఒక్కసారి కలుసుకున్నప్పటికీ, మన పొరుగువారికి సహాయపడగల ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం.
దేవుని పట్ల ప్రేమ మొదటి గొప్ప ఆజ్ఞగా ఎందుకున్నది?
ఆయన మనకు ముఖ్యమైన వాడు కనుక అని నేను అనుకుంటున్నాను. మనము ఆయన పిల్లలము, ఆయన మన శ్రేయస్సును విచారిస్తారు, మనము ఆయనపై ఆధారపడియున్నాము మరియు ఆయన ప్రేమ మనల్ని కాపాడుతుంది. ఆయన ప్రణాళిక కర్తృత్వమును కలిపియున్నది; కాబట్టి, మనము బహుశా కొన్ని తప్పులు చేస్తాము.
పరీక్షించబడడానికి మరియు శోధించబడడానికి కూడా ఆయన మనల్ని అనుమతిస్తారు. మనము కొన్ని తప్పులు చేసినప్పటికీ లేదా శోధనలో పడినప్పటికీ, ప్రణాళిక ఒక రక్షకుడిని అందిస్తుంది, ఆవిధంగా మనము విమెచింపబడగలము మరియు దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళగలము.
మన జీవితాలలో ప్రతికూలత మనకు చేయబడిన వాగ్దానముల నెరవేర్పు గురించి అనుమానం కలిగించవచ్చు. దయచేసి మన తండ్రియందు నమ్మకముంచండి. ఆయన ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నిలుపుకుంటారు మరియు ఆయన మనకు బోధించాలని కోరిన దానిని మనము నేర్చుకోగలము.
మనము సరైన దానిని చేసినా కూడా, మన జీవితంలో పరిస్థితులు మంచి నుండి చెడుకు, సంతోషము నుండి విచారమునకు మారగలవు. దేవుడు తన అంతములేని కనికరము, ప్రేమ మరియు తన స్వంత సమయమునుబట్టి మన ప్రార్థనలకు జవాబిస్తారు.
-
ఏలీయా నీళ్ళు తాగిన వాగు ఎండిపోయింది.4
-
ఉక్కుతో చేసిన నీఫై విల్లు విరిగిపోయింది. 5
-
ఒక చిన్న బాలుడు వివక్షకు గురయ్యాడు మరియు పాఠశాల నుండి బహిష్కరించబడ్డాడు.
-
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బిడ్డ పుట్టిన కొన్ని రోజులలో చనిపోయాడు.
పరిస్థితులు మారతాయి.
పరిస్థితులు మంచి మరియు సానుకూలమైన వాటి నుండి చెడుగా, ప్రతికూలంగా మారినప్పుడు, ఇంకను మనం సంతోషంగా ఉండగలము, ఎందుకంటే సంతోషము పరిస్థితులపై ఆధారపడదు, కానీ పరిస్థితుల పట్ల మన వైఖరిపై ఆధారపడుతుంది. అధ్యక్షులు నెల్సన్ ఇలా చెప్పారు, “మనము అనుభవించు సంతోషము మన జీవితపు పరిస్థితులతో పెద్దగా సంబంధము కలిగిలేదు, కానీ మన జీవితాల దృష్టితో పూర్తి సంబంధము కలిగియున్నది.”6
మనం ఏమీ చేయకుండా, పరిస్థితులు వాటంతటవే మారే వరకు ఎదురుచూడవచ్చు లేదా మనము క్రొత్త పరిస్థితుల కోసం వెదకవచ్చు మరియు తీసుకొనిరావచ్చు.
-
ఏలీయా సారెపతు ఊరుకు వెళ్ళగా, అక్కడ ఒక విధవరాలు అతడికి ఆహారమును, త్రాగడానికి నీటిని ఇచ్చింది.7
-
నీఫై కర్రతో విల్లును చేసి, తినడానికి జంతువులను వేటాడాడు.8
-
ఆ చిన్న బాలుడు కిటికీ ప్రక్కన కూర్చొని విని, పుస్తకంలో వ్రాసుకున్నాడు, ఈరోజు అతడు ప్రాథమిక పాఠశాల బోధకుడు.
-
ఆ దంపతులు రక్షకుడైన యేసు క్రీస్తునందు గొప్ప విశ్వాసమును, రక్షణ ప్రణాళికయందు నమ్మకమును వృద్ధి చేసారు. దీర్ఘ-కాలము ఎదురుచూసి, హఠాత్తుగా చనిపోయిన బిడ్డ కొరకు వారి ప్రేమ దుఃఖము కంటే గొప్పది.
“పరలోక తండ్రీ, మీరు నిజంగా ఉన్నారా? మీరు [ప్రతి] బిడ్డ ప్రార్థనను విని సమాధానం ఇస్తారా?”9 అనే ప్రశ్నలను వినినప్పుడు, నేనిలా సమాధానం చెప్పాలనుకుంటున్నాను: “ఆయన ఉన్నారు, ఆయన ఉంటారు మరియు ఆయన మీకోసం, నాకోసం ఎల్లప్పుడూ ఉంటారు. నేను ఆయన కుమారుడను, ఆయన నా తండ్రి మరియు ఆయన వలే మంచి తండ్రిగా ఉండడాన్ని నేను నేర్చుకుంటున్నాను.”
నా భార్య, నేను ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా మరియు ఏ విధంగానైనా మా పిల్లల కోసం అందుబాటులో ఉండడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాము. ప్రతీ బిడ్డ ప్రత్యేకమైనది; దేవుని దృష్టిలో వారి విలువ గొప్పది, వారు ఎటువంటి సవాళ్ళు, పాపములు మరియు బలహీనతలను కలిగియున్నప్పటికీ, దేవుడు వారిని ప్రేమిస్తున్నారు మరియు మనము కూడా ప్రేమించాలి.
ప్రధాన అధికారిగా నేను ఈ పిలుపు పొందినప్పుడు, సాల్ట్ లేక్‌కు మా ప్రయాణానికి ముందు, చివరి రోజు మా పిల్లలు మరియు వారి కుటుంబాలు మా ఇంటి వద్ద కుటుంబ గృహ సాయంకాలము కొరకు కూడుకున్నారు, అక్కడ మేము మా ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తపరిచాము. పాఠము తరువాత, నా పిల్లలలో ప్రతీఒక్కరికి నేను యాజకత్వ దీవెనను ఇచ్చాను. ప్రతీఒక్కరు కన్నీళ్ళు పెట్టుకున్నారు. దీవెనల తరువాత, నా పెద్ద కొడుకు వారు పుట్టినప్పటి నుండి అప్పటి వరకు మేము వారిపట్ల చూపిన గొప్ప ప్రేమ కొరకు అందరి తరఫున కృతజ్ఞతగల మాటలను వ్యక్తపరిచాడు.
మీ పిల్లలు 5 లేదా 50 సంవత్సరాల వారైనప్పటికీ వారిని దీవించండి. వారితో ఉండండి; వారి కొరకు అందుబాటులో ఉండండి. సమకూర్చుట అనేది దైవిక రూపకల్పన ద్వారా స్థాపించబడిన బాధ్యత, అయినప్పటికీ మన పిల్లలతో సంతోషకరమైన సమయం పంచుకోవడాన్ని మనము మరచిపోరాదు.
మన పరలోక తండ్రికి తన ప్రతీ బిడ్డ పట్ల ఉన్న ప్రేమ నిజమైనది. ప్రతీఒక్కరి కోసం ఆయన ఉన్నారు. ఆయన దానిని ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఆయన చేస్తారు. ఆయన మరియు ఆయన ప్రథమ పుత్రుడు తండ్రి యొక్క కార్యమును, మహిమను చేయడంలో “మానవుని యొక్క అమర్త్యత్వమును మరియు నిత్య జీవమును తెచ్చుటకు” ఒకటైయున్నారు.10 వారు మనల్ని నడిపించడానికి, మనల్ని హెచ్చరించడానికి మరియు అవసరమైతే మనల్ని ఓదార్చడానికి పరిశుద్ధాత్మను మన కోసం పంపారు.
ఈ అందమైన భూమిని సృష్టించమని ఆయన తన ప్రియమైన కుమారునికి సూచించారు. ఆయన ఆదాము, హవ్వలకు ఉపదేశించారు మరియు వారికి వారి కర్తృత్వమును ఇచ్చారు. ఆయన అనేక సంవత్సరాలుగా దూతలను పంపుతున్నారు, ఆవిధంగా మనము ఆయన ప్రేమను మరియు ఆయన ఆజ్ఞలను పొందగలము.
బాలుడైన జోసెఫ్ యొక్క నిజాయితీగల ప్రశ్నకు జవాబిస్తూ, అతడిని పేరు పెట్టి పిలుస్తూ, పరిశుద్ధ వనములో ఆయన ఉన్నారు. ఆయన ఇలా అన్నారు: “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినుము!”11
మన పట్ల దేవుని ప్రేమకు అత్యున్నత నిదర్శనము గెత్సేమనేలో జరిగిందని నేను నమ్ముతున్నాను, అక్కడ జీవముగల దేవుని కుమారుడు ఇలా ప్రార్థించారు, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము.”12
యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తములో నేను గ్రహించిన స్వల్ప భాగము, తండ్రి మరియు ఆయన కుమారుని కొరకు నా ప్రేమను హెచ్చిస్తుందని, పాపము చేయుటకు, అవిధేయుడనగుటకు నా కోరికను తగ్గిస్తుందని, మెరుగ్గా ఉండడానికి మరియు మంచిని చేయడానికి నా సుముఖతను పెంపొందిస్తుందని నేను గమనించాను.
ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కాలని ఎరిగి, యేసు తన తండ్రిని నమ్ముతూ, గెత్సేమనేకు నిర్భయంగా, నిస్సందేహంగా నడిచాడు. ఆయన సమస్త బాధను మరియు సమస్త అవమానమును సహించాడు. ఆయన నిందించబడ్డాడు, తీర్పుతీర్చబడ్డాడు మరియు సిలువ వేయబడ్డాడు. సిలువపై తన స్వంత వేదన మరియు బాధయందు, యేసు తన తల్లి మరియు తన ప్రియమైన శిష్యుని అవసరతలపై దృష్టిసారించాడు. ఆయన తన ప్రాణమును అర్పించాడు.
మూడవ దినమున ఆయన పునరుత్థానము చెందాడు. సమాధి ఖాళీగా ఉన్నది; ఆయన తన తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు. మన నిబంధనలు పాటించి, వారి సన్నిధికి తిరిగివెళ్ళడాన్ని మనం ఎంచుకుంటామని వారు ఆశిస్తున్నారు. ఈ రెండవ స్థితి మన చివరి స్థితి కాదు; మనము ఈ భూలోక గృహానికి చెందిన వారము కాదు, బదులుగా మనం తాత్కాలిక అనుభవాలను జీవిస్తున్న నిత్య ప్రాణులము.
యేసే క్రీస్తు, సజీవుడగు దేవుని కుమారుడు. ఆయన జీవిస్తున్నాడు మరియు ఆయన జీవిస్తున్నాడు కనుక, దేవుని పిల్లలందరూ శాశ్వతంగా జీవిస్తారు. ఆయన ప్రాయశ్చిత్త త్యాగానికి కృతజ్ఞతలు, మనమందరం వారితో కలిసి జీవించగలము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.