సర్వసభ్య సమావేశము
ఆయనలో పరిపూర్ణులు కండి
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


10:54

ఆయనలో పరిపూర్ణులు కండి

మన పరిపూర్ణత దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

మన పరలోక తండ్రి మరియు మన రక్షకుడైన యేసు క్రీస్తు, మనల్ని రక్షించడానికి, మనల్ని మార్చడానికి శక్తిని కలిగియున్నారు. వారిలా మారడానికి వారు మనకు సహాయపడగలరు.

కొన్ని సంవత్సరాల క్రితం, మా మనుమలలో ఒకడైన ఆరోన్‌కు ఆరోగ్య సమస్యలు ప్రారంభమయ్యాయి. అతడు అలసిపోయాడు, కాస్త గాయాలు తగిలాయి మరియు ఆరోగ్యంగా కనబడలేదు. వైద్య పరీక్ష తరువాత, అతను తీవ్రమైన అప్లాస్టిక్ అనీమియాతో బాధపడుతున్నాడని తెలిసింది, ఈ వ్యాధిలో అతని ఎముక మూలగ ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు ప్లేట్‌లెట్‌లను ఉత్పత్తి చేయడం ఆపివేసింది. చికిత్స మరియు అంతిమ నివారణ లేకుండా, అతని రక్తం సరిగ్గా గడ్డకట్టదు లేదా అంటువ్యాధులతో పోరాడలేదు, కాబట్టి చిన్న దెబ్బలు, గాయాలు లేదా అనారోగ్యాలు కూడా త్వరగా ప్రాణాంతకం కావచ్చు.

కొంతకాలము వరకు, ఆరోన్‌ను అపాయం నుండి కాపాడడానికి క్రమంగా ప్లేట్‌లెట్ మరియు రక్తమార్పిడిని చేసారు. ఈ వ్యాధికి ఏకైక నివారణ, ఎముక మూలగను మార్పిడి చేయడం మాత్రమేనని మరియు తోబుట్టువు దాతగా ఉండడం విజయానికి ఉత్తమమైన అవకాశమని వైద్యులు వివరించారు. అతడి తోబుట్టువులలో ఒకరు ఖచ్చితంగా సరిపోతే, మార్పిడి యొక్క ఫలితం ప్రాణాలను కాపాడుతుంది. అతడి నలుగురు తమ్ముళ్ళు పరీక్షించబడ్డారు మరియు వారిలో ఒకడైన మాక్స్‌వెల్ ఖచ్చితమైన జతగా పరిగణించబడ్డాడు.

ఖచ్చితమైన దాత సరిపోలికతో కూడా, ఎముక మూలగ మార్పిడి ఇంకను తీవ్రమైన సమస్యలను కలిగియుంటుంది. అతని సోదరుడు మాక్స్‌వెల్ యొక్క ఎముక మూలగ నుండి మూలకణాలను స్వీకరించడానికి ముందు, వ్యాధిగ్రస్థమైన ఆరోన్ ఎముక మూలగలోని అతని స్వంత కణాలను కీమోథెరపీ మరియు రేడియేషన్ కలయికతో నాశనం చేయవలసి ఉంటుంది. తర్వాత ఆరోన్ యొక్క బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా, అతను చాలా వారాలపాటు ఆసుపత్రి‌లో ఒంటరిగా ఉండవలసి వస్తుంది మరియు ప్రత్యేక ఒడంబడికలు, పరిమితులు, మందులతో అనేక నెలల పాటు ఇంట్లో ఉండవలసి వస్తుంది.

ఆరోన్ శరీరం దాత కణాలను తిరస్కరించదని మరియు మాక్స్‌వెల్ కణాలు ఆరోన్ శరీరంలో అవసరమైన ఎర్ర మరియు తెల్ల రక్త కణాలను, ప్లేట్‌లెట్లను క్రమంగా ఉత్పత్తి చేస్తాయనేది మార్పిడి నుండి ఆశించబడిన ఫలితం. విజయవంతమైన దాత మార్పిడి నిజమైన శారీరక మార్పును కలుగజేస్తుంది. ఆశ్చర్యకరంగా, ఆరోన్ ఒక నేరము చేసి, నేర ప్రాంతంలో రక్తమును విడిచి పెడితే, పోలీసులు అతడి తమ్ముడు మాక్స్‌వెల్‌ను అరెస్టు చేస్తారని ఒక వైద్యుడు వివరించాడు. ఇది ఎందుకనగా ఆరోన్ రక్తము మాక్స్‌వెల్‌ యొక్క మార్చబడిన కణాల నుండి వస్తుంది మరియు మాక్స్‌వెల్‌ డిఎన్‌ఎను కలిగియుంటుంది, అతడి మిగిలిన జీవిత కాలమంతా ఈవిధంగా ఉంటుంది.

ఆరోన్ తన తమ్ముని రక్తముచేత రక్షించబడడం, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త రక్తము గురించి మరియు మనపై ఆయన ప్రాయశ్చిత్తము యొక్క ప్రభావము గురించి అనేక ఆలోచనలను పురికొల్పింది. మనలో అద్భుతాలను చేయడానికి ప్రభువును మనం అనుమతించినప్పుడు కలిగే శాశ్వతమైన, జీవితాన్ని ఇచ్చే మార్పుపై ఈ రోజు దృష్టిసారించాలని నేను కోరుతున్నాను. 1

ఆరోన్ వ్యాధిని జయించడానికి తనలో శక్తిని కలిగిలేడు. అతడి శరీరము అతడి ప్రాణమును కాపాడే రక్త కణాలను తయారు చేయలేకపోయింది. అతడు వ్యక్తిగతంగా ఏమి చేసినప్పటికీ, అతడు తన ఎముక మూలగను స్వస్థపరచుకోలేడు. ఆరోన్ తననుతాను నయం చేసుకోలేనట్లుగా, మనల్నిమనం రక్షించుకోలేము. మనము ఎంత సమర్థులము, విద్యావంతులము, తెలివైనవారము లేదా బలమైనవారము అయినప్పటికీ, మన పాపముల నుండి మనల్నిమనం శుద్ధి చేసుకోలేము, మన శరీరాలను అమర్త్య స్థితికి మార్చలేము లేదా మహోన్నతస్థితిని మనకైమనం పొందలేము. అది రక్షకుడైన యేసు క్రీస్తు మరియు ఆయన అనంత ప్రాయశ్చిత్తము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. “దేవుని రాజ్యమందు మనుష్యుడు రక్షించబడుటకు పరలోకము క్రింద ఇయ్యబడిన ఏ ఇతర మార్గము గాని నామము గాని లేదు.”2 ఆయన ప్రాయశ్చిత్త రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది మరియు మనల్ని పరిశుద్ధపరుస్తుంది.3

ఆరోన్ తనకుతానుగా స్వస్థత పొందలేకపోయినప్పటికీ, మార్పిడి పని చేయడానికి వైద్యులు అడిగిన వాటిని చేయడానికి అతను సిద్ధంగా ఉండాలి—అవి చాలా కష్టమైనా, సవాలు చేసే విషయాలైనా సరే. మనల్నిమనం రక్షించుకోలేనప్పటికీ, ప్రభువు చిత్తానికి మనల్నిమనం అప్పగించుకొని మన నిబంధనలను పాటించినప్పుడు, మన విమోచనకు మార్గము తెరువబడుతుంది.4 ఆరోన్ రక్త కణాల యొక్క డిఎన్‌ఎ మార్పుచెందే ఆశ్చర్యకరమైన ప్రక్రియవలే, మనము మన హృదయాలను మార్చుకోగలము,5 మన ముఖాలపై ఆయన స్వరూపమును కలిగియుండగలము,6 మరియు క్రీస్తుయందు నూతన సృష్టి కాగలము.7

మార్పుచెందిన మునుపటి తరమును జారహేమ్ల ప్రజలకు ఆల్మా గుర్తు చేసాడు. తన తండ్రి గురించి మాట్లాడుతూ, ఆల్మా ఇలా వివరించాడు, “అతని విశ్వాసమును బట్టి అతని హృదయమందు బలమైన మార్పు జరిగెను.”8 తరువాత అతడు ప్రశ్నించాడు, “మీ హృదయములందు ఈ బలమైన మార్పును మీరు అనుభవించియున్నారా?”9 వారి స్వంత హృదయాలను మార్చినది జనులు కాదు. ప్రభువు అసలైన మార్పును కలుగజేసారు. ఆల్మా దీని గురించి చాలా స్పష్టంగా ఉన్నాడు. అతడు ఇలా అన్నాడు, “ఆయన వారి హృదయములను మార్చియున్నాడు.”10 వారు “తమనుతాము తగ్గించుకొని, నిజమైన మరియు సజీవుడైన దేవునియందు తమ విశ్వాసముంచిరి, … [మరియు] అంతము వరకు వారు విశ్వాసముతో నుండిరి … [మరియు] రక్షింపబడిరి.”11 జనులు తమ హృదయాలను తెరచి, విశ్వాసమును సాధన చేయడానికి సమ్మతిగా ఉన్నారు, ఆ తరువాత ప్రభువు వారి హృదయాలను మార్చియున్నాడు. అది ఎంతటి బలమైన మార్పు! వారి హృదయాలలో మార్పు రాకముందు మరియు వచ్చిన తరువాత ఆల్మా అని పేరుగల ఈ ఇద్దరు పురుషుల జీవితాలలోని వ్యత్యాసం గురించి ఆలోచించండి.12

మనము గంభీరమైన గమ్యముగల దేవుని పిల్లలము. ఆయన వలే మారడానికి మరియు “సంపూర్ణమైన ఆనందమును” కలిగియుండడానికి మనము మారగలము.13 మరొకప్రక్క, మనము అతడి వలె దయనీయంగా ఉండాలని సాతాను కోరుతున్నాడు.14 ఎవరిని అనుసరిస్తామని ఎంపిక చేసే సామర్థ్యమును మనము కలిగియున్నాము.15 మనము సాతానును అనుసరించినప్పుడు, మనము అతడికి శక్తిని ఇస్తున్నాము.16 మనము దేవుడిని అనుసరించినప్పుడు, ఆయన మనకు శక్తిని ఇస్తారు.

మనము “పరిపూర్ణముగా ఉండాలి,”17 అని రక్షకుడు బోధించాడు. ఇది చాలా భయంకరంగా అనిపించవచ్చు. నేను నా వ్యక్తిగత లోపాలను స్పష్టంగా చూడగలను, నాకు మరియు పరిపూర్ణతకు మధ్య దూరం గురించి బాధాకరంగా నాకు తెలుసు. మనల్నిమనం పరిపూర్ణులుగా చేసుకోవాలని ఆలోచించే ధోరణి మనము కలిగియుండవచ్చు, కానీ అది సాధ్యము కాదు. ప్రపంచంలోని ప్రతీ స్వీయ-సహాయ పుస్తకములోనున్న ప్రతీ సూచనను అనుసరించడం వలన అది జరగదు. ఒకే మార్గము మరియు ఒకే నామము ద్వారా మాత్రమే పరిపూర్ణత కలుగుతుంది. మనము “క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు ద్వారా పరిపూర్ణులుగా చేయబడ్డాము, ఆయన తన రక్తమును చిందించుట ద్వారా ఈ పరిపూర్ణమైన ప్రాయశ్చిత్తమును చేసెను.”18 మన పరిపూర్ణత దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

చిన్నవాడైన మా మనవడు ఆరోన్ తన మార్పిడికి సంబంధించిన అన్ని వైద్య విధానాలను స్వయంగా అర్థం చేసుకోవాలని మరియు నిర్వహించాలని ఊహించడం అతడికి ఎంత విపరీతంగా ఉండెనో మీరు ఊహించగలరా? మన పరిపూర్ణత యొక్క అద్భుత ప్రక్రియలో, రక్షకుడు మాత్రమే చేయగలిగిన దానిని మనం చేయవలసి ఉంటుందని మనం ఊహించరాదు.

మొరోనై తన నివేదికను ముగించినప్పుడు ఇలా బోధించాడు, “క్రీస్తు నొద్దకు రండి, ఆయనలో పరిపూర్ణులు కండి, … మీకైమీరు సమస్త భక్తిహీనత నుండి ఉపేక్షించుకొని, మీ పూర్ణ శక్తి, మనస్సు మరియు బలముతో దేవుడిని ప్రేమించిన యెడల, అప్పుడు ఆయన కృప మీకు చాలును; ఆయన కృప ద్వారా మీరు క్రీస్తు నందు పరిపూర్ణులగుదురు.”19 ఎంతటి ఓదార్పునిచ్చే, శక్తివంతమైన సత్యము! ఆయన కృప నాకు చాలును. ఆయన కృప మీకు చాలును. “ప్రయాసపడి భారము మోసికొనుచున్న”20 వారందరికి ఆయన కృప చాలును.

ఆరోన్ యొక్క వైద్య చికిత్సల వలె, ఫలితంలో ఎల్లప్పుడు కొంత అనిశ్చితి ఉంటుంది. వాస్తవానికి, ఆరోన్ మొదటి మార్పిడికి సమస్యలు కలిగినప్పుడు రెండవ మార్పిడి అవసరమయ్యింది. కృతజ్ఞతాపూర్వకంగా, హృదయము యొక్క ఆత్మీయ మార్పుతో, అది జరుగుతుందా అని మనము ఆశ్చర్యపోనవసరం లేదు. “రక్షించుటకు శక్తిమంతుడైన వాని మంచితనముపై పూర్తిగా ఆధారపడుచూ,”21 మనము ఆయన చిత్తానుసారముగా జీవించినప్పుడు, రక్షకుని రక్తము ద్వారా శుద్ధి చేయబడి, చివరికి ఆయనలో పరిపూర్ణత పొందుతామని 100 శాతం హామీ ఉంటుంది. ఆయన “సత్య దేవుడు మరియు అబద్ధమాడ[లేడు].”22

ఈ మార్పు యొక్క ప్రక్రియకు సమయం పడుతుందని, ఈ జీవితం తర్వాత గాని పూర్తవదని అనడంలో సందేహం లేదు, కానీ వాగ్దానము ఖచ్చితమైనది. దేవుని యొక్క వాగ్దానముల నెరవేర్పు దూరముగా కనబడినప్పుడు, అవి నెరవేర్చబడతాయని ఎరిగి, ఆ వాగ్దానాలను మనము ఇంకా హత్తుకుంటాము.23

ఆరోన్ ఆరోగ్యములో కలిగిన అద్భుతమైన మార్పు మా కుటుంబానికి గొప్ప సంతోషాన్ని తెచ్చింది. మన ఆత్మలందు బలమైన మార్పు కలిగినప్పుడు పరలోకములో ఉండే గొప్ప ఆనందాన్ని ఊహించండి.

మన పరలోక తండ్రి మరియు మన రక్షకుడైన యేసు క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నారు మరియు మనల్ని మార్చడానికి, మనల్ని పరిపూర్ణులను చేయడానికి కనికరముతో శక్తిని అందిస్తున్నారు. దీనిని చేయాలని వారు కోరుతున్నారు. వారి కార్యము మరియు మహిమకు ఇది ప్రధానమైనది.24 విశ్వాసమందు మనము వారి వద్దకు వచ్చినప్పుడు దీనిని చేయడానికి వారు శక్తి కలిగియున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.