వాక్యము యొక్క ప్రభావము
ప్రాచీన మరియు ఆధునిక ప్రవక్తల మాటలయందు ఖచ్చితంగా ప్రభావమున్నది, ఎందుకనగా వారి మాటలు ప్రభువు యొక్క మాటలు.
మోర్మన్ గ్రంథములో, ఒక ప్రియమైన లేఖన వచనములో ఆల్మా ప్రవక్త చేత చేయబడిన ముఖ్యమైన నిర్ణయము గురించి మనము చదువుతాము. ఆ పరిచయమైన మాటలను పునర్వీక్షించక ముందు, దయచేసి ఆ నిర్ణయము తీసుకొన్న క్లిష్టమైన పరిస్థితులను నాతోపాటు పరిశీలించండి.
జోరమీయులని తమనుతాము పిలుచుకొన్న ఒక ప్రజల వర్గము, నీఫైయుల నుండి వేరు చేయబడి,1 లేమనీయుల సరిహద్దు ప్రాంతములో సమావేశమయ్యారు.2 పదుల వేలమంది మరణించిన అసాధారణమైన యుద్ధంలో నీఫైయులు ఇటీవల లేమనీయులను ఓడించిరి3 మరియు “జోరమీయులు, లేమనీయులతో ఉత్తర ప్రత్యుత్తరములు జరుపుదురని మరియు దాని మూలముగా తాము బాగా నష్టపోయెదమని నీఫైయులు అధికముగా భయపడిరి.”4 యుద్ధ ఆందోళనలను మించి, “దేవుని యొక్క వాక్యము బోధింపబడియున్న” 5 జోరమీయులు విగ్రహారాధన వైపు తిరిగి, “ప్రభువు యొక్క మార్గములను చెరుపుచున్నారని” 6 ఆల్మా తెలుసుకున్నాడు. ఇదంతా ఆల్మాను తీవ్రమైన నిరాశకు గురిచేసి, “గొప్ప దుఃఖమునకు కారణమాయెను.”7
పరిస్థితులు క్లిష్టంగా, సవాళ్ళతో కూడియున్నాయని గ్రహించిన ఆల్మా, ఏమి చేయాలని తీవ్రంగా ఆలోచించాడు. మన కాలంలో క్లిష్టంగా, సవాళ్ళతో కూడియున్న పరిస్థితులను మనం ఎదుర్కొన్నప్పుడు, మనల్ని పేరేపించి, సలహా ఇవ్వడానికి భద్రపరచబడిన మాటలను అతని నిర్ణయంలో మనము చదువుతాము.8
“ఇప్పుడు వాక్యము యొక్క బోధన, న్యాయమైన దానిని చేయుటకు జనులను నడిపించుటలో అత్యంత ప్రభావవంతమైనందున—ఖడ్గము లేదా వారికి సంభవించిన ఇతర వాటన్నిటి కంటే జనుల మనస్సులపై అధిక శక్తివంతమైన ప్రభావము కలిగియున్నందున— దేవుని వాక్యము యొక్క ప్రభావమును వారు ప్రయత్నించుట ప్రయోజనకరమని ఆల్మా తలంచెను.”9
అనేక సాధ్యమైన పరిష్కారాలలో, ఆల్మా యొక్క విశ్వాసము వాక్యము యొక్క శక్తిపై ఆధారపడడానికి వారిని నడిపించింది. ఆ నిర్ణయాన్ని అనుసరించి లేఖనాలలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఉపన్యాసాలలో కొన్ని వెంటనే బోధించబడడం యాదృచ్ఛికం కాదు. ఆల్మా 32 మరియు 33వ అధ్యాయాలలో, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముపై అతని శక్తివంతమైన ఉపన్యాసాన్ని మనము చదువుతాము మరియు 34వ అధ్యాయములో, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తముపై అమ్యులెక్ యొక్క ప్రాథమిక బోధనలను మనము కనుగొంటాము.
వాక్యము యొక్క ప్రభావమును గూర్చి ఉదాహరణలు
వాస్తవానికి, వారి జీవితాలలో దేవుని వాక్యము యొక్క ప్రభావమును ప్రయత్నించడానికి ఎన్నుకొన్న వారిపై క్రుమ్మరించబడిన అద్భుతమైన దీవెనలను గూర్చి మనము లేఖనమంతటా చదువుతాము.10 మోర్మన్ గ్రంథము—అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ “మన కడవరి దిన మనుగడకు మార్గదర్శి”11 గా వర్ణించిన గ్రంథము వైపు మనము దృష్టి సారించినప్పుడు మూడు మాదిరులను ధ్యానించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
మొదటిది, తమ తండ్రులను ప్రభువు ఎలా విడిపించారో తన జనులకు జ్ఞాపకం చేస్తూ, ఆల్మా ఇలా బోధించాడు: “ఆయన వారి హృదయములను మార్చియున్నాడు; ఆయన వారిని గాఢమైన నిద్ర నుండి మేల్కొలిపియున్నాడు; మరియు వారు దేవుని కొరకు మేలుకొనియున్నారు. వారు అంధకారము మధ్యనుండిరి; అయినప్పటికీ, వారి ఆత్మలు శాశ్వత వాక్యము యొక్క వెలుగు ద్వారా ప్రకాశింపజేయబడినవి.”12 బహుశా మీరు అంధకారము మధ్యలో ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఆత్మీయ నడిపింపు కొరకు మీరు నిర్విరామంగా కోరుతున్నారా? అలాగైతే, దయచేసి దేవుని వాక్యము యొక్క ప్రభావమును ప్రయత్నించండి.
రెండవది, లేమనీయులు ప్రభువుకు పరివర్తన చెందుట గురించి ఆలోచిస్తూ, ఒక సువార్తకునిగా దానిని ప్రత్యక్షంగా చూసిన అమ్మోన్ ఇలా అన్నాడు, “మన సహోదరులలో అనేక వేలమందిని నరకపు బాధలనుండి ఆయన విడిపించెను; వారు విమోచించు ప్రేమను కీర్తించుటకు తేబడియున్నారు మరియు ఇది మనయందున్న ఆయన వాక్యము యొక్క శక్తిని బట్టియైయున్నది.”13 సహోదర సహోదరీలారా, విమోచించు ప్రేమను కీర్తించడానికి మనము ప్రేమించే వారిని తీసుకొని రావడానికి ఆపేక్షించేవారు మనలో అనేకమంది ఉన్నారు. మన ప్రయత్నాలన్నిటిలో, మనలో ఉన్న దేవుని వాక్యము యొక్క ప్రభావమును ప్రయత్నించడాన్ని జ్ఞాపకముంచుకొందాము.
మూడవది, “తక్షణమైనది మరియు బలమైనది, అపవాది యొక్క సమస్త వంచన, వలలు మరియు తంత్రములను నేరుగా విభజించునది మరియు దుష్టులను చుట్టుకొనుటకు సిద్ధము చేయబడిన దౌర్భాగ్యము యొక్క ఆ నిత్య అగాధమునకు అడ్డముగా ఒక తిన్నని ఇరుకైన మార్గమందు క్రీస్తు యొక్క మనుష్యుని నడిపించు దేవుని వాక్యమును హత్తుకొనుటకు కోరువారెవరైనను … వారి ఆత్మలను … పరలోక రాజ్యమందు దేవుని కుడి పార్శ్వమున కూర్చొనుటకు చేర్చుదురు,”14అని హీలమన్ గ్రంథములో మనము చదువుతాము. మన కాలపు తత్వాలలో చాలా ప్రబలంగా ఉన్న అపవాది యొక్క సమస్త వంచన, వలలు మరియు తంత్రములను మీరు నేరుగా విభజించాలని కోరుతున్నారా? నిబంధన బాటపై మరింత విశేషంగా దృష్టిసారించడానికి, నేటి ప్రపంచంలో గల అత్యధిక సమాచారము వలన కలిగే భారీ గందరగోళం నుండి విముక్తి పొందాలని మీరు కోరుతున్నారా? దయచేసి దేవుని వాక్యము యొక్క ప్రభావమును ప్రయత్నించండి.
వాక్యము యొక్క శక్తి చేత మార్పుచెందిన వానిగా, మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చేత చాలా మనోహరంగా బోధించబడిన ఈ సత్యమును గూర్చి నేను వ్యక్తిగతంగా సాక్ష్యమిస్తున్నాను: “నాకైతే, మోర్మన్ గ్రంథమును ‘యథార్థ హృదయముతో, క్రీస్తు నందు విశ్వాసము కలిగియుండి, మనఃపూర్వకముగా’ చదివిన వారి జీవితాలలోనికి వచ్చే బలమైన మార్పునందు దాని యొక్క శక్తి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మార్పుచెందిన అనేకమంది, ఆ గ్రంథములోని సూక్తులననుసరించడానికి ఒకప్పుడు వారికి ఎంతో ఇష్టమైన వాటిని వదలుకుంటారు. … యేసు క్రీస్తు నొద్దకు ఆత్మలను తెచ్చుటలో ఇది మీ మిక్కిలి ప్రభావవంతమైన సాధనముగా ఉంటుంది.”15
శక్తి యొక్క మూలాధారము.
వీటిలో మరియు మిగిలిన ఉదాహరణలలో, ఆయన పిల్లల జీవితాలలో దేవుని వాక్యము యొక్క ప్రభావమును మనము చూస్తున్నాము. ఆ ప్రభావము లేదా శక్తికి ఆధారమేమిటని మనము అడగవచ్చు?
ఆ ప్రశ్నను మనము పరిగణించినప్పుడు, లేఖనములో ఉపయోగించబడినట్లుగా, “వాక్యము” కనీసము రెండు అర్థాలను కలిగియున్నదని జ్ఞాపకముంచుకొనుట ఆవశ్యకమైనది. ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఈమధ్య ఇలా బోధించారు, “యేసు క్రీస్తు యొక్క పేర్లలో ఒకటి ‘వాక్యము,’” మరియు “పరిశుద్ధ లేఖనాలలో నమోదు చేయబడిన రక్షకుని బోధనలు కూడా ‘వాక్యమే.’” 16
ప్రవక్త నీఫై ఇలా వ్రాసినప్పుడు ఈ రెండు అర్థాల మధ్య సంబంధాన్ని వివరించాడు: “ఈ మాటలను ఆలకించి క్రీస్తునందు విశ్వసించుడి; మీరు ఈ మాటలయందు విశ్వసించకపోయినను క్రీస్తునందు విశ్వసించుడి. మీరు క్రీస్తునందు విశ్వసించిన యెడల మీరు ఈ మాటల యందు విశ్వసించెదరు, ఏలయనగా అవి ఆయన నాకు ఇచ్చియున్న క్రీస్తు యొక్క మాటలు.”17 ఆవిధంగా ప్రాచీన మరియు ఆధునిక ప్రవక్తల మాటలయందు ఖచ్చితంగా ప్రభావమున్నదని మనము నేర్చుకున్నాము, ఎందుకనగా వారి మాటలు ప్రభువు యొక్క మాటలు.18 నా ప్రియమైన స్నేహితులారా, ఈ నిత్య సత్యమును అంగీకరించుట కడవరి దినాలలో 19 మన ఆత్మీయ మనుగడకు కీలకమైనది, ప్రవచించబడినట్లుగా “దేశములో క్షామమున్నది, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామము.”20
చివరకు, దేవుని వాక్యము యొక్క ప్రభావమే ప్రభువైన యేసు క్రీస్తు.21 దీనిని మరింత సంపూర్ణంగా మనం గ్రహించినప్పుడు, ఆయన ప్రవక్తలు మరియు విమోచకుని యొక్క పాత్రల మధ్య నిత్య ప్రాముఖ్యమైన సంబంధాన్ని మనము ఏర్పరచగలము. ఆయన పట్ల మన ప్రేమ, ఆయనకు దగ్గర కావాలని, ఆయన ప్రేమయందు నిలిచియుండాలనే మన కోరిక22 వాక్యము యొక్క ప్రభావమును—మన వ్యక్తిగత రక్షకుడు మరియు విమోచకునిగా23 ఆయన నుండి ప్రవహించే శక్తిని మరియు “ప్రభువుచే ఎన్నుకోబడిన వారి” మాటల ద్వారా ఆయన నుండి ప్రవహించే శక్తిని రెండింటిని మన జీవితాలలో ప్రయత్నించడానికి మనల్ని ప్రేరేపిస్తాయి.24 రక్షకుని గురించి, ఆయన ప్రవక్తల మాటలను గూర్చి మన అధ్యయనానికి ఇతర మూలాధారాలు ఎంత సహాయకారిగా ఉన్నా, అవి ఎప్పటికీ వాటికి ప్రత్యామ్నాయం కాకూడదని మనం తెలుసుకోగలుగుతాము. మనము తప్పనిసరిగా మోర్మన్ గ్రంథాన్ని చదివి, దాని గురించి ధ్యానించి, మనకు చేతనైనంత నేర్చుకోవాలి 25.26
నా సహోదర సహోదరీలారా, మీలో ప్రతీఒక్కరికి నా ప్రేమను తెలియజేస్తున్నాను. ఆ ప్రేమయందు, మీ జీవితంలో ప్రతీరోజు ప్రత్యేకించి మోర్మన్ గ్రంథము ద్వారా దేవుని వాక్యము యొక్క ప్రభావమును అనుభూతి చెందాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు ఆవిధంగా చేసినప్పుడు, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నుండి ఈ ప్రవచనాత్మక వాగ్దానమును మీరు అనుభవిస్తారు: “ప్రతిరోజూ మోర్మన్ గ్రంథమును మీరు ప్రార్థనాపూర్వకంగా అధ్యయనం చేసినప్పుడు, ప్రతిరోజూ—మీరు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారని నేను వాగ్దానం చేస్తున్నాను. మీరు అధ్యయనం చేసిన దానిని ధ్యానించినప్పుడు ఆకాశపు వాకిండ్లు విప్పబడతాయి, మీ స్వంత ప్రశ్నలకు సమాధానాలను మరియు మీ స్వంత జీవితం కొరకు నడిపింపును మీరు అందుకుంటారని నేను వాగ్దానం చేస్తున్నాను. మోర్మన్ గ్రంథములో మీరు ప్రతిరోజూ నిమగ్నమైనట్లయితే, మీరు అనుదిన దుష్ప్రభావాల నుండి రక్షించబడగలరని నేను వాగ్దానం చేస్తున్నాను.”27
మన పరలోక తండ్రి మనల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నారు మరియు ఆయనతో శాశ్వతంగా జీవించడానికి ఇంటికి తిరిగి వెళ్ళాలని మనల్ని కోరుతున్నారు కనుక మనకు వాక్యమునిచ్చారని నేను సాక్ష్యమిస్తున్నాను. “వాక్యము … శరీరధారియైన”28 యేసు క్రీస్తును గూర్చి, మరియు మనల్ని రక్షించడానికి, విమోచించడానికి ఆయనకున్న శక్తిని గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. గతములో మరియు ప్రస్తుతము, ఆయన ప్రవక్తల మాటల ద్వారా ఆయన శక్తి ప్రవహిస్తుందని నాకు తెలుసు.
దేవుని వాక్యమును గట్టిగా పట్టుకోవడానికి29 మరియు మహోన్నతస్థితికి, నిత్య జీవమునకు నడిపించే నిబంధన బాటపై నిలిచియుండడానికి తెలివిని మరియు సాత్వీకమును మనము కలిగియుండాలనేది నా హృదయపూర్వకమైన ప్రార్థన.30 వాక్యము యొక్క ప్రభావము ద్వారా మనలో ప్రతీఒక్కరికి లభ్యమయ్యే బలమైన మార్పును మనము నిరంతరం అనుభవించెదము గాక.31 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.