వ్యక్తిగత బయల్పాటు కొరకు ఒక అంతర్లీన నిర్మాణం
వ్యక్తిగత బయల్పాటును అందించడానికి పరిశుద్ధాత్మ ఏ అంతర్లీన నిర్మాణంలో పనిచేస్తాడో మనం అర్థం చేసుకోవాలి. మనం అంతర్లీన నిర్మాణం లోపల పనిచేసినప్పుడు, పరిశుద్ధాత్మ ఆశ్చర్యకరమైన అంతర్దృష్టిని అందించగలడు.
మీలో చాలామంది మాదిరిగా నేను చాలాకాలంగా ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ చేత అధికంగా ప్రభావితం చేయబడ్డాను. కొంతవరకు నేను చెప్పబోయే దానిని అది వివరిస్తుంది.1 కాబట్టి, ఆయనకు క్షమాపణలతో …
బాగా శిక్షణ ఇవ్వబడిన వైమానికులు తమ విమాన సామర్థ్యం మేరకు నడుపుతారు మరియు రన్‌వే ఉపయోగం గురించి, విమాన మార్గం గురించి విమాన రాకపోకల నియంత్రికుల సూచనలను పాటిస్తారు. సరళంగా చెప్పాలంటే, వైమానికులు ఒక అంతర్లీన నిర్మాణంలో పనిచేస్తారు. వారు ఎంత తెలివైనవారు లేదా నైపుణ్యం గలవారైనప్పటికీ, ఈ అంతర్లీన నిర్మాణంలో నడపడం ద్వారా మాత్రమే వైమానికులు, విమానం రూపొందించబడిన అద్భుతమైన ఉద్దేశ్యాలను సాధించడానికి దాని అపారమైన సామర్థ్యాన్ని సురక్షితంగా విడుదల చేయగలరు.
అదేవిధంగా, ఒక అంతర్లీన నిర్మాణంలో మనం వ్యక్తిగత బయల్పాటు పొందుతాము. బాప్తిస్మము తర్వాత మనకు దివ్యమైన, ఆచరణాత్మక బహుమానం ఇవ్వబడుతుంది, అదే పరిశుద్ధాత్మ వరము.2 నిబంధన మార్గంలో నిలిచేందుకు మనం ప్రయత్నించినప్పుడు, 3 “[మనం] చేయవలసిన వాటన్నిటిని [మనకు] చూపేది … పరిశుద్ధాత్మయే.”4 మనం అనిశ్చయంగా లేదా అసౌకర్యంగా ఉన్నప్పుడు, సహాయం కోసం మనం దేవుడిని అడగగలము.5 రక్షకుని వాగ్దానం చాలా స్పష్టమైనది: “అడుగుడి మీకియ్యబడును; … అడుగు ప్రతివాడును పొందును.”6 పరిశుద్ధాత్మ సహాయంతో మనం మన దైవిక స్వభావాన్ని మన నిత్య గమ్యంగా మార్చుకోగలము.7
పరిశుద్ధాత్మ ద్వారా వ్యక్తిగత బయల్పాటు యొక్క వాగ్దానం ఎగురుతున్న విమానంలా విస్మయం కలిగించేది. విమాన చోదకుల వలె మనం, వ్యక్తిగత బయల్పాటును అందించడానికి పరిశుద్ధాత్మ ఏ అంతర్లీన నిర్మాణంలో పనిచేస్తాడో అర్థం చేసుకోవాలి. మనం అంతర్లీన నిర్మాణం లోపల పనిచేసినప్పుడు, పరిశుద్ధాత్మ ఆశ్చర్యకరమైన అంతర్దృష్టిని, నిర్దేశాన్ని, ఓదార్పును అందించగలడు. ఈ అంతర్లీన నిర్మాణం వెలుపల మనం ఎంత తెలివైన వారమైనా లేదా నైపుణ్యం గలవారమైనా, మనం మోసగించబడగలము మరియు వినాశనాన్ని కలిగించేలా విఫలం కాగలము.
వ్యక్తిగత బయల్పాటు కొరకు ఈ అంతర్లీన నిర్మాణం యొక్క మొదటి అంశాన్ని లేఖనాలు రూపొందిస్తాయి.8 లేఖనాలలో కనుగొనబడినట్లు, క్రీస్తు యొక్క మాటలను విందారగించడం వ్యక్తిగత బయల్పాటును పురికొల్పుతుంది. ఎల్డర్ రాబర్ట్ డి. హేల్స్ ఇలా బోధించారు: “మనం దేవునితో మాట్లాడాలనుకున్నప్పుడు, మనం ప్రార్థిస్తాము. ఆయన మనతో మాట్లాడాలని మనం కోరుకున్నప్పుడు, మనం లేఖనాలను వెదుకుతాము.”9
వ్యక్తిగత బయల్పాటును ఎలా పొందాలో కూడా లేఖనాలు మనకు బోధిస్తాయి.10 ఏది సరైనదో, మంచిదో మనం అడుగుతాము11 తప్ప, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండాలని కాదు.12 మన స్వలాభము నిమిత్తము వినియోగించుటకు లేదా మన స్వీయానందాన్ని నేరవేర్చుకోవాలనే సరికాని ఉద్దేశాలతో మనం “దురుద్దేశముతో అడగము”.13 అన్నిటిని మించి, మనం పొందుతామని నమ్మి,15 మనం యేసు క్రీస్తు నామములో పరలోక తండ్రిని అడగాలి.14
అంతర్లీన నిర్మాణం యొక్క రెండవ అంశమేమిటంటే, మన కోసం మరియు మన పరిధిలో ఉన్న వాటికోసమే మనం వ్యక్తిగత బయల్పాటును పొందుతాము తప్ప, ఇతరుల పరిధిలో ఉన్నవాటి గురించి కాదు. మరోలా చెప్పాలంటే, మనం మనకు కేటాయించిన రన్‌వే నుండే ఎగురుతాము మరియు అక్కడే దిగుతాము. జనులు చేయడానికి పిలువబడిన విషయాలను మాత్రమే చేయడం ముఖ్యమని పునఃస్థాపన యొక్క చరిత్రలో ముందుగానే నేర్చుకోబడింది. మోర్మన్ గ్రంథానికి ఎనిమిదిమంది సాక్షులలో ఒకరైన హైరమ్ పేజ్, తాను సంఘమంతటి కొరకు బయల్పాటులు పొందుతున్నాడని పేర్కొన్నాడు. అనేకమంది సభ్యులు మోసగించబడ్డారు మరియు తప్పుగా ప్రభావితం చేయబడ్డారు.
దానికి జవాబుగా, “అతనికి మారుగా మరియొకనిని నేను నియమించు వరకు … ఈ సంఘములో ఆజ్ఞలను, బయల్పాటులను పొందుటకు జోసెఫ్ స్మిత్ జూ. తప్ప మరెవ్వరూ నియమింపబడరని” ప్రభువు బయల్పరిచారు.16 సిద్ధాంతము, ఆజ్ఞలు మరియు సంఘము కొరకు బయల్పాటులు అనేవి జీవించియున్న ప్రవక్త యొక్క ప్రత్యేకాధికారము, ఆయన వాటిని ప్రభువైన యేసు క్రీస్తు నుండి పొందుతారు.17 అది ప్రవక్తకివ్వబడిన బాధ్యత.
చాలా ఏళ్ళ క్రితం, చట్టం అతిక్రమించినందుకు అరెస్టు చేయబడిన ఒక వ్యక్తి నాకు ఫోను చేసాడు. అతడు వెళ్ళాలని ప్రయత్నించిన భవనం క్రింది అంతస్తు క్రింద అదనపు లేఖనం పాతిపెట్టబడియున్నట్లు అతనికి బయల్పరచబడిందని నాతో చెప్పాడు. అదనపు లేఖనాన్ని అతడు పొందిన తర్వాత, అతడు అనువాద వరమును పొందుతానని, క్రొత్త లేఖనాన్ని వెలుగులోకి తెస్తానని, సంఘ సిద్ధాంతాన్ని మరియు దిశను మారుస్తానని తనకు తెలుసని అతడు పేర్కొన్నాడు. అతడు పొరబడుతున్నాడని నేను అతనితో చెప్పాను మరియు దాని గురించి ప్రార్థించమని అతడు నన్ను ప్రాధేయపడ్డాడు. నేను చేయనని అతనితో చెప్పాను. అతడు మాటలతో దూషిస్తూ ఫోను పెట్టేసాడు.18
సరళమైనదే కానీ ఒక గంభీరమైన కారణం వలన ఈ మనవి గురించి నేను ప్రార్థించనవసరం లేదు: సంఘం కొరకు ప్రవక్త మాత్రమే బయల్పాటు పొందుతారు. ప్రవక్తకు మాత్రమే చెందియున్న బయల్పాటును ఇతరులు పొందడం “దేవుని ఏర్పాటు క్రమానికే విరుద్ధమైనది”.19
వ్యక్తిగత బయల్పాటు సరిగ్గా వ్యక్తులకే చెందియుంది. ఉదాహరణకు, ఎక్కడ నివసించాలి, ఏ వృత్తి చేపట్టాలి లేదా ఎవరిని వివాహమాడాలి వంటి బయల్పాటును మీరు పొందగలరు.20 సంఘ నాయకులు సిద్ధాంతాన్ని బోధించవచ్చు మరియు ప్రేరేపిత సలహాను పంచుకోవచ్చు, కానీ ఈ నిర్ణయాల బాధ్యత మీపైనే ఉంది. అది మీరు పొందవలసిన బయల్పాటు; అది మీ బాధ్యత.
అంతర్లీన నిర్మాణం యొక్క మూడవ అంశం ఏమిటంటే, వ్యక్తిగత బయల్పాటు దేవుని ఆజ్ఞలు మరియు ఆయనతో మనం చేసిన నిబంధనలతో సామరస్యంగా ఉంటుంది. ఈ రకమైన ప్రార్థనను పరిగణించండి: “పరలోక తండ్రి, సంఘ కార్యక్రమాలు విసుగ్గా ఉన్నాయి. సబ్బాతునాడు నేను మిమ్మల్ని పర్వతాలలో లేదా సముద్రతీరంలో ఆరాధించవచ్చా? సంఘానికి వెళ్ళకుండా, సంస్కారంలో పాలుపొందకుండా ఉన్నప్పటికీ, సబ్బాతుదినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం వలన కలిగే వాగ్దాన దీవెనలను నేను కలిగియుండవచ్చా?21 అటువంటి ప్రార్థనకు జవాబుగా దేవుడిచ్చే సమాధానాన్ని మనం ఊహించగలము: “నా బిడ్డా, నేను ఇదివరకే సబ్బాతుదినం గురించి నా చిత్తాన్ని బయల్పరిచాను.”
దేవుడు ఇదివరకే స్పష్టమైన నిర్దేశాన్ని ఇచ్చిన వాటి గురించి మనం బయల్పాటు కొరకు అడిగినప్పుడు, మన భావాలను తప్పుగా అర్థం చేసుకుంటూ, మనం వినాలని కోరుకొనే దానినే వింటూ మనల్ని మనం బలహీనపరచుకుంటాము. తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని స్థిరపరచడానికి తాను పడుతున్న శ్రమల గురించి ఒకసారి ఒకతను నాతో చెప్పాడు. పరిష్కారంగా నిధులను అపహరించాలనే ఆలోచన అతనికి కలిగింది, దాని గురించి ప్రార్థించాడు మరియు అలా చేయడానికి నిశ్చయాత్మకమైన బయల్పాటును అతడు పొందినట్లు భావించాడు. అతడు మోసగించబడ్డాడని నాకు తెలుసు, ఎందుకంటే దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా అతడు బయల్పాటును కోరుకున్నాడు. “దేవుని ఆత్మను వారు కలిగియున్నారని వారు అనుకున్నప్పుడు, దురాత్మ ప్రభావం క్రింద ఉండడం కంటే మనుష్య సంతానాన్ని అధికంగా గాయపరిచేదేదీ లేదు” అని ప్రవక్త జోసెఫ్ స్మిత్ హెచ్చరించారు.22
లేబన్‌ను హత్య చేసినప్పుడు నీఫై ఒక ఆజ్ఞను ఉల్లంఘించాడని కొందరు ప్రత్యేకించి చూపవచ్చు. అయినప్పటికీ, వ్యక్తిగత బయల్పాటు దేవుని ఆజ్ఞలతో సామరస్యంగా ఉంటుందనే నియమాన్ని ఈ మినహాయింపు నిరాకరించదు. ఈ ఉదంతం యొక్క సరళమైన వివరణ ఏదీ పూర్తిగా సంతృప్తినివ్వదు, కానీ కొన్ని అంశాలను నేను ప్రముఖంగా పేర్కొంటాను. నేను లేబన్‌ను చంపవచ్చా అని నీఫై అడగడంతో ఈ సంఘటన ప్రారంభం కాలేదు. అది అతడు చేయాలని కోరుకున్నది కాదు. నీఫై తన వ్యక్తిగత లాభం కోసం కాదు, కానీ భవిష్యత్ తరానికి మరియు నిబంధన జనులకు లేఖనాలను అందించడం కోసం లేబన్‌ను చంపడం జరిగింది. అది బయల్పాటు అని నీఫై నిశ్చయంగా ఉన్నాడు—వాస్తవానికి, ఆ సందర్భంలో అది దేవుడిచ్చిన ఆజ్ఞ.23
అంతర్లీన నిర్మాణం యొక్క నాల్గవ అంశం ఏమిటంటే, దేవుని నుండి మరింత బయల్పాటును పొందడానికి సమ్మతిస్తూనే ఆయన మీకు వ్యక్తిగతంగా ఇదివరకే బయల్పరచిన దానిని గుర్తించడం. దేవుడు ఒక ప్రశ్నకు జవాబిచ్చియుండి, పరిస్థితులు మారకుండా ఉండియుంటే, జవాబు భిన్నంగా ఉండాలని మనం ఎందుకు ఆశించాలి? 1828 లో జోసెఫ్ స్మిత్ ఈవిధమైన సమస్యాత్మక దృష్టాంతంలో తడబడ్డాడు. శ్రేయోభిలాషి మరియు ప్రారంభ లేఖకుడైన మార్టిన్ హారిస్ అనువాద పత్రాలను తన భార్యకు చూపించడానికి తీసుకు వెళ్తానని జోసెఫ్‌ను అనుమతి కోరినప్పుడు, మోర్మన్ గ్రంథం యొక్క మొదటి భాగము అనువదించబడింది. ఏమి చేయాలో తెలియక జోసెఫ్ నడిపింపు కొరకు ప్రార్థించాడు. మార్టిన్‌ను పత్రాలు తీసుకువెళ్ళనివ్వద్దని ప్రభువు అతనితో చెప్పారు.
దేవుడిని మళ్ళీ అడగమని మార్టిన్ జోసెఫ్‌ను అభ్యర్థించాడు. జోసెఫ్ అడిగాడు, ఆశ్చర్యం లేదు, మళ్ళీ అదే సమాధానం. కానీ మూడవసారి అడగమని మార్టిన్ జోసెఫ్‌ను ప్రాధేయపడ్డాడు మరియు జోసెఫ్ అడిగాడు. ఈసారి దేవుడు వద్దు అని చెప్పలేదు. బదులుగా, “జోసెఫ్, దీని గురించి నేను ఏమనుకుంటున్నానో నీకు తెలుసు, కానీ ఎంచుకునే స్వేచ్ఛ నీకుంది” అని దేవుడు చెప్పినట్లు అనిపించింది. నిర్బంధం నుంచి ఉపశమనం పొందినట్లుగా భావించి, 116 చేతివ్రాత పేజీలను తీసుకువెళ్ళి కొద్దిమంది కుటుంబ సభ్యులకు చూపడానికి మార్టిన్‌ను అనుమతించాలని జోసెఫ్ నిర్ణయించాడు. అనువదించబడిన పేజీలు కోల్పోబడ్డాయి మరియు ఎన్నడూ తిరిగి దక్కలేదు. ప్రభువు జోసెఫ్‌ను తీవ్రంగా మందలించారు.24
మోర్మన్ గ్రంథ ప్రవక్త జేకబ్ బోధించినట్లుగా జోసెఫ్ నేర్చుకున్నాడు: “ప్రభువుకు సలహా ఇచ్చుటకు ప్రయత్నించవద్దు, కానీ ఆయన నుండి సలహా తీసుకొనుటకు ప్రయత్నించుడి. ఏలయనగా … ఆయన వివేకమందు సలహా ఇచ్చును.”25 మనం అడగకూడని విషయాల కొరకు అడిగినప్పుడు దురదృష్టకర విషయాలు జరుగుతాయని జేకబ్ హెచ్చరించాడు. యెరూషలేములోని జనులు “వారు గ్రహించలేని సంగతుల కొరకు” వెదకుతారని, “గురిని దాటి” చూచెదరని మరియు లోకరక్షకుడిని పూర్తిగా పట్టించుకోరని అతడు ముందుగానే చెప్పాడు.26 వారు తొట్రుపడతారు, ఎందుకంటే వారు గ్రహించని మరియు గ్రహించలేని సంగతుల కొరకు వారు అడిగారు.
మన సందర్భానికి తగినట్లు మనం వ్యక్తిగత బయల్పాటును పొందియుండి, పరిస్థితులు మారకుండా ఉండియుంటే, దేవుడు ఇదివరకే మన ప్రశ్నకు బదులిచ్చారని అర్థం.27 ఉదాహరణకు, కొన్నిసార్లు మనం క్షమించబడ్డామనే అభయం కోసం మనం పదేపదే అడుగుతాము. మనం పశ్చాత్తాపపడి, ఆనందంతో, మనశ్శాంతితో నింపబడియుండి, మన పాపాల కొరకు క్షమాపణను పొందినప్పుడు, మనం మళ్ళీ అడగవలసిన అవసరం లేదు, కానీ దేవుడు ఇదివరకే ఇచ్చిన జవాబును నమ్మగలము.28
దేవుడు ఇదివరకే ఇచ్చిన జవాబులను మనం నమ్మినప్పటికీ, దేవుని నుండి మరింత వ్యక్తిగత బయల్పాటు కొరకు మనం సమ్మతించాలి. ఏదేమైనా, జీవితంలో అన్నీ అనుకున్నట్లుగా జరగవు, అనుకోని సంఘటనలతో నిండియుండేదే జీవితం. వ్యక్తిగత బయల్పాటు అనేది “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రముగా పొందబడవచ్చని,” 29 బయల్పరచబడిన నిర్దేశము పెరగగలదని మరియు తరచూ పెరుగుతుందని మనం గుర్తించాలి. 30
వ్యక్తిగత బయల్పాటు కొరకు అంతర్లీన నిర్మాణం యొక్క అంశాలు అతివ్యాప్తి చెందుతాయి మరియు పరస్పరం బలోపేతం చేయబడతాయి. కానీ, మనం పురోగమించడానికి, మనం చేసిన మరియు చేయబోయే నిబంధనల ప్రకారం జీవించడాన్ని కొనసాగించడానికి మనకు కావలసిన వాటన్నిటిని ఆ అంతర్లీన నిర్మాణంలోనే పరిశుద్ధాత్మ బయల్పరచగలడు మరియు బయల్పరుస్తాడు. ఆవిధంగా, మనం ఎలా ఉండాలని పరలోక తండ్రి కోరుతున్నారో అలా మారడానికి యేసు క్రీస్తు యొక్క శక్తి చేత మనం దీవించబడగలము. దేవుడు బయల్పరచిన దానిని అర్థం చేసుకుంటూ, ఆయన నియమించిన ప్రవక్తల ద్వారా ఆయన ఇచ్చిన లేఖనాలు మరియు ఆజ్ఞలకు అనుగుణంగా ఉంటూ, మీ స్వంత పరిధి మరియు కర్తృత్వము లోపల మీ కొరకు వ్యక్తిగత బయల్పాటును హక్కుగా పొందడానికి నమ్మకం కలిగియుండమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు చేయవలసిన కార్యములన్నిటినీ పరిశుద్ధాత్మ మీకు చూపగలరని, చూపుతారని నాకు తెలుసు.31 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.