మన భూలోక గృహనిర్వాహకత్వము
భూమిని, తమ తోటి స్త్రీ పురుషులను ప్రేమించి, శ్రద్ధవహించే వారికి గొప్ప ఆత్మీయ దీవెనలు వాగ్దానం చేయబడ్డాయి.
మా స్వదేశమైన ఫ్రాన్సును సందర్శిస్తున్నప్పుడు, గివర్ని అనే చిన్న పట్టణంలో ఉన్న అద్భుతమైన తోటను పరిశోధించడానికి మా మనవళ్ళలో కొంతమందిని తీసుకువెళ్ళడం నా భార్యకు, నాకు ఆనందాన్ని కలిగించింది. అందమైన పూల పాన్పులను, సొగసైన నీటి లిల్లీలను మరియు సరస్సులో మెరుస్తున్న కిరణాలను మెచ్చుకుంటూ దాని దారుల వెంట తిరగడాన్ని మేము ఆనందించాము.
ఈ అద్భుతమైన ప్రదేశం ఒక వ్యక్తి యొక్క సృజనాత్మక అభిరుచి యొక్క ఫలితం: గొప్ప చిత్రకారుడైన క్లాడ్ మోనెట్, తన పెయింటింగ్ కార్యస్థలంగా దానిని మార్చుకోవడానికి 40 సంవత్సరాలపాటు తన తోటను మృదువుగా రూపొందించి, సాగు చేసాడు. శోభాయమానమైన ప్రకృతిలో మోనెట్ అధిక సమయం గడిపాడు; తర్వాత తన కుంచెతో, అతని అనుభూతులను రంగు మరియు కాంతి రేఖలతో తెలియజెప్పాడు. సంవత్సరాలుగా, అతడు తన తోట చేత ప్రత్యక్షంగా ప్రేరేపించబడి, వందలకొలది చిత్రాల యొక్క అసాధారణ సేకరణను సృష్టించాడు.
సహోదర సహోదరీలారా, మన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలతో మన పరస్పర చర్యలు జీవితంలోని అత్యంత ప్రేరేపితమైన మరియు ఆనందకరమైన అనుభవాలలో కొన్నింటిని అందించగలవు. మనకు కలిగే భావోద్వేగాలు, ఈ అద్భుతమైన భూమిని—దాని పర్వతాలు, ప్రవాహాలు, మొక్కలు, జంతువులతోపాటు— మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము, హవ్వలను సృష్టించిన మన పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కొరకు మనలో ఒక లోతైన కృతజ్ఞతా భావాన్ని ప్రేరేపించగలవు.1
సృష్టి కార్యానికి ఇది అంతం కాదు. ఆయన పిల్లల కొరకు దేవుని ప్రణాళికలో ఇది ముఖ్యభాగము. స్త్రీ పురుషులు పరీక్షించబడి, తమ కర్తృత్వాన్ని సాధనచేసి, ఆనందాన్ని కనుగొని, నేర్చుకొని, పురోగమించగల పరిస్థితులను కల్పించడమే దీని ఉద్దేశ్యము, ఆవిధంగా వారు ఒకనాటికి తమ సృష్టికర్త సన్నిధికి తిరిగివెళ్ళి, నిత్యజీవాన్ని స్వాస్థ్యముగా పొందవచ్చు.
ఈ అద్భుతమైన సృష్టి పూర్తిగా మన లాభము కొరకు సిద్ధం చేయబడింది మరియు ఆయన పిల్లల కొరకు సృష్టికర్త యొక్క ప్రేమకు సజీవ నిదర్శనమిది. “అవును, భూమిపై నుండి వచ్చు సమస్తము … కంటికి ఇంపుగా ఉండుటకు, హృదయమునకు ఆనందము కలుగజేయుటకు మనుష్యుని ప్రయోజనము, ఉపయోగము నిమిత్తము చేయబడినవి” అని ప్రభువు ప్రకటించారు.2
ఏదేమైనా, సృష్టి యొక్క దైవిక బహుమానం విధులు, బాధ్యతలు లేకుండా రాదు. ఈ విధులు గృహనిర్వాహకత్వము అనే భావన చేత బాగా వివరించబడతాయి. సువార్త పదాలలో, గృహనిర్వాహకత్వము అనే పదము దేవునికి చెందిన దానిపట్ల శ్రద్ధ వహించడానికి గల పవిత్రమైన ఆత్మీయ లేదా భౌతిక బాధ్యతను నిర్దేశిస్తుంది, దానికి మనం జవాబుదారులం.3
పరిశుద్ధ లేఖనాలలో బోధించబడినట్లు, మన భూలోక గృహనిర్వాహకత్వము క్రింది సూత్రాలను కలిపియుంది:
మొదటి సూత్రం: సమస్త భూమి, దానిపై నున్న జీవమంతటితో కలిపి దేవునికి చెందియున్నది.
భూమి యొక్క వనరులను మరియు సమస్త జీవకోటిని సృష్టికర్త మన చేతులకు అప్పగించారు, కానీ పూర్తిగా ఆయన యాజమాన్యాన్ని కలిగి ఉన్నారు. “ప్రభువైన నేను, పరలోకములను విశాలపరచి, నా హస్తకృత్యముతో భూమిని నిర్మించితిని; దానియందున్న సమస్తము నావే” అని ఆయన చెప్పారు.4 మన కుటుంబాలు, మన భౌతిక శరీరాలు, మన జీవితాలతో కలిపి భూమిపై నున్న సమస్తము దేవునికి చెందియున్నది.5
రెండవ సూత్రము: దేవుని సృష్టి యొక్క గృహనిర్వాహకులుగా, వాటిని గౌరవించి, వాటిపట్ల శ్రద్ధ చూపవలసిన బాధ్యత మనకుంది.
దేవుని పిల్లలుగా మనం ఆయన దైవిక సృష్టికి గృహనిర్వాహకులుగా, సంరక్షకులుగా, కాపలాదారులుగా ఉండడానికి బాధ్యతను అందుకున్నాము. “నా జీవుల కొరకు తయారుచేసి సిద్ధపరచియుంచిన భూలోక దీవెనలపై గృహనిర్వాహకునిగా నున్న ప్రతివాడు లెక్క అప్పగించునట్లు”6 చేసితినని ప్రభువు చెప్పారు.
మన స్వంత చిత్తానుసారము భూలోక వనరులను ఉపయోగించుకోవడానికి మన పరలోక తండ్రి మనల్ని అనుమతిస్తారు. అయినప్పటికీ, మన కర్తృత్వాన్ని వివేకం లేదా నిగ్రహము లేకుండా ఈ లోకం యొక్క వనరులను ఉపయోగించుకోవడానికి లేదా అనుభవించడానికి అనుమతిగా అనుకోకూడదు. ప్రభువు ఇలా ఉపదేశించారు: “ఇవన్నీ మనుష్యునికిచ్చుట దేవునికి ఆనందము కలిగించును; ఈ హేతువు చేతనే ఇవన్నీ వివేకముతో వినియోగించుకొనుటకు చేయబడెను, కానీ మితిమీరుటకు లేదా బలవంతముగా పొందుటకు కాదు.”7
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు: “దైవిక సృష్టి యొక్క లబ్ధిదారులుగా మనం ఏమి చేయాలి? మనం భూమిపట్ల శ్రద్ధ వహించాలి, దానిపై తెలివైన గృహనిర్వాహకులుగా ఉండాలి మరియు దానిని భవిష్యత్ తరాల కొరకు కాపాడాలి.”8
కేవలం శాస్త్రీయ లేదా రాజకీయ అవసరంగా ఉండడాన్ని మించి, భూమిపట్ల మరియు మన సహజ పర్యావరణంపట్ల శ్రద్ధ అనేది దేవునిచేత మనకు అప్పగించబడిన పవిత్రమైన బాధ్యత, అది మనలో విధి యొక్క బలమైన భావనను, వినయాన్ని నింపాలి. అది మన శిష్యత్వం యొక్క సమగ్ర భాగం కూడా. వారి సృష్టిని గౌరవించకుండా, ప్రేమించకుండా పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తును మనం ఎలా గౌరవించగలము మరియు ప్రేమించగలము?
మంచి గృహనిర్వాహకులుగా ఉండేందుకు మనం సమిష్టిగా మరియు వ్యక్తులుగా చేయగల విషయాలు అనేకం ఉన్నాయి. మన వ్యక్తిగత పరిస్థితులను పరిగణిస్తూ, మనలో ప్రతీఒక్కరు సమృద్ధిగా ఉన్న భూలోక వనరులను మరింత భక్తితో మరియు వివేకంతో ఉపయోగించగలము. భూమి పట్ల శ్రద్ధ వహించడానికి చేసే సామాజిక ప్రయత్నాలకు మనం సహకరించగలము. దేవుని సృష్టిని గౌరవించి, మన స్వంత నివాస స్థలాలను శుభ్రంగా, మరింత అందంగా, మరింత ప్రేరేపితంగా చేసే వ్యక్తిగత జీవన విధానాలను, ప్రవర్తనలను మనం అవలంబించగలము.9
దేవుని సృష్టి మీద మన గృహనిర్వాహకత్వంలో దాని పరాకాష్ట వద్ద, మనతోపాటు భూమిని పంచుకొనే సమస్త మానవాళి పట్ల ప్రేమ, గౌరవం, శ్రద్ధ చూపడం ఒక పవిత్ర విధిగా కూడా ఉంది. వారు దేవుని కుమారులు మరియు కుమార్తెలు, మన సహోదరులు, సహోదరీలు మరియు వారి నిత్య సంతోషమే సృష్టి కార్యము యొక్క ముఖ్య ఉద్దేశ్యము.
ఆంటోయిన్ డి సెయింట్-ఎక్సుపెరి అనే రచయిత క్రింది విధంగా వివరించాడు: ఒకరోజు, రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు, తాను శరణార్థుల సమూహం మధ్య కూర్చున్నట్లు అతడు కనుగొన్నాడు. ఒక చిన్నబిడ్డ ముఖంలో అతడు చూసిన నిస్సహాయత చేత బాగా కదిలించబడి, అతడు ఇలా ఆశ్యర్యపడ్డాడు; “పరివర్తన ద్వారా ఒక తోటలో ఒక క్రొత్త గులాబీ పుట్టినప్పుడు, తోటమాలులు అందరూ ఆనందిస్తారు. వారు ఆ గులాబీని విడిగా ఉంచి, పెంచి, పోషిస్తారు. కానీ, మనుష్యుల కొరకు ఏ సంరక్షకుడు లేడు.”10
నా సహోదర సహోదరీలారా, మన తోటి స్త్రీ పురుషులకు మనం సంరక్షకులుగా ఉండవద్దా? మనం మన సహోదరునికి కావలివారము కాదా? మన వలె మన పొరుగువానిని ప్రేమించమని యేసు మనల్ని ఆజ్ఞాపించారు.11 ఆయన నోటి నుండి వచ్చిన పొరుగువాడు అనే పదానికి అర్థం భౌగోళిక సామీప్యత మాత్రమే కాదు; హృదయం యొక్క సామీప్యతకు కూడా అది వర్తిస్తుంది. వారు మనకు దగ్గరగా లేదా దూరదేశంలో ఉన్నప్పటికీ, వారి మూలాలు, వ్యక్తిగత నేపథ్యాలు లేదా పరిస్థితులతో సంబంధం లేకుండా ఈ గ్రహంపై నున్న నివాసులందరిని అది ఆవరించియుంటుంది.
క్రీస్తు యొక్క శిష్యులుగా, భూమిపై నున్న దేశాలన్నిటి మధ్య శాంతి, సామరస్యాల కొరకు అలసిపోకుండా పనిచేయవలసిన గంభీరమైన బాధ్యత మనకు ఉంది. బలహీనులను, అవసరంలో ఉన్నవారిని, బాధపడుతున్న లేదా బాధింపబడిన వారందరిని రక్షించడానికి మరియు వారికి ఓదార్పును, ఉపశమనాన్ని ఇవ్వడానికి మనకు వీలైనంత మనం తప్పక చేయాలి. అన్నిటిని మించి, మనం మన తోటివారికి ఇవ్వగల ప్రేమ యొక్క గొప్ప బహుమానం వారితో సువార్త యొక్క ఆనందాన్ని పంచుకోవడం మరియు పవిత్ర నిబంధనలు, విధుల ద్వారా వారి రక్షకుని వద్దకు రమ్మని వారిని ఆహ్వానించడం.
మూడవ సూత్రము: సృష్టి కార్యములో పాల్గొనడానికి మనం ఆహ్వానించబడ్డాము.
సృష్టి యొక్క దైవిక ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ప్రతీరోజు దేవుని సృష్టి ఎదగడాన్ని, విస్తరించడాన్ని మరియు వృద్ధిపొందడాన్ని కొనసాగిస్తుంది. అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే, ఆయన సృష్టి కార్యంలో పాల్గొనమని మన పరలోక తండ్రి మనల్ని ఆహ్వానిస్తున్నారు.
మనం భూమిని సాగు చేసినప్పుడు లేదా ఈ లోకానికి మన స్వంత నిర్మాణాలను జత చేసినప్పుడు—దేవుని సృష్టి పట్ల మనం గౌరవం చూపినంత కాలము మనం సృష్టి కార్యంలో పాల్గొంటాము. కళాకృతులు, వాస్తుశిల్పం, సంగీతం, సాహిత్యం మరియు సంప్రదాయం యొక్క సృష్టి ద్వారా మన సహకారాన్ని వ్యక్తం చేయవచ్చు, అవి మన గ్రహాన్ని అలంకరించి, మన ఇంద్రియాలకు జీవమునిచ్చి, మన జీవితాలను ప్రకాశవంతం చేస్తాయి. భూమిని, దానిపై నున్న జీవాన్ని కాపాడే శాస్త్రీయ, వైద్యపరమైన పరిశోధనల ద్వారా కూడా మనం సహకారమిస్తాము. ఈ అభిప్రాయాన్ని ఈ అందమైన మాటలలో అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ సంక్షిప్తపరిచారు: “సృష్టి యొక్క ఆనందాలు, మహిమలను మానవుడు తెలుసుకొనేలా … తన నైపుణ్యంపై పనిచేయడానికి మానవుని కోసం దేవుడు లోకాన్ని అసంపూర్తిగా విడిచిపెట్టారు.”12
యేసు యొక్క తలాంతుల ఉపమానంలో, యజమాని తన ప్రయాణం నుండి తిరిగి వచ్చినప్పుడు, తమ తలాంతులను పెంచి, అధికం చేసిన ఇద్దరు సేవకులను ఆయన పొగిడి, బహుమానమిస్తాడు. దానికి విరుద్ధంగా, తన ప్రత్యేక తలాంతును భూమిలో దాచిన సేవకుడిని ఆయన “పనికిమాలిన దాసుడు” అని పిలిచి, అతడు పొందిన దానిని కూడా వాని యొద్దనుండి తీసివేసాడు.13
అదేవిధంగా, భూలోక సృష్టి యొక్క గృహనిర్వాహకులుగా మన పాత్ర వాటిని పరిరక్షించడం లేదా సంరక్షించడం మాత్రమే కాదు. ఆయన మనకు అప్పగించిన వనరులను మన లాభం కొరకు మాత్రమే కాకుండా ఇతరులను దీవించడానికి—ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినట్లు పెంచి, వృద్ధిచేసి, సద్వినియోగపరచడానికి మనం శ్రద్ధగా పనిచేయాలని ప్రభువు ఆశిస్తున్నారు.
మానవుడు సాధించిన వాటన్నిటిలో, జీవమునిచ్చుటలో లేదా ఒక బిడ్డ నేర్చుకొని, ఎదిగి, వర్ధిల్లేలా సహాయపడడంలో దేవునితో సహసృష్టికర్తలు అయ్యే అనుభవానికి ఏదీ సమానం కాలేదు—అది తల్లిదండ్రులైనా, బోధకులైనా, లేదా నాయకులైనా లేదా మరే పాత్రయైనా. ఆయన ఆత్మీయ బిడ్డలకు భౌతిక శరీరాలను అందించి, వారి దైవిక సామర్థ్యాన్ని చేరుకోవడానికి వారికి సహాయపడడంలో మన సృష్టికర్తతో భాగస్వామ్యులు కావడం కంటే అధిక పవిత్రమైన, అధిక సఫలమైన మరియు అధిక అక్కర గల గృహనిర్వాహకత్వమేదీ లేదు.
జీవితం మరియు ప్రతీ వ్యక్తి యొక్క శరీరం పవిత్రమైనవి, అవి దేవునికి తప్ప మరెవ్వరికీ చెందవు, మరియు వాటిని గౌరవించి, రక్షించి, శ్రద్ధ చూపడానికి ఆయన మనల్ని సంరక్షకులుగా చేసారని సహసృష్టి యొక్క బాధ్యత నిరంతరం జ్ఞాపకార్థంగా పనిచేస్తుంది. సంతానోత్పత్తి యొక్క శక్తులు మరియు నిత్య కుటుంబాల స్థాపనను నిర్వహించే దేవుని ఆజ్ఞలు, ఆయన ప్రణాళికకు అత్యంత ముఖ్యమైన ఈ పరిశుద్ధ గృహనిర్వాహకత్వములో మనల్ని నడిపిస్తాయి.
నా సహోదర సహోదరీలారా, మన జీవితం యొక్క అత్యంత తాత్కాలిక అంశాలతో కలిపి—అన్నీ ప్రభువుకు ఆత్మీయమైనవని మనం గుర్తించాలి. భూమిని, తమ తోటి స్త్రీ పురుషులను ప్రేమించి, శ్రద్ధవహించే వారికి గొప్ప ఆత్మీయ దీవెనలు వాగ్దానం చేయబడ్డాయని నేను సాక్ష్యమిస్తున్నాను. మీరు ఈ పవిత్ర గృహనిర్వాహకత్వములో విశ్వాసపాత్రంగా ఉండి, మీ నిత్య నిబంధనలను గౌరవించినప్పుడు, మీరు దేవుడు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు గురించిన జ్ఞానములో ఎదుగుతారు మరియు మీ జీవితంలో వారి ప్రేమను, వారి ప్రభావాన్ని సమృద్ధిగా అనుభవిస్తారు. ఇవన్నీ వారితో నివసించడానికి మరియు రాబోయే జీవితంలో అదనపు సృష్టించే శక్తిని పొందడానికి14 మిమ్మల్ని సిద్ధపరుస్తాయి.
ఈ మర్త్య ఉనికి యొక్క అంతములో, ఆయన సృష్టి పట్ల మనం ఎలా శ్రద్ధ చూపామనే దానితో కలిపి మన పవిత్ర గృహనిర్వాహకత్వము కొరకు లెక్క అప్పజెప్పమని యజమాని మనల్ని అడుగుతారు. అప్పుడు మన హృదయాలలో గుసగుసగా ఆయన ప్రియమైన మాటలు మనం వినాలని నేను ప్రార్థిస్తున్నాను: “భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిమీద నియమించెదను, నీ యాజమానుని సంతోషములో పాలుపొందుము.”15 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.