ఈ దినము
జీవించియున్న మన ప్రవక్త, మోర్మన్ గ్రంథముతో భూమిని వరదలా ముంచివేయడానికి తన వంతు కృషి చేస్తున్నారు. మనం ఆయన మార్గాన్ని తప్పక అనుసరించాలి.
ప్రియమైన నా సహోదర సహోదరీలారా, మోర్మన్ గ్రంథములో ఉపదేశము, వాగ్దానాలు మరియు బోధనలను ఆలకించమని చెప్పడానికి “ఈ దినమున”1 అనే వాక్యభాగము పదేపదే ఉపయోగించబడింది. “ఈ దినమున నేను మీతో చెప్పబోవు మాటలను వినుము; … మీరు వినునట్లు మీ చెవులను, మీరు గ్రహించునట్లు మీ హృదయములను, మీ దృష్టి యందు దేవుని మర్మములు విశదమగునట్లు మీ మనస్సులను తెరువుము” అని రాజైన బెంజమిన్ తన చివరి ప్రసంగంలో జనులను హెచ్చరించాడు.2 సర్వసభ్య సమావేశము అటువంటి సందర్భమే. మనము ప్రభువుకు, ఆయన సువార్తకు “అన్ని సమయములలో సత్యవంతులై”3 యుండునట్లు, “ఈ దినము” కొరకైన ఉపదేశాన్ని వినడానికి మనం వస్తాము. “భూమిపైనున్న గ్రంథములన్నింటిలోకెల్లా మిక్కిలి ఖచ్చితమైనదని” జోసెఫ్ స్మిత్ పిలిచిన మోర్మన్ గ్రంథానికి మన ఒడంబడికను “ఈ దినమున” క్రొత్తదిగా చేయుట యొక్క ప్రాముఖ్యతను నేను బలంగా భావిస్తున్నాను.4
మోర్మన్ గ్రంథము యొక్క ఒక ప్రతిని నేను నా చేతిలో పట్టుకున్నాను. ఇది నా 1970ల నాటి పాతకాలపు సంచిక మరియు ఇది నాకు అమూల్యమైనది. దీని ఆకారాన్ని బట్టి ఇది అలసిపోయి అరిగిపోయింది, కానీ మరేయితర గ్రంథము దీనిలా నా జీవితానికి, నా సాక్ష్యానికి ముఖ్యమైనది కాదు. దీనిని చదివి, యేసు క్రీస్తు దేవుని కుమారుడని,5 ఆయన నా రక్షకుడని,6 ఈ లేఖనాలు దేవుని వాక్యమని,7 సువార్త పునఃస్థాపించబడిందని8 ఆత్మ ద్వారా నేను సాక్ష్యం పొందాను. ఆ సత్యాలు నా స్వభావంలో ఆవశ్యక భాగమయ్యాయి. ప్రవక్త నీఫై చెప్పినట్లుగా, “నా ఆత్మ ప్రభువు యొక్క కార్యములందు ఆనందించును.”9
దీని వెనుక ఉన్న కథ ఇది. ఒక యువ సువార్తికునిగా నేను, ఈస్టర్న్ స్టేట్స్ మిషనులో మమ్మల్ని సందర్శించిన ఎల్డర్ మారియన్ డి. హాంక్స్ ఉపదేశాన్ని విన్నాను. ఆయన బ్రిటీషు మిషను యొక్క మాజీ అధ్యక్షుడు, ఆయన సువార్తికులలో ఇద్దరు ఈరోజు వేదికపై ఉన్నారు: నా ప్రియ సహోదరులైన ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ మరియు ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్.10 ఇంగ్లండులో ఉన్న ఆయన సువార్తికులతో చేసినట్లుగా, గుర్తులు పెట్టని మోర్మన్ గ్రంథ ప్రతిని కనీసం రెండుసార్లు చదవమని ఆయన మమ్మల్ని సవాలు చేసారు. నేను సవాలును స్వీకరించాను. మొదటిసారి చదివినప్పుడు, యేసు క్రీస్తు గురించి చెప్తున్న లేదా సాక్ష్యమిస్తున్న ప్రతీదాని క్రింద నేను గీతగీయాలి లేదా గుర్తుపెట్టాలి. నేను ఎర్ర పెన్సిలును ఉపయోగించాను మరియు అనేక భాగాల క్రింద గీతగీసాను. రెండవసారి, సువార్త యొక్క సూత్రాలను, సిద్ధాంతాన్ని ప్రత్యేకించి చూపమని ఎల్డర్ హాంక్స్ చెప్పారు మరియు ఈసారి నేను లేఖనాలలో గుర్తుపెట్టడానికి నీలిరంగును ఉపయోగించాను. సూచించబడినట్లుగా నేను రెండుసార్లు మోర్మన్ గ్రంథాన్ని చదివాను, తర్వాత నాకు ప్రత్యేకంగా అనిపించిన భాగాలను గుర్తించడానికి పసుపు మరియు నలుపు రంగులను ఉపయోగిస్తూ మరో రెండుమార్లు చదివాను.11 నేను అనేక గుర్తులు పెట్టానని మీరు చూడవచ్చు.
నా పఠనంలో లేఖనాలను గుర్తించడం కంటే చాలా ఎక్కువే ఉంది. మొదలు నుండి చివరి వరకు, మోర్మన్ గ్రంథాన్ని చదివిన ప్రతీసారి నేను ప్రభువు కొరకు గాఢమైన ప్రేమతో నింపబడ్డాను. ఆయన బోధనల యొక్క సత్యము గురించి మరియు అవి “ఈ దినము”నకు ఎలా అన్వయిస్తాయనే దాని గురించి ఆవశ్యకమైన, లోతైన సాక్ష్యాన్ని నేను భావించాను. “యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన” అనే పేరు ఈ గ్రంథానికి సరిగ్గా సరిపోతుంది.12 ఆ అధ్యయనముతో మరియు పొందిన ఆత్మీయ సాక్ష్యముతో, నేను మోర్మన్ గ్రంథాన్ని ప్రేమించే సువార్తికునిగా మరియు యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా మారాను.13
“ఈ దినమున,” మోర్మన్ గ్రంథము యొక్క గొప్ప సువార్తికులలో ఒకరు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్. ఆయన క్రొత్తగా అపొస్తలునిగా పిలువబడినప్పుడు, ఆయన ఆక్రా, ఘానాలో ఉపన్యాసమిచారు.14 హాజరైన ప్రముఖులలో ఆఫ్రికా గిరిజనుల రాజు కూడా ఉన్నారు, అతనితో ఒక అనువాదకుని సహాయంతో ఆయన మాట్లాడారు. ఆ రాజు బైబిలు యొక్క గంభీరమైన విద్యార్థి మరియు ప్రభువును ప్రేమించాడు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ వ్యాఖ్యానం తరువాత, ఆ రాజు ఆయనను సమీపించి, పరిపూర్ణమైన ఆంగ్లంలో, “నీవెవరు?” అని అడిగాడు. తాను యేసు క్రీస్తు చేత నియమించబడిన అపొస్తలుడనని అధ్యక్షులు నెల్సన్ వివరించారు.15 రాజు అడిగిన తరువాతి ప్రశ్న, “యేసు క్రీస్తు గురించి మీరు నాకేమి బోధించగలరు?”16
అధ్యక్షులు నెల్సన్ మోర్మన్ గ్రంథాన్ని తీసుకొని, 3 నీఫై 11 తెరిచారు. అధ్యక్షులు నెల్సన్ మరియు రాజు కలిసి నీఫైయులకు రక్షకుని ప్రసంగాన్ని చదివారు: “ఇదిగో లోకములోనికి వచ్చునని ప్రవక్తలు సాక్ష్యమిచ్చిన యేసు క్రీస్తును నేనే. … నేను లోకమునకు వెలుగును, జీవమునైయున్నాను.”17
అధ్యక్షులు నెల్సన్ మోర్మన్ గ్రంథము యొక్క ఆ ప్రతిని రాజుకు బహూకరించినప్పుడు, రాజు ఇలా స్పందించాడు, “మీరు నాకు వజ్రాలు లేదా కెంపులు ఇచ్చియుండవచ్చు, కానీ ప్రభువైన యేసు క్రీస్తు గురించి ఈ అదనపు జ్ఞానము కంటే నాకు ఎక్కువ విలువైనది ఏదీ లేదు.”18
మోర్మన్ గ్రంథమును మన ప్రియమైన ప్రవక్త ఎలా పంచుకుంటారనే దానికి అది ఒక్కటే మాదిరి కాదు. యేసు క్రీస్తు గురించి ఎల్లప్పుడూ తన సాక్ష్యాన్ని పంచుకుంటూ, ఆయన వందలమందికి మోర్మన్ గ్రంథ ప్రతులను ఇచ్చారు. సంఘ ప్రధాన కేంద్రంలోనైనా లేదా వారి స్వంత ప్రదేశాలలోనైనా, అధ్యక్షులు నెల్సన్ అతిథులు, అధ్యక్షులు, రాజులు, రాష్ట్రపతులు, వ్యాపార నాయకులు, సంస్థలు మరియు విభిన్న విశ్వాసాలకు చెందిన వారిని కలుసుకున్నప్పుడు, బయల్పరచబడిన లేఖనమైన ఈ గ్రంథాన్ని ఆయన భక్తిపూర్వకంగా బహూకరిస్తారు. ఆయన సందర్శనకు జ్ఞాపకార్థంగా బల్లపై, సొరుగులలో లేదా బీరువాలలో ఉంచబడే విధంగా రిబ్బన్లతో చుట్టబడిన అనేక వస్తువులను ఆయన వారికి ఇవ్వగలరు. దానికి బదులుగా, గిరిజన రాజు వివరించినట్లు వజ్రాలు, కెంపులను మించి, తనకు అత్యంత అమూల్యమైన దానిని ఆయన ఇస్తారు.
“మోర్మన్ గ్రంథము యొక్క సత్యములు మన ఆత్మలను స్వస్థపరచుటకు, ఆదరించుటకు, పునఃస్థాపించుటకు, సహాయపడుటకు, బలపరచుటకు, ఓదార్చుటకు మరియు ఉల్లాసపరచుటకు శక్తి కలిగియున్నవి” అని అధ్యక్షులు నెల్సన్ చెప్పారు.19 దేవుని యొక్క మన ప్రవక్త నుండి వాటిని అందుకున్న వారి చేతులలో మోర్మన్ గ్రంథము యొక్క ఈ ప్రతులు పట్టుకొనబడియుండడాన్ని నేను గమనించాను. దానిని మించిన గొప్ప బహుమానము ఉండజాలదు.
ఈమధ్య ఆయన గాంబియా యొక్క ప్రథమ మహిళను ఆయన కార్యాలయంలో కలిసినప్పుడు, వినయంగా ఆమెకు మోర్మన్ గ్రంథాన్ని అందించారు. అక్కడితో ఆయన ఆగిపోలేదు. యేసు క్రీస్తు, ఆయన ప్రాయశ్చిత్తము మరియు ప్రతిచోటా ఉన్న—దేవుని పిల్లలందరి కొరకు ఆయన ప్రేమ గురించి బోధించి, సాక్ష్యమివ్వడానికి ఆమెతో పాటు చదవడానికి ఆయన దాని పేజీలు తెరిచారు.
జీవించియున్న మన ప్రవక్త మోర్మన్ గ్రంథముతో భూమిని వరదలా ముంచివేయడానికి తన వంతు చేస్తున్నారు.20 కానీ, ఆయన ఒక్కరే ఆ పని చేయలేరు. మనం ఆయన మార్గాన్ని తప్పక అనుసరించాలి.
ఆయన మాదిరిచేత ప్రేరేపించబడి, నేను వినయంగా, మరింత మనఃపూర్వకముగా మోర్మన్ గ్రంథాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
ఇటీవల నేను ఒక పనిమీద మొజాంబిక్‌లో ఉన్నాను. ఈ అందమైన దేశపౌరులు పేదరికం, అనారోగ్యం, నిరుద్యోగం, తుఫానులు మరియు రాజకీయ అశాంతితో కష్టపడుతున్నారు. ఆ దేశ అధ్యక్షుడైన ఫిలీపె నాయుసిని కలుసుకొనే గౌరవం నాకు కలిగింది. ఆయన మనవితో, నేను ఆయన కొరకు, ఆయన దేశం కొరకు ప్రార్థించాను; ఆయన దేశంలో మేము యేసు క్రీస్తు21 యొక్క దేవాలయాన్ని నిర్మిస్తున్నామని నేను ఆయనతో చెప్పాను. మా సందర్శన ముగింపులో, ఆయన స్థానిక భాషయైన పోర్చుగీసులో ఉన్న మోర్మన్ గ్రంథ ప్రతిని నేను ఆయనకు బహూకరించాను. ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఆ గ్రంథాన్ని అంగీకరించినప్పుడు, దాని పేజీలలో ఉన్న ప్రభువు మాటలలో ఆయన జనుల కొరకు కనుగొనబడు నిరీక్షణ, వాగ్దానాల గురించి నేను సాక్ష్యమిచ్చాను.22
మరొక సందర్భంలో, నా భార్య మెలానీ మరియు నేను, లెసోతో రాజు లెట్సీ III మరియు అతని భార్యను వారి ఇంట్లో కలిశాము.23 మాకు మా సందర్శనలో ముఖ్యమైనది వారికి మోర్మన్ గ్రంథము యొక్క ప్రతిని బహూకరించడం, తర్వాత నా సాక్ష్యాన్ని పంచుకోవడం. ఆ అనుభవం గురించి మరియు ఇతర వాటి గురించి నేను ఆలోచించినప్పుడు, కడవరి దిన లేఖనం యొక్క ఒక వచనం నా మనస్సులో మెదులుతుంది: “నా సంపూర్ణ సువార్త భూదిగంతముల వరకు, రాజులు మరియు పరిపాలకుల యెదుట బలహీనులు, సామాన్యులచేత ప్రకటింపబడాలి.”24
జెనీవాలోని ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి ఇంద్ర మణి పాండేతో25; తూర్పు ఆర్థోడాక్స్ సంఘము యొక్క పవిత్ర గోత్రజనికుడు బర్తొలోమయితో26 ; మరియు అనేకమంది ఇతరులతో నేను మోర్మన్ గ్రంథమును పంచుకున్నాను. నేను వారికి వ్యక్తిగతంగా “మన మతము యొక్క ప్రధానరాయిని” 27 ఇచ్చి, మన విశ్వాసము యొక్క మూలరాయి28 అయిన యేసు క్రీస్తు గురించి నా సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు, ప్రభువు యొక్క ఆత్మను మాతో నేను అనుభవించాను.
ఇప్పుడు, సహోదర సహోదరీలారా, పవిత్రమైన బోధనలు, వాగ్దానాలు గల ఈ గ్రంథాన్ని ఎవరికైనా ఇవ్వడానికి మీరు మొజాంబిక్ లేదా భారత దేశానికి వెళ్ళనక్కరలేదు లేదా రాజులను, పాలకులను కలవాల్సిన అవసరం లేదు. మీ స్నేహితులు, కుటుంబము, మీతోపాటు పని చేసేవారు, మీ సాకర్ శిక్షకుడు లేదా మీ సంతలో రైతుకు మోర్మన్ గ్రంథమును ఇవ్వమని ఈ దినము నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ గ్రంథములో కనుగొనబడే ప్రభువు యొక్క వాక్యము వారికి అవసరము. అనుదిన జీవితము మరియు రాబోయే నిత్యజీవము గురించిన ప్రశ్నలకు జవాబులు వారికి అవసరము. వారి ముందు ఉంచబడిన నిబంధన బాట గురించి, వారి కొరకు ప్రభువు యొక్క స్థిరమైన ప్రేమ గురించి వారు తెలుసుకోవాలి. అవన్నీ మోర్మన్ గ్రంథములో ఉన్నాయి.
మీరు మోర్మన్ గ్రంథాన్ని వారికి ఇచ్చినప్పుడు, దేవుని వాక్యానికి వారి మనస్సులను, హృదయాలను మీరు తెరుస్తున్నారు. గ్రంథము యొక్క ముద్రించబడిన ప్రతులను మీతోపాటు తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోనులో సువార్త గ్రంథాలయ యాప్‌లో లేఖన విభాగం నుండి మీరు దీనిని సులువుగా పంచుకోవచ్చు.29
వారి జీవితాల్లో సువార్త ద్వారా ఆశీర్వదించబడే వారందరి గురించి ఆలోచించండి, ఆపై మీ ఫోన్ నుండి మోర్మన్ గ్రంథ ప్రతిని వారికి పంపండి. మీ సాక్ష్యాన్ని మరియు మీ జీవితాన్ని ఈ పుస్తకం ఎలా ఆశీర్వదించిందో గుర్తుంచుకోండి.
ప్రియమైన నా స్నేహితులారా, మోర్మన్ గ్రంథముతో భూమిని వరదలా ముంచివేయడంలో మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు నెల్సన్ గారిని అనుసరించమని ప్రభువు యొక్క అపొస్తలునిగా నేను మీకు ఆహ్వానమిస్తున్నాను. అవసరం చాలా గొప్పది; మనం ఇప్పుడు పని చేయాలి. “కేవలము సత్యమును ఎక్కడ కనుగొనవలెనో తెలియకపోవుట వలన దానిని యెరుగకయున్న”31 వారిని సమీపించాలని మీరు ప్రేరేపించబడినప్పుడు, మీరు “భూమిపై అత్యంత గొప్ప కార్యము, ఇశ్రాయేలు సమకూర్పు”30 నందు పాల్గొంటున్నారని నేను వాగ్దానమిస్తున్నాను. ఈ గ్రంథము మీ జీవితాన్ని ఎలా మార్చింది మరియు మిమ్మల్ని దేవునికి, ఆయన శాంతికి,32 మరియు ఆయన “గొప్ప సంతోషకరమైన సువార్తలకు”33 ఎలా దగ్గర చేసింది అనేదాని గురించి మీ సాక్ష్యము వారికి అవసరము.
దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, “ఈ దినము” ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు, పునఃస్థాపించబడిన ఆయన సువార్త యొద్దకు ఆత్మలను తీసుకురావడానికి వెలుగులోనికి వచ్చేందుకు మోర్మన్ గ్రంథము ప్రాచీన అమెరికాలో దైవిక రూపకల్పనచేత సిద్ధపరచబడిందని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.