సర్వసభ్య సమావేశము
మీ సాక్ష్యమును పోషించుట మరియు పంచుకొనుట
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


మీ సాక్ష్యమును పోషించుట మరియు పంచుకొనుట

మాటలో, క్రియలో మీ సాక్ష్యమును పంచుకొనే అవకాశాలను వెదకమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

పరిచయము

జీవితంలో నిర్వచించే క్షణాలు మీరు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు కూడా తరచుగా మరియు అనుకోకుండా వస్తాయి. ఉన్నత పాఠశాల విద్యార్థి కెవిన్ గురించిన కథనాన్ని పంచుకోవడానికి నన్ను అనుమతించండి, అతని స్వంత మాటల్లో చెప్పబడినట్లుగా విద్యార్థి నాయకుడి కార్యక్రమం కోసం రాష్ట్రం వెలుపల ప్రయాణించడానికి అతడు ఎంచుకున్నాడు.

“వరుసలో నా వంతు వచ్చింది, అధికారికంగా కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ గుమాస్తా నా పేరు అడిగింది. ఆమె తన జాబితా చూసి, ‘అయితే నువ్వు యూటాకు చెందిన యువకుడివి,’ అంది.

“‘అంటే నేనొక్కడినేనని మీ అర్థమా?’ అని నేను అడిగాను.

“‘అవును, ఒక్కడివే.’ ఆమె నా పేరు క్రింద “యుటా” అని ముద్రించిన నా పేరుగల టాగ్‌ను నాకు ఇచ్చింది. నేను దానిని చొక్కాకు అతికించినప్పుడు, నేను ముద్ర వేయబడినట్లుగా భావించాను.

హోటలు లిఫ్టు‌లోనికి నాలాగే పేరు టాగ్ ఉన్న మిగిలిన ఐదుగురు విద్యార్థులతోపాటు పెద్ద గుంపుతో వెళుతున్నాను. ‘హే, నువ్వు యుటా నుండా. నువ్వు మోర్మన్‌వా?’ అని ఒక విద్యార్థి అడిగాడు.

“దేశం నలుమూలల నుండి వచ్చిన ఈ విద్యార్థి నాయకులందరి మధ్య నాకు చోటు లేనట్లు భావించాను. ‘అవును,’ నేను సంకోచిస్తూ ఒప్పుకున్నాను.

“‘దేవదూతలను చూసానని చెప్పిన జోసెఫ్ స్మిత్‌ను మీరందరు నమ్ముతారు కదా. దానిని నువ్వు నిజంగా నమ్మడం లేదు, కదా?’

“ఏమి చెప్పాలో నాకు తెలియలేదు. లిఫ్టులోని విద్యార్థులు అందరూ నావైపే చూస్తున్నారు. నేను అప్పుడే వచ్చాను,మరియు అప్పుడే ప్రతీఒక్కరు నేను భిన్నంగా ఉన్నానని అనుకున్నారు. నేను కాస్త ధైర్యము తెచ్చుకున్న తరువాత చెప్పాను, ‘జోసెఫ్ స్మిత్ దేవుని ప్రవక్త అని నాకు తెలుసు.’

“‘ఆ ప్రశ్నకు నేను ఎందుకలా జవాబిచ్చాను? నేను ఆశ్చర్యపడ్డాను. ఈ జవాబిచ్చే ధైర్యము నాకుందని నాకు తెలియలేదు. కానీ మాటలు నిజమే అనిపించాయి.

“‘అవును, మీ అందరికి కేవలం మత పిచ్చి అని నాకు చెప్పబడింది,’ అన్నాడు అతడు.

“దానితో, లిఫ్టు తలుపు తెరువబడినప్పుడు అసౌకర్యమైన విరామమున్నది. మేము మా సామాన్లు తీసుకొన్నప్పుడు, అతడు నవ్వుకుంటూ హాలువైపు నడిచాడు.

“తరువాత, నా వెనుక నుండి ఒక స్వరము అడిగింది, ‘హే, మోర్మన్ల దగ్గర మరొక బైబిలు ఉందా?’

“ఓహ్, వద్దు. మరలా వద్దు. నేను వెనక్కి తిరిగినప్పుడు, లిఫ్టులో నాతో ఉన్న మరొక విద్యార్థి క్రిస్టాఫర్‌ను చూసాను.

“‘దానిని మోర్మన్ గ్రంథము అని పిలుస్తారు,’ అన్నాను, విషయాన్ని వదిలేయాలని కోరుతూ. నేను నా బ్యాగులను తీసుకొని, హాలు వైపు నడవసాగాను.

“‘అది జోసెఫ్ స్మిత్ అనువదించిన గ్రంథమా?’ అని అతడు అడిగాడు.

“‘అవును,’ అని నేను జవాబిచ్చాను. ఇబ్బందిని తప్పించుకోవాలని ఆశిస్తూ నేను నడవసాగాను.

“‘మంచిది, నేను ఒక ప్రతిని ఎలా పొందవచ్చో నీకు తెలుసా?’

“సెమినరీలో నేను నేర్చుకొన్న ఒక లేఖనము హఠాత్తుగా నాకు గుర్తుకొచ్చింది. ‘యేసు క్రీస్తు సువార్త గురించి నేను సిగ్గుపడను.’1 అది నా మనస్సులో ప్రవేశించగానే, నేను చాలా ఇబ్బందిపడినందుకు నేను సిగ్గుపడ్డాను.

“మిగిలిన వారమంతా ఆ లేఖనము నన్ను విడిచిపెట్టలేదు. నాకు సాధ్యమైనంత వరకు సంఘము గురించి నేను అనేక ప్రశ్నలకు జవాబిచ్చాను మరియు నేను అనేకమందిని స్నేహితులుగా చేసుకున్నాను.

“నేను నా మతం గురించి గర్విస్తున్నట్లుగా కనుగొన్నాను.

“నేను క్రిస్టాఫర్‌కు ఒక మోర్మన్ గ్రంథాన్నిఇచ్చాను. తరువాత అతడు తన ఇంటికి సువార్తికులను ఆహ్వానించానని చెప్తూ నాకు లేఖ రాసాడు.

“నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి సిగ్గుపడకుండా ఉండడం నేను నేర్చుకున్నాను.”2

తన సాక్ష్యమును పంచుకోవడంలో కెవిన్ ధైర్యము చేత నేను ప్రేరేపించబడ్డాను. ప్రపంచమంతటా సంఘము యొక్క విశ్వాసులైన సభ్యుల చేత పునరావృతం చేయబడే ధైర్యమది. నేను నా ఆలోచనలు పంచుకొన్నప్పుడు, ఈ నాలుగు ప్రశ్నలను పర్యాలోచన చేయమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను:

  1. సాక్ష్యము అనగా ఏమిటో నాకు తెలుసా మరియు నేను గ్రహించానా?

  2. నా సాక్ష్యమును ఎలా పంచుకోవాలో నాకు తెలుసా?

  3. నా సాక్ష్యమును పంచుకోవడంలో ఆటంకాలు ఏమున్నాయి?

  4. నేను నా సాక్ష్యమును ఎలా నిలుపుకోగలను?

సాక్ష్యము అనగా ఏమిటో నాకు తెలుసా మరియు నేను గ్రహించానా?

మీ సాక్ష్యము అత్యంత విలువైన ఆస్తి, తరచుగా లోతైన ఆధ్యాత్మిక భావాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఆ భావనలు సాధారణంగా నిశ్శబ్దంగా సంభాషించబడతాయి మరియు “మిక్కిలి నిమ్మళమైన స్వరముగా” వర్ణించబడ్డాయి.3 అది సత్యమును గూర్చి మీ నమ్మకము లేదా జ్ఞానము, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం చేత ఒక ఆత్మీయ సాక్ష్యముగా ఇవ్వబడినది. ఈ సాక్ష్యమును సంపాదిండం మీరు చెప్పే దానిని మరియు మీరు ప్రవర్తించే తీరును మారుస్తుంది. పరిశుద్ధాత్మచే నిర్దేశించబడిన మీ సాక్ష్యము యొక్క ముఖ్యాంశాలలో ఇవి ఉన్నాయి:

  • దేవుడు మీ పరలోక తండ్రి; మీరు ఆయన బిడ్డ. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.

  • యేసు క్రీస్తు జీవిస్తున్నారు. ఆయన సజీవుడైన దేవుని కుమారుడు మరియు మీ రక్షకుడు, విమోచకుడు.

  • జోసెఫ్ స్మిత్ యేసు క్రీస్తు యొక్క సంఘమును పునఃస్థాపించడానికి పిలువబడిన దేవుని ప్రవక్త.

  • యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము భూమి మీద దేవుని యొక్క పునఃస్థాపించబడిన సంఘము.

  • యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సంఘము నేడు జీవిస్తున్న ప్రవక్తచేత నడిపించబడుతుంది.

నా సాక్ష్యమును ఎలా పంచుకోవాలో నాకు తెలుసా?

ఇతరులతో ఆత్మీయ భావనలను మీరు పంచుకొన్నప్పుడు, మీరు మీ సాక్ష్యాన్ని పంచుకుంటారు. సంఘము యొక్క సభ్యులుగా మీకు, మీ సాక్ష్యమును చెప్పడానికి అవకాశాలు అధికారిక సంఘ సమావేశాలలో లేదా అనధికారికమైన వాటిలో, కుటుంబము, స్నేహితులు మరియు ఇతరులతో ఒకరితో ఒకరు జరిపే సంభాషణలలో వస్తాయి.

మరొక విధానములో, నీతిగల ప్రవర్తన ద్వారా మీరు మీ సాక్ష్యాన్ని పంచుకోగలరు. యేసు క్రీస్తు గురించి మీ సాక్ష్యము మీరు చెప్పేది మాత్రమే కాదు—మీరు ఎవరనేది కూడా.

యేసు క్రీస్తును వెంబడించడానికి మీ నిబద్ధతను మాటలతో చెప్పిన లేదా మీ క్రియల ద్వారా రుజువు చేసిన ప్రతీసారి, మీరు ఇతరులను “క్రీస్తునొద్దకు రమ్మని”4 ఆహ్వానిస్తున్నారు.

సంఘము యొక్క సభ్యులు అన్ని సమయములలో, అన్ని విషయములలో మరియు అన్ని స్థలములలో దేవునికి సాక్షులుగా నిలబడతారు.5 ఇంటర్నెట్‌లో ప్రేరేపించే మన స్వంత విషయాన్ని ఉపయోగించి దీనిని చేయడానికి లేదా ఇతరులు సిద్ధపరచిన ఉద్ధరించే విషయాన్ని పంచుకోవడానికి అవకాశాలు అపరిమితమైనవి. మనము ప్రేమించి, పంచుకొని, ఆన్‌లైన్‌లో ఆహ్వానించినప్పుడు కూడా మనము సాక్ష్యమిస్తాము. యేసు క్రీస్తు యొక్క సువార్త మీ జీవితాన్ని ఎలా రూపొందించిందో చూపడానికి కూడా మీరు సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించినప్పుడు, మీ ట్వీట్లు, సూటిగా చెప్పే సందేశాలు మరియు పోస్టులు ఉన్నతమైన, పరిశుద్ధమైన ప్రయోజనాన్ని పొందుతాయి.

నా సాక్ష్యమును పంచుకోవడంలో ఆటంకాలు ఏమున్నాయి?

ఏమి చెప్పాలనే అనిశ్చితి మీ సాక్ష్యమును పంచుకోవడానికి గల ఆటంకాలలో ఉండవచ్చు. తొలి అపొస్తలుడైన మథ్యూ కౌలే, 17 సంవత్సరాల వయస్సులో ఐదు-సంవత్సరాల సువార్త సేవకై న్యూజిలాండ్‌కు వెళ్ళినప్పటి ఈ అనుభవాన్ని పంచుకున్నాడు:

“నేను వెళ్ళుతున్న రోజు నా తండ్రి యొక్క ప్రార్థనలు నేను ఎన్నడూ మరచిపోను. నా జీవితమంతటిలో ఇంతకంటే అందమైన దీవెనను నేను ఎప్పుడూ వినలేదు. తరువాత రైలు రోడ్డు స్టేషను వద్ద నాతో ఆయన చెప్పిన చివరి మాటలివి, ‘నా కుమారుడా, నువ్వు ఆ సేవకు వెళ్తున్నావు … మరియు కొన్నిసార్లు సాక్ష్యమివ్వడానికి నువ్వు పిలువబడినప్పుడు, నువ్వు అద్భుతంగా సిద్ధపడ్డావని అనుకుంటావు, కానీ నువ్వు నిలబడినప్పుడు, నీ మనస్సు పూర్తిగా ఖాళీ అవుతుంది.’ … ఒకసారి కంటే ఎక్కువగా నాకు ఆ అనుభవం కలిగింది.

“‘మీ మనస్సు ఖాళీ అయినప్పుడు మీరేమి చేస్తారు?’ అన్నాను నేను.

“దానికి ఆయన, ‘నువ్వు అక్కడ నిలబడి, నీ ఆత్మ యొక్క పూర్ణశక్తితో, జోసెఫ్ స్మిత్ సజీవుడైన దేవుని ప్రవక్త అని సాక్ష్యమివ్వు మరియు ఆలోచనలు నీ మనస్సులోకి, మాటలు నీ నోటికి … వింటున్న ప్రతీఒక్కరి హృదయములోకి ప్రవహిస్తాయి’ అని చెప్పారు. కాబట్టి నా … సువార్తసేవ … సమయంలో దాదాపు ఖాళీగా ఉన్న నా మనస్సు, రక్షకుని యొక్క సిలువ శ్రమ జరిగిన తర్వాత, లోక చరిత్రలో జరిగిన గొప్ప సంఘటనకు సాక్ష్యము చెప్పే అవకాశము నాకిచ్చింది. స్నేహితులారా, అమ్మాయిలారా, ఒకసారి దానిని ప్రయత్నించండి. చెప్పడానికి మీ దగ్గర ఏమి లేనట్లయితే, జోసెఫ్ స్మిత్ దేవుని ప్రవక్త అని సాక్ష్యమివ్వండి మరియు సంఘము యొక్క చరిత్ర మొత్తం మీ మనస్సులోకి ప్రవహిస్తుంది.”6

అదేవిధంగా, అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ పంచుకున్నారు, “కొన్ని సాక్ష్యాలు వాటి కోసం మోకరించి ప్రార్థన చేసిన దానికంటె వాటిని మోస్తున్న పాదాల ద్వారా ఉత్తమంగా పొందబడతాయి.”7 ప్రసంగీకునికి మరియు వినే వారికి ఒకేవిధంగా ఆత్మ సాక్ష్యము వహిస్తుంది.

కెవిన్ యొక్క కథ నొక్కి చెప్పినట్లుగా, మరొక ఆటంకము, భయము. పౌలు తిమోతికి వ్రాసినట్లుగా:

“దేవుడు మనకు శక్తియు ప్రేమయు … గల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.

“కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి సిగ్గుపడకుము.”8

భయముగల భావనలు ప్రభువు నుండి రావు, కానీ చాలా తరచుగా అపవాది నుండి వస్తాయి. కెవిన్ చేసినట్లుగా విశ్వాసము కలిగియుండడం, ఆ భావనలను జయించడానికి మరియు మీ హృదయంలో ఉన్నదానిని స్వేచ్ఛగా పంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

నేను నా సాక్ష్యమును ఎలా నిలుపుకోగలను?

ఒక సాక్ష్యము మన ఉనికిలో ఆవశ్యకమైన భాగమని నేను నమ్ముతున్నాను, అయినప్పటికీ, దానిని నిలుపుకొని, దానిని మరింత పూర్తిగా అభివృద్ధి చేయడానికి, మనము అధిక శ్రద్ధతో మన సాక్ష్యమును పోషించాలని ఆల్మా బోధించాడు.9 మనము ఆవిధంగా చేసినప్పుడు, “అది వేరు పారి, పైకి పెరిగి, ఫలమును ఫలించును.”10 అట్లు కానప్పుడు, “అది వాడిపోవును.”11

ప్రథమ అధ్యక్షత్వము యొక్క ప్రియమైన సభ్యులు ప్రతీఒక్కరు ఒక సాక్ష్యమును నిలుపుకోవడానికి మనకు నడిపింపును అందించారు.

“మీ సాక్ష్యము ఎదగడం కోసం మరియు అభివృద్ధి చెందడం కోసం దేవుని వాక్యమును విందారగించుట, హృదయపూర్వకమైన ప్రార్థన మరియు ప్రభువు యొక్క ఆజ్ఞలకు విధేయత సమానంగా మరియు నిరంతరం తప్పక అన్వయించబడాలి”12 అని అధ్యక్షులు హెన్రీ. బి. ఐరింగ్ మనకు ప్రేమగా బోధించారు.

మన సాక్ష్యమును నిలుపుకోవడానికి, “మనము ‘ఎల్లప్పుడు ఆయన ఆత్మను [మనతో] కలిగియుండునట్లు’ (సి&ని 20:77) అనే ప్రశస్థమైన వాగ్దానము కొరకు అర్హులు కావడానికి ప్రతీవారము మనము సంస్కారములో పాలుపొందాలి (సి&ని 59:9 చూడండి)” అని అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ మనకు గుర్తుచేసారు.13

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈమధ్య దయతో సలహా ఇచ్చారు:

“[మీ సాక్ష్యానికి] సత్యమును ఆహారమివ్వండి. …

“… ప్రాచీన మరియు ఆధునిక ప్రవక్తల మాటలతో మిమ్మల్ని మీరు పోషించుకోండి. ఆయనను సరిగ్గా ఎలా వినాలో మీకు బోధించమని ప్రభువును అడగండి. దేవాలయములో మరియు కుటుంబ చరిత్ర కార్యములో ఎక్కువ సమయాన్ని గడపండి.

“… మీ సాక్ష్యమును మీ అత్యున్నత ప్రాధాన్యతగా చేసుకోండి.”14

ముగింపు

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, సాక్ష్యమంటే ఏమిటో మీరు ఎక్కువ సంపూర్ణంగా గ్రహించి, దానిని పంచుకున్నప్పుడు, ఆ అత్యంత విలువైన ఆస్తియైన మీ సాక్ష్యమును పోషించుటను, నిలుపుకొనుటను సాధ్యపరుస్తూ, మీరు అనిశ్చితి మరియు భయము యొక్క ఆటంకాలను జయిస్తారని నేను వాగ్దానమిస్తున్నాను.

వారి సాక్ష్యములను ధైర్యముగా పంచుకొన్న ప్రాచీన మరియు ఆధునిక దిన ప్రవక్తల యొక్క లెక్కలేనన్ని మాదిరులను కలిగియుండడానికి మనము దీవించబడ్డాము.

క్రీస్తు యొక్క మరణము తరువాత, పేతురు నిలబడి ఇలా సాక్ష్యమిచ్చాడు:

“మీరందరు తెలిసికొనవలసినదేమనగా … మీరు సిలువ వేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే, … ఈ మనుష్యుడు మీ యెదుట నిలుచుచున్నాడు. …

“ … ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.”15

విశ్వాసముపై ఆల్మా ప్రసంగము తరువాత, అమ్యులెక్ శక్తివంతంగా చెప్పాడు: “ఈ సంగతులు సత్యమని నాకై నేను మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదిగో, క్రీస్తు నరుల సంతానము మధ్యకు వచ్చునని, … మరియు లోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయునని నేనెరుగుదునని నేను మీతో చెప్పుచున్నాను; ఏలయనగా ప్రభువైన దేవుడు దానిని పలికియున్నాడు.”16

పునరుత్థానుడైన రక్షకుని యొక్క మహిమకరమైన దర్శనమును ప్రత్యక్షంగా చూచిన తరువాత, జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్‌లు ఇలా సాక్ష్యమిచ్చారు:

“ఇప్పుడు, ఆయనను గూర్చి ఇవ్వబడిన అనేక సాక్ష్యముల తరువాత ఆయనను గూర్చి ఇచ్చు సాక్ష్యములన్నిటిలో ఇది చివరిది: అదేమనగా ఆయన సజీవుడు!

“ఏలయనగా దేవుని కుడిచేతి వైపున ఆయనను మేము చూచితిమి; ఆయన తండ్రి యొక్క అద్వితీయుడని ఒక స్వరము సాక్ష్యము చెప్పుటను వింటిమి.”17

సహోదర సహోదరీలారా, మాటలో మరియు క్రియలో మీ సాక్ష్యమును పంచుకొనే అవకాశాలను వెదకమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దక్షిణ అమెరికాలో రాజధాని నగర మేయరుతో, ఆయన కార్యనిర్వాహక శాఖ అగ్రనాయకులతో ఆయన కార్యాలయంలో జరిగిన ఒక సమావేశం ముగింపులో అలాంటి అవకాశము ఇటీవల నాకు కలిగింది. మేము సహృదయ భావాలతో ముగించినప్పుడు, నేను సంకోచంగా నా సాక్ష్యాన్ని పంచుకోవాలనుకున్నాను. ప్రేరేపణను అనుసరించి నేను యేసు క్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడని, లోక రక్షకుడని సాక్ష్యమిచ్చాను. ఆ క్షణములో ప్రతీది మారిపోయింది. గదిలోని ఆత్మ తిరస్కరించలేనిది. ప్రతీఒక్కరు ప్రభావితం చేయబడినట్లు కనబడింది. “ఆదరణ కర్త … తండ్రిని గూర్చి మరియు కుమారుని గూర్చి సాక్ష్యమిచ్చును.”18 నా సాక్ష్యమును చెప్పే ధైర్యాన్ని సమకూర్చుకున్నందుకు నేను చాలా కృతజ్ఞత కలిగియున్నాను.

అలాంటి క్షణము వచ్చినప్పుడు, సందేహించకుండా దానిని తీసుకోండి మరియు దానిని హత్తుకోండి. మీరు అలా చేసినప్పుడు మీ లోపల ఆదరణకర్త యొక్క అప్యాయతను మీరు అనుభవిస్తారు.

దేవుడు మన పరలోక తండ్రి అని, యేసు క్రీస్తు జీవిస్తున్నారని, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము ఈరోజు భూమిమీద దేవుని యొక్క సంఘమని, మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చేత నడిపించబడుతుందని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు