సర్వసభ్య సమావేశము
మీరు ఇంకా సమ్మతిస్తున్నారా?
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


మీరు ఇంకా సమ్మతిస్తున్నారా?

యేసు క్రీస్తును అనుసరించడానికి మన సమ్మతి, మనం పరిశుద్ధ స్థలములలో ఎంత సమయం ఉండడానికి ఒడంబడిక చేస్తామనే దానికి సరైన నిష్పత్తిలో ఉంటుంది.

అనేక వారములు స్టేకు సమావేశ నియామకాల తరువాత, ఒక ఆదివారము సంస్కారమును తీసుకోవడానికి నేను సిద్ధపడుతుండగా, ఒక ఆసక్తికరమైన మరియు శక్తివంతమైన ఆలోచన నా మనస్సులోనికి వచ్చింది.

యాజకుడు రొట్టెపై దీవెన ఇచ్చినప్పుడు, నేను ఇంతకుముందు అనేకసార్లు విన్న మాటలు నా మనస్సు మరియు హృదయముపై బలమైన ప్రభావము చూపాయి. “ఓ దేవా, నిత్యుడవగు తండ్రీ, వారు మీ కుమారుని నామమును తమపై తీసుకొనుటకు, ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు, ఆయన వారికిచ్చిన ఆయన ఆజ్ఞలను పాటించుటకు సమ్మతించుచున్నామని మీకు సాక్ష్యమిచ్చెదరు గాక, తద్వారా వారు ఎల్లప్పుడు ఆయన ఆత్మను వారితో కలిగియుండెదరు గాక.”1 మనము సమ్మతిస్తున్నామని ఎన్నిసార్లు మనము దేవునికి సాక్ష్యమిచ్చాము?

ఆ పవిత్రమైన మాటల ప్రాముఖ్యతను నేను ధ్యానించినప్పుడు, సమ్మతించుట అనే మాట ఇదివరకెన్నడూ లేనంతగా నన్ను ఆకట్టుకున్నది. రక్షకుని యొక్క ప్రాయశ్చిత్త త్యాగము మరియు నా కుటుంబము కొరకు, నా కొరకు తండ్రి యొక్క విమోచన ప్రణాళికలో ఆయన కీలకమైన పాత్ర పట్ల ప్రేమతో, కృతజ్ఞతతో మధురమైన మరియు పవిత్రమైన అనుభవాలు నా మనస్సును, హృదయమును నింపాయి. తరువాత నీటిపై ప్రార్థన యొక్క తీక్షణమైన మాటలను విని, నేను వాటిని అనుభూతి చెందాను: “వారు ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకొందురని మీకు సాక్ష్యమిచ్చెదరు గాక.”2 నా నిబంధనలను పాటించడమనేది మంచి ఉద్దేశ్యాలను మించి ఉండాలని ఆ క్షణమందు నేను స్పష్టంగా గ్రహించాను.

సంస్కారములో పాలుపొందుట అనేది కేవలము మన సమ్మతిని సూచించే మతపరమైన నిష్క్రియాత్మక ఆచారము కాదు. అది క్రీస్తు యొక్క అంతములేని ప్రాయశ్చిత్తము యొక్క వాస్తవికతకు మరియు ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొని, ఆయన ఆజ్ఞలను పాటించాల్సిన అవసరతకు శక్తివంతమైన జ్ఞాపకార్థము. రక్షకునిపై దృష్టిసారించుటకు సమ్మతించుట చాలా కీలకమైనది, అది సంఘములో ఎక్కువగా ఉదహరించబడిన రెండు లేఖనాల యొక్క ప్రధాన సందేశము: సంస్కార ప్రార్థనలు. ఆయన అద్వితీయ కుమారుని ద్వారా పరలోక తండ్రి మనలో ప్రతీఒక్కరికి చాలా సమ్మతిగా ఇచ్చే దాని యధార్థతను గ్రహించుట తిరిగి వెళ్ళడానికి ఆయన మనల్ని అడిగిన దానిని చేయడానికి మనం గొప్ప ప్రయత్నాలు చేసేలా చేయాలి.

మన స్వంత ఆత్మీయ పునాది యేసు క్రీస్తుపై దృఢంగా నిర్మించబడిందా?

మన ఆత్మీయ పునాది బలహీనమైనది లేదా లోతులేనిది అయితే, మన సమ్మతిని ఒక సామాజిక లాభసాటి విశ్లేషణపై లేదా వ్యక్తిగత అసౌకర్య సూచికపై ఆధారం చేసుకోవడానికి మనం మొగ్గు చూపవచ్చు. సంఘము ప్రధానంగా పాతవి లేదా రాజకీయంగా తప్పైన సామాజిక విధానాలు, అవాస్తవ వ్యక్తిగత పరిమితులు మరియు సమయ కట్టుబాట్లను కలిగి ఉన్నదనే కథనాన్ని మనము అంగీకరిస్తే, అప్పుడు సమ్మతి గురించి మన తీర్మానాలు లోపభూయిష్టంగా ఉంటాయి. సమ్మతి యొక్క సూత్రము సామాజిక మాధ్యమాన్ని ప్రభావితం చేసేవారితో లేదా TikTok ఔత్సాహికులతో సానుకూల ధోరణిని కలిగి ఉండాలని మనం ఆశించకూడదు. మనుష్యుల సూత్రములు దైవిక సత్యముతో అరుదుగా కలుస్తాయి.

దేవుడిని ప్రేమించి, ప్రభువైన యేసు క్రీస్తును అనుసరించడానికి సమ్మతిగల అపరిపూర్ణ వ్యక్తులు సమకూడే ప్రదేశమే సంఘము. యేసే క్రీస్తు, సజీవుడైన దేవుని కుమారుడు అనే వాస్తవమునందు ఆ సమ్మతి వృద్ధి చెందుతుంది. ఈ దైవిక సత్యము పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మాత్రమే తెలుసుకొనబడగలదు. కాబట్టి మన సమ్మతి, మనము పరిశుద్ధాత్మ ప్రభావము గల పరిశుద్ధ స్థలములలో ఎంత సమయం ఉండడానికి ఒడంబడిక చేస్తామనే దానికి సరైన నిష్పత్తిలో ఉంటుంది.

ప్రేమగల పరలోక తండ్రితో మన ఆలోచనలను చర్చిస్తూ అర్థవంతమైన సంభాషణలో ఎక్కువ సమయాన్ని గడపడం మరియు ఇతరుల అభిప్రాయాలను వెదకడంలో తక్కువ సమయాన్ని గడపడం మనకు ప్రయోజనకరమైనది. మన అనుదిన వార్తల మూలాధారమును పరిశుద్ధ లేఖనములలో ఉన్న క్రీస్తు మాటలకు మరియు ఆయన సజీవ ప్రవక్తల ప్రవచనాత్మక మాటలకు మార్చడానికి కూడా మనం ఎంపిక చేయవచ్చు.

మన సబ్బాతు దిన ఆచరణకు మనమిచ్చే ప్రాముఖ్యత, నిజాయితీగా దశమభాగమును చెల్లించుట, చలామణిలో ఉన్న దేవాలయ సిఫారసును కలిగియుండుట, దేవాలయమునకు హాజరగుట మరియు మన పవిత్రమైన దేవాలయ నిబంధనలను గౌరవించుట అన్నీ మన సమ్మతికి శక్తివంతమైన సూచనలు మరియు మన ఒడంబడికకు రుజువు. క్రీస్తునందు మన విశ్వాసమును బలోపేతం చేయడానికి పైపై ప్రయత్నం కంటే ఎక్కువ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా?

పరలోక తండ్రి మనల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నారు, కానీ ఆ ప్రేమ గొప్ప అంచనాలతో వస్తుంది. మన జీవితాలలో ఇష్టపూర్వకంగా రక్షకుడిని ప్రధానంగా ఉంచాలని ఆయన మనల్ని కోరుతున్నారు. అన్ని విషయాలందు తండ్రికి లోబడుటకు సమ్మతించిన రక్షకుడు మనకు పరిపూర్ణమైన మాదిరి. ఆయనే “మార్గమును, సత్యమును, జీవమును.”3 ఆయన మన పాపముల కొరకు ఇష్టపూర్వకంగా ప్రాయశ్చిత్తము చేసారు. ఆయన ఇష్టపూర్వకంగా మన భారములను తేలిక చేస్తారు, మన భయాలను శాంతింపజేస్తారు, మనకు బలమునిస్తారు, బాధమరియు వేదన సమయాలందు మన హృదయాలకు శాంతిని, అవగాహనను తెస్తారు.

అయినప్పటికీ యేసు క్రీస్తునందు విశ్వాసమనేది ఒక ఎంపిక. ఆయన మాటలందు “నమ్మవలెనను కోరిక కలిగియుండుట తప్ప మరేమియు [మనము] చేయలేనియెడల”4, మన విశ్వాస ప్రయాణమును మొదలుపెట్టడానికి లేదా తిరిగి మొదలుపెట్టడానికి మనం ఒక ప్రారంభ స్థానమును కలిగియున్నాము. ఆయన మాటలు, ఒక విత్తనమువలే మన హృదయాలలో నాటబడి, గొప్ప శ్రద్ధతో పోషించబడిన యెడల, అవి వేరుపారును మరియు మన విశ్వాసము అభయముగా ఎదిగి, క్రియాశీలత మరియు శక్తి యొక్క సూత్రము అవుతుంది. మోర్మన్ గ్రంథము మన విశ్వాసమును వృద్ధిచేయడానికి, క్రొత్తదిగా చేయడానికి మన అత్యంత శక్తివంతమైన ఆధారముగా ఉన్నది. దేవునికి లోబడుటకు మన సమ్మతి విశ్వాసమును వృద్ధి చేయడానికి మనకు సహాయపడుతుంది.

దైవిక రూపకల్పన ద్వారా మర్త్యత్వము సులభమైనది కాదు మరియు కొన్నిసార్లు క్షీణింపజేసేది కాగలదు. ఏమైనప్పటికీ, “[మనము] సంతోషము కలిగియుండునట్లు [మనము] ఉనికిలో ఉన్నాము”!5 రక్షకునిపై మరియు మన నిబంధనలపై దృష్టిసారించుట శాశ్వతమైన ఆనందాన్ని తెస్తుంది! మర్తత్యము యొక్క ఉద్దేశ్యము మన సమ్మతిని రుజువు చేయడం. “జీవితం యొక్క గొప్ప కార్యము [శిష్యత్వము యొక్క ఖరీదు] ప్రభువు యొక్క చిత్తమును తెలుసుకోవడం, తరువాత దానిని చేయడం.”6 నిజమైన శిష్యత్వము సంపూర్ణమైన ఆనందానికి దారితీస్తుంది. శిష్యత్వమునకు అవసరమైన దానిని చేయడానికి మనము సమ్మతిస్తున్నామా?

నిబంధన బాట సాధారణమైన పనుల జాబితా కాదు; అది ఆత్మీయ అభివృద్ధి యొక్క ప్రక్రియ మరియు ప్రభువైన యేసు క్రీస్తుపట్ల లోతైన నిబద్ధత. ప్రతీ ఆజ్ఞ, సూత్రము, నిబంధన మరియు విధి యొక్క ప్రధాన ఉద్దేశ్యము క్రీస్తునందు విశ్వాసమును, నమ్మకమును నిర్మించుట. కాబట్టి, క్రీస్తుపై మన జీవితాలను కేంద్రీకరించాలనే మన తీర్మానము ఏకరీతిగా ఉండాలి—షరతులతో కూడినది, పరిస్థితులకు తగినది లేదా లోతులేనిది కాదు. “అన్ని సమయములలో, అన్ని విషయములలో, అన్ని స్థలములలో దేవునికి సాక్షులుగా నిలబడుటకు”7 మన సమ్మతియందు మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి, అప్పుడప్పుడు కాదు. శిష్యత్వము చౌకగా లేదు, ఎందుకనగా పరిశుద్ధాత్మ యొక్క సహవాసము అమూల్యమైనది.

నిశ్చయంగా, ప్రభువు పదిమంది కన్యకల ఉపమానమును బోధించినప్పుడు ఆయన మన కాలము గురించి ఆలోచిస్తున్నారు. వారిలో ఐదుగురు బుద్ధిగలవారి గురించి ఆయన ఇలా చెప్పారు, వారు “పరిశుద్ధాత్మను వారి మార్గదర్శిగా చేసుకున్నారు మరియు మోసగించబడలేదు,”8 కానీ బుద్ధిలేని కన్యకల దివిటీలు నూనె లేకపోవడంతో “ఆరిపోయినవి.”9 బహుశా నీఫై మాటలు ఒకప్పుడు విశ్వాసులైన ఈ సంఘ సభ్యులను బాగా వర్ణిస్తాయి: “ఇతరులను అతడు శాంతపరచి, శరీర సంబంధమైన భద్రతాభావమునిచ్చును, దానిని బట్టి వారిట్లందురు: సీయోనులో అంతయు క్షేమమే.”10

శరీర సంబంధమైన భద్రత అనగా, క్రీస్తుకు బదులుగా లోక సంబంధమైన విషయాలను వెదకుట మరియు నమ్ముట—మరొక విధంగా, ఆత్మీయ దృష్టికోణమునకు బదులుగా లౌకిక సంబంధమైన దృష్టికోణముతో చూచుట. “విషయములను గూర్చి అవి వాస్తవముగా ఉన్నట్లు, వాస్తవముగా ఉండబోవునట్లు ”11 చూడడానికి పరిశుద్ధాత్మ మనకు సామర్థ్యాన్నిస్తాడు. కేవలము “పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు అన్ని సంగతుల యొక్క సత్యమును తెలుసుకొనగలరు”12. మరియు మోసగించబడరు. మనము గ్రుడ్డి వారమగుట వలన కాదు, కానీ మనము చూడగలము కనుక మన జీవితాలలో క్రీస్తును కేంద్రముగా చేస్తాము మరియు ఆయన ఆజ్ఞలకు విధేయులు కావడానికి మన సమ్మతిని ప్రతిజ్ఞ చేస్తాము.13

బుద్ధిలేని కన్యకల సంగతేమిటి? వారు ఆత్మీయ నూనె పాత్రను మోయడానికి ఎందుకు సమ్మతిగా లేరు? వారు కేవలం వాయిదా వేసారా? బహుశా వారు తేలికగా తీసుకున్నారు, ఎందుకంటే అది అసౌకర్యంగా ఉంది లేదా అనవసరమైనదిగా కనబడింది. కారణము ఏదైనప్పటికీ, వారు క్రీస్తు యొక్క కీలకమైన పాత్ర గురించి మోసగించబడ్డారు. ఇది సాతాను యొక్క ప్రధాన మోసంగా ఉన్నది మరియు చివరికి ఆత్మీయ నూనె కొరత కారణంగా వారి సాక్ష్యపు దివిటీలు ఎందుకు ఆరిపోయాయి. ఈ ఉపమానము మన కాలము కొరకు ఒక నీతికథ. అనేకమంది ఆయన సంఘమును విడిచిపెట్టకముందు రక్షకుడిని మరియు వారి నిబంధనలను విడిచిపెడతారు.

ప్రాచీన ప్రవక్తల చేత దీర్ఘకాలం ముందే చెప్పబడిన అపూర్వమైన కాలంలో మనం జీవిస్తున్నాము, సాతాను “నరుల సంతానము యొక్క హృదయములలో విజృంభించి, మంచిదానికి వ్యతిరేకముగా వారిని కోపమునకు పురిగొల్పు”14 దినమది. మనలో చాలామంది దైవిక గుర్తింపుకు మరియు క్రీస్తుపై విశ్వాసానికి విరుద్ధమైన వినోదంతో, సందేశాలతో నిండిన ఊహాజనిత ప్రపంచంలో నివసిస్తున్నాము.

ఒక బిడ్డ యొక్క జీవితంలో అత్యంత శక్తివంతమైన ఆత్మీయ ప్రభావము ఏదనగా, వారి స్వంత పవిత్ర నిబంధనలను విశ్వాసంగా పాటించే ప్రేమగల తల్లిదండ్రులు మరియు తాత, మామ్మల నీతిగల మాదిరి. ఉద్దేశపూర్వకమైన తల్లిదండ్రులు వారి పిల్లలకు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసమును బోధిస్తారు, ఆవిధంగా వారు కూడా “వారి పాప పరిహారము కొరకు ఏ మూలాధారము వైపు చూడవలెనో తెలుసుకుంటారు.” 15 క్రమబద్ధం కాని మరియు ఏకరీతిగా లేని విధంగా నిబంధనలను పాటించడం ఆధ్యాత్మిక ప్రమాదానికి దారితీస్తుంది. ఆధ్యాత్మిక నష్టము తరచుగా మన పిల్లలు మరియు మనుమలపై అత్యధికంగా ఉంటుంది. తల్లిదండ్రులు మరియు తాత మామ్మలారా, మనము ఇంకా సమ్మతిగా ఉన్నామా?

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు, “రాబోయే దినములలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, మార్గనిర్దేశము, ఆదరణ మరియు నిరంతర ప్రభావము లేకుండా ఆత్మీయ మనుగడ అసాధ్యము.”16 మన దివిటీలను సిద్ధపరచడానికి, మన ఆత్మీయ నూనె నిల్వలను వృద్ధి చేయడానికి ఇది స్పష్టమైన మరియు నిర్దిష్టమైన హెచ్చరిక. జీవిస్తున్న ప్రవక్తలను అనుసరించడానికి మనము ఇంకా సమ్మతి కలిగి ఉన్నామా? మీ దివిటీలోని ఆత్మీయ నూనె యొక్క స్థాయి ఏమిటి? మీ వ్యక్తిగత జీవితంలో ఏ మార్పులు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావమును నిరంతరం కలిగియుండడాన్ని మీకు సాధ్యపరుస్తాయి?

యేసు కాలములో వలే, నేడు శిష్యత్వము యొక్క ఖరీదును అంగీకరించడానికి సుముఖంగా లేకుండా, క్రీస్తును అనుసరించడం మానేసిన వారున్నారు. రక్షకుని యొక్క సంఘమువైపు మరియు ఆయనను అనుసరించే వారి వైపు కఠినమైన, ద్వేషపూరితమైన విమర్శ అధికస్థాయిలో పెరుగుతుండగా, యేసు క్రీస్తును అనుసరించడానికి ఒకరి తీర్మానమును బలపరచుట మరియు వాటిని లక్ష్యపెట్టకుండుటకు గొప్ప సమ్మతి మన శిష్యత్వమునకు అవసరము.17

మన ఆత్మీయ పునాది యేసు క్రీస్తుపై దృఢంగా నిర్మించబడితే, మనము విఫలము కాము మరియు మనము భయపడనవసరము లేదు.

“ఇదిగో హృదయమును, సిద్ధమైన మనస్సును ప్రభువు కోరును; సమ్మతించువారును, విధేయులును ఈ అంత్యదినములలో భూమి యొక్క సారమును తిందురు.”18

మనము ఎల్లప్పుడు సమ్మతి కలిగియుందుము గాక. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.

ముద్రించు