సర్వసభ్య సమావేశము
సత్యమును ప్రకటించడానికి ధైర్యము
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


సత్యమును ప్రకటించడానికి ధైర్యము

ఒకసారి మనము సత్యమును నేర్చుకుంటే, ఈరోజు ప్రభువు ఇక్కడ ఉంటే ఆయన ఏమి చేస్తారో, అదే చేసే అవకాశాన్ని ఆయన మనకిస్తారు.

1982లో, నేను ఒక సాంకేతిక పాఠశాలలో స్థల వర్ణనలో నా అసోసియేట్ డిగ్రీని పూర్తి చేస్తున్నాను.

సంవత్సరం ముగింపులో, ఒక తోటి విద్యార్థి మాట్లాడాలని పిలిచాడు. తరగతిలో మిగిలినవారిని విడిచిపెట్టి, మేము క్రీడా స్థలము ప్రక్కన ప్రదేశానికి వెళ్ళడం నాకు గుర్తుంది. మేము అక్కడకు వెళ్ళినప్పుడు, అతడు తన మత నమ్మకాలను గూర్చి నాతో చెప్పాడు మరియు అతడు ఒక గ్రంథాన్ని నాకు చూపించడమే కాకుండా, ఆ గ్రంథాన్ని నాకిచ్చాడు. నిజాయితీగా చెప్పాలంటే, అతడు చెప్పిన మాటలన్నీ నాకు గుర్తులేవు, కానీ ఆ క్షణము మరియు “ఈ గ్రంథము సత్యమని, యేసు క్రీస్తు యొక్క సువార్త పునఃస్థాపించబడిందని నా సాక్ష్యమును చెప్పాలని నేను కోరుతున్నాను,” అని అతడు చెప్పినప్పుడు నేను అనుభూతి చెందినది నాకు చాలా బాగా గుర్తుంది.

మా సంభాషణ తరువాత నేను ఇంటికి వెళ్ళాను, గ్రంథములో కొన్ని పేజీలను తిప్పాను మరియు దానిని ఒక గూటిలో పెట్టాను. మేము సంవత్సరం ముగింపులో ఉన్నాము మరియు అది నా స్థల వర్ణన పట్టభద్రతకు చివరి సంవత్సరం కనుక, ఆ గ్రంథముపట్ల లేదా దానిని నాతో పంచుకొన్న నా తోటి విద్యార్థి పట్ల నిజంగా నేను ఆసక్తి చూపించలేదు. గ్రంథము యొక్క పేరును మీరు ఇప్పటికే ఊహించగలరు. అవును, అది మోర్మన్ గ్రంథము.

ఐదు నెలల తరువాత, సువార్తికులు మా ఇంటికి వచ్చారు; నేను పని నుండి ఇంటికి వస్తుండగా, అప్పుడే వారు వెళుతున్నారు. నేను వారిని తిరిగి ఆహ్వానించాను. మా యింటి ముందున్న చిన్న డాబాలో మేము కూర్చున్నాము మరియు వారు నాకు బోధించారు.

సత్యము కొరకు నా అన్వేషణలో, ఏ సంఘము సత్యమని, నేను దానిని ఎలా కనుగొనగలనని వారిని అడిగాను. ఆ జవాబును నాకై నేను పొందగలనని సువార్తికులు నాకు బోధించారు. గొప్ప ఆశ మరియు కోరికతో, మోర్మన్ గ్రంథములో అనేక అధ్యాయాలు చదవడానికి వారి సవాలును నేను అంగీకరించాను. యథార్థ హృదయముతో, మనఃపూర్వకంగా నేను ప్రార్థించాను (మొరోనై 10:4–5 చూడండి). నా ప్రశ్నకు జవాబు స్పష్టమైనది మరియు చాలారోజుల తరువాత—మరింత ఖచ్చితంగా 1983, మే 1న—నేను బాప్తిస్మము పొందాను మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యుడిగా నిర్ధారించబడ్డాను.

సంభవించిన సంఘటనల క్రమము గురించి ఈరోజు నేను ఆలోచించినప్పుడు, పునఃస్థాపించబడిన సత్యము గురించి తన సాక్ష్యమును పంచుకోవడంలో మరియు యేసు క్రీస్తు సువార్త యొక్క ప్రత్యక్ష సాక్ష్యమైన మోర్మన్ గ్రంథమును నాకు ఇవ్వడంలో నా తోటి విద్యార్థి ధైర్యము ఎంత ముఖ్యమైనదో నేను స్పష్టంగా చూసాను. ఆ సాధరణమైన చర్య నాకు అత్యంత ప్రాముఖ్యత కలిగియున్నది, నేను వారిని కలిసినప్పుడు నాకు, సువార్తికులకు మధ్య సంబంధాన్ని ఏర్పరిచింది.

నాకు సత్యము సమర్పించబడింది మరియు నా బాప్తిస్మము తరువాత, నేను యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా మారాను. తరువాతి సంవత్సరాలలో మరియు నాయకులు, బోధకులు, స్నేహితులు వంటి ప్రత్యేకమైన జనుల సహాయంతో మరియు నా స్వంత వ్యక్తిగత అధ్యయనం ద్వారా కూడా, యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా ఉండడానికి నేను నిర్ణయించుకున్నప్పుడు సత్యమును కాపాడే పని మాత్రమే కాదు, దానిని ప్రకటించే పనిని కూడా నేను అంగీకరించానని నేర్చుకున్నాను.

సత్యమును నమ్మడానికి, దానిని అనుసరించడానికి మనము అంగీకరించినప్పుడు మరియు యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులుగా మారడానికి మనం ప్రయత్నించినప్పుడు, మనము తప్పులు చేయము, సత్యము నుండి దూరము కావాలని శోధింపబడము, మనము విమర్శించబడము లేదా మనము బాధలు అనుభవించము అనే హామీ గల ధృవపత్రాన్ని మనం పొందము. కానీ మనము పరలోక తండ్రి యొక్క సన్నిధికి మనల్ని తిరిగి తీసుకొని వెళ్ళగల తిన్నని ఇరుకైన మార్గములో ప్రవేశించినప్పుడు, ఈ సమస్యలను తప్పించుకోవడానికి ఎల్లప్పుడూ ఒక మార్గముంటుందని సత్యము యొక్క జ్ఞానము బోధిస్తుంది (1 కొరింథీయులకు 10:13 చూడండి); మన విశ్వాసమును సందేహించకముందు మన సందేహాలను అనుమానించే సాధ్యత ఎల్లప్పుడూ ఉంటుంది (see Dieter F. Uchtdorf, “Come, Join with Us,” Liahona, Nov. 2013, 21); మరియు చివరిగా, బాధల గుండా మనము ఒంటరిగా ఎన్నటికి వెళ్ళమనే హామీ మనకుంటుంది, ఏలయనగా దేవుడు తన జనులను వారి శ్రమలందు దర్శిస్తాడు (మోషైయ 24:14 చూడండి).

ఒకసారి మనము సత్యమును నేర్చుకుంటే, ఈరోజు ప్రభువు ఇక్కడ ఉంటే ఆయన ఏమి చేస్తారో, అదే చేసే అవకాశాన్ని ఆయన మనకిస్తారు. నిజంగా, ఆయన మనము తప్పక చేయాల్సిన దానిని తన బోధనల ద్వారా మనకు చూపించారు: “ఇద్దరిద్దరు చొప్పున మీ స్వరములను బూరధ్వని వలే ఎలుగెత్తుచూ నా నామమున నా సువార్తను, దేవదూతల వలే నా వాక్యమును ప్రకటించుచూ నా ఆత్మ శక్తితో మీరు ముందుకు సాగవలెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:6). మన యౌవనములో సువార్త సేవ కొరకు గల అవకాశము ప్రత్యేకమైనది!

యువకులారా, సువార్తికులుగా ప్రభువుకు సేవ చేయడానికి మీ సిద్ధపాటును దయచేసి వాయిదా వేయకండి. సువార్త సేవ చేయాలనే నిర్ణయాన్ని కష్టతరం చేసే పరిస్థితులు—కొంతకాలం మీ చదువులను ఆపివేయడం, మీ ప్రియురాలితో మరలా ఎప్పటికైనా కలుస్తారనే హమీ లేకుండా ఆమెకు వీడ్కోలు చెప్పడం లేదా ఉద్యోగాన్ని వదిలివేయడం వంటివాటిని—మీరు ఎదుర్కొన్నప్పుడు,రక్షకుని మాదిరిని గుర్తుంచుకోండి. ఆయన పరిచర్య సమయములో, ఆయన అదేవిధంగా విమర్శ, హింస మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము యొక్క చేదు పాత్రతో సహా కష్టమును ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ అన్ని పరిస్థితులందు ఆయన తన తండ్రి చిత్తమును చేయడానికి మరియు ఆయనకు మహిమను ఇవ్వడానికి కోరాడు. (యోహాను 5:30; 6:38–39; 3 నీఫై 11:11; సిద్ధాంతము మరియు నిబంధనలు 19:18–19 చూడండి.)

యువతులారా, మీరు ప్రభువు యొక్క ద్రాక్షతోటలో పని చేయడానికి కోరిన యెడల, మీరు స్వాగతించబడుతున్నారు మరియు పూర్తి-కాల సువార్తికులుగా సేవ చేయడానికి మీరు సిద్ధపడినప్పుడు, మీరు అటువంటి సవాళ్ళ నుండి మినహాయించబడరు.

ఆయనకు సేవ చేయాలని నిర్ణయించే వారందరికి, మీకు ఇంట్లో గడిచినట్లుగానే, మిషను రంగంలో 24 లేదా 18 నెలల సేవ గడిచిపోతుంది, కానీ మిషను రంగంలో ఈ సంఘపు యోగ్యులైన యువతీ యువకుల కొరకు ఎదురుచూసే అవకాశాలు ప్రత్యేకమైనవని నేను మీకు వాగ్దానమిస్తున్నాను. రక్షకుడైన యేసు క్రీస్తుకు మరియు ఆయన సంఘమునకు ప్రాతినిధ్యం వహించే విశేషావకాశము నిర్లక్ష్యము చేయబడజాలదు. లెక్కలేనన్ని ప్రార్థనలలో పాల్గొనుట, మీ సాక్ష్యమును వృద్ధి చేసి రోజులో అనేకసార్లు పంచుకొనుట, అనేక గడియల లేఖన అధ్యయనము, మీరు ఇంట్లో ఉంటే ఎప్పటికీ కలవని వ్యక్తులను కలుసుకొనుట వంటివి అనిర్వచనీయమైన అనుభవాలు. సేవా మిషన్లలో సేవ చేయడానికి ప్రభువు పిలిచిన యువత కొరకు అదే స్థాయి అనుభవము దాచబడింది. మీరు చాలా స్వాగతించబడుతున్నారు మరియు అవసరమైనవారు. సేవా మిషను యొక్క ప్రాముఖ్యతను దయచేసి తగ్గించకండి, సేవా మిషన్లు కూడా వర్ణించ సాధ్యముకాని అనుభవాలను అందిస్తాయి. మీ ఆత్మ యొక్క విలువతో కలిపి, “దేవుని దృష్టిలో ఆత్మల విలువ గొప్పది” (సిద్ధాంతము మరియు నిబందనలు 18:10).

మీ సేవ నుండి తిరిగి వచ్చిన తరువాత, బహుశా మీ ప్రియురాలు లేదా ప్రియుడు మీకోసం ఎదురుచూస్తూ ఉండకపోవచ్చు, కానీ సమర్థవంతమైన పరిచయాలను ఎలా చేసుకోవాలో మీరు బాగా నేర్చుకొనియుంటారు. మీ విద్యాసంబంధమైన అధ్యయనాలు మీ ఉద్యోగంలో పని చేయడానికి తగినట్లుగా సిద్ధపడుట గురించి మీరు కలిగి ఉన్న సంగ్రహావలోకనంతో మరింత అర్థవంతం చేయబడతాయి మరియు చివరకు, మీరు శాంతి సువార్తను ధైర్యంగా ప్రకటించి, పునఃస్థాపించబడిన సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చారనే పూర్తి నిశ్చయతను మీరు కలిగియుంటారు.

మీలో వివాహమైన వారికి, మీ జీవితంలోని వివిధ దశలలో ఉన్నవారికి, ప్రభువు యొక్క పనిలో మీరు చాలా అవసరము. మిమ్మల్నిమీరు సిద్ధం చేసుకోండి. ఆరోగ్యకరమైన జీవితాలను జీవించండి, భౌతికమైన, ఆత్మీయమైన స్వావలంబన కొరకు వెదకండి, ఎందుకనగా ప్రభువు తన పిల్లల కొరకు చేసే దానిని చేయడానికి అవకాశాలు ఒక వయస్సు వారికి పరిమితమైనవి కాదు. ఈ మధ్య కాలంలో నాకు, నా భార్యకు కలిగిన మిక్కిలి సంతోషకరమైన అనుభవాలు, ప్రత్యేక దంపతుల ప్రక్కన, ప్రత్యేక స్థలాలలో మరియు చాలా ప్రత్యేకమైన జనులకు సేవ చేస్తుండగా కలిగాయి.

నా స్థల వర్ణన డిగ్రీ ముగింపులో నాకు కలిగిన అనుభవము, మనము సత్యమును ప్రకటించినప్పుడు దానిని ఎల్లప్పుడు కాపాడుతున్నామని మరియు సత్యమును కాపాడుట క్రియాశీలక విషయమని నాకు బోధించింది. సత్యమును కాపాడుట ఎన్నడూ దూకుడు విధానములో చేయబడరాదు, దానికి బదులుగా సత్యము గురించి మనము సాక్ష్యమిచ్చే జనులను ప్రేమించడానికి, వారితో పంచుకోవడానికి, వారిని ఆహ్వానించడానికి ప్రత్యేక ఆసక్తితో, ప్రేమగల పరలోక తండ్రి పిల్లల యొక్క భౌతిక మరియు ఆత్మీయ శ్రేయస్సు గురించి మాత్రమే ఆలోచించుట ద్వారా అది చేయబడాలి (మోషైయ 2:41 చూడండి).

కొందరి సందేహాలకు విరుద్ధంగా నిజంగా తప్పు మరియు ఒప్పు అనేది ఉందని, 2021 అక్టోబరు సర్వసభ్య సమావేశములో మన ప్రియమైన ప్రవక్తయైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు. నిజంగా శుద్ధమైన సత్యం—నిత్య సత్యం అనేది ఉంది. “శుద్ధమైన సత్యం, శుద్ధమైన సిద్ధాంతం మరియు శుద్ధమైన బయల్పాటు,” లియహోనా, నవ. 2021, 6 చూడండి.)

“సత్యమనగా, ప్రస్తుతము ఉన్నవిధముగా, గతములో ఉన్నవిధముగా, భవిష్యత్తులో ఉండబోవు విధముగా ఉన్న సంగతుల యొక్క జ్ఞానము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 93:24) అని పరిశుద్ధ లేఖనాలు మనకు బోధిస్తున్నాయి.

సత్యము యొక్క జ్ఞానము మనల్ని ఇతరుల కంటే గొప్ప వారిగా చేయదు, కానీ మనము దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళడానికి తప్పక చేయాల్సిన దానిని అది మనకు బోధిస్తుంది.

క్రీస్తునందు స్థిరముగా మరియు సత్యమును ప్రకటించుట మాత్రమే కాకుండా సత్యమును జీవించుటకు ధైర్యముగా మీరు ముందుకు సాగినప్పుడు , ఈ రోజులలో మీరు ఎదుర్కొనే అల్లకల్లోల సమయమందు ఓదార్పును, సమాధానమును మీరు కనుగొంటారు.

జీవితపు సవాళ్ళు మనల్ని పడగొట్టవచ్చు, కానీ మనము యేసు క్రీస్తునందు విశ్వాసమును సాధన చేసినప్పుడు, నిత్యత్వము యొక్క గొప్ప పరిధిలో “[మన] కష్టములు కొంతకాలమే ఉండును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:7 చూడండి). దయచేసి మీ కష్టాలు మరియు సవాళ్ళు ముగిసే చివరి దినాన్ని నిర్ణయించకండి. పరలోక తండ్రియందు విశ్వసించండి మరియు ఎన్నడూ నిరాశ చెందవద్దు, ఏలయనగా మనము నిరాశ చెందిన యెడల, దేవుని రాజ్యములో మన ప్రయాణపు ముగింపు ఎలా ఉంటుందో మనకు ఎప్పటికీ తెలియదు.

సత్యము యొక్క మూలాధారముల నుండి నేర్చుకొంటూ, సత్యమును విశ్వసించండి:

యేసు క్రీస్తును గూర్చి మరియు ఇది ఆయన సంఘమని నేను నా సాక్ష్యమిస్తున్నాను. మనము జీవిస్తున్న ప్రవక్తను కలిగియున్నాము మరియు ధైర్యముతో మనము సత్యమును ప్రకటించినప్పుడు మనము ఎల్లప్పుడు స్వతంత్రులుగా భావిస్తాము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు