చెందియుండడం యొక్క సిద్ధాంతం
మనలో ప్రతీఒక్కరి కొరకు చెందియుండడం యొక్క సిద్ధాంతం దీనికి వస్తుంది: సువార్త నిబంధనలో నేను క్రీస్తుతో ఏకమైయున్నాను.
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో చెందియుండడం యొక్క సిద్ధాంతం అని నేను పిలిచే దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సిద్ధాంతం మూడు భాగాలను కలిగియుంది: (1) ప్రభువు యొక్క నిబంధన జనులను సమకూర్చడంలో చెందియుండడం యొక్క పాత్ర, (2) చెందియుండడంలో సేవ మరియు త్యాగము యొక్క ప్రాముఖ్యత మరియు (3) చెందియుండడంలో యేసు క్రీస్తు యొక్క ప్రాముఖ్యత.
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రారంభదశలో ఎక్కువమంది తెల్ల ఉత్తర అమెరికా మరియు ఉత్తర యూరోపియన్ పరిశుద్ధులు, కొద్దిమంది స్థానిక అమెరికన్లు, ఆఫ్రికన్ అమెరికన్లు, పసిఫిక్ ద్వీపవాసులు ఉండేవారు. ఇప్పుడు, అది స్థాపించబడి 200వ వార్షికోత్సవానికి ఎనిమిదేళ్ళ దూరంలో ఉండగా, సంఖ్యాపరంగా మరియు భిన్నత్వంలో ఉత్తర అమెరికాలో బాగా, మరియు మిగతా ప్రపంచంలో ఇంకా ఎక్కువగా సంఘము వృద్ధిచెందింది.
దీర్ఘకాలంగా ప్రవచించినట్లు ప్రభువు యొక్క నిబంధన జనుల కడవరి దిన సమకూర్పు వేగం పుంజుకుంటుండగా, సంఘము నిజంగా ప్రతీ దేశం నుండి సభ్యులు, వంశములు, భాషలు, జనులను కలిగియుంది.1 ఇది లెక్కించిన లేదా బలవంతపెట్టబడిన భిన్నత్వము కాదు, కానీ సంఘ నిర్మాణము ప్రతీ జనము మరియు ప్రతీ ప్రజల నుండి సమకూరుస్తుందని గుర్తిస్తూ, మనం ఆశించినట్లు సహజంగా సంభవించే దృగ్విషయం.
ఏకకాలంలో ప్రతీ ఖండంపై మరియు మన స్వంత ఇరుగుపొరుగు ప్రాంతాలలో సీయోను స్థాపించబడే రోజును చూడడానికి మనం ఎంతో దీవించబడ్డాము. ప్రవక్త జోసెఫ్ స్మిత్ చెప్పినట్లుగా, ఈరోజు కోసం ప్రతీ తరంలోని దేవుని జనులు సంతోషకరమైన నిరీక్షణతో ఎదురుచూసారు మరియు “కడవరి దిన వైభవాన్ని తీసుకురావడానికి దేవుడు ఎంచుకున్న మనం అనుగ్రహం పొందిన జనులము.”2
ఈ విశేషాధికారం ఇవ్వబడిన మనం, క్రీస్తు యొక్క కడవరి దిన సంఘంలో ఎటువంటి జాత్యహంకారం, గిరిజన పక్షపాతం, లేదా ఇతర విభజనలు ఉండేందుకు అనుమతించలేము. “ఒకటిగా ఉండండి; మీరు ఒకటిగానుండని యెడల మీరు నా వారు కారు” అని ప్రభువు మనల్ని ఆజ్ఞాపించారు.3 పక్షపాతాన్ని, వివక్షను సంఘం నుండి, మన ఇళ్ళ నుండి, అన్నిటిని మించి మన హృదయాల నుండి బయటకు పెకిలించడానికి మనం శ్రద్ధగా పనిచేయాలి. మన సంఘ జనాభా మరింత విభిన్నంగా పెరుగుతున్నప్పుడు, మనం మరింత ఆకస్మికంగా మరియు సాదరంగా స్వాగతించాలి. మనకు ఒకరికొకరం కావాలి.4
సంఘములోనికి బాప్తిస్మము పొందిన వారందరు క్రీస్తు యొక్క శరీరమందు ఏకమైయున్నారని కొరింథీయులకు అతడు వ్రాసిన మొదటి పత్రికలో పౌలు ప్రకటించాడు:
“ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరము యొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.
“ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు; మరియు మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు. …
“… అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదాని నొకటి యేకముగా పరామర్శించవలెను.
“కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతోషించును.”5
చెందియుండడమనే భావన మన భౌతిక, మానసిక, ఆత్మీయ ఆరోగ్యానికి ముఖ్యమైనది. అయినప్పటికినీ కొన్నిసార్లు మనలో ప్రతీఒక్కరం తగియుండమని భావించవచ్చు. నిరాశపరిచే క్షణాలలో, మనం ఎన్నటికీ ప్రభువు యొక్క ఉన్నత ప్రమాణాలను లేదా ఇతరుల అంచనాలను చేరుకోలేమని మనం భావించవచ్చు.6 ప్రభువు యొక్క అంచనాలు కాని వాటిని ఇతరులపైన—లేదా మనపైన మనం—తెలియకుండానే విధించవచ్చు. ఆత్మ యొక్క విలువ నిర్దిష్టమైన విజయాలు లేదా పిలుపుల మీద ఆధారపడియుందని కుటిలమైన మార్గాల్లో మనం తెలియజేయవచ్చు, కానీ ప్రభువు దృష్టిలో మన విలువకు అవి కొలమానం కాదు. “యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.”7 ఆయన మన కోరికలను, ఆకాంక్షలను మరియు మనం ఏమి అవుతున్నామనే దానిని లక్ష్యపెడతారు.8
గత సంవత్సరాల తన స్వీయానుభవం గురించి సహోదరి జోడి కింగ్ ఇలా వ్రాసారు:
“సంతానలేమితో నేను, నా భర్త కామెరాన్ కష్టపడేవరకు నేను సంఘములో చెందియుండలేదని ఎప్పుడూ భావించలేదు. సంఘములో చూడడం వల్ల నాకు ప్రత్యేకంగా ఆనందాన్నిచ్చిన పిల్లలు మరియు కుటుంబాలు ఇప్పుడు నాకు దుఃఖాన్ని, బాధను కలిగించనారంభించారు.
“నా చేతుల్లో ఒక బిడ్డ లేదా హస్తములో డైపరు సంచి లేకుండా నేను గొడ్రాలిగా భావించాను. …
“మేము ఒక క్రొత్త వార్డులోకి మొదటిసారి వెళ్ళిన రోజు అతి కష్టమైన ఆదివారం. మాకు పిల్లలు లేకపోవడం వలన, మాకు క్రొత్తగా పెళ్ళయిందా, కుటుంబాన్ని ప్రారంభించడానికి ఎప్పుడు ప్రణాళిక చేస్తున్నాము అని మేము అడుగబడ్డాము. అవి నాపై ప్రభావం చూపకుండా ఈ ప్రశ్నలకు జవాబివ్వడం నేను బాగా నేర్చుకున్నాను—నన్ను బాధపెట్టాలనేది వారి ఉద్దేశ్యం కాదని నాకు తెలుసు.
“అయినా, ఈ ప్రత్యేక ఆదివారం, ఆ ప్రశ్నలకు జవాబివ్వడం ప్రత్యేకంగా కష్టమనిపించింది. ఆశాజనకంగా ఉన్న తర్వాత, మళ్ళీ—నేను గర్భం దాల్చలేదని ఇప్పుడే మాకు తెలిసింది.
“నిరాశగా నేను సంస్కార సమావేశానికి వెళ్ళాను మరియు అటువంటి ‘సాధారణ పరిచయ ప్రశ్నలకు’ జవాబివ్వడం నాకు కష్టమయింది. …
“కానీ ఆదివారపు బడి నన్ను లోతుగా గాయపరచింది. తల్లుల యొక్క దైవిక పాత్ర గురించి ఉద్దేశించబడిన పాఠము యొక్క చర్చలో ఆకస్మిక మార్పు జరిగి, మాతృత్వం గురించి నిరాశ వ్యక్తపరచేదిగా మారింది. నేను ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న దీవెన గురించి స్త్రీలు ఫిర్యాదు చేయడం వినినప్పుడు, నా హృదయం ద్రవించి, కన్నీళ్ళు నిశ్శబ్దంగా నా చెంపలపై జారాయి
“నేను వెంటనే సంఘం నుండి వెళ్ళిపోయాను. మొదట, నేను తిరిగి వెళ్ళాలనుకోలేదు. మళ్ళీ ఆ ఒంటరి భావనను నేను అనుభవించదలచుకోలేదు. కానీ ఆ రాత్రి, నా భర్తతో మాట్లాడిన తర్వాత, ప్రభువు మనల్ని అడిగినందుకు మాత్రమే కాకుండా, నిబంధనలను క్రొత్తవిగా చేయడం మరియు సంఘములో ఆత్మను అనుభవించడం నుండి వచ్చే ఆనందం ఆరోజు నేను భావించిన విచారాన్ని అధిగమిస్తుందని మాకు తెలిసినందువలన కూడా మేము సంఘానికి హాజరవడం కొనసాగిస్తామని మాకు తెలుసు. …
“సంఘములో వితంతువులు, విడాకులు పొందినవారు, ఒంటరి సభ్యులు; సువార్త నుండి తొలగిపోయిన కుటుంబ సభ్యులు గలవారు; దీర్ఘకాలిక వ్యాధులు లేదా ఆర్థికపరమైన కష్టాలు ఉన్నవారు; స్వ-లింగ ఆకర్షణను అనుభవించే సభ్యులు; వ్యసనాలను లేదా సందేహాలను జయించడానికి శ్రమిస్తున్న సభ్యులు, ఇటీవల పరివర్తన చెందినవారు; క్రొత్తగా ఆ ప్రాంతానికి మారిన వారు; పిల్లలు పెరిగి వెళ్ళిపోయాక మిగిలిన పెద్దలు ఉన్నారు; మరియు ఈ జాబితా పెరుగుతూనే ఉంటుంది. …
“మన పరిస్థితులు ఏవైనప్పటికీ—ఆయన వద్దకు రమ్మని రక్షకుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు. మన నిబంధనలను క్రొత్తవిగా చేసుకోవడానికి, మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి, శాంతిని కనుగొనడానికి మరియు ఆయన జీవితంలో ఆయన పరిపూర్ణంగా చేసినట్లుగా—చెందియుండమని భావించే వారికి పరిచర్య చేయడానికి మనం సంఘానికి వస్తాము.”9
“పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును సంఘము మరియు దాని అధికారులు దేవుని చేత ఇవ్వబడ్డారని పౌలు వివరించాడు.
“మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.”10
అయితే, ఎవరైనా తమ జీవితంలోని అన్ని కోణాలలో ఆదర్శవంతంగా ఉండలేకపోయామని భావించి, ఆదర్శవంతంగా ఉండడం వైపు పురోగమించేలా మనకు సహాయం చేయడానికి దేవుని చేత రూపొందించబడిన సంస్థకు వారు చెందరనే నిర్ణయానికి రావడం విచారకరమైన పరిహాసము.
తీర్పును ప్రభువు చేతులకు, ఆయన నియమించిన వారికి అప్పగిద్దాం మరియు మనకు చేతనైనంత బాగా ఒకరినొకరు ప్రేమించుకోవడంలో, ఆదరించడంలో సంతృప్తి చెందుదాం. రోజురోజుకీ, ప్రభువు యొక్క విందుకు “బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని [అనగా, ప్రతీఒక్కరిని]” … తీసుకురావడానికి మనకు మార్గం చూపమని ఆయనను మనం అడుగుదాం.11
చెందియుండడం యొక్క సిద్ధాంతపు రెండవ లక్షణం మన స్వంత తోడ్పాటుకు సంబంధించినది. మనం దాని గురించి అరుదుగా ఆలోచించినప్పటికీ, మనం చెందియుండడంలో అధికభాగం ఇతరుల కొరకు మరియు ప్రభువు కొరకు మనం చేసే సేవ మరియు త్యాగాల నుండి వస్తుంది. మన వ్యక్తిగత అవసరాలు లేదా మన స్వంత సౌకర్యంపై అధికంగా దృష్టిసారించడం చెందియున్నామనే ఆ భావనను భంగం చేయగలదు.
రక్షకుని సిద్ధాంతాన్ని అనుసరించడానికి మనం ప్రయత్నిస్తాము:
“మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను. …
“ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను.”12
చెందియున్నామనే భావన దానికోసం మనం వేచియున్నప్పుడు రాదు, కానీ మనం ఒకరికొకరం సహాయం చేసుకోవడానికి సమీపించినప్పుడు వస్తుంది.
దురదృష్టవశాత్తూ నేడు, ఒక కారణం కోసం తననుతాను అంకితం చేసుకోవడం లేదా ఎవరి కోసమైనా ఏదైనా త్యాగం చేయడం వంటివి విరుద్ధ సంప్రదాయంగా మారుతున్నాయి. గత సంవత్సరంలో Deseret Magazine కోసం ఒక అంశంలో రచయిత రాడ్ డ్రేహెర్ బుడాపెస్ట్‌లో ఒక యౌవన తల్లితో సంభాషణను వివరించాడు:
“నేను బుడాపెస్ట్ ట్రామ్‌లో … 30 ప్రారంభ వయస్సులో ఉన్న ఒక స్నేహితురాలితో ఉన్నాను—ఆమెను క్రిస్టీనా అని పిలుద్దాం—భర్తను కోల్పోయి, కమ్యూనిస్టు రాజ్యం చేత హింసను తట్టుకున్న ఒక [క్రైస్తవ] వృద్ధురాలిని ఇంటర్వూ చేసే దారిలో మేమున్నాము. పట్టణ వీధుల్లోని ఎత్తుపల్లాల గుండా మేము ప్రయాణిస్తున్నప్పుడు, ఒక భార్యగా మరియు చిన్న పిల్లల తల్లిగా ఆమె అనుభవిస్తున్న కష్టాల గురించి తన తోటి స్నేహితులతో నిజాయితీగా చెప్పడం ఎంత కష్టమనే దాని గురించి క్రిస్టీనా మాట్లాడింది.
“ఒక తల్లిగా, భార్యగా ఎలా ఉండాలో నేర్చుకుంటున్న యువతికి క్రిస్టీనా కష్టాలు సర్వసాధారణమైనవి—అయినప్పటికీ, ఆమె తరంలో ప్రబలుతున్న వైఖరి ఏమిటంటే, జీవితంలో కష్టాలనేవి ఒకరి శ్రేయస్సుకు ముప్పు మరియు అవి నిరాకరించబడాలి. ఆమె, ఆమె భర్త అప్పుడప్పుడు వాదించుకుంటారా? అప్పుడు ఆమె అతడ్ని వదిలేయాలని వారు చెప్తున్నారు. ఆమె పిల్లలు ఆమెను విసిగిస్తున్నారా? అప్పుడు ఆమె వారిని పిల్లల సంరక్షణ కేంద్రానికి పంపాలి.
“ఆ శ్రమలు మరియు బాధ జీవితంలో భాగమని—మరియు ఆ బాధ ఓర్పుగా, దయగా, ప్రేమగా ఎలా ఉండాలో మనకు నేర్పిస్తున్నప్పుడు అది ఒక మంచి జీవితంలో భాగమని ఆమె స్నేహితులు అర్థం చేసుకోరని క్రిస్టీనా విచారిస్తుంది. …
“… నోట్రే డేమ్ యొక్క విశ్వవిద్యాలయములో మతానికి సంబంధించిన సామాజిక శాస్త్రవేత్త క్రిస్టియన్ స్మిత్ 18 నుండి 23 [వయస్సుల] మధ్య ఉన్న వారిపై జరిపిన అధ్యయనంలో, సమాజం అంటే ‘జీవితాన్ని ఆస్వాదించడానికి స్వయంప్రతిపత్తి గల వ్యక్తుల సమాహారం’ కంటే ఏ మాత్రం ఎక్కువ కాదని వారిలో అధికశాతం నమ్ముతున్నట్లు కనుగొన్నారు.”13
ఈ తత్వశాస్త్రాన్ని బట్టి, ఎవరైనా కష్టంగా భావించేది ఏదైనా “అణచివేత యొక్క రూపము.”14
దీనికి విరుద్ధంగా, సువార్త సేవ చేయడానికి, దేవాలయాలు నిర్మించడానికి, హింస మూలంగా సౌకర్యవంతమైన ఇళ్ళను వదిలివేసి మళ్ళీ ప్రారంభించడానికి మరియు ఇతరత్రా అనేకవిధాలుగా తమను, తమ ఆస్థులను సీయోను నిర్మాణానికై అంకితం చేయడానికి వారు చేసిన త్యాగాల ద్వారా మన మార్గదర్శక అగ్రగాములు చెందియున్నామనే లోతైన భావనను, ఐక్యతను, క్రీస్తునందు నిరీక్షణను పొందారు. అవసరమైతే, తమ ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి వారు సమ్మతించారు. మరియు మనమందరము వారి సహనము యొక్క లబ్ధిదారులం. కుటుంబము మరియు స్నేహితుల సహవాసాన్ని కోల్పోయిన వారు, ఉద్యోగ అవకాశాలను పోగొట్టుకున్నవారు లేదా బాప్తిస్మము తీసుకున్నందుకు పర్యవసానంగా మరోరకమైన వివక్షను, అసహనాన్ని అనుభవించే అనేకమంది విషయంలో నేటికీ అదే నిజము. ఏమైనప్పటికీ, నిబంధన జనుల మధ్య చెందియున్నామనే శక్తివంతమైన భావనే వారి బహుమానము. ప్రభువు కోసం మనం చేసే ఏ త్యాగమైనా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చిన ఆయనతో మన స్థానాన్ని నిర్ధారించడానికి సహాయపడుతుంది.
చెందియుండడం యొక్క సిద్ధాంతంలో చివరిది మరియు అత్యంత ముఖ్యమైన అంశం యేసు క్రీస్తు యొక్క ప్రముఖ పాత్ర. ముఖ్యమైనదైనప్పటికీ, మనం కేవలం సహవాసం కోసమే సంఘములో చేరము. యేసు క్రీస్తు యొక్క ప్రేమ, కృప ద్వారా కలిగే విమోచన కోసం మనం చేరుతాము. మనకోసం మరియు తెరకు ఇరువైపులా మనం ప్రేమించే వారికోసం రక్షణ మరియు మహోన్నతస్థితి యొక్క విధులను భద్రపరచుకోవడానికి మనం చేరుతాము. ప్రభువు యొక్క రాక కోసం సిద్ధపాటుగా సీయోనును స్థాపించాలనే గొప్ప కార్యములో పాల్గొనడానికి మనం చేరుతాము.
పరిశుద్ధ యాజకత్వపు విధుల ద్వారా దేవుడు మనకు అందించే రక్షణ మరియు మహోన్నతస్థితి యొక్క నిబంధనలకు సంఘము సంరక్షకునిగా ఉంటుంది.15 ఈ నిబంధనలను పాటించడం ద్వారా, మనం చెందియున్నామనే అత్యున్నతమైన మరియు లోతైన భావనను పొందుతాము. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇటీవల ఇలా వ్రాసారు:
“మీరు మరియు నేను దేవునితో ఒకసారి నిబంధన చేసుకున్న తర్వాత, ఆయనతో మన సంబంధం మన నిబంధనకు ముందున్న దానికంటే చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మనం కలిపి బంధించబడ్డాము. దేవునితో మన నిబంధన కారణంగా, మనకు సహాయం చేయడానికి ఆయన చేసే ప్రయత్నాలలో ఆయన ఎప్పటికీ అలసిపోరు మరియు మనపై కరుణతో కూడిన ఆయన సహనాన్ని మనం ఎప్పటికీ పోగొట్టుకోము. మనలో ప్రతీఒక్కరం దేవుని హృదయంలో ప్రత్యేక స్థానం కలిగియున్నాము. …
“… ఆ నిబంధనలకు యేసు క్రీస్తు హామీదారు ( హెబ్రీయులకు 7:22; 8:6).”16
మనం దీనిని గుర్తుంచుకున్నట్లయితే, మన కోసం ప్రభువు యొక్క ఉన్నతమైన ఆశలు మనల్ని ప్రేరేపిస్తాయే గానీ నిరుత్సాహపరచవు.
మనం వ్యక్తిగతంగా, సామాజికంగా, “క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను”17 కొనసాగించినప్పుడు, మనం ఆనందాన్ని అనుభవించగలము. మార్గము వెంబడి నిరాశలు మరియు ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ, ఇది ఒక గొప్ప తపన. వాగ్దనం చేయబడిన దీవెనలలో శ్రమలు మరియు ఆలస్యాలు ఉన్నప్పటికీ, “ధైర్యము తెచ్చుకొనుడి; [ఏలయనగా క్రీస్తు] లోకమును జయించి యున్నారు”18 మరియు మనం ఆయనతో ఉన్నామని తెలుసుకొని, ముందుకు వెళ్ళే మార్గంలో కొనసాగడానికి మనం ఒకరికొకరం సహాయం చేసుకొని, ప్రోత్సహించుకుంటాము. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మతో ఏకమైయుండడమనేది చెందియుండడంలో నిస్సందేహంగా అత్యున్నతమైనది. 19
ఆవిధంగా, చెందియుండడం యొక్క సిద్ధాంతము దీనికి వస్తుంది—మనలో ప్రతీఒక్కరం స్థిరంగా చెప్పగలము: యేసు క్రీస్తు నాకోసం మరణించారు; ఆయన రక్తానికి నేను యోగ్యుడనని ఆయన తలంచారు. ఆయన నన్ను ప్రేమిస్తున్నారు మరియు నా జీవితంపై ముఖ్యమైన ప్రభావాన్ని కలిగియుండగలరు. నేను పశ్చాత్తాపపడినప్పుడు, ఆయన కృప నన్ను మారుస్తుంది. సువార్త నిబంధనలో నేను ఆయనతో ఏకమైయున్నాను; ఆయన సంఘానికి, రాజ్యానికి నేను చెందియున్నాను; మరియు దేవుని పిల్లలందరికి విమోచనను తెచ్చుటలో నేను ఆయన పక్షానికి చెందినవాడిని.
మీరు కూడా చెందియున్నారని యేసు క్రీస్తు నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.