సర్వసభ్య సమావేశము
ఆయన ద్వారా మనము కష్టమైన విషయాలను చేయగలము
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


10:53

ఆయన ద్వారా మనము కష్టమైన విషయాలను చేయగలము

కష్ట సమయాలందు మనము ప్రభువునందు విశ్వాసమును సాధన చేసినప్పుడు మన శిష్యత్వమందు మనము ఎదుగుతాము.

రక్షకుని యొక్క భూలోక పరిచర్యలో, ఆయన గ్రుడ్డివాడైన ఒక వ్యక్తిని గమనించారు. యేసు యొక్క శిష్యులు “బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా?” అని అడిగారు.

రక్షకుని యొక్క స్థిరమైన, ప్రేమగల, నిజాయితీగల జవాబు ఆయన మన ప్రయాసలను గుర్తుంచుకున్నారని మనకు అభయమిస్తుంది: “వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.”1

కొన్ని సవాళ్ళు ఉద్దేశ్యపూర్వకమైన అవిధేయత వలన కలిగినప్పటికీ, జీవితపు సవాళ్ళలో అనేకము మిగిలిన కారణాల వలన కలుగుతాయని మనకు తెలుసు. మన సవాళ్ళకు ఆధారము ఏదైనప్పటికీ, అవి ఎదగడానికి విజయవంతమైన అవకాశములు కాగలవు.

జీవితపు శ్రమల నుండి మా కుటుంబము మినహాయింపబడలేదు. ఎదుగుతున్న వయస్సులో, నేను పెద్ద కుటుంబాలను మెచ్చుకున్నాను. ప్రత్యేకించి నా యుక్తవయస్సులో, ఘనాలోని టకొరాడిలో నా తల్లి తరఫు మావయ్య, సర్ఫో మరియు అతని భార్య ద్వారా సంఘాన్ని కనుగొన్నప్పుడు అటువంటి కుటుంబాలు నాకు ఆకర్షణీయంగా కనబడేవి.

నేను, హన్నా వివాహము చేసుకున్నప్పుడు, మా గోత్ర జనకుని దీవెనల నెరవేర్పును మేము కోరుకున్నాము, మేము అనేకమంది పిల్లలతో దీవించబడతామని అది సూచించింది. అయినప్పటికీ, మా మూడవ బిడ్డ పుట్టకముందు, హన్నా మరొక బిడ్డను కనలేదని వైద్యపరంగా స్పష్టమయ్యింది. కృతజ్ఞతాపూర్వకంగా, కెన్నెత్ తనకు, తన తల్లికి ఇరువురికి ప్రాణాపాయ పరిస్థితిలో పుట్టినప్పటికీ, అతడు క్షేమంగా పుట్టాడు మరియు అతడి తల్లి కోలుకున్నది. సంఘానికి హాజరవడం, ప్రతీరోజు కుటుంబ ప్రార్థనలు, లేఖన అధ్యయనము, గృహ సాయంకాలము మరియు ఆరోగ్యకరమైన వినోద కార్యక్రమాలలో హాజరవడంతో పాటు, అతడు మా కుటుంబ జీవితంలో పూర్తిగా పాల్గొనడం ప్రారంభించగలిగాడు.

ఒక పెద్ద కుటుంబాన్ని కలిగియుండాలనే మా అంచనాలను సర్దుబాటు చేయవలసి వచ్చినప్పటికీ, మా ముగ్గురు ప్రియమైన పిల్లలతో “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన” నుండి బోధనలను సాధన చేయడం ఆనందంగా ఉంది. ఆ బోధనలను అనుసరించడం ఎదుగుతున్న నా విశ్వాసానికి ఎక్కువ అర్థాన్ని చేకూర్చింది.

ప్రకటన వివరించినట్లుగా: “ఆయన నిత్య ప్రణాళికకు స్త్రీ మరియు పురుషుని మధ్య వివాహము ఆవశ్యకమైనది. పిల్లలు వివాహ బంధముయందు జన్మించవలెను మరియు పూర్తి విశ్వాసముతో వివాహ ప్రమాణములను గౌరవించు తల్లి మరియు తండ్రిచే పెంచబడవలెను.” 2 ఈ సూత్రాలను ఆచరణలో పెట్టినప్పుడు, మేము దీవించబడ్డాము.

ఏమైనప్పటికీ, స్టేకు అధ్యక్షునిగా నేను సేవచేస్తున్నప్పుడు ఒక వారాంతములో, బహుశా తల్లిదండ్రులు ఎదుర్కోగల భయంకరమైన శ్రమను మేము ఎదుర్కొన్నాము. మా కుటుంబము సంఘ ప్రోత్సాహకార్యక్రమము నుండి తిరిగి వచ్చి, భోజనానికి కూర్చుంది. తరువాత మా ముగ్గురు అబ్బాయిలు మా ఇంటి ఆవరణలో ఆడుకోవడానికి వెళ్ళారు.

ఏదో సరిగ్గాలేదని నా భార్యకు పలుమార్లు అనిపించింది. మేము గిన్నెలను శుభ్రపరుస్తుండగా పిల్లలను చూసిరమ్మని ఆమె నన్ను అడిగింది. వారు ఆడుకుంటుండగా ఉత్సాహముగల వారి స్వరాలను మేము వినగలిగాము కనుక, వారు క్షేమంగా ఉన్నారని నేను భావించాను.

చివరికి మేమిద్దరం మా కొడుకులను చూడడానికి వెళ్ళినప్పుడు, తన అన్నల చేత చూడబడకుండా, మా చిన్నకొడుకు 18-నెలల కెన్నెత్ నీళ్ళ బకెట్టులో నిస్సహాయంగా పడి ఉండడాన్ని చూసి మేము విస్మయానికి గురయ్యాము. వెంటనే మేము అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్ళాము, కానీ అతడిని బ్రతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

ఈ మర్త్య జీవితకాలమందు మా ప్రశస్థమైన బిడ్డను పెంచే అవకాశము మాకు ఉండదని తెలిసి మేము నాశనము చేయబడ్డాము. నిత్యత్వములో కెన్నెత్ మా కుటుంబంలో భాగమవుతాడని మాకు తెలిసినప్పటికీ, నా పిలుపును నెరవేర్చడానికి నేను చేయగల సమస్తమును నేను చేస్తున్నప్పుడు, ఈ విషాదము కలగడానికి దేవుడు ఎందుకు అనుమతించాడని నేను ప్రశించసాగాను. పరిశుద్ధులకు పరిచర్య చేయడంలో నా బాధ్యతలలో ఒకదానిని నెరవేర్చి, నేను అప్పుడే ఇంటికి వచ్చాను. దేవుడు నా సేవను చూసి, మా కొడుకుని, మా కుటుంబాన్ని ఈ విషాదం నుండి ఎందుకు కాపాడలేదు? దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించే కొద్దీ, నా విచారము ఎక్కువవసాగింది.

తన ప్రేరేపణలకు స్పందించనందుకు నా భార్య ఎన్నడూ నన్ను నిందించలేదు, కానీ నేను జీవితాన్ని మార్చే పాఠాన్ని నేర్చుకున్నాను మరియు ఎప్పటికీ ఉల్లంఘించకూడని రెండు నియమాలను చేసాను:

నియమము 1: మీ భార్య యొక్క ప్రేరేపణలను విని, లక్ష్యపెట్టండి.

నియమము 2: ఏ కారణము చేతనైనా, మీకు సరిగ్గా తెలియకపోతే, నియమము 1 ని పరిగణించండి.

ఆ అనుభవము మానసికంగా చాలా కష్టంగా ఉండి, మేము దుఃఖించడం కొనసాగిస్తున్నప్పటికీ, తీవ్రమైన మా భారము చివరకు తేలిక చేయబడింది.3 మాకు కలిగిన నష్టము నుండి నా భార్య, నేను ప్రత్యేక పాఠాలు నేర్చుకున్నాము. మేము ఏకము చేయబడినట్లుగా, మా దేవాలయ నిబంధనల చేత బంధింపబడినట్లుగా భావించాము; కెన్నెత్ నిబంధనలో జన్మించాడు కనుక, తరువాతి లోకములో అతడు మావాడని మేము హక్కుగా చెప్పగలమని మాకు తెలుసు. ఇతరులకు పరిచర్య చేయడానికి మరియు వారి బాధలో సానుభూతి చూపడానికి అవసరమైన అనుభవాన్ని కూడా మేము సంపాదించాము. ప్రభువునందు విశ్వాసమును మేము సాధన చేసినప్పటి నుండి మా బాధ చెదరగొట్టబడిందని నేను సాక్ష్యమిస్తున్నాను. మా అనుభవము కష్టమైనదిగా కొనసాగింది, కానీ మేము అపొస్తలుడైన పౌలుతో కలిసి, మనము “[మనల్ని బలపరచువాని] యందే సమస్తము చేయగలము” 4 అని నేర్చుకున్నాము.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు, “మన జీవితాల యొక్క దృష్టి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక … యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త పై ఉన్నప్పుడు, మన జీవితాలలో—జరుగుచున్న దానిని లేదా జరగని దానిని లక్ష్యపెట్టకుండా మనం ఆనందాన్ని అనుభవించవచ్చును.” ఆయన ఇంకా ఇలా చెప్పారు, “ఆనందము ఆయన నుండి మరియు ఆయన వలన కలుగుతుంది.”5

మన కష్ట సమయాలందు మనము ధైర్యము తెచ్చుకొని, శాంతితో నింపబడగలము. రక్షకుడు మరియు ఆయన ప్రాయశ్చిత్తము వలన మనము అనుభవించే ప్రేమ, మన పరీక్షా సమయాలలో మనకొరకు శక్తివంతమైన వనరుగా మారుతుంది. “జీవితంలో అన్యాయమైనవిగా [మరియు కష్టమైనవిగా] ఉన్నవన్నీ యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా సరిచేయబడగలవు.”6 “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాను” అని ఆయన ఆజ్ఞాపించారు.7 మర్త్యత్వములో మనము ఎదుర్కొనే ఎటువంటి నొప్పి, వ్యాధి మరియు శ్రమలనైనా సహించడానికి ఆయన మనకు సహాయపడగలరు.

యిర్మీయా, యోబు, జోసెఫ్ స్మిత్, నీఫై వంటి గొప్ప మరియు ఘనులైన నాయకుల యొక్క అనేక లేఖన కథలను మనము కనుగొంటాము, వారు కూడా మర్త్యత్వములోని ప్రయాసలు మరియు సవాళ్ళ నుండి మినహాయించబడలేదు. కఠినమైన పరిస్థితులలో కూడా ప్రభువుకు విధేయులుగా ఉండడం నేర్చుకొన్న మర్త్యులు వారు. 8

లిబర్టీ చెరసాలలో భయంకరమైన దినాలలో, జోసెఫ్ స్మిత్ ఇలా మొరపెట్టాడు: “ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు? నిన్ను మరుగుపరచు స్థలమును కప్పియుంచు తెర ఎక్కడనున్నది?”9 “బాగా సహించమని”10 జోసెఫ్ స్మిత్‌కు ప్రభువు బోధించారు మరియు అతడు సహించినట్లయితే, ఈ విషయాలన్నీ అతడికి అనుభవాన్ని ఇస్తాయని మరియు అతడి మేలుకొరకేనని వాగ్దానమిచ్చారు.11.

నా స్వంత అనుభవాల గురించి ఆలోచిస్తూ, నా జీవితంలో క్లిష్టమైన సమయాలందు , నాకు అలవాటు లేని క్రొత్త అనుభవాలు కలిగినప్పుడు నా శ్రేష్టమైన పాఠాలలో కొన్ని నేర్చుకున్నానని నేను గ్రహించాను. సెమినరీ ద్వారా సంఘము గురించి నేర్చుకుంటున్నప్పుడు యౌవనుడిగా, క్రొత్తగా మార్పుచెందినవానిగా, పూర్తి-కాల సువార్తికునిగా నేను ఎదుర్కొన్న కష్టాలు మరియు నా చదువులో, నా పిలుపులను నెరవేర్చడానికి ప్రయత్నించడంలో, కుటుంబాన్ని పెంచడంలో నేను ఎదుర్కొన్న సవాళ్ళు భవిష్యత్తు కొరకు నన్ను సిద్ధపరిచాయి. ప్రభువునందు విశ్వాసముతో కష్టమైన పరిస్థితులకు నేను ఎంత ఎక్కువ సంతోషంగా స్పందిస్తే, అంత ఎక్కువగా నేను నా శిష్యత్వములో ఎదుగుతాను.

ఒకసారి మనము తిన్నని ఇరుకైన మార్గములో ప్రవేశించిన తరువాత మన జీవితాలలో కష్టమైన విషయాలు ఆశ్చర్యము కలిగించవు.12 యేసు క్రీస్తు “తాను పొందిన శ్రమలవలన విధేయతను” 13 నేర్చుకున్నారు. ప్రత్యేకించి మన కష్ట సమయాలలో, మనము ఆయనను అనుసరించినప్పుడు మనం ఆయనలా మరింతగా మారగలము.

దేవాలయములో ప్రభువుతో మనము చేసే నిబంధనలలో ఒకటి, త్యాగము యొక్క చట్టమును జీవించడం. త్యాగము ఎల్లప్పుడూ యేసు క్రీస్తు యొక్క సువార్తలో భాగమైయున్నది. అది భూమి మీద జీవించిన లేదా జీవించే వారందరి కోసం యేసు క్రీస్తు యొక్క గొప్ప ప్రాయశ్చిత్త త్యాగము యొక్క జ్ఞాపకార్థముగా ఉంది.

ఎల్డర్ మోరిసన్ యొక్క సువార్తికులు

మనం నీతిగల కోరికలను కలిగియున్నప్పుడు ప్రభువు ఎల్లప్పుడూ ఏదోవిధంగా దీవిస్తారు. నా గోత్ర జనకుని దీవెనలో నాకు వాగ్దానము చేయబడిన అనేకమంది పిల్లలు గుర్తున్నారా? ఆ దీవెన నెరవేరుతోంది. నా భార్య, నేను ఘనా కేప్ కోస్ట్ మిషనులో, 25 కు పైగా దేశాల నుండి వచ్చిన కొన్ని వందలమంది సువార్తికులతో కలిసి సేవ చేసాము. వాళ్ళు నిజంగా మా స్వంత పిల్లల వలె మాకు ప్రియమైన వారు.

కష్ట సమయాల్లో ప్రభువునందు విశ్వాసమును మనము సాధన చేసినప్పుడు మన శిష్యత్వమందు మనము ఎదుగుతామని నేను సాక్ష్యమిస్తున్నాను. మనం ఆవిధంగా చేసినప్పుడు, ఆయన మనల్ని కనికరముతో బలపరుస్తారు మరియు మన భారములు మోయడానికి మనకు సహాయపడతారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.