రక్షకునికి దగ్గరవడం
రక్షకుడిని యెరిగి, ప్రేమించాలని కోరుతూ, దేవునితో నిబంధనల ద్వారా, భిన్న విశ్వాసాలు గలవారి నుండి మనల్నిమనం దూరం చేసుకోకుండా, విలక్షణంగా, అసాధారణంగా మరియు ప్రత్యేకంగా ఉంటూ మనల్నిమనం ప్రపంచం నుండి వేరుచేసుకుంటాము.
ప్రియమైన నా సహోదర సహోదరీలారా, ఈ సాయంకాలం నేను యేసు క్రీస్తు యొక్క వినయముగల, భక్తిగల అనుచరులతో మాట్లాడతాను. ఇక్కడ ఈ దేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో మీ జీవితాలలోని మంచితనాన్ని, ప్రభువైన యేసు క్రీస్తు నందు మీ విశ్వాసాన్ని చూసినప్పుడు, నేను మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాను.
ఆయన పరిచర్య ముగింపులో, యేసు యొక్క శిష్యులు “[ఆయన రెండవ రాకడ] యొక్క సూచన గురించి, లోకాంతము గురించి” వారితో చెప్పమని ఆయనను అడిగారు.1
ఆయన తిరిగి రావడానికి ముందు ఉండే పరిస్థితుల గురించి యేసు వారితో చెప్పారు మరియు “మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు [సమయము] సమీపముననే యున్నదని [మీరు] తెలుసుకొందురు,” అని ప్రకటించడం ద్వారా ముగించారు.2
గత సర్వసభ్య సమావేశంలో,నేను అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ గారి మాటలను చాలా శ్రద్ధగా విన్నాను: ఆయన ఇలా అన్నారు, “మనం ఎక్కడ ఉన్నప్పటికీ, పెరుగుతున్న అపాయకరమైన కాలంలో మనం జీవిస్తున్నామని మనలో ప్రతీఒక్కరికి తెలుసు. … కాలముల చిహ్నాలను చూచు కన్నులను మరియు ప్రవక్తల మాటలను విను చెవులను కలిగియున్నవారు అది నిజమని తెలుసుకుంటారు.”3
పరాక్రమవంతులైన ఆయన శిష్యులను రక్షకుడు అభినందించారు: “మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.”4 ఈ సమావేశంలో ఆయన ప్రవక్తలు మరియు ఇతరుల ద్వారా ప్రభువు యొక్క మాటలను మనం శ్రద్ధగా వింటున్నప్పుడు, ఈ దీవెన మనది కాగలదు.
గోధుమలు మరియు గురుగులు
ఆయన తిరిగి రావడానికి ముందు ఈ అంతిమ కాలంలో, “గోధుమలు” అని వర్ణించే ఆయన “రాజ్యసంబంధులు”5, “గురుగులు” లేదా దేవుడిని ప్రేమించకుండా, ఆయన ఆజ్ఞలను పాటించకుండా ఉండేవారితో పాటు, ప్రక్క ప్రక్కనే పెరుగుతారని ప్రభువు వివరించారు. అవి ప్రక్కప్రక్కనే “రెండు కలిసి యెదుగుతాయి.”6
రక్షకుడు తిరిగి వచ్చేవరకు ఇది మన లోకము, అన్నివైపులా అధిక మంచితనం మరియు అధిక దుష్టత్వంతో ఉంది.7
కొన్నిసార్లు మీరింకా ఒక బలమైన గోధుమ గడ్డిపోచ వలె వర్ణించబడేందుకు సిద్ధంగా లేనట్లు భావించవచ్చు. మీపట్ల మీరు సహనము కలిగియుండండి! గోధుమలు ఇప్పుడే పుట్టుకొస్తున్న లేత మొక్కలను కలిగియుంటాయనిప్రభువు చెప్పారు.8 మనమందరం ఆయన కడవరి దిన పరిశుద్ధులం, పూర్తిగా మనం కావాలని కోరుకున్నట్లుగా ఇంకా మారనప్పటికీ, ఆయన యొక్క నిజమైన శిష్యులుగా ఉండాలనే మన కోరికలో మనం గంభీరంగా ఉన్నాము.
యేసుక్రీస్తులో మన విశ్వాసాన్ని బలపరచుకోండి
లోకంలో చెడు పెరుగుతున్నప్పుడు, యేసు క్రీస్తు నందు మన విశ్వాసపు మూలాలను మనం ఇంకా ఎక్కువగా పోషించి, దృఢంగా చేసి, బలపరచడం మన ఆత్మీయ మనుగడకు, మనం ప్రేమించేవారి ఆత్మీయ మనుగడకు అవసరమని మనం గ్రహించాము. రక్షకుని కొరకు మన ప్రేమలో మరియు ఆయనను అనుసరించాలనే మన సంకల్పంలో మనం వేరు పారి స్థిరపడి,9 పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండాలని10 అపొస్తలుడైన పౌలు ఉపదేశించాడు. నేడు మరియు రాబోయ రోజులలో మళ్ళింపులు, అజాగ్రత్త నుండి కాపాడుకోవడానికి మరింత స్పష్టమైన, కేంద్రీకృత ప్రయత్నం అవసరము.11
కానీ మన చుట్టూ లోకం యొక్క ప్రభావాలు పెరుగుతున్నప్పుడు కూడా, మనం భయపడవలసిన అవసరం లేదు. ప్రభువు తన నిబంధన జనులను ఎన్నడూ విడిచిపెట్టరు. నీతిమంతుల కొరకు ఆత్మీయ బహుమానాలు మరియు దైవిక నిర్దేశం యొక్క పరిహార శక్తి ఉంది.12 అయినప్పటికీ, మనం ఈ తరంలో భాగమైనందున ఆత్మీయ శక్తి యొక్క ఈ అదనపు దీవెన మనపై నిలిచియుండదు. ప్రభువైన యేసు క్రీస్తుపై మన విశ్వాసాన్ని బలపరచుకొని, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మనం ఆయనను తెలుసుకొని, ఆయనను ప్రేమించినప్పుడు అది వస్తుంది. “అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము”13 అని యేసు ప్రార్థించారు.
మనకు బాగా తెలిసినట్లుగా, యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యునిగా ఉండడం మరియు ఆయన యందు విశ్వాసాన్ని కలిగియుండడం అనేది ఒకసారి తీసుకునే నిర్ణయం కంటే—ఒకసారి జరిగే సంఘటన కంటే ఎక్కువైనది. అది ఒక పవిత్రమైన నిరంతర ప్రక్రియ, మన జీవితాల్లోని విభిన్న సమయాల్లో అది వృద్ధిచెందుతుంది మరియు విస్తరిస్తుంది, ఆయన పాదాల వద్ద మనం మోకరించే వరకు అది కొనసాగుతుంది.
లోకంలో గురుగుల మధ్య గోధుమలు పెరుగుతుండగా, రాబోయే రోజులలో రక్షకుని పట్ల మన నిబద్ధతను మనమెలా వృద్ధిచేయగలము మరియు బలపరచగలము?
దానికి మూడు ఆలోచనలున్నాయి:
యేసు యొక్క జీవితంలోనికి మనల్ని మనం నిమగ్నం చేసుకోవాలి
మొదటిది, యేసు యొక్క జీవితం, ఆయన బోధనలు, ఆయన ఘనత, ఆయన శక్తి మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగములోనికి మనల్ని మనం మరింత సంపూర్ణంగా నిమగ్నం చేసుకోగలము. “ప్రతి తలంపులో నా వైపు చూడుడి” అని రక్షకుడు బోధించారు.14 “ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము”15 అని అపొస్తలుడైన యోహాను మనకు గుర్తుచేస్తున్నాడు. ఆయన ప్రేమను మనం బాగా అనుభవించినప్పుడు, మనం ఆయనను ఇంకా ఎక్కువగా, చాలా సహజంగా ప్రేమిస్తాము, మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించడం మరియు వారి పట్ల శ్రద్ధ చూపడంలో ఆయన మాదిరిని బాగా అనుసరిస్తాము. ఆయన వైపు వేసే నీతిగల ప్రతీ అడుగుతో మనం ఆయన గురించి మరింత జ్ఞానాన్ని పొందగలము.16 మనం ఆయనను ఆరాధిస్తాము మరియు మన సూక్ష్మమైన మార్గాలలో ఆయనను అనుకరించడానికి ప్రయత్నిస్తాము.17
ప్రభువుతో నిబంధనలు చేసుకోండి
తరువాతది, మనం రక్షకుడిని బాగా యెరిగి, ప్రేమించినప్పుడు, ఇంకా ఎక్కువగా మన విధేయతను, నమ్మకాన్ని చూపుతామని ఆయనకు వాగ్దానం చేయాలని మనం కోరుకుంటాము. ఆయనతో మనం నిబంధనలు చేస్తాము. బాప్తిస్మము వద్ద మన వాగ్దానాలతో మనం ప్రారంభిస్తాము మరియు మనం అనుదినము పశ్చాత్తాపపడుతూ, క్షమాపణను అడుగుతూ, ప్రతీవారం సంస్కారంలో పాలుపొందడానికి ఆత్రంగా ఎదురుచూస్తూ ఈ వాగ్దానాలను, ఇతర వాటిని నిర్ధారిస్తాము. “ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకముంచుకుంటామని, ఆయన ఆజ్ఞలను పాటిస్తామని”18 మనం ప్రతిజ్ఞ చేస్తాము.
మనం సిద్ధంగా ఉన్నప్పుడు, దేవాలయం యొక్క విధులను, నిబంధనలను మనము హత్తుకుంటాము. ప్రభువు మందిరంలో మన పవిత్రమైన, నిశ్శబ్ద సమయాల్లో నిత్యత్వపు ప్రభావాన్ని అనుభవిస్తూ, మనం సంతోషంగా దేవునితో నిబంధనలు చేస్తాము మరియు వాటిని పాటిస్తామనే మన సంకల్పాన్ని బలపరచుకుంటాము.
నిబంధనలను చేయడం మరియు పాటించడం, రక్షకుని ప్రేమ మన హృదయంలో మరింత స్థిరంగా స్థాపించబడేందుకు అనుమతిస్తుంది. ఈ నెల లియహోనాలో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు: “[మన] నిబంధన(లు) మనలను ఆయనకు చాలా దగ్గరగా నడిపిస్తుంది. … తనతో అలాంటి బంధాన్ని ఏర్పరచుకున్న వారితో దేవుడు తన సంబంధాన్ని విడిచిపెట్టడు.”19 మరియు ఈ ఉదయం అధ్యక్షుడు నెల్సన్ చాలా అందంగా చెప్పినట్లు, “ప్రతీ క్రొత్త దేవాలయ ప్రతిష్ఠాపనతో, మనల్ని బలపరచడానికి మరియు అపవాది యొక్క తీవ్రమైన ప్రయత్నాలను ప్రతిఘటించడానికి అదనంగా దేవుని శక్తి లోకంలోకి వస్తుంది.”20
ప్రభువు మందిరాలను మనకు దగ్గరగా తేవాలని, మరింత తరచుగా ఆయన మందిరంలో ఉండడానికి మనల్ని అనుమతించాలని ప్రభువు తన ప్రవక్తకు ఎందుకు నిర్దేశిస్తున్నారో మనం చూడగలమా?
మనం దేవాలయంలో ప్రవేశించినప్పుడు, జీవితంలో మన ఉద్దేశ్యము గురించి, మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు అందించబడిన నిత్య బహుమానాల గురించి మనం తెలుసుకున్నప్పుడు, మనకు వ్యతిరేకంగా గుమికూడుతున్న లోక ప్రభావాల నుండి కొంతకాలం కొరకు మనం విముక్తి పొందుతాము.
పరిశుద్ధాత్మ వరమును రక్షించండి
చివరగా, నా మూడవ ఆలోచన: ఈ పవిత్రమైన అన్వేషణలో, మనం పరిశుద్ధాత్మ వరాన్ని కూడబెడతాము, కాపాడుకుంటాము, రక్షించుకుంటాము మరియు భద్రపరచుకుంటాము. అధ్యక్షుడు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ మరియు ఎల్డర్ కెవిన్ డబ్ల్యు. పియర్సన్ ఇద్దరూ కొద్ది క్షణాల క్రితం అధ్యక్షులు నెల్సన్ యొక్క ప్రవచనాత్మక హెచ్చరిక గురించి మాట్లాడారు, నేను ఆ విషయాన్ని మళ్లీ పునరావృతం చేస్తాను: “పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, మార్గనిర్దేశము, ఆదరణ మరియు నిరంతర ప్రభావము లేకుండా ఆత్మీయంగా మనుగడ సాగించడం అసాధ్యం.”21 ఇది అమూల్యమైన బహుమానము. పరిశుద్ధాత్మ ప్రభావము మనతో నిలిచియుండేలా మన అనుదిన అనుభవాలను కాపాడుకోవడానికి మనకు చేతనైనంత మనం చేస్తాము. మనం లోకమునకు వెలుగైయున్నాము మరియు అవసరమైనప్పుడు, మనం ఇతరుల నుండి భిన్నంగా ఉండడానికి ఇష్టపూర్వకంగా ఎంచుకుంటాము. అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ ఇటీవల ఒంటరి యువజనులను ఇలా అడిగారు: “భిన్నంగా ఉండేందుకు [మీకు} ‘ధైర్యముందా?’ … [ప్రత్యేకించి] మీ వ్యక్తిగత జీవితంలో మీరు చేస్తున్న ఎంపికలు ముఖ్యమైనవి. … ప్రపంచము యొక్క వ్యతిరేకతకు వ్యతిరేకంగా మీరు ముందుకెళ్తున్నారా?”22
ప్రపంచం నుండి భిన్నంగా ఉండడానికి ఎంచుకోండి
ఇటీవల ఒక సామాజిక మాధ్యమ పోస్టులో, నా తోటి శిష్యులు చేసిన ప్రపంచం నుండి వారు భిన్నంగా ఉండవలసిన అవసరం గల ఎంపికలను పంచుకోమని వారిని నేను అడిగాను. వందలకొలది జవాబులను నేను పొందాను.23 ఇవి వాటిలో కొన్ని:
అమండా: స్థానిక జైలులో నేను నర్సుగా పనిచేస్తున్నాను. క్రీస్తు వలె ఖైదీల పట్ల శ్రద్ధ చూపడానికి నేను ప్రయత్నిస్తాను.
రేఛెల్: నేనొక ఒపేరా గాయకురాలిని మరియు నిరాడంబరతతో సంబంధం లేకుండా, నాకు ఏ దుస్తులిచ్చినా నేను వేసుకుంటానని తరచు ఊహించుకుంటారు. [నేను వరము పొందాను, కాబట్టి] దుస్తులు [నిరాడంబరంగా] ఉండాలని నేను [నిర్మాతల]తో చెప్పాను. వారికి నచ్చలేదు … కానీ అయిష్టంగానే మార్పులు చేసారు. అన్ని సమయాల్లో క్రీస్తు యొక్క సాక్షిగా నిలబడడం నుండి వచ్చే శాంతిని నేను అమ్ముకోను.
క్రిస్: నేను మద్యానికి బానిసను (కోలుకుంటున్నాను), దేవాలయానికి యోగ్యతగల సంఘ సభ్యుడిని. వ్యసనంతో మరియు [యేసు క్రీస్తు యొక్క] ప్రాయశ్చిత్తమును గూర్చి సాక్ష్యాన్ని పొందడంలో నా అనుభవాల గురించి నేను మాట్లాడుతూ ఉంటాను.
లారెన్: ఉన్నత పాఠశాలలో నా తోటి విద్యార్థులతో కలిసి ఒక నాటకాన్ని నేను రచిస్తున్నాను. నిశ్శబ్దమైన, బిడియపు స్వభావం గల నేను ఆకస్మికంగా ఒట్టుపెట్టాలని, అసభ్యంగా మాట్లాడాలని వారు కోరుకున్నారు. వారు నాపై ఒత్తిడి తీసుకురాసాగారు, కానీ నేను నిరాకరించాను మరియు నా నిర్ణయం మార్చుకోలేదు.
ఆడమ్: పవిత్రత యొక్క చట్టాన్ని పాటించమని, అశ్లీలచిత్రాల నుండి దూరంగా ఉండేందుకు ఎంచుకోమని నేను చెప్పినప్పుడు, చాలామంది నన్ను నమ్మరు. అది నాకిచ్చే ఆనందం మరియు మనశ్శాంతి యొక్క లాభాన్ని వారు అర్థం చేసుకోరు.
ఎల్లా: నా తండ్రి ఎల్ జి బి టి క్యు సమాజంలో సభ్యుడు. క్రీస్తుకు సాక్షిగా నిలబడుతూ, నేను నమ్మేదానికి యదార్థంగా ఉంటూ, ఇతరుల మనోభావాలను పరిగణించడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను.
ఆండ్రేడ్: నా కుటుంబం ఇకపై సంఘానికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నప్పుడు, నేను వెళ్ళడం కొనసాగించాలని నిర్ణయించుకున్నాను.
చివరకు, షెర్రీ నుండి: గవర్నర్ గారి బంగళాలో ఒక కార్యక్రమానికి మేము హాజరవుతున్నాము. గవర్నర్ “గౌరవార్థం” మాట్లాడమంటూ వారు మద్యం ఇవ్వడం ప్రారంభించారు. అలా చెప్పడం అవమానించినట్లు అవుతుందని పనివారు చెప్పినప్పటికీ, నేను మంచినీళ్ళే కావాలని పట్టుబట్టాను. మేము గవర్నర్ గౌరవార్థం మాట్లాడాము మరియు నేను నా గ్లాసును పైకెత్తి పట్టుకున్నాను! గవర్నర్ అవమానంగా ఏమీ భావించలేదు.
అధ్యక్షులు నెల్సన్ ఇలా చెప్పారు, “అవును, మీరు ప్రపంచంలో జీవిస్తున్నారు, కానీ ప్రపంచం యొక్క మాలిన్యమును నివారించడానికి మీకు సహాయపడేందుకు ప్రపంచం నుండి చాలా భిన్నమైన ప్రమాణాలను మీరు కలిగియున్నారు.”24
అనస్తీషియా, యుక్రెయిన్‌లో ఒక యౌవన తల్లి, గత ఫిబ్రవరిలో కైవ్‌లో బాంబుదాడి ప్రారంభమైనప్పుడు ఆమె ఆసుపత్రిలో అప్పుడే ఒక బాబుకు జన్మనిచ్చింది. ఒక నర్సు ఆసుపత్రి గది తలుపు తెరిచి కంగారుగా అంది, “నీ బిడ్డను తీసుకొని, అతడిని దుప్పటిలో చుట్టి, హాలులోకి వెళ్ళు—ఇప్పుడే!”
తర్వాత, అనస్తీషియా ఇలా వ్యాఖ్యానించింది:
“నా మాతృత్వపు తొలిరోజులు ఇంత కష్టంగా ఉంటాయని నేనెప్పుడూ ఊహించలేదు, … కానీ … నేను చూసిన దీవెనలు మరియు అద్భుతాలపై … నేను దృష్టిసారిస్తున్నాను. …
“ఇప్పుడు, …అంతటి వినాశనాన్ని, హానిని కలిగించిన వారిని క్షమించడం అసాధ్యమనిపించవచ్చు … , కానీ, క్రీస్తు యొక్క శిష్యురాలిగా, నేను [క్షమించగలనని] నాకు నమ్మకముంది. …
“భవిష్యత్తులో జరిగేదంతా నాకు తెలియదు … కానీ మన నిబంధనలను పాటించడం ఆత్మ మనతో నిరంతరం ఉండేలా చేస్తుందని, … కష్టసమయాల్లో కూడా … మనం ఆనందాన్ని, నిరీక్షణను అనుభవించేలా చేస్తుందని నాకు తెలుసు.”25
నిత్యజీవము మరియు సిలెస్టియల్ మహిమ యొక్క వాగ్దానం
నా సహోదర సహోదరీలారా, మన ప్రియమైన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రేమను సమృద్ధిగా పొందే ఆశీర్వాదం నాకు లభించింది. ఆయన జీవించియున్నాడని మరియు తన పవిత్ర కార్యమును నడిపిస్తాడని నాకు తెలుసు. ఆయన పట్ల నాకున్న ప్రేమను తెలియజేయడానికి, నా దగ్గర సరైన మాటలు లేవు.
మన ప్రభువు మరియు రక్షకుని మహిమకరమైన రాకడ కోసం వేచిచూస్తూ, లక్షల సంఖ్యలో ప్రతీ ఖండంపైనున్న దేశాలలో, సంప్రదాయాలలో భూమిపైనంతటా వ్యాపించియున్న మనమందరం “నిబంధన సంతానము.” మన చుట్టూ ఉన్నవారిపై సానుకూల ప్రభావం చూపుతూ, మనం మన కోరికలు, ఆలోచనలు, ఎంపికలు మరియు చర్యలను స్పృహతో రూపొందించుకుంటున్నాము. మన హృదయమంతటితో రక్షకుడిని యెరిగి, ప్రేమించాలని కోరుతూ, దేవునితో నిబంధనల ద్వారా, భిన్న విశ్వాసాలు గలవారి నుండి మనల్నిమనం దూరం చేసుకోకుండా, ఆయనను, ఆయన బోధనలను మనం గౌరవిస్తున్నప్పుడు విలక్షణంగా, అసాధారణంగా మరియు ప్రత్యేకంగా ఉంటూ మనల్నిమనం ప్రపంచం నుండి వేరుచేసుకుంటాము.
గురుగుల మధ్య గోధుమలవలె ఉండడం అద్భుతమైన ప్రయాణం, కొన్నిసార్లు వేదనతో నిండినప్పటికీ, మన విశ్వాసం యొక్క పరిపక్వత మరియు భరోసా చేత ఎల్లప్పుడూ శాంతింపజేయబడుతుంది. రక్షకుని పట్ల మీ ప్రేమ మరియు మీ పట్ల ఆయన ప్రేమను ఒకరి అంతర్గత భావాలను ప్రభావితం చేయడానికి మీరు అనుమతించినప్పుడు, మీ జీవితపు సవాళ్ళను ఎదుర్కోవడంలో అదనపు నమ్మకాన్ని, శాంతిని, ఆనందాన్ని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. రక్షకుడు ఇలా వాగ్దానం చేసారు: “కాబట్టి గోధుమలు, గురుగుల ఉపమానము ప్రకారము నా జనులను నేను పోగుచేయవలెను, నిత్యజీవము పొందుటకు, సిలెస్టియల్ మహిమతో కిరీటము ధరించుటకు గోధుమలు కొట్లలో జాగ్రత్తపరచబడును.”26 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.