హృదయపూర్వకంగా
మనం యేసు యొక్క ఆనందకరమైన అనుచరులుగా ఉండాలి మరియు మన స్వంత శిష్యత్వపు వ్యక్తిగత ప్రయాణంలో హృదయపూర్వకంగా ఉండాలి.
కొన్నిసార్లు, ఏమి ఆశించాలో తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
దాదాపు ఆయన పరిచర్య ముగింపులో, యేసు తన అపొస్తలులతో కష్టకాలాలు వస్తాయని చెప్పారు. కానీ, “మీరు కలవరపడకుండ చూచుకొనుడి” అని కూడా ఆయన చెప్పారు.1 అవును, ఆయన వెళ్ళిపోతారు, కానీ ఆయన వారిని ఒంటరిగా వదిలివెళ్ళరు.2 జ్ఞాపకముంచుకొని, స్థిరంగా ఉండి, సమాధానాన్ని కనుగొనేందుకు వారికి సహాయపడడానికి ఆయన తన ఆత్మను పంపిస్తారు. రక్షకుడు మనతో, తన శిష్యులతో ఉంటానని చెప్పబడిన తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, అయితే ఆయన సన్నిధిని గుర్తించి ఆనందించడానికి మనకు సహాయం చేయడానికి మనం నిరంతరం ఆయన వైపు చూడాలి.
క్రీస్తు యొక్క శిష్యులు ఎల్లప్పుడూ కష్టకాలాలను ఎదుర్కొన్నారు.
సంయుక్త రాష్ట్రాల మధ్యపశ్చిమ ప్రాంతంలో, 1857 జూలై 9న ముద్రించబడిన వార్తాపత్రిక, Nebraska Advertiser నుండి ఒక పాత వ్యాసాన్ని నా ప్రియమైన స్నేహితురాలు నాకు పంపింది. అందులో ఇలా ఉంది: “ఈరోజు ఉదయం, సాల్ట్ లేక్‌కు వారి ప్రయాణంలో మోర్మనుల సమూహమొకటి ఇటుప్రక్కగా వెళ్ళింది. స్త్రీలు (ఖచ్చితంగా సున్నితంగా లేరు) మృగాలవలె తోపుడు బండ్లను లాగుతున్నారు, ఒక [స్త్రీ] ఈ నల్లటి బురదలో క్రింద పడిపోయింది, అందువల్ల ప్రయాణంలో చిన్న విరామం ఏర్పడింది, చిన్న పిల్లలు తమ (వింతైన) విదేశీ దుస్తులలో వెంట నడిచారు, వారు తమ తల్లులు ఉన్నంత నిశ్చయంగా కనిపించారు.”3
బురదతో తడిసిన ఈ స్త్రీ గురించి నేను చాలా ఆలోచించాను. ఆమె ఒంటరిగా ఎందుకు లాగుతోంది? ఆమె ఒంటరి తల్లా? గమనిస్తున్న వారిచేత అప్పుడప్పుడు వెక్కిరించబడి—తెలియని ఎడారికి తోపుడుబండిలో తన వస్తువులన్నిటిని పెట్టుకొని లాగుకుంటూ, బురద గుండా అటువంటి కష్టతరమైన ప్రయాణం చేయడానికి ఏది ఆమెకు అంతర్గత బలాన్ని, ధైర్యాన్ని, పట్టుదలను ఇచ్చింది?4
అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ ఈ అగ్రగామి స్త్రీ యొక్క అంతర్గత బలం గురించి మాట్లాడుతూ, ఇలా అన్నారు: “యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము గురించి వారి బలమైన నమ్మకాల నుండి ఎవరైనా ఈ స్త్రీలలో ఒక్కరిని దారి మళ్ళించగలరా? ప్రవక్త జోసెఫ్ స్మిత్ యొక్క నియమితకార్యం గురించి వారు సందేహించేలా మీరు చేయగలరా? దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క దైవిక నియమితకార్యానికి సంబంధించి ఎవరైనా వారిని మోసపుచ్చగలరా? లేదు, ఈ జీవితంలో దానిని చేయడం అసాధ్యము. ఎందుకు? ఎందుకంటే వారికి తెలుసు. దేవుడు దానిని వారికి బయల్పరిచారు, వారు దానిని అర్థం చేసుకున్నారు మరియు సత్యమని వారు ఎరిగిన దాని నుండి భూమిపైనున్న ఏ శక్తి వారిని మరల్చలేదు.”5
సహోదర సహోదరీలారా, అటువంటి స్త్రీ పురుషులుగా— కష్టమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు కూడా ప్రయత్నాన్ని కొనసాగించేలా బలాన్ని కనుగొనేందుకు శ్రమించే శిష్యులుగా, దేవుని చేత మనకు బయల్పరచబడిన నమ్మకాలు గల శిష్యులుగా, శిష్యత్వం యొక్క మన స్వంత వ్యక్తిగత ప్రయాణంలో ఆనందంగా, హృదయపూర్వకంగా ఉన్న యేసు అనుచరులుగా ఉండడమే నేడు మనకున్న ముఖ్యమైన సవాలు. యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా, మనం మూడు ముఖ్యమైన సత్యాలను నమ్ముతాము మరియు వాటిలో వృద్ధిచెందగలము.
మొదటిది, సులువుగా లేనప్పుడు కూడా, మనం మన నిబంధనలను పాటించగలము.
మీ విశ్వాసం, మీ కుటుంబం లేదా మీ భవిష్యత్తు సవాలు చేయబడినప్పుడు—సువార్తను జీవించడానికి మీరు ఉత్తమంగా చేస్తున్నప్పుడు జీవితం ఎందుకింత కష్టంగా ఉందని మీరు ఆశ్చర్యపడినప్పుడు—కష్టాలను ఆశించమని ప్రభువు మనతో చెప్పారని గుర్తుంచుకోండి. కష్టాలు ప్రణాళికలో భాగము, దాని అర్థము మీరు విడిచిపెట్టబడ్డారని కాదు; ఆయన శిష్యులుగా ఉండడంలో అవి భాగము.6 ఎంతైనా ఆయన, “వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి ననుభవించినవాడు గాను ఉండెను.”7
నా సౌకర్యం కంటే ఎక్కువగా యేసు క్రీస్తు యొక్క శిష్యురాలిగా నా ఎదుగుదలలో పరలోక తండ్రి ఆసక్తి కలిగియున్నారని నేను నేర్చుకుంటున్నాను. అది అలా ఉండాలని నేను ఎల్లప్పుడూ కోరుకోకపోవచ్చు—కానీ అది ఉంది!
సౌకర్యవంతమైన జీవితాన్ని జీవించడం శక్తిని తీసుకురాదు. మన కాలపు సవాళ్ళను తట్టుకోవడానికి మనకు కావలసిన శక్తి ప్రభువు యొక్క శక్తి మరియు ఆయన శక్తి ఆయనతో మన నిబంధనల ద్వారా ప్రవహిస్తుంది.8 చాలా కష్టమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు విశ్వాసంతో స్పందించడమంటే—ప్రత్యేకించి మనం అలసిపోయినప్పుడు, విచారంగా ఉన్నప్పుడు, కష్టమైన ప్రశ్నలతో, విషయాలతో పోరాడుతున్నప్పుడు కూడా మనం చేస్తామని రక్షకునితో మనం నిబంధన చేసిన దానిని ప్రతీరోజు చేయడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించడమంటే—ఆయన వెలుగును, ఆయన బలాన్ని, ఆయన ప్రేమను, ఆయన ఆత్మను, ఆయన శాంతిని క్రమంగా పొందడం.
నిబంధన బాటపై నడవడానికి కారణం రక్షకుడిని సమీపించడమే. నిబంధన బాట వెంబడి మన అభివృద్ధి యొక్క ఉద్దేశము ఆయనే, మన పరిపూర్ణమైన పురోగతి కాదు. అది పరుగుపందెం కాదు మరియు మనం మన ప్రయాణాన్ని ఇతరులతో పోల్చుకోకూడదు. మనం తొట్రిల్లినప్పుడు కూడా ఆయన అక్కడుంటారు.
రెండవది, మనం విశ్వాసంతో పని చేయగలము.
యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా, ప్రత్యేకించి కష్టకాలములో— ఆయన యందు విశ్వాసానికి క్రియ అవసరమని మనకు తెలుసు.9
చాలా సంవత్సరాల క్రితం, ఇంటిలో తివాచీ మార్చాలని మా తల్లిదండ్రులు నిర్ణయించారు. క్రొత్త తివాచీ రావడానికి ముందు రోజు రాత్రి, అది వేయగలిగేలా సామాన్లు తీసి, పడకగదిలో ఉన్న పాత తివాచీలను తొలగించమని మా అమ్మ నా తమ్ముళ్ళను అడిగింది. అప్పుడు, నా ఏడేళ్ల సోదరి ఎమిలీ, అప్పటికే నిద్రలో ఉంది. కాబట్టి, ఆమె నిద్రపోతుండగానే వాళ్ళు నెమ్మదిగా మంచం తప్ప, ఆమె గదిలోని సామాన్లన్నీ తీసివేసారు, తర్వాత తివాచీని తొలగించారు. అయితే, అన్నలు కొన్నిసార్లు చేసేలా, వాళ్ళు ఒక చిలిపి పని చేయాలనుకున్నారు. వాళ్ళు బీరువాలో నుండి, గోడలపై నుండి ఆమెకు సంబంధించిన వాటన్నిటిని తీసివేసి, గది ఖాళీ చేసారు. తర్వాత ఒక గమనిక వ్రాసి, దానిని గోడకు తగిలించారు: “ప్రియమైన ఎమిలి, మేము ఇల్లు ఖాళీ చేసాము. కొద్దిరోజులలో నీకు ఉత్తరం రాస్తాము మరియు మేము ఎక్కడ ఉన్నామో చెప్తాము. ప్రేమతో, నీ కుటుంబము.”
మరుసటి ఉదయం ఎమిలి అల్పాహారానికి రాకపోవడంతో, నా తమ్ముళ్ళు ఆమెను వెదకడానికి వెళ్ళారు—అక్కడ ఆమె, మూసివున్న తలుపు వెనుక ఒంటరిగా, విచారంగా కూర్చొని ఉంది. ఈ అనుభవం గురించి ఎమిలి తర్వాత చెప్పింది: “నేను కృంగిపోయాను. కానీ, నేను తలుపు తెరిచి ఉంటే ఏమి జరిగియుండేది? నేను ఏమి వినియుండేదానిని? నేను ఏమి వాసన చూసియుండేదానిని? నేను ఒంటరిగా లేనని నేను తెలుసుకొనేదానిని. నేను నిజంగా ప్రేమించబడ్డానని నేను తెలుసుకొనేదానిని. నా పరిస్థితి గురించి ఏదైనా చేయాలనే ఆలోచనే నా మనస్సులో మెదలలేదు. నేను ఆశ వదులుకొని, నా గదిలో ఏడుస్తూ ఉండిపోయాను. అయినా నేను తలుపు తెరిచివుంటే, నాకు నిజం తెలిసేది.”10
ఆమె చూసిన దానిపై ఆధారపడి నా చెల్లెలు ఊహించుకుంది, కానీ అది వాస్తవంగా ఉన్న దానికి ప్రతిబింబం కాదు. మనం కూడా ఎమిలి వలె విచారం, బాధ, నిరుత్సాహం, చింత, ఒంటరితనం, కోపం లేదా వైఫల్యం చేత ఎంతగా ముంచివేయబడినట్లు భావిస్తామంటే, ఏదైనా చేయాలని, తలుపు తెరవాలని, యేసు క్రీస్తు నందు విశ్వాసంతో చర్య తీసుకోవాలనే ఆలోచన కూడా మనకు రాకపోవడం ఆసక్తికరమైనది, కదా?
లేఖనాలు స్త్రీ పురుషులు, క్రీస్తు యొక్క శిష్యుల మాదిరులతో నిండియున్నాయి, వారు అసాధ్యమైన దానిని ఎదుర్కొన్నప్పుడు కేవలం చర్య తీసుకున్నారు—వారు విశ్వాసముతో పైకి లేచి, నడిచారు.11
స్వస్థత కోరిన కుష్ఠురోగులతో క్రీస్తు ఇలా అన్నారు: “వెళ్ళి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడి. మరియు వారు వెళ్ళుచుండగా, శుద్ధులైరి.”12
వారు అప్పటికే స్వస్థపరచబడినట్లు వారు తమనుతాము యాజకులకు కనబరచుకోవడానికి వెళ్ళారు మరియు చర్య తీసుకొనే ప్రక్రియలో వారు శుద్ధులయ్యారు.
మీ బాధలో చర్య తీసుకోవాలనే ఆలోచన రావడం అసాధ్యమనిపిస్తే, దయచేసి సహాయం కోసం మీ చర్య—ఒక స్నేహితుడిని, ఒక కుటుంబ సభ్యుని, ఒక సంఘ నాయకుని, ఒక నిపుణుడిని సమీపించడం కానివ్వమని కూడా నేను చెప్పదలిచాను. ఇది నిరీక్షణకు మొదటి అడుగు కాగలదు.
మూడవది, మన భక్తిలో మనం హృదయపూర్వకంగా, ఆనందంగా ఉండగలము.13
కష్టసమయాలు వచ్చినప్పుడు, నేను భూమిపైకి రాకముందు క్రీస్తును అనుసరించడానికి ఎంచుకున్నానని మరియు నా విశ్వాసం, నా ఆరోగ్యం, నా సహనాన్ని సవాలు చేసేవన్నీ నేను ఇక్కడ ఉన్నాను అనే కారణంలో భాగమని గుర్తుంచుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. ఈనాటి కష్టం నా కొరకు దేవుని ప్రేమను ప్రశ్నిస్తుందని లేదా ఆయన యందు నా విశ్వాసాన్ని సందేహంగా మారుస్తుందని నిశ్చయంగా నేనెప్పుడూ అనుకోకూడదు. కష్టాలకు అర్థం ప్రణాళిక విఫలమవుతోందని కాదు; దేవుడిని వెదకడానికి నాకు సహాయపడేలా అవి ప్రణాళికలో భాగమైయున్నాయి. నేను ఓర్పుతో సహించినప్పుడు, నేను మరింతగా ఆయనలా మారతాను మరియు వేదనలో ఉన్నప్పుడు, ఆశాజనకంగా ఆయనలా మరింత మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తాను.14
వెలతో సంబంధం లేకుండా, తన హృదయమంతటితో మన తండ్రిని ప్రేమించడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు క్రీస్తు పరిపూర్ణమైన మాదిరి.15 అదేవిధంగా చేయడం ద్వారా ఆయన మాదిరిని నేను అనుసరించాలనుకుంటున్నాను.
దేవాలయ కానుకపెట్టెలో తన రెండు కాసులను వేసిన విధవరాలి హృదయపూర్వకమైన, పరిపూర్ణమైన శిష్యత్వం చేత నేను ప్రేరేపించబడ్డాను. ఆమె తనకు కలిగినదంతా ఇచ్చింది.16
యేసు క్రీస్తు ఆమె ఇచ్చిన దానిలో సమృద్ధిని గుర్తిస్తే, ఇతరులు కేవలం ఆమె లేమిని చూసారు. మనలో ప్రతీఒక్కరి విషయంలో అదే నిజము. ఆయన మన లోపాలను వైఫల్యాలుగా చూడరు, కానీ బదులుగా విశ్వాసాన్ని సాధనచేసి, వృద్ధిచెందడానికి అవకాశంగా చూస్తారు.
ముగింపు
యేసు క్రీస్తు యొక్క నా తోటి శిష్యులారా, నా హృదయమంతటితో నేను ప్రభువుకు నమ్మకంగా ఉండాలని ఎంచుకుంటున్నాను. ఆయన ఏర్పరచుకున్న సేవకులైన—అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మరియు ఆయన తోటి అపొస్తలుల పట్ల నమ్మకంగాగా ఉండాలని నేను ఎంచుకుంటున్నాను—ఎందుకంటే, వారు ఆయన కొరకు మాట్లాడతారు మరియు నన్ను రక్షకునితో కలిపియుంచే విధులు, నిబంధనల యొక్క గృహనిర్వాహకులు.
నేను తొట్రిల్లినప్పుడు, యేసు క్రీస్తు యొక్క కృప మరియు సాధ్యపరచు శక్తిపై ఆధారపడుతూ నేను దానిని సరిచేయడానికి ప్రయత్నిస్తాను. నేను ఆయనతో నా నిబంధనలో నిలుస్తాను మరియు దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, విశ్వాసం ద్వారా మరియు నేను ఎవరి మార్గదర్శకత్వాన్ని విశ్వసిస్తానో ఆ పరిశుద్ధాత్మ సహాయంతో నా ప్రశ్నలపై పనిచేస్తాను. చిన్న మరియు సరళమైన విషయాలను చేయడం ద్వారా ప్రతీరోజు నేను ఆయన ఆత్మను వెదకుతాను.
ఇది నా శిష్యత్వపు బాట.
మర్త్యత్వము యొక్క అనుదిన గాయాలు మానే రోజు వరకు నేను ప్రభువు కొరకు ఎదురుచూస్తాను మరియు ఆయనను—ఆయన సమయాన్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన ప్రణాళికను నమ్ముతాను.17
మీతో కలిసి పనిచేస్తూ, నేను శాశ్వతంగా ఆయన పట్ల నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను. హృదయపూర్వకంగా. మన హృదయమంతటితో మనం యేసు క్రీస్తును ప్రేమిస్తున్నామని తెలుసుకొన్నప్పుడు, ఆయన అన్నింటిని మనకు తిరిగి ఇస్తారు.18 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.