యేసు ఎవరోయని వారు చూడగోరెను
యేసు జీవిస్తున్నాడని, ఆయన మనల్ని ఎరుగునని, స్వస్థపరచడానికి, మార్చడానికి మరియు క్షమించడానికి ఆయన శక్తిని కలిగియున్నాడని నేను సాక్ష్యమిస్తున్నాను.
సహోదర సహోదరీలారా మరియు స్నేహితులారా, 2013 లో నా భార్య లారెల్, నేను చెక్/స్లోవాక్ మిషనులో మిషను నాయకులుగా సేవ చేయడానికి పిలువబడ్డాము. మా నలుగురు పిల్లలు మాతోపాటు సేవ చేసారు.1 మేము తెలివైన సువార్తికులతో, ప్రముఖమైన చెక్ మరియు స్లోవాక్ పరిశుద్ధులతో కుటుంబంగా దీవించబడ్డాము. మేము వారిని ప్రేమిస్తాము.
మా కుటుంబము మిషను ప్రాంతము చేరుకున్నప్పుడు, ఎల్డర్ జోసెఫ్ బి. వర్త్‌లిన్ బోధించినది మాతోపాటు వచ్చింది. “గొప్ప ఆజ్ఞ” అని పేరుగల ప్రసంగంలో, “మీరు ప్రభువును ప్రేమిస్తున్నారా?” అని ఎల్డర్ వర్త్‌లిన్ ప్రశ్నించారు. అవును అని జవాబిచ్చిన మాలాంటి వారికి ఆయన సలహా సాధారణమైనది మరియు గంభీరమైనది: “ఆయనతో సమయాన్ని గడపండి. ఆయన మాటలను ధ్యానించండి. ఆయన కాడిని మీపై తీసుకోండి. అర్థం చేసుకోవడానికి వెదకండి మరియు లోబడండి.”2 తర్వాత, యేసు క్రీస్తుకు సమయాన్ని మరియు స్థలమును ఇవ్వడానికి ఒడంబడిక చేసుకొన్న వారికి పరివర్తన చెందు దీవెనలను ఎల్డర్ వర్త్‌లిన్ వాగ్దానము చేసారు.3
మేము ఎల్డర్ వర్త్‌లిన్ సలహాను, వాగ్దానమును మనస్సుకు హత్తుకున్నాము. మా సువార్తికులతో కలిసి, మేము క్రొత్త నిబంధన నుండి మత్తయి, మార్కు, లూకా, యోహాను మరియు మోర్మన్ గ్రంథము నుండి 3 నీఫై అధ్యయనం చేస్తూ ఎక్కువ సమయాన్ని యేసుతో గడిపాము. “ఐదు సువార్తలు”4 అని మేము సూచించిన దానిలో యేసు గురించి చదివి, చర్చించి, పరిగణించి, నేర్చుకొని, వాటిలో ఒకదాని నుండి ఆత్మీయ సందేశముతో ప్రతీ సువార్తకుల సమావేశమును మేము ముగించాము.
నాకు, లారెల్‌కు మరియు మా సువార్తికులకైతే, లేఖనాలలో యేసుతో సమయాన్ని గడపడం సమస్తాన్ని మార్చివేసింది. ఆయన ఎవరు, ఆయనకు ఏది ముఖ్యమైనదో అనేదాని కొరకు మేము లోతైన ప్రశంసను పొందాము. ఆయన ఎలా బోధించారు, ఏమి బోధించారు, ఆయన ప్రేమ చూపించిన విధానములు, దీవించడానికి, సేవ చేయడానికి ఆయన ఏమి చేసారు, ఆయన అద్భుతాలు, మోసగించబడినప్పుడు ఆయన ఎలా స్పందించారు, కష్టమైన మానవ భావావేశాలతో ఆయన ఏమి చేసారు, ఆయన బిరుదులు, పేర్లు, ఆయన ఎలా విన్నారు, ఆయన వివాదమును ఎలా పరిష్కరించారు, ఆయన జీవించిన ప్రపంచము, ఆయన ఉపమానములు, ఆయన ఐక్యతను మరియు దయను ఎలా ప్రోత్సహించారు, క్షమించడానికి మరియు స్వస్థపరచడానికి ఆయన సామర్థ్యము, ఆయన ప్రసంగాలు, ఆయన ప్రార్థనలు, ఆయన ప్రాయశ్చిత్త త్యాగము, ఆయన పునరుత్థానము, ఆయన సువార్తను మేము కలిసి పరిగణించాము.
యేసు యెరికో గుండా వెళ్ళుచుండగా, రావి చెట్టు ఎక్కడానికి పరిగెత్తిన “[పొట్టివాడు]” అయిన జెకర్యా వలే మేము తరచుగా భావించాము, లూకా దానిని వివరించినట్లుగా, మేము “యేసు ఎవరోయని చూడగోరాము.”5 ఆయన మేము కోరినట్లుగా లేదా ఆశించినట్లుగా ఉన్న యేసు కాదు, బదులుగా, యేసు ఉన్నట్లుగా నిజముగా ఉన్నాడు.6 ఎల్డర్ వర్త్‌లిన్ వాగ్దానమిచ్చినట్లుగా, “యేసు క్రీస్తు యొక్క సువార్త పరివర్తన యొక్క సువార్త అని చాలా వాస్తవమైన విధానంలో మేము నేర్చుకున్నాము. అది భూమి యొక్క పురుషులు మరియు స్త్రీలుగా మనల్ని తీసుకొని, నిత్యత్వము కొరకైన పురుషులు, స్త్రీలుగా మనల్ని శుద్ధి చేస్తుంది.”7
ఆ రోజులు ప్రత్యేకమైనవి. “దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని”8 మేము నమ్మగలిగాము. ప్రేగ్, బ్రాటిస్లావా లేదా బర్నోలో పవిత్రమైన మధ్యాహ్నాలు, యేసు యొక్క వాస్తవికతను మరియు శక్తిని అనుభూతి చెందడం, మా జీవితములంతటా శక్తివంతమైన ప్రభావంగా ఉండుట కొనసాగించాయి.
మేము తరచుగా మార్కు 2:1–12 అధ్యయనం చేసాము. ఆ కథ చాలా ప్రేరేపితమైనది. నేను దానిలో భాగమును మార్కు నుండి నేరుగా చదవాలనుకుంటున్నాను, తరువాత విస్తారమైన అధ్యయనము మరియు మా సువార్తికులతో, ఇతరులతో చర్చ తరువాత నేను గ్రహించినట్లుగా దానిని పంచుకుంటాను.9
“కొన్నిదినములైన పిమ్మట [యేసు] మరల కపెర్నహూములోనికి వచ్చెను; ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు
“అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా,
“కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసికొని వచ్చిరి.
“చాలమంది కూడియున్నందున వారాయన యొద్దకు చేరలేక, ఆయన యున్న చోటికి పైగా ఇంటి కప్పును విప్పి, సందు చేసి పక్షవాయువుగల వానిని పరుపుతోనే దింపిరి.
“యేసు వారి విశ్వాసము చూచి--కుమారుడా నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువుగల వానితో చెప్పెను.”
గుంపులో కొందరితో మాట్లాడిన తరువాత,10 యేసు పక్షవాయువుగల వానిని చూచి, అతడిని శారీరకంగా స్వస్థపరచి, ఇలా అన్నారు:
“నీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను.
“తక్షణమే అతడు లేచి పరుపెత్తికొని, వారందరి యెదుట నడచిపోయెను గనుక, వారందరు విభ్రాంతి నొంది--మనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.”11
ఇప్పుడు నేను అర్థము చేసుకున్న కథ: ఆయన పరిచర్య ప్రారంభంలో, యేసు కపెర్నహూముకు తిరిగి వచ్చారు, అది గలిలయ సముద్రమునకు ఉత్తర తీరమున ఉన్న చేపలు పట్టే చిన్న గ్రామము.12 ఆయన ఈమధ్య రోగులను స్వస్థపరచుట మరియు దురాత్మలను వెళ్ళగొట్టుట వంటి వరుస అద్భుతాలను చేసారు.13 ఆయన ఇంట వున్నాడని విని యేసు అని పిలువబడిన వ్యక్తిని వినడానికి ఆతృత కలిగియుండి, అనుభూతి చెందడానికి గ్రామస్థులు కూడుకున్నారు.14 వారు కూడినప్పుడు, యేసు బోధించడం ప్రారంభించారు.15
ఆ సమయమందు కపెర్నహూములోని గృహాలు, చదునైన పైకప్పు గలిగి, సమూహంగా ఉన్న ఒకే అంతస్తుగల నివాసాలు.16 పైకప్పు మరియు గోడలు రాయి, కలప, మట్టి మరియు గడ్డి మిశ్రమంతో కూడినవి, ఇంటి వైపున ఉన్న సాధారణమైన మెట్ల ద్వారా చేరుకోబడినవి.17 ఇంటివద్ద సమూహము త్వరగా పెద్దదయ్యింది, యేసు బోధిస్తున్న గది నిండిపోయి, వీధి బయటకు విస్తరించింది.18
కథ “పక్షవాయువు” గల మనుష్యునిపై మరియు అతడి నలుగురు స్నేహితులపై దృష్టిసారిస్తుంది.19 పక్షవాయువు ఒక రకమైన పక్షవాతము, తరచుగా బలహీనత మరియు వణకుతో కూడి వుంటుంది.20 నలుగురిలో ఒకరు, “యేసు మన గ్రామంలో ఉన్నాడు” అని చెప్పడాన్ని నేనూహిస్తున్నాను. ఆయన చేసిన అద్భుతాలు మరియు ఆయన స్వస్థపరచిన వారి గురించి మనందరికి తెలుసు. మన స్నేహితుడిని యేసు వద్దకు మనం తీసుకొని వెళ్ళగలిగితే, బహుశా అతడు కూడా స్వస్థపరచబడగలడు.
కాబట్టి, వారిలో ప్రతీఒక్కరూ తమ స్నేహితుడు పడుకున్న చాప లేదా మంచం యొక్క ఒక మూలను పట్టుకొని, కపెర్నహూము యొక్క వంకరయైన, ఇరుకైన, చదును చేయని వీధుల గుండా అతడిని మోసుకెళ్ళడం ప్రారంభిస్తారు.21 కండరాల నొప్పులతో, నలుగురూ చివరి మూలను తిరుగుతారు లేదా లేఖనాలు చెప్పినట్లుగా, వినడానికి జనులు చాలామంది “కూడియున్నందున” ద్వారము గుండా యేసు వద్దకు వారి స్నేహితుడిని తీసుకొని వెళ్ళుట అసాధ్యమైనదని వారు కనుగొంటారు.22 ప్రేమ మరియు విశ్వాసముతో, ఆ నలుగురు నిరాశ చెందరు. బదులుగా, వారు చదునైన పైకప్పు వద్దకు మెట్లపైన ముందుకెళ్ళి, వారి స్నేహితుడిని, అతడి మంచమును జాగ్రత్తగా పైకెత్తి, యేసు బోధిస్తున్న గది పైకప్పును పగులగొట్టి వారి స్నేహితుడిని దించుతారు.23
గంభీరంగా బోధిస్తున్న క్షణంలో, గీస్తున్న శబ్దాన్ని విని, యేసు పైకి చూచి, గదిలోనికి దుమ్ము, గడ్డి పడుతుండగా పైకప్పులో పెరుగుతున్న రంధ్రాన్ని చూడడాన్ని పరిగణించండి. తరువాత మంచముపైన పక్షవాయువుగల వ్యక్తి నేలమీద దించబడ్డాడు. విశేషమేమిటంటే, యేసు దానిని అంతరాయంగా కాకుండా ముఖ్యమైనదిగా చూసారు. ఆయన మంచంపై ఉన్న ఆ వ్యక్తి వైపు చూసి, బహిరంగంగా అతడి పాపములు క్షమించారు మరియు శారీరకంగా అతడిని స్వస్థపరిచారు.24
మార్కు 2 లో చెప్పినది దృష్టిలో ఉంచుకుంటే, క్రీస్తుగా యేసు గురించి అనేక ముఖ్యమైన సత్యములు స్పష్టమవుతాయి. మొదటిది, మనము ప్రేమించే వారు క్రీస్తునొద్దకు రావడానికి సహాయపడేందుకు ప్రయత్నించినప్పుడు, ఆయన పాప భారమును పైకెత్తి, క్షమించడానికి సామర్థ్యమును కలిగియున్నాడనే విశ్వాసముతో మనము ఆవిధంగా చేయగలము. రెండవది, మనము శారీరకమైనవి, భావావేశమైనవి లేదా ఇతర వ్యాధులను క్రీస్తు నొద్దకు తెచ్చినప్పుడు, ఆయన స్వస్థపరచుటకు మరియు ఓదార్చడానికి శక్తిని కలిగియున్నారని తెలుసుకొని ఆవిధంగా చేయగలము. మూడవది, ఇతరులను క్రీస్తునొద్దకు తీసుకొని రావడానికి ఆ నలుగురి వలె మనము ప్రయత్నము చేసినప్పుడు, ఆయన మన నిజమైన ఉద్దేశాలను చూచి, వాటిని సరిగ్గా గౌరవిస్తారనే నిశ్చయముతో మనము ఆవిధంగా చేయగలము.
జ్ఞాపకముంచుకోండి, పైకప్పు రంధ్రము కనబడుటతో యేసు యొక్క బోధనలో అంతరాయం ఏర్పడింది. అంతరాయం కలిగేలా రంధ్రము చేసిన నలుగురిని గద్దించుటకు లేదా పంపివేయుటకు బదులుగా, “యేసు వారివిశ్వాసమును చూసారు”25 అని లేఖనాలు చెప్తున్నాయి. అప్పుడు అద్భుతమును ప్రత్యక్షంగా చూసిన వారు “విభ్రాంతి నొంది--మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.”26
సహోదర సహోదరీలారా, రెండు అదనపు గమనికలతో నేను ముగిస్తాను. సువార్తికులు, పరిచారకులు, ఉపశమన సమాజ అధ్యక్షురాళ్ళు, బిషప్పులు, బోధకులు, తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా స్నేహితులు ఎవరైనప్పటికీ, మనమందరం కడవరి దిన పరిశుద్ధులుగా క్రీస్తునొద్దకు ఇతరులను తెచ్చు కార్యములో పూనికొనియున్నాము. కాబట్టి, నలుగురు స్నేహితుల చేత ప్రదర్శించబడిన లక్షణాలు పరిగణించదగినవి మరియు అనుకరించదగినవి.27 వారు ధైర్యంగా, అనుకూలంగా, స్థితిస్థాపకంగా, సృజనాత్మకంగా, బహుముఖంగా, ఆశాజనకంగా ఉన్నారు, వారు తీర్మానముగలవారు, విశ్వాసపాత్రులు, ఆశావాదులు, వినయం మరియు సహనం గలవారు.
అదనంగా, నలుగురు సమాజము మరియు సహవాసము యొక్క ఆత్మీయ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.28 వారి స్నేహితుడిని క్రీస్తు నొద్దకు తేవడానికి, నలుగురిలో ప్రతీఒక్కరు మంచము యొక్క ఒక మూలను మోయాలి. ఒకరు వదిలేస్తే, మోయడం ఎక్కువ కష్టమవుతుంది. ఇద్దరు ప్రయత్నాన్ని విడిచిపెడితే, పని సమర్థవంతంగా అసాధ్యమవుతుంది. దేవుని రాజ్యములో మనలో ప్రతీఒక్కరు ఒక పాత్రను పోషించవలసి ఉన్నది.29 ఆ పాత్రను మనము నెరవేర్చి, మన వంతు చేసినప్పుడు, మన మూలను మనం మోస్తున్నాము. అర్జెంటీనా లేదా వియత్నాం, ఆక్రా లేదా బ్రిస్బేన్‌లోనైనా, ఒక బ్రాంచి లేక ఒక వార్డు, ఒక కుటుంబము లేదా ఒక సువార్తికుల సహవాసత్వమైనా, మనలో ప్రతీఒక్కరూ ఒక మూలను మోయవలసియున్నది. మనము చేసినప్పుడు మరియు చేసిన యెడల, ప్రభువు మనందరిని దీవిస్తారు. ఆయన వారి విశ్వాసమును చూచినట్లుగా, మన విశ్వాసమును చూసి, జనులుగా మనల్ని దీవిస్తారు.
వేర్వేరు సమయాలలో మంచము యొక్క మూలను నేను మోసాను, మరియు ఇతర సమయాల్లో నేను మోయబడ్డాను. యేసు యొక్క ఈ అసాధారణమైన కథ యొక్క శక్తిలో భాగమేదంటే, క్రీస్తునొద్దకు రావడానికి మరియు మార్పు చెందడానికి సహోదర సహోదరీలుగా మనం ఒకరికొకరం ఎంత అవసరమో ఇది మనకు గుర్తు చేస్తుంది.
ఇవి మార్కు 2 లో యేసుతో సమయాన్ని గడపడం నుండి నేను నేర్చుకొన్న విషయాలలో కొన్ని.
“మనము విడిచిపెట్టకుండా, భయపడకుండా, మన విశ్వాసములో దృఢముగా ఉండి, ప్రభువు యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి మన కార్యములో తీర్మానము కలిగియుండి, [మన మూలను మోయగల] సామర్థ్యాన్ని దేవుడు దయచేయును గాక.”30
యేసు జీవిస్తున్నాడని, ఆయన మనల్ని ఎరుగునని, స్వస్థపరచడానికి, మార్చడానికి మరియు క్షమించడానికి ఆయన శక్తిని కలిగియున్నాడని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.