సర్వసభ్య సమావేశము
ఏది సత్యము?
2022 అక్టోబరు సర్వసభ్య సమావేశము


5:59

ఏది సత్యము?

దేవుడు సమస్త సత్యాలకు మూలం. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము, దేవుడు తన పిల్లలకు తెలియజేసే అన్ని సత్యాలను కలిగి ఉంటుంది.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ ప్రేరేపించబడిన సభ కొరకు అందరికీ ధన్యవాదాలు! గత ఏప్రిల్‌లో మన సమావేశం జరిగినప్పటి నుండి, మనం ఒక ప్రక్క తీవ్రమైన బాధ కలిగించే సంఘటనలు, మరొకప్రక్క గొప్ప ఆనందాన్ని కలిగించే సంఘటనలు అనేకం చూసాము.

ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడిన భారీ యువజన సమావేశాల నివేదికలతో మేము సంతోషించాము.1 వారి జీవితాల్లో ఏమి జరిగినప్పటికీ, ప్రధానంగా వారి బలము ప్రభువు నుండి వస్తుందని ఈ సమావేశాలలో మన గొప్ప యువత నేర్చుకుంటున్నారు.2

ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేవాలయాలు నిర్మించబడుతున్నాయని మేము ఆనందిస్తున్నాము. ప్రతీ క్రొత్త దేవాలయ ప్రతిష్ఠాపనతో, మనల్ని బలపరచడానికి మరియు అపవాది యొక్క తీవ్రమైన ప్రయత్నాలను ప్రతిఘటించడానికి అదనంగా దేవుని శక్తి లోకంలోకి వస్తుంది.

హింస అపవాది యొక్క ప్రభావాన్ని ఏర్పరుస్తుంది. అది ఘోరమైన పాపము.3 సంఘము యొక్క అధ్యక్షునిగా నేను, ఈ విషయంపై ప్రభువైన యేసు క్రీస్తు బోధనలను ధృవీకరిస్తున్నాను. అత్యంత స్పష్టంగా నేను చెప్తాను: స్త్రీలు, పిల్లలు లేదా ఎవరి పట్ల అయినా, విధమైన హింస అయినా ప్రభువుకు అసహ్యకరము. ఎప్పుడైనా ఎవరైనా బాధింపబడితే ఆయన దుఃఖిస్తారు, నేను దుఃఖిస్తాను. ఏ రకమైన హింసకైనా గురైన ప్రతీఒక్క బాధితుని కోసం ఆయన దుఃఖిస్తారు మరియు మనందరం దుఃఖిస్తాము. ఈ నీచమైన చర్యలకు పాల్పడేవారు మనిషి రూపొందించిన చట్టాలకు జవాబుదారీగా ఉండటమే కాకుండా సర్వశక్తిమంతుడైన దేవుని ఆగ్రహానికి గురవుతారు.

ఇప్పటికి కొన్ని దశాబ్దాల నుండి—ప్రత్యేకించి—పిల్లలను హింస నుండి కాపాడడానికి సంఘము విస్తృత చర్యలు చేపట్టింది. సంఘ వెబ్‌సైటులో అనేక సహాయాలున్నాయి. వాటిని అధ్యయనం చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.4 ఈ మార్గదర్శకాలు అమాయకులను రక్షించడానికి స్థాపించబడ్డాయి. హింసించబడగల ప్రమాదంలో ఉన్న ఎవరిపట్ల అయినా అప్రమత్తంగా ఉండమని, వారిని రక్షించడానికి వెంటనే స్పందించమని మీలో ప్రతీఒక్కరిని నేను కోరుతున్నాను. రక్షకుడు హింసను సహించరు, ఆయన శిష్యులుగా, మనం కూడా సహించకూడదు.

అపవాది ఇతర అవాంతర వ్యూహాలు కలిగియున్నాడు. ఏది నిజమో, ఏది కాదో తెలుసుకోవడాన్ని కష్టతరం చేయడం అతని ప్రయత్నాల్లో ఒకటి. సులువుగా లభ్యమయ్యే అత్యధిక సమాచారం, హాస్యాస్పదంగా, ఏది సత్యమో గుర్తించడాన్ని కష్టతరం చేస్తుంది.

నేను, సహోదరి నెల్సన్ ఒక దేశంలో ఒక ప్రముఖుడిని దర్శించడానికి వెళ్ళినప్పుడు కలిగిన అనుభవాన్ని ఈ సవాలు నాకు గుర్తుచేస్తుంది, అక్కడ చాలా తక్కువమంది యేసు క్రీస్తు గురించి విన్నారు. వృద్ధుడవుతున్న ఈ స్నేహితుడు ఇటీవల చాలా అనారోగ్యంతో ఉన్నాడు. చాలా రోజులు మంచంపైనే ఉండిపోయినప్పుడు, అతడు తరచు పైకప్పు వంక తేరిచూస్తూ, “ఏది సత్యము?” అని అడిగినట్లు అతడు మాతో చెప్పాడు.

నేడు భూమిపైనున్న అనేకమంది “సత్యమును ఎక్కడ కనుగొనవలెనో తెలియకపోవుట వలన దానిని యెరుగకయున్నారు.”5 సత్యము సాపేక్షమైనదని—ప్రతీఒక్కరు ఏది సత్యము అని ఎవరికివారు నిశ్చయించుకోవాలని మనం నమ్మేలా కొందరు చేస్తారు. వారు దేవునికి జవాబుదారులు కాదని కూడా తప్పుగా ఆలోచించే వారికి అటువంటి నమ్మకము కేవలం వారు కోరుకున్న ఆలోచన.

ప్రియమైన సహోదర సహోదరీలారా, దేవుడు సమస్త సత్యము యొక్క మూలము. దేవుడు తన పిల్లలకు తెలియజేసే సత్యము, అది శాస్త్రీయ ప్రయోగశాలలో నేర్చుకోబడినా లేదా ఆయన నుండి తిన్నని బయల్పాటు ద్వారా పొందబడినా, ఆ సత్యము మొత్తాన్ని యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము హత్తుకుంటుంది.

నేడు మరియు రేపు, ఈ వేదిక నుండి మీరు సత్యాన్ని వినడం కొనసాగిస్తారు. మీ దృష్టిని ఆకర్షించేవి, మీ మనస్సులోనికి వచ్చేవి మరియు మీ హృదయంలో నిలిచియుండే ఆలోచనలను దయచేసి వ్రాసియుంచుకోండి. మీరు వినినది సత్యమని నిర్ధారించడానికి ప్రార్థనాపూర్వకంగా ప్రభువును అడగండి.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు వెదకుతున్న ఆత్మీయ విందును, ఈ సమావేశము అందించాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.