19వ అధ్యాయము
రాజైన నోవహును సంహరించుటకు గిడియన్ ప్రయత్నించును—లేమనీయులు దేశముపై దండెత్తుదురు—రాజైన నోవహు అగ్నిచేత మరణమును అనుభవించును—లింహై ఒక సామంత రాజుగా పరిపాలించును. సుమారు క్రీ. పూ. 145–121 సం.
1 ప్రభువు యొక్క జనుల కొరకు వ్యర్థముగా వెదికి రాజు యొక్క సైన్యములు తిరిగి వచ్చెను.
2 ఇప్పుడు రాజు యొక్క సైన్యములు తగ్గిపోయి, చిన్నవాయెను మరియు జనులలో మిగిలిన వారి మధ్య ఒక చీలిక మొదలాయెను.
3 చిన్నభాగము రాజుకు వ్యతిరేకముగా బెదిరింపులు మొదలుపెట్టెను మరియు వారి మధ్య గొప్ప వివాదము మొదలాయెను.
4 ఇప్పుడు వారి మధ్య గిడియన్ అను పేరుగల బలమైన మనుష్యుడొకడు ఉండెను, అతడు రాజుకు శత్రువైయుండెను, కావున అతడు తన ఖడ్గమును దూసి, రాజును సంహరించెదనని కోపమందు ఒట్టు పెట్టుకొనెను.
5 అతడు రాజుతో పోరాడెను; అతడు తనను ఓడించబోవుచున్నాడని చూచినప్పుడు రాజు పరుగెత్తి పారిపోయి దేవాలయమునకు దగ్గరగా నున్న గోపురముపైకి చేరెను.
6 గిడియన్ రాజు వెంటపడి, అతడిని సంహరించుటకు గోపురముపైకి చేరబోయెను మరియు రాజు షెమ్లోన్ దేశము వైపు చుట్టూ చూచినప్పుడు లేమనీయుల సైన్యము దేశ సరిహద్దులలో ఉండుట గమనించెను.
7 ఇప్పుడు రాజు ఆందోళన చెంది బిగ్గరగా ఇట్లనెను: గిడియన్, నన్ను విడిచిపెట్టుము, లేమనీయులు మనపై దండెత్తుతున్నారు, వారు మనలను నాశనము చేయుదురు; వారు నా జనులను నాశనము చేయుదురు.
8 అయితే రాజు తన ప్రాణమును గూర్చి వ్యాకులపడినంత అధికముగా తన జనులను గూర్చి చింతించలేదు; అయినప్పటికీ గిడియన్ అతడిని విడిచిపెట్టెను.
9 అప్పుడు లేమనీయుల యెదుట నుండి పారిపొమ్మని రాజు జనులను ఆజ్ఞాపించెను, అతడు కూడా వారి ముందు వెళ్ళెను మరియు వారు తమ స్త్రీలు, పిల్లలతోపాటు అరణ్యములోనికి పారిపోయిరి.
10 లేమనీయులు వారిని తరుముచూ వారిని పట్టుకొని, సంహరించుట మొదలుపెట్టిరి.
11 ఇప్పుడు పురుషులందరు తమ స్త్రీలను, పిల్లలను వదిలి లేమనీయుల యెదుట నుండి పారిపోవలెనని రాజు వారిని ఆజ్ఞాపించెను.
12 కానీ వారిని వదిలివేయక, వారితోపాటు నిలిచియుండి నశించిపోవుటకు ఇష్టపడిన వారనేకులు అక్కడ ఉండిరి. మిగిలిన వారు వారి భార్యలను, పిల్లలను వదిలి పారిపోయిరి.
13 తమ భార్యలతోను, పిల్లలతోను నిలిచినవారు తమ అందమైన కుమార్తెలు వారి ముందు నిలబడి, తమను సంహరించరాదని లేమనీయులను బ్రతిమాలుకొనునట్లు చేసిరి.
14 అంతట లేమనీయులకు వారిపై కనికరము కలిగెను, ఏలయనగా వారి స్త్రీల సౌందర్యము చేత వారు ముగ్ధులైరి.
15 కావున లేమనీయులు వారి ప్రాణములను విడిచిపెట్టి, వారిని బందీలుగా నీఫై దేశమునకు తీసుకొనిపోయిరి మరియు రాజైన నోవహును లేమనీయుల చేతులలోనికి వారు అప్పగించుదురనియు వారి ఆస్థిని, వారు కలిగియున్న సమస్తములో సగమును, వారి బంగారము, వెండి మరియు వారి సమస్త వెలగల వస్తువులలో సగభాగమును అప్పగించివేయుదురను షరతులపై వారు దేశమును స్వాధీనపరచుకొనునట్లు వారు అనుగ్రహించిరి, ఆ విధముగా ప్రతి సంవత్సరము లేమనీయుల రాజుకు వారు కప్పము కట్టవలసియుండెను.
16 ఇప్పుడు బందీలుగా కొనిపోబడిన వారి మధ్య రాజు యొక్క కుమారులలో ఒకడు అక్కడ ఉండెను, అతని పేరు లింహై.
17 తన తండ్రి నాశనము చేయబడరాదని లింహై కోరియుండెను; అయినప్పటికీ అతడు నీతిమంతుడైయుండి, తన తండ్రి యొక్క దోషములను ఎరిగియుండెను.
18 ఇప్పుడు రాజు మరియు అతనితోనున్న వారి కొరకు వెదకుటకు గిడియన్ అరణ్యములోనికి రహస్యముగా మనుష్యులను పంపెను; వారు అరణ్యమందు రాజును అతని యాజకులను తప్ప మిగిలిన జనులందరిని కలుసుకొనిరి.
19 ఆ జనులు తమ భార్యలు, పిల్లలు మరియు వారితోనున్నవారు సంహరింపబడిన యెడల, పగతీర్చుకొనుటకు మరియు వారితోపాటు నశించిపోవుటకు నీఫై దేశమునకు తిరిగి వెళ్ళెదమని తమ హృదయముల యందు ఒట్టుపెట్టుకొనిరి.
20 అయితే వారు తిరిగి వెళ్ళరాదని రాజు వారిని ఆజ్ఞాపించగా, రాజుపై వారి కోపము రగులుకొని అతడు అగ్నిచేత మరణించునట్లు వారు చేసిరి.
21 వారు యాజకులను కూడా చంపబోయిరి, కానీ వారు పారిపోయిరి.
22 వారు నీఫై దేశమునకు తిరిగి వెళ్ళబోవుచుండగా గిడియన్ మనుష్యులను కలుసుకొనిరి. గిడియన్ మనుష్యులు వారి భార్యలకు, పిల్లలకు జరిగినదంతయు వారికి వివరించిరి; మరియు వారికి కలిగియున్న దానంతటిలో సగభాగమును లేమనీయులకు కప్పముగా చెల్లించుట ద్వారా దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు లేమనీయులు వారికి దయచేసిరని చెప్పిరి.
23 తాము రాజును సంహరించితిమని, అతని యాజకులు దూరముగా అరణ్యములోనికి పారిపోయిరని గిడియన్ మనుష్యులతో ఆ జనులు చెప్పిరి.
24 వారు కూటమి ముగించిన తరువాత వారి భార్యలు, పిల్లలు సంహరింపబడనందుకు సంతోషించుచు నీఫై దేశమునకు తిరిగి వెళ్ళి, వారు రాజుపట్ల చేసిన దానిని గిడియన్కు చెప్పిరి.
25 ఇప్పుడు తన జనులు వారిని సంహరించరని లేమనీయుల రాజు వారికి ప్రమాణము చేసెను.
26 మరియు రాజు యొక్క కుమారుడైన లింహై, జనుల చేత రాజ్యము అనుగ్రహించబడిన వాడైయుండి, తన జనులు తాము కలిగియున్న దానంతటిలో సగభాగమును కప్పముగా చెల్లించెదరని లేమనీయుల రాజుకు ప్రమాణము చేసెను.
27 ఇప్పుడు లింహై రాజ్యమును, తన జనుల మధ్య సమాధానమును స్థాపించుట మొదలుపెట్టెను.
28 లింహై జనులు అరణ్యములోనికి వెడలిపోకుండా వారిని దేశమందు ఉంచగలుగునట్లు లేమనీయుల రాజు దేశము చుట్టూ భటులను కాపలా ఉంచెను; నీఫైయుల నుండి పొందిన కప్పముతో అతడు తన భటులను పోషించెను.
29 ఇప్పుడు లేమనీయులు వారిని బాధించలేదు లేదా వారిని నాశనము చేయుటకు ప్రయత్నించలేదు గనుక, రాజైన లింహై తన రాజ్యమందు రెండు సంవత్సరముల పాటు నిరంతర సమాధానము కలిగియుండెను.