24వ అధ్యాయము
ఆల్మా మరియు అతని జనులను అమ్యులోన్ హింసించును—ప్రార్థన చేసిన యెడల, వారు చంపబడవలెను—ప్రభువు వారి భారములను తేలికగా చేయును—ఆయన వారిని దాస్యము నుండి విడిపించును మరియు వారు జరహేమ్లకు తిరిగి వచ్చెదరు. సుమారు క్రీ. పూ. 145–120 సం.
1 లేమనీయుల రాజు దృష్టిలో అమ్యులోన్ అనుగ్రహము సంపాదించెను; కావున అతడు మరియు అతని సహోదరులు తన జనులపై అనగా షెమ్లోన్ దేశమందు, షైలోమ్ దేశమందు, అమ్యులోన్ దేశమందున్న జనులపై బోధకులుగా నియమించబడునట్లు లేమనీయుల రాజు అనుగ్రహించెను.
2 ఏలయనగా లేమనీయులు ఈ దేశములన్నిటిని స్వాధీనము చేసుకొనినందున లేమనీయుల రాజు ఈ దేశములన్నిటిపై రాజులను నియమించెను.
3 ఇప్పుడు అతని తండ్రి పేరును బట్టి లేమనీయుల రాజు పేరు లేమన్ అయ్యుండెను; అందువల్ల అతడు రాజైన లేమన్ అని పిలువబడెను మరియు అతడు అసంఖ్యాక జనులపై రాజుగా ఉండెను.
4 అతని జనులచేత స్వాధీనము చేసుకొనబడిన ప్రతి దేశమందు అతడు అమ్యులోన్ సహోదరులను బోధకులుగా నియమించెను; ఆ విధముగా నీఫైయుల భాష లేమనీయుల యొక్క సమస్త జనుల మధ్య బోధింపబడుట మొదలాయెను.
5 వారు ఒకరితోనొకరు స్నేహము గల జనులుగానుండిరి; అయినప్పటికీ వారు దేవుడిని ఎరుగకయుండిరి; అమ్యులోన్ యొక్క సహోదరులు వారి దేవుడైన ప్రభువును గూర్చి లేదా మోషే ధర్మశాస్త్రమును గూర్చి వారికి ఏమియు బోధించలేదు లేదా వారు అబినడై మాటలను వారికి బోధించలేదు;
6 కానీ వారు తమ వృత్తాంతమును భద్రపరచవలెనని, తద్వారా వారు ఒకరికొకరు వ్రాయవచ్చునని వారికి బోధించిరి.
7 ఆ విధముగా లేమనీయులు ఐశ్వర్యమందు వర్ధిల్లుట మొదలుపెట్టి, ఒకనితోనొకడు వ్యాపారము చేసి గొప్పవారవసాగిరి; లోక జ్ఞానమును బట్టి కపటమైన, తెలివైన జనులైరి; వారి స్వంత సహోదరుల మధ్య తప్ప అంతటా సమస్త విధములైన దుష్టత్వమందు, దోపిడీయందు ఆనందించుచూ నయవంచకులగుట మొదలుపెట్టిరి.
8 ఇప్పుడు ఆల్మా మరియు అతని సహోదరులపై అమ్యులోన్ అధికారము చెలాయించుట మొదలు పెట్టి, అతడిని హింసించుచు తన పిల్లలు, వారి పిల్లలను హింసించునట్లు చేయసాగెను.
9 ఏలయనగా ఆల్మా, రాజు యొక్క యాజకులలో ఒకడైయుండెనని, అబినడై మాటలను విశ్వసించినది అతడేనని మరియు రాజు యెదుట నుండి తరిమివేయబడెనని అమ్యులోన్ ఎరిగియున్నందున అతనిపై కోపముతోనుండెను; రాజైన లేమన్‌కు లోబడియున్నప్పటికీ అతడు వారిపై అధికారము చెలాయించుచూ, పనులు మోపుచూ వారిపై అధికారులను నియమించెను.
10 వారి శ్రమలు ఎంతో గొప్పవైనందున వారు దేవునికి బలముగా మొరపెట్టనారంభించిరి.
11 వారు తమ మొరలను ఆపవలెనని అమ్యులోన్ వారిని ఆజ్ఞాపించెను; దేవునికి ప్రార్థన చేయుచు కనిపించు వారందరు చంపబడునట్లు వారిని కనిపెట్టుటకు అతడు వారిపై కావలివారిని పెట్టెను.
12 ఆల్మా మరియు అతని జనులు తమ దేవుడైన ప్రభువుకు తమ స్వరములనెత్తలేదు, కాని ఆయన యెదుట తమ హృదయములను క్రుమ్మరించిరి మరియు వారి హృదయ తలంపులను ఆయన యెరిగియుండెను.
13 ప్రభువు యొక్క స్వరము వారి శ్రమలయందు వారికి ఇట్లు చెప్పెను: మీ తలలు పైకెత్తి ధైర్యము తెచ్చుకొనుము, ఏలయనగా మీరు నాతో చేసిన నిబంధనను నేనెరుగుదును; నేను నా జనులతో నిబంధన చేయుదును మరియు వారిని దాస్యము నుండి విడిపించెదను.
14 మీ భుజములపై మోపబడిన భారములను నేను సడలించెదను, అందువలన మీరు దాస్యములో ఉన్నప్పుడు కూడా మీ వీపులపై వాటి భారమును ఎరుగరు; ఇక మీదట మీరు నాకు సాక్షులుగా నిలబడునట్లు, నేను ప్రభువైన దేవుడనని నా జనులను వారి శ్రమలలో దర్శించుదునని మీరు నిశ్చయముగా తెలుసుకొనునట్లు నేను దీనిని చేసెదను.
15 ఇప్పుడు ఆల్మా మరియు అతని సహోదరులపై మోపబడిన భారములు తేలిక చేయబడెను; వారు తమ భారములను సునాయాసముగా భరించునట్లు ప్రభువు వారిని బలపరిచెను మరియు వారు సంతోషముతోను సహనముతోను ప్రభువు యొక్క చిత్తమంతటికి లోబడిరి.
16 వారి విశ్వాసము, వారి సహనము ఎంత గొప్పదనగా ప్రభువు యొక్క స్వరము మరలా వారితో ఇట్లు చెప్పెను: ధైర్యము తెచ్చుకొనుము, ఏలయనగా రేపు నేను మిమ్ములను దాస్యము నుండి విడిపించెదను.
17 ఆయన ఆల్మాతో ఇట్లనెను: నీవు ఈ జనులకు ముందుగా వెళ్ళవలెను, నేను నీతో వెళ్ళుదును మరియు ఈ జనులను దాస్యము నుండి విడిపించెదను.
18 ఇప్పుడు ఆల్మా మరియు అతని జనులు రాత్రి సమయమున వారి మందలను, వారి ధాన్యమును పోగుచేసిరి; రాత్రి సమయమంతయు వారు తమ మందలను పోగుచేయుచుండిరి.
19 ఉదయమున ప్రభువు లేమనీయులపై గాఢనిద్రను కలుగజేయగా, వారి అధికారులందరు గాఢనిద్రలో ఉండిరి.
20 అప్పుడు ఆల్మా మరియు అతని జనులు అరణ్యములోనికి వెడలిపోయిరి; వారు దినమంతయు ప్రయాణము చేసిన తరువాత, ఒక లోయలో తమ గుడారములను వేసుకొనిరి మరియు అరణ్యములో అతడు వారికి దారిచూపినందున ఆ లోయను ఆల్మా అని పిలిచిరి.
21 ఆల్మా లోయయందు వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించిరి, ఎందుకనగా ఆయన వారిపట్ల కనికరము చూపి, వారి భారములు సడలించి, వారిని దాస్యము నుండి విడిపించెను; ఏలయనగా వారు దాస్యమందుండిరి మరియు వారి దేవుడైన ప్రభువు తప్ప ఎవరును వారిని విడిపించలేకపోయిరి.
22 వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించిరి, వారి పురుషులందరు, స్త్రీలందరు, మాట్లాడగలుగు పిల్లలందరు తమ స్వరములనెత్తి దేవుడిని స్తుతించిరి.
23 ఇప్పుడు ప్రభువు ఆల్మాతో ఇట్లనెను: త్వరపడి నీవు, నీ జనులు ఈ దేశము నుండి బయటకు వెళ్ళుడి, ఏలయనగా లేమనీయులు నిద్రలేచి మిమ్ములను తరుముచున్నారు; కావున మీరు ఈ దేశము నుండి బయటకు వెళ్ళుడి, వారు ఈ జనులను వెంబడించుచూ ఇక మీ పైకి రాకుండునట్లు లేమనీయులను నేను ఈ లోయలో ఆపెదను.
24 అంతట వారు లోయలో నుండి వెడలిపోయి, అరణ్యములోనికి వారి ప్రయాణము కొనసాగించిరి.
25 వారు పన్నెండు దినములు అరణ్యములో ప్రయాణించిన తరువాత, జరహేమ్ల దేశమందు వచ్చి చేరిరి; వారిని కూడా రాజైన మోషైయ సంతోషముతో చేర్చుకొనెను.