27వ అధ్యాయము
మోషైయ హింసను నిషేధించి, సమానత్వమును ఆదేశించును—చిన్నవాడగు ఆల్మా మరియు మోషైయ యొక్క నలుగురు కుమారులు సంఘమును నాశనము చేయుటకు కోరుదురు—ఒక దేవదూత ప్రత్యక్షమై చెడు మార్గమును విడువమని వారిని ఆజ్ఞాపించును—ఆల్మా హఠాత్తుగా మూగవాడగును—రక్షణ పొందుటకు సమస్త మానవజాతి మరలా జన్మించవలెను—ఆల్మా మరియు మోషైయ కుమారులు సువర్తమానములను ప్రకటించుదురు. సుమారు క్రీ. పూ. 100–92 సం.
1 ఇప్పుడు అవిశ్వాసుల మూలముగా సంఘమునకు కలిగిన హింసలు తీవ్రమైనందున సంఘము సణుగుచు ఆ విషయమును గూర్చి తమ నాయకులకు ఫిర్యాదు చేయనారంభించెను; వారు ఆల్మాకు ఫిర్యాదు చేసిరి. ఆల్మా వారి వ్యాజ్యమును రాజైన మోషైయ ముందుంచెను. మోషైయ తన యాజకులను సంప్రదించెను.
2 ఏ అవిశ్వాసియు దేవుని సంఘమునకు చెందిన వారిలో ఎవరినీ హింసించరాదని రాజైన మోషైయ దేశమంతటా ఒక ప్రకటన పంపెను.
3 మరియు వారి మధ్య ఎట్టి హింసలు ఉండరాదని, మనుష్యలందరి మధ్య సమానత్వముండవలెనని;
4 గర్వము లేదా అహంకారము వారి శాంతికి భంగము కలిగించునట్లు వారు చేయనివ్వరాదని, తమ పోషణ కొరకు తమ స్వహస్తములతో పనిచేయుచూ ప్రతి మనుష్యుడు తన పొరుగువానిని తన వలెనే యెంచవలెనని సమస్త సంఘములలో కఠినమైన ఆజ్ఞ ఉండెను.
5 సమస్త యాజకులు, బోధకులు వ్యాధియందు లేదా అధిక లేమియందు తప్ప, అన్ని సందర్భములలో తమ పోషణ నిమిత్తము తమ స్వహస్తములతో పనిచేయవలెను; మరియు ఈ కార్యములు చేయుట ద్వారా వారు దేవుని కృప యందు వృద్ధి పొందిరి.
6 దేశమందు మరలా అధిక సమాధానముండుట మొదలాయెను; జనులు అధిక సంఖ్యాకులవసాగిరి, అనగా ఉత్తరమున దక్షిణమున తూర్పున పశ్చిమమున దేశము యొక్క నలుదిక్కుల పెద్ద పట్టణములను, గ్రామములను నిర్మించుచూ భూముఖముపైన విస్తరించసాగిరి.
7 ప్రభువు వారిని దర్శించి, వర్థిల్లజేసెను మరియు వారు అధికసంఖ్యాకులై, ధనవంతులైరి.
8 ఇప్పుడు మోషైయ కుమారులు అవిశ్వాసుల మధ్య లెక్కింపబడిరి మరియు ఆల్మా కుమారులలో ఒకడు కూడా వారి మధ్య లెక్కింపబడెను, అతని తండ్రిని బట్టి అతడు ఆల్మా అని పిలువబడెను; అయినప్పటికీ అతడు మిక్కలి దుర్మార్గుడై, విగ్రహారాధికుడాయెను. అతడు వాక్చాతుర్యము గలవాడై, జనులను అధికముగా పొగడుచుండెను; కావున అతడు తన దుర్ణీతుల ప్రకారము చేయునట్లు జనులలో అనేకులను నడిపించెను.
9 అతడు జనుల హృదయములను గెలుచుకొనుచు, జనుల మధ్య అధిక విభేదములు కలుగజేయుచు, దేవుని శత్రువుకు వారిపై అధికారము చెలాయించుటకు అవకాశమిచ్చుచూ దేవుని సంఘము యొక్క వృద్ధికి గొప్ప ఆటంకమాయెను.
10 అతడు దేవుని సంఘమును నాశనము చేయుటకు వెళ్ళుచుండగా—ఏలయనగా సంఘమును నాశనము చేయుటకు, దేవుడు లేదా రాజు ఆజ్ఞలకు వ్యతిరేకముగా ప్రభువు యొక్క జనులను దారి తప్పించుటకు కోరుచు అతడు మోషైయ కుమారులతో రహస్యముగా వెళ్ళియుండెను—
11 మరియు నేను మీతో చెప్పినట్లు వారు దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయుచూ వెళ్ళుచుండగా, ప్రభువు దూత వారికి ప్రత్యక్షమాయెను; అతడు మేఘములో నుండి వచ్చినట్లుగా దిగివచ్చెను; ఉరుము వలే అతడు మాట్లాడగా వారు నిలిచియున్న భూమిని అది వణుకునట్లు చేసెను;
12 వారు నేలపై పడి, అతడు వారితో పలికిన మాటలను గ్రహించలేనంతగా దిగ్భ్రాంతి చెందిరి.
13 అయినను అతడు మరలా బిగ్గరగా ఇట్లనెను: ఆల్మా, లేచి నిలబడుము; దేవుని సంఘమును నీవెందుకు హింసించుచున్నావు? ఏలయనగా ప్రభువు ఈలాగు సెలవిచ్చెను: ఇది నా సంఘము, నేను దానిని స్థిరపరచెదను మరియు నా జనుల అతిక్రమము తప్ప ఏదియు దానిని పడద్రోయజాలదు.
14 మరలా ఆ దేవదూత ఇట్లనెను: ఇదిగో, ప్రభువు తన జనుల ప్రార్థనలను మరియు తన సేవకుడైన నీ తండ్రి ఆల్మా యొక్క ప్రార్థనలను కూడా వినియున్నాడు; ఏలయనగా నీవు సత్యమును గూర్చి తెలుసుకొనవలెనని నిన్ను గూర్చి అధిక విశ్వాసముతో అతడు ప్రార్థన చేసియున్నాడు; కావున, ఆయన సేవకుల ప్రార్థనలు వారి విశ్వాసమును బట్టి జవాబివ్వబడునను ఉద్దేశ్యము నిమిత్తము దేవుని శక్తి మరియు అధికారము గూర్చి నిన్ను ఒప్పించుటకు నేను వచ్చియున్నాను.
15 ఇప్పుడు, దేవుని శక్తిని నీవు సందేహించగలవా? ఇదిగో, నా స్వరము భూమిని కంపింపజేయలేదా? నీ యెదుటనున్న నన్ను చూడలేకపోవుచున్నావా? నేను దేవుని నుండి పంపబడితిని.
16 ఇప్పుడు నేను నీతో చెప్పుచున్నాను: వెళ్ళి, హీలమ్ మరియు నీఫై దేశములందు నీ పితరులు చెరపట్టబడుటను, ఆయన వారి కొరకు చేసిన గొప్ప క్రియలను జ్ఞాపకము చేసుకొనుము; ఏలయనగా వారు దాస్యమందుండగా ఆయన వారిని విడిపించెను; ఆల్మా నేను నీతో చెప్పుచున్నాను, వెళ్ళుము, వారితో చేరుటకు నీవు కోరనప్పటికీ వారి ప్రార్థనలకు జవాబివ్వబడునట్లు సంఘమును నాశనము చేయుటకు ఇక ప్రయత్నించకుము.
17 ఇవి ఆల్మాతో దేవదూత మాట్లాడిన ఆఖరి మాటలు మరియు అతడు వెడలిపోయెను.
18 ఇప్పుడు ఆల్మా మరియు అతనితోనున్న వారు తిరిగి నేలపై పడిరి, ఏలయనగా వారి ఆశ్చర్యము అంత గొప్పదైయుండెను; ఏలయనగా వారు తమ కన్నులతో ప్రభువు దూతను చూసియుండిరి; అతని స్వరము ఉరుము వలే ఉండి, భూమిని కంపింపజేసెను; దేవుని శక్తి తప్ప భూమిని కంపింపజేసి, అది ముక్కలగునట్లు దానిని వణికింపజేయ గలిగినదేదియు లేదని వారెరిగియుండిరి.
19 ఆల్మా మూగవాడై తన నోరు తెరువలేనంతగా దిగ్భ్రాంతి చెందెను; తన చేతులను కదిలించలేనంతగా అతడు బలహీనుడాయెను; కావున అతడు, అతనితో నున్నవారి చేత తీసుకొనిపోబడి, అతని తండ్రి యెదుట పరుండబెట్టబడు వరకు అసహాయుడుగా మోసుకొనిపోబడెను.
20 మరియు వారికి జరిగినదంతయు వారు అతని తండ్రికి తెలియజేసిరి; అది దేవుని శక్తియని ఎరిగినందున అతని తండ్రి సంతోషించెను.
21 అతని కుమారునికి, అతనితోనున్న వారికి ప్రభువు చేసిన దానిని చూచునట్లు ఒక సమూహము అక్కడ సమకూడునట్లు అతడు చేసెను.
22 మరియు యాజకులు కూడా సమావేశమగునట్లు అతడు చేసెను; దేవుని మంచితనమును, మహిమను చూచి తెలుసుకొనుటకు జనుల కన్నులు తెరువబడునట్లు ఆల్మా నోరు తెరచి మాట్లాడగలుగునట్లు, అతని కాళ్ళు చేతులు శక్తిని పొందునట్లు కూడా ప్రభువు చేయవలెనని వారు ఉపవాసము చేయుచు వారి దేవుడైన ప్రభువుకు ప్రార్థన చేయుట మొదలుపెట్టిరి.
23 రెండు పగళ్ళు మరియు రెండు రాత్రులపాటు వారు ఉపవాసముండి, ప్రార్థన చేసిన తరువాత ఆల్మా కాళ్ళుచేతులు శక్తిని పొందెను; అతడు లేచి నిలబడి వారికి ధైర్యము చెప్పుచూ వారితో మాట్లాడుట మొదలుపెట్టెను:
24 అతడు ఇట్లు చెప్పెను, నేను నా పాపముల విషయమై పశ్చాత్తాపపడి, ప్రభువు చేత విమోచించబడి, ఆత్మ మూలముగా జన్మించియున్నాను.
25 మరియు ప్రభువు నాతో ఇట్లు చెప్పెను: సమస్త మానవజాతి అనగా పురుషులు, స్త్రీలు, సమస్త జనములు, వంశములు, భాషలు మరియు ప్రజలు మరలా జన్మించవలెనని ఆశ్చర్యపడవద్దు; దేవుని మూలముగా జన్మించుట అనగా వారి శరీరసంబంధమైన, పతనమైన స్థితి నుండి పరిశుద్ధమైన స్థితికి మారి దేవునిచే విమోచింపబడి ఆయన కుమారులు మరియు కుమార్తెలు కావలెను;
26 ఆ విధముగా వారు నూతన సృష్టి అగుదురు; వారిట్లు చేయని యెడల వారేవిధముగాను దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు.
27 ఈ విధముగా జరుగని యెడల వారు త్రోసివేయబడవలెనని మరియు నేను త్రోసివేయబడబోతిని కాబట్టి నేనిది ఎరుగుదునని నేను మీతో చెప్పుచున్నాను.
28 అయినప్పటికీ అధిక శ్రమ యందు ప్రయాసముతో సాగిపోయి మరణమునకు దగ్గరగునంతగా పశ్చాత్తాపపడిన తరువాత, నిత్యాగ్ని నుండి నన్ను విడిపించుట సరియని ప్రభువు కనికరమందు చూచెను మరియు నేను దేవుని మూలముగా జన్మించియున్నాను.
29 నా ఆత్మ ఘోర దుష్టత్వమునుండి, దుర్నీతి యొక్క బంధకముల నుండి విమోచింపబడినది. నేను చీకటి అగాధములో ఉంటిని, కానీ ఇప్పుడు నేను దేవుని యొక్క అద్భుతమైన వెలుగును చూచియున్నాను. నా ఆత్మ నిత్య వేదనతో బాధింపబడినది, కానీ నేను విడిపించబడినందున నా ఆత్మ ఇక బాధపడుట లేదు.
30 నేను నా విమోచకుని తిరస్కరించి, మన పితరుల చేత పలుకబడియున్న దానిని నిరాకరించితిని; కానీ ఆయన వచ్చునని, ఆయన సృష్టించిన ప్రతిప్రాణిని జ్ఞాపకముంచుకొనునని, తననుతాను అందరికీ ప్రత్యక్షపరచుకొనునని వారు ముందుగా చూడవచ్చును.
31 ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఆయన ముందు ఒప్పుకొనును. అంత్య దినమున ఆయన చేత తీర్పుతీర్చబడుటకు మనుష్యులందరు నిలిచినప్పుడు ఆయనే దేవుడని వారు ఒప్పుకొందురు; అప్పుడు నిత్యశిక్ష అను తీర్పు వారికిచ్చుట న్యాయమేనని లోకములో దేవుడు లేకుండా జీవించువారు ఒప్పుకొందురు; వారు కంపించి వణికి, సమస్తమును శోధించు ఆయన కంటిచూపు క్రింద కృంగిపోవుదురు.
32 ఇప్పుడు ఈ సమయము నుండి ఆల్మా జనులకు బోధించుట ప్రారంభించెను మరియు దేవదూత వారికి ప్రత్యక్షమైన సమయమున ఆల్మాతో ఉన్నవారు దేశమంతటా ప్రయాణము చేయుచు వారు విని, చూచియున్న విషయములను ప్రజలందరికి ప్రకటించుచు అధిక శ్రమయందు దేవుని వాక్యమును బోధించుచు అవిశ్వాసులైనవారి చేత ఎక్కువగా హింసింపబడుచూ వారిలో అనేకులచేత కొట్టబడుచుండిరి.
33 కానీ ఇదంతయు జరిగినప్పటికీ, వారి విశ్వాసమును ధృడపరచుచు, దేవుని ఆజ్ఞలు పాటించమని దీర్ఘశాంతముతో అధిక శ్రమతో ఉద్భోధించుచూ వారు సంఘమునకు అధిక ఓదార్పునిచ్చిరి.
34 వారిలో నలుగురు మోషైయ యొక్క కుమారులు; వారి పేర్లు అమ్మోను, అహరోను, ఓమ్నెర్ మరియు హింనై; ఇవి మోషైయ యొక్క కుమారుల పేర్లు.
35 సంఘమునకు వారు చేసిన కీడును సరిచేయుటకు శ్రద్ధగా ప్రయత్నించుచు తమ పాపములన్నియు ఒప్పుకొనుచు వారు చూచియున్న సమస్త విషయములను ప్రకటించుచు వారి నుండి వినుటకు కోరిన వారందరికి ప్రవచనములను, లేఖనములను వివరించుచు వారు జరహేమ్ల దేశమంతటా మరియు రాజైన మోషైయ పరిపాలన క్రింద ఉన్న జనులందరి మధ్య ప్రయాణించిరి.
36 ఆ విధముగా అనేకులకు సత్యమును గూర్చి, వారి విమోచకుని గూర్చి తెలియజేయుటలో వారు దేవుని చేతులలో సాధనములుగా ఉండిరి.
37 వారెంత ధన్యులు! వారు సమాధానమును ప్రకటించిరి, వారు మేలును గూర్చిన సువర్తమానమును ప్రకటించిరి మరియు ప్రభువు పరిపాలించుచున్నాడని వారు జనులకు ప్రకటించిరి.