లేఖనములు
మోషైయ 5


5వ అధ్యాయము

పరిశుద్ధులు విశ్వాసము ద్వారా క్రీస్తు యొక్క కుమారులు, కుమార్తెలగుదురు—అప్పుడు వారు క్రీస్తు యొక్క నామముతో పిలువబడుదురు—సత్‌క్రియల యందు స్థిరముగా కదలకయుండవలెనని రాజైన బెంజమిన్ వారికి ఉద్భోధించును. సుమారు క్రీ. పూ. 124 సం.

1 రాజైన బెంజమిన్ తన జనులతో ఆ విధముగా మాట్లాడిన తరువాత, అతడు వారితో చెప్పియున్న మాటలను తన జనులు విశ్వసించిరో లేదోయని తెలుసుకొనగోరినవాడై అతడు వారి మధ్యకు సేవకులను పంపెను.

2 వారందరు ఇట్లనుచూ ఏక స్వరముతో బిగ్గరగా చెప్పిరి: అవును, నీవు మాతో చెప్పిన మాటలన్నిటినీ మేము నమ్ముచున్నాము; ఇంకను సర్వశక్తిమంతుడైన ప్రభువు యొక్క ఆత్మను బట్టి మేము వాటి యథార్థతను సత్యమును ఎరుగుదుము, మేము చెడు చేయుటకు ఇక ఏ మాత్రము కోరుకొనక నిరంతరము మంచి చేయుటకు కోరిక కలిగియుండునట్లు ఆ ఆత్మ మా యందు లేదా మా హృదయములందు గొప్ప మార్పు కలుగజేసెను.

3 దేవుని యొక్క అనంతమైన మంచితనము మరియు ఆయన ఆత్మ యొక్క ప్రత్యక్షతల ద్వారా మేము కూడా రాబోవు దానిని గూర్చి గొప్ప అవగాహన కలిగియున్నాము; అవసరమైన యెడల, మేము అన్ని విషయములను గూర్చి ప్రవచించగలము.

4 మా రాజు మాతో చెప్పిన ఆ విషయములపై మేము కలిగియుండిన విశ్వాసమే మాకు ఈ గొప్ప జ్ఞానమును కలుగజేసెను, దానిని బట్టి మేము మహదానందముతో సంతోషించుచున్నాము.

5 మేము ఆయన చిత్తమును చేయుటకు మరియు దేవదూత ద్వారా చెప్పబడినట్లుగా ఎన్నటికీ అంతముకాని వేదనను మాపై మేము తెచ్చుకొనకుండునట్లు, దేవుని ఉగ్రతాపాత్రలోనిది మేము త్రాగకుండునట్లు మా శేష దినములన్నియు అన్ని విషయములలో ఆయన మాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలకు లోబడుటకు మా దేవునితో ఒక నిబంధనలోనికి ప్రవేశించుటకు మేము సమ్మతించుచున్నాము.

6 ఇప్పుడు రాజైన బెంజమిన్ వారి నుండి కోరిన మాటలు ఇవే; అందునుబట్టి అతడు వారితో ఇట్లనెను: నేను కోరిన మాటలను మీరు పలికియున్నారు; మీరు చేసిన నిబంధన ఒక పరిశుద్ధమైన నిబంధనయైయున్నది.

7 మీరు చేసిన నిబంధన కారణముగా మీరు క్రీస్తు యొక్క సంతానమని, ఆయన కుమారులు, కుమార్తెలని పిలువబడుదురు; ఏలయనగా ఈ దినమున ఆయన మిమ్ములను ఆత్మీయముగా కనియున్నాడు; ఆయన నామమందు విశ్వాసము ద్వారా మీ హృదయములు మారినవని మీరు చెప్పుచున్నారు; కావున, మీరు ఆయన ద్వారా జన్మించియున్నారు మరియు ఆయన కుమారులు, కుమార్తెలైయున్నారు.

8 ఈ నామము క్రింద మీరు స్వంతంత్రులుగా చేయబడియున్నారు మరియు మీరు స్వతంత్రులుగా చేయబడగలుగుటకు మరేయితర నామము లేదు. రక్షణ కలుగజేయుటకు మరేయితర నామము ఇవ్వబడ లేదు; కావున, మీ జీవితాంతము విధేయులైయుందురని దేవునితో ఒక నిబంధనలోనికి ప్రవేశించిన మీరందరు క్రీస్తు నామమును మీపైన తీసుకొనవలెనని నేను కోరుచున్నాను.

9 దీనిని చేయువాడు దేవుని కుడిపార్శ్వమున కనుగొనబడును, ఏలయనగా తాను పిలువబడియున్న నామమును అతడు ఎరుగును; అతడు క్రీస్తు యొక్క నామము చేత పిలువబడును.

10 ఇప్పుడు క్రీస్తు నామమును తనపై తీసుకొనని వాడు వేరొక నామమున పిలువబడవలెను; కావున, అతడు తననుతాను దేవుని ఎడమ పార్శ్వమున కనుగొనును.

11 అతిక్రమము ద్వారా తప్ప ఎన్నడూ తుడిచివేయబడని ఒక పేరును మీకు ఇచ్చెదనని నేను చెప్పినది ఇదేనని మీరు జ్ఞాపకముంచుకొనవలెనని కూడా నేను కోరుచున్నాను; కావున, ఆ నామము మీ హృదయములలో నుండి తుడిచివేయబడకుండునట్లు మీరు అతిక్రమము చేయకుండా జాగ్రత్తపడుడి.

12 మీ హృదయములలో వ్రాయబడిన ఆ నామమును ఎల్లప్పుడు నిలుపుకొనుటకు మీరు జ్ఞాపకముంచుకొనవలెనని, మీరు దేవుని ఎడమ పార్శ్వమున కనుగొనబడకూడదని నేను కోరుచున్నాను; కానీ మీరు పిలువబడు స్వరమును, ఆయన మిమ్ములను పిలుచు ఆ పేరును కూడా మీరు విని ఎరుగవలెనని నేను చెప్పుచున్నాను.

13 ఏలయనగా అతడు సేవించియుండని వానిని, అతనికి పరదేశియై అతని హృదయపు ఆలోచనలు, తలంపుల నుండి దూరముగా ఉన్న యజమానిని ఒక మనుష్యుడు ఎట్లు ఎరుగగలడు?

14 మరలా ఒక మనుష్యుడు తన పొరుగువాని గాడిదను తీసుకొని, దానిని ఉంచుకొనునా? లేదు, అని నేను మీతో చెప్పుచున్నాను; అది అతని మందల మధ్య మేయుటకు కూడా అనుమతించక అతడు దానిని తరిమివేసి, బయటకు త్రోలివేయును. మీరు పిలువబడియున్న ఆ పేరును మీరు ఎరుగని యెడల, మీ మధ్య కూడా అట్లే జరుగునని నేను మీతో చెప్పుచున్నాను.

15 కాబట్టి మీరు ఎల్లప్పుడు సత్‌క్రియలయందు విస్తరించుచూ స్థిరముగా కదలకయుండవలెనని, సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభువైన క్రీస్తు మిమ్ములను తన వారిగా ముద్రవేయవలెనని, మీరు పరలోకమునకు తేబడవలెనని, భూమ్యాకాశములయందు సమస్తమును సృష్టించి అందరిపై దేవుడైయున్న ఆయన యొక్క జ్ఞానము, శక్తి, న్యాయము మరియు కనికరము ద్వారా మీరు శాశ్వత రక్షణను నిత్యజీవమును కలిగియుండవలెనని నేను కోరుచున్నాను. ఆమేన్‌.