సర్వసభ్య సమావేశము
ఈయనను ఆలకించుము
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


24:23

ఈయనను ఆలకించుము

మనం అనిశ్చితి మరియు భయంతో చుట్టుముట్టబడినప్పుడు, ఆయన కుమారుడిని వినడం మనకు చాలా సహాయపడుతుందని మన తండ్రికి తెలుసు.

నా ప్రియ సహోదర, సహోదరీలారా, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా, ఈ ఆదివారం ఉదయం ఆరాధించడానికి మనము కలవగలిగినందుకు నేను ఎంతో కృతజ్ఞత కలిగియున్నాను. యేసు క్రీస్తు సువార్త భూమిపైన పునఃస్థాపించబడిందని తెలుసుకొనుటకు మనం ఎంత ధన్యులం!

గత అనేక వారాలలో, మనలో చాలామంది మన వ్యక్తిగత జీవితాలలో అంతరాయాలను ఎదుర్కొన్నారు. భూకంపాలు, మంటలు, వరదలు, తెగుళ్ళు మరియు వాటి పర్యవసానాలు నిత్యకృత్యాలకు విఘాతం కలిగించాయి, ఆహారం, ముఖ్యోత్పత్తులు మరియు పొదుపుల కొరతకు కారణమయ్యాయి.

వీటన్నిటి మధ్య, సర్వసభ్య సమావేశానికి మాతో చేరడం ద్వారా ఈ గందరగోళ సమయంలో ప్రభువు మాట వినడానికి ఎంచుకున్నందుకు మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కష్టాలతో పాటు పెరుగుతున్న చీకటి, యేసు క్రీస్తు వెలుగును ఎప్పటికంటే ఎక్కువ ప్రకాశవంతంగా ప్రకాశించేలా చేస్తుంది. ఈ ప్రపంచ ఉపద్రవ సమయంలో మనలో ప్రతి ఒక్కరూ చేయగలిగే మంచి గురించి ఆలోచించండి. ఎవరైనా యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపనను కనుగొనడానికి మీ ప్రేమ మరియు రక్షకుడిపై మీ విశ్వాసం ఉత్ప్రేరకంగా ఉండవచ్చు.

గత రెండేళ్ళలో, సహోదరి నెల్సన్ మరియు నేను ప్రపంచవ్యాప్తంగా మీలో వేలాది మందిని కలిశాము. మేము మీతో బహిరంగ ప్రదేశాలలో మరియు హోటల్ సమావేశ గదులలో సమావేశమయ్యాము. ప్రతి ప్రదేశంలో, నేను ప్రభువుచే ఎన్నుకోబడినవారి సమక్షంలో ఉన్నట్లు మరియు ఇజ్రాయేలు యొక్క సమకూర్పు నా కళ్ళ ముందు జరగడం నేను చూస్తున్నట్లు నేను భావించాను.

“మన పూర్వీకులు ఆత్రుతగా ఎదురుచూసిన రోజు”1 లో మనము జీవిస్తున్నాము. భూముఖమంతటిపైన చెదరియున్న ప్రభువు నిబంధన జనులపైన దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క శక్తి దిగివచ్చునని; వారు గొప్ప మహిమయందు పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియుండిరి”2 అని ప్రవక్త నీఫై కేవలం దర్శనము లో చూచిన దానిని, అది నిజంగా జరుగుతుండగా మనం ముందువరుసలో ఉండి చూస్తున్నాము.

నీఫై చూసిన పురుషులు, స్త్రీలు మరియు పిల్లలలో నా సహోదర, సహోదరీలైన మీరు ఉన్నారు. దాని గురించి ఆలోచించండి!

మీరు ఎక్కడ నివసిస్తున్నా లేదా మీ పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రభువైన యేసు క్రీస్తు మీరక్షకుడు, మరియు దేవుని ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ మీ ప్రవక్త. పరిశుద్ధుల నుండి “ఏమీ దాచబడని”3 ఈ చివరి యుగము యొక్క ప్రవక్తగా, ఈ భూమి పునాది వేయబడడానికి ముందే అతడు సృష్టికి ముందుగా నియమించబడ్డాడు. ఈ పునఃస్థాపన ప్రక్రియలో ప్రభువు నుండి బయల్పాటులు రావడం కొనసాగుతోంది.

యేసు క్రీస్తు సువార్త భూమిపైన పునఃస్తాపించబడిందని తెలుసుకొనుట మీకు ఏ అర్థాన్ని ఇస్తుంది?

మీరు మరియు మీ కుటుంబం ఎప్పటికీ కలిసి ముద్రింపబడగలరని దీని అర్థం! యేసు క్రీస్తు నుండి అధికారం ఉన్న ఒక వ్యక్తి చేత మీరు బాప్తీస్మం తీసుకున్నందున మరియు ఆయన సంఘ సభ్యునిగా నిర్థారించబడినందున, మీరు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసాన్ని ఆస్వాదించవచ్చని దీనర్థం. ఆయన మీకు మార్గనిర్దేశం చేస్తాడు మరియు రక్షిస్తాడు. మీరు ఆదరణలేకుండా ఎన్నటికీ వదిలివేయబడరని లేదా మీకు సహాయం చేయడానికి దేవుని శక్తి లభ్యం కాకుండా ఉండదని దీని అర్థం. మీరు అవసరమైన విధులు పొంది, దేవునితో నిబంధనలు చేసుకుని, వాటిని పాటించిప్పుడు యాజకత్వపు శక్తి మిమ్మల్ని ఆశీర్వదించగలదని దీని అర్థం. ప్రత్యేకించి కష్టాలు ఉధృతంగా ఉన్న ఈ సమయాల్లో, ఈ సత్యాలు మన ఆత్మలకు దృఢత్వాన్ని ఇస్తున్నాయి.

మోర్మన్ గ్రంథము రెండు ప్రధాన నాగరికతల యొక్క సంప్రదాయసిద్ధమైన పెరుగుదల మరియు పతనం గురించి వివరిస్తుంది. చాలా మంది ప్రజలకు దేవునిని మరచిపోవటం, ప్రభువు యొక్క ప్రవక్తల హెచ్చరికలను తిరస్కరించడం, అధికారం, ప్రజాదరణ మరియు శారీరక సంతోషాలను వెదకడం ఎంత సులభమో వారి చరిత్ర నిరూపిస్తుంది.4 గత ప్రవక్తలు పదేపదే “గొప్ప మరియు ఆశ్చర్యకరమైన సంగతులను జనులకు ప్రకటించారు, వారు వాటిని విశ్వసించలేదు.”5

ఇది మన కాలంలో భిన్నంగా లేదు. సంవత్సరాలుగా, గొప్ప మరియు ఆశ్చర్యకరమైన సంగతులు భూమి అంతటా అంకితమైన వేదికల నుండి వినబడ్డాయి. అయినప్పటికీ చాలా మంది ప్రజలు ఈ సత్యాలను స్వీకరించరు—ఎందుకంటే వాటిని ఎక్కడ వెదకాలో వారికి తెలియదు,6 లేదా వారు పూర్తి సత్యం లేనివారి మాటలు వింటున్నారు, లేదా వారు ప్రాపంచిక అన్వేషణలకు అనుకూలంగా సత్యాన్ని తిరస్కరించారు.

విరోధి తెలివైనవాడు. సహస్రాబ్దాలుగా, అతడు మంచిని చెడుగా మరియు చెడును మంచిగా కనిపించేలా చేస్తున్నాడు.7 అతని సందేశాలు బిగ్గరగా, ధైర్యంగా ఉంటాయి మరియు ప్రగల్భాలు పలుకుతాయి.

ఏదేమైనా, మన పరలోక తండ్రి నుండి వచ్చిన సందేశాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఆయన సరళంగా, నిశ్శబ్దంగా మరియు చాలా అద్భుతమైన స్పష్టతతో తెలియపరుస్తారు, కాబట్టి మనం ఆయనను అపార్థం చేసుకోలేము.8

ఉదాహరణకు, ఆయన తన ఏకైక కుమారుడిని భూమిపై ఉన్న మానవులకు పరిచయం చేసినప్పుడల్లా, ఆయన చాలా తక్కువ పదాలతో చేశారు. పేతురు, యాకోబు, యోహానులతో రూపాంతరపు కొండ మీద దేవుడు ఇలా అన్నారు, “ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి.”9 పురాతన సమృద్ధిదేశములో నీఫైయులకు ఆయన చెప్పిన మాటలివి, “ఇదిగో నేను మిక్కిలి సంతోషించుచున్న నా ప్రియ కుమారుడు, అతనియందు నేను నా నామమును మహిమపరచి యున్నాను—మీరు ఆయనను వినుడి.”10 మరియు ఈ యుగమును తెరిచిన ఆ లోతైన ప్రకటనలో, జోసెఫ్ స్మిత్‌‌తో దేవుడు ఇలా అన్నారు, “ఈయన నా ప్రియకుమారుడు. ఈయనను ఆలకించుము!11

ఇప్పుడు, నా ప్రియ సహోదర సహోదరీలారా, ఈ మూడు సందర్భాల్లో, తండ్రి కుమారుడిని పరిచయం చేయడానికి ముందే, పాల్గొన్న వ్యక్తులు భయపడే స్థితిలో ఉన్నారు మరియు కొంతవరకు నిరాశకు గురయ్యారు.

రూపాంతరపు కొండపైన యేసు క్రీస్తు మేఘంతో చుట్టుబడి ఉండడాన్ని చూసినప్పుడు అపొస్తలులు భయపడ్డారు.

వారు చాలా రోజులు విధ్వంసం మరియు చీకటిలో ఉన్నందున నీఫైయులు భయపడ్డారు.

పరలోకములు తెరువబడడానికి ముందు జోసెఫ్ స్మిత్ చీకటి శక్తి యొక్క పిడికిళ్ళలో ఉన్నాడు.

మనం అనిశ్చితి మరియు భయంతో చుట్టుముట్టబడినప్పుడు, ఆయన కుమారుడిని వినడం మనకు చాలా సహాయపడుతుందని మన తండ్రికి తెలుసు.

ఎందుకంటే మనం ఆయన కుమారుడిని వినడానికి—నిజంగా వినడానికి—ప్రయత్నించినప్పుడు, ఏ పరిస్థితులలోనైనా ఏమి చేయాలో తెలుసుకోవడానికి మనకు మార్గనిర్దేశం చేయబడుతుంది.

సిద్ధాంతము మరియు నిబంధనలలో మొదటి పదం ఆలకించండి.12 దీని అర్థం, “లోబడాలనే ఉద్దేశ్యంతో వినడం.”13 ఆలకించడం అంటే “ఆయన మాట వినడం”— రక్షకుడు చెప్పేది వినడం , ఆపై ఆయన సలహాకు శ్రద్ధవహించడం. “ఆయనను వినండి”— అనే ఆ రెండు మాటలలో— ఈ జీవితంలో విజయం, సంతోషం మరియు ఆనందానికి దేవుడు మనకు నమూనా ఇస్తారు. మనం ప్రభువు మాటలు వినాలి, వాటిని ఆలకించాలిమరియు, ఆయన మనకు చెప్పిన వాటికి శ్రద్ధవహించాలి!

యేసు క్రీస్తు శిష్యులుగా ఉండడానికి మనం కోరినప్పుడు, ఆయనను వినడానికి మన ప్రయత్నాలు మరింత ఉద్దేశపూర్వకంగా ఉండాలి. ఆయన మాటలు, ఆయన బోధనలు, ఆయన సత్యాలతో మన దైనందిన జీవితాన్ని నింపడానికి తెలివిగల మరియు స్థిరమైన ప్రయత్నం అవసరం.

మనము సామాజిక మాధ్యమంలో ఎదురయ్యే సమాచారంపై ఆధారపడలేము. విరోధి యొక్క ధ్వనించే, దుర్మార్గపు ప్రయత్నాల ద్వారా నిరంతరం బిలియన్ల పదాలతో ఆన్‌లైన్‌లో మరియు ప్రకటనల ప్రపంచంలో చొరబడుతుండగా, ఆయనను వినడానికి మనం ఎక్కడికి వెళ్ళ గలము ?

మనం లేఖనాలకు వెళ్ళవచ్చు. అవి యేసు క్రీస్తు గురించి మరియు ఆయన సువార్త, ఆయన ప్రాయశ్చిత్తం యొక్క పరిమాణం మరియు మన తండ్రి యొక్క గొప్ప సంతోషం మరియు విమోచన ప్రణాళిక గురించి బోధిస్తాయి. ప్రత్యేకించి ఉపద్రవం పెరుగుతున్న ఈ రోజుల్లో, ఆధ్యాత్మిక మనుగడకు దేవుని వాక్యంలో రోజువారీ నిమగ్నత చాలా ముఖ్యమైనది. మనం రోజూ క్రీస్తు మాటలను విందారగిస్తున్నప్పుడు, మనం ఎదుర్కోవలసి వస్తుందని మనం ఎప్పుడూ అనుకోని ఇబ్బందులకు ఎలా స్పందించాలో క్రీస్తు మాటలు మనకు చెబుతాయి.

మనము దేవాలయంలో కూడా ఆయనను వినవచ్చు. ప్రభువు మందిరము నేర్చుకునే మందిరము. అక్కడ, ప్రభువు తనదైన రీతిలో బోధిస్తారు. అక్కడ, ప్రతి ఒక్క విధి కూడా రక్షకుని గురించి బోధిస్తుంది. అక్కడ, తెరను ఎలా విభజించాలో మరియు పరలోకంతో మరింత స్పష్టంగా ఎలా సంభాషించాలో మనం నేర్చుకుంటాము. అక్కడ, విరోధిని ఎలా మందలించాలో మరియు మనల్ని, మనం ప్రేమిస్తున్న వారిని బలోపేతం చేయడానికి ప్రభువు యొక్క యాజకత్వపు శక్తిని ఎలా పొందాలో మనం నేర్చుకుంటాము. మనలో ప్రతి ఒక్కరూ అక్కడ ఆశ్రయం పొందడానికి ఎంతో ఆసక్తిగా ఉండాలి.

ఈ తాత్కాలిక కోవిడ్-19 పరిమితులు ఎత్తివేయబడినప్పుడు, దయచేసి దేవాలయంలో ఆరాధనలు మరియు సేవ చేయడానికి క్రమమైన సమయాన్ని కేటాయించండి. ఇంకేది కూడా చేయలేని విధంగా ఆ సమయం యొక్క ప్రతి నిమిషం మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు వింటున్న మరియు అనుభూతి చెందుతున్న విషయాలను ఆలోచించడానికి సమయం కేటాయించండి. మీ జీవితాన్ని, మీరు ప్రేమించే మరియు సేవచేసే వారి జీవితాలను ఆశీర్వదించడానికి పరలోకాలను ఎలా తెరవాలో నేర్పమని ప్రభువును అడగండి.

దేవాలయంలో ఆరాధన ప్రస్తుతం సాధ్యం కానప్పటికీ, కుటుంబ చరిత్ర పరిశోధన మరియు సూచికలతో సహా కుటుంబ చరిత్రలో మీ భాగస్వామ్యాన్ని పెంచమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవాలయం మరియు కుటుంబ చరిత్ర పనిలో మీరు మీ సమయాన్ని పెంచుతున్నప్పుడు, మీరు ఆయనను వినగల సామర్థ్యాన్ని పెంచుతారు మరియు మెరుగుపరుస్తారని నేను వాగ్దానం చేస్తున్నాను.

పరిశుద్ధాత్మ యొక్క గుసగుసలను గుర్తించగల మన సామర్థ్యాన్ని మనం మెరుగుపరుచుకున్నప్పుడు, మనం మరింత స్పష్టంగా ఆయనను వింటాము. ఆత్మ మీతో ఎలా మాట్లాడుతుందో మీరు తెలుసుకోవలసిన అవసరం ప్రస్తుతం కంటే ఎక్కువగా ఇంతకుముందు ఎన్నడూ లేదు. దైవసమూహములో, పరిశుద్ధాత్మ రాయబారి. తండ్రి మరియు కుమారుడు మీరు పొందాలని కోరుకునే ఆలోచనలను ఆయన మీ మనస్సులోకి తీసుకువస్తాడు. ఆయన ఆదరణకర్త. ఆయన మీ హృదయానికి శాంతి భావాన్ని తెచ్చును. ఆయన సత్యానికి సాక్ష్యమిచ్చును మరియు ప్రభువు వాక్యాన్ని మీరు విన్నప్పుడు మరియు చదివినప్పుడు నిజం ఏమిటో ధృవీకరించును.

వ్యక్తిగత బయల్పాటు పొందడానికి మీ ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని పెంచడానికి ఏది అవసరమో దానిని చేయమని నేను నా విజ్ఞప్తిని పునరుద్ధరిస్తున్నాను.

అలా చేయడం వల్ల మీ జీవితంలో ఎలా ముందుకు సాగాలి, సంక్షోభ సమయాల్లో ఏమి చేయాలి మరియు విరోధి యొక్క ప్రలోభాలను, మోసాలను ఎలా గుర్తించాలో మరియు ఎలా నివారించాలో మీకు తెలుస్తుంది.

చివరకు, మనము ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారుల మాటలను వింటున్నప్పుడు మనము ఆయనను వింటాము. నియమించబడిన యేసు క్రీస్తు యొక్క అపొస్తలులు ఎల్లప్పుడూ ఆయన గురించి సాక్ష్యమిస్తారు. మన మర్త్య అనుభవాల యొక్క హృదయ వేదన అనే చిట్టడవి ద్వారా మనం వెళ్ళేటప్పుడు అవి మార్గం చూపుతాయి.

రక్షకుడు చెప్పినదానిని మరియు తన ప్రవక్తల ద్వారా ఆయన ఇప్పుడు చెబుతున్న దానిని మీరు మరింత ఉద్దేశపూర్వకంగా విన్నప్పుడు, ఆలకించినప్పుడు మరియు శ్రద్ధపెట్టినప్పుడు ఏమి జరుగుతుంది? శోధనలు, పోరాటాలు మరియు బలహీనతలను ఎదుర్కోవడానికి మీరు అదనపు శక్తిచేత దీవించబడతారని నేను వాగ్దానం చేస్తున్నాను. మీ వివాహం, కుటుంబ సంబంధాలు మరియు రోజువారీ పనిలో అద్భుతాలను నేను వాగ్దానం చేస్తున్నాను. మీ జీవితంలో అల్లకల్లోలం పెరిగినా ఆనందాన్ని అనుభవించే మీ సామర్థ్యం పెరుగుతుందని నేను వాగ్దానం చేస్తున్నాను.

ఈ ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశం ప్రపంచాన్ని మార్చిన ఒక సంఘటనను జ్ఞాపకం చేసుకోవడానికి మన సమయం. జోసెఫ్ స్మిత్ మొదటి దర్శనము యొక్క ఈ 200వ వార్షికోత్సవాన్ని మేము ఊహించినట్లు, ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సలహామండలిగా ఈ అద్భుతమైన సంఘటనను సముచితంగా జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏమి చేయగలమని ఆలోచించాము.

ఆ దైవదర్శనము యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపనను ప్రారంభించింది మరియు కాలముల సంపూర్ణ యుగమును ఆహ్వానించింది.

ఒక స్మారక చిహ్నం నిర్మించాలా అని మేము ఆలోచించాము. కానీ మొదటి దర్శనము యొక్క ప్రత్యేకమైన చారిత్రాత్మక మరియు అంతర్జాతీయ ప్రభావాన్ని మేము పరిగణించినప్పుడు, స్మారక చిహ్నాన్ని గ్రానైట్ లేదా రాతితో కాకుండా పదాలతో—గంభీరమైన మరియు పవిత్రమైన ప్రకటన పదాలతో—“రాతి పలకల” మీద చెక్కబడుట కాదు, కానీ మన మెత్తని హృదయములు అనే “పలకల” మీద పొందుపరచబడటం ద్వారా సృష్టించాలి అనే విషయం మమ్మల్ని ఆకట్టుకుంది.14

సంఘం స్థాపించబడినప్పటి నుండి కేవలం ఐదు ప్రకటనలు మాత్రమే జారీ చేయబడ్డాయి, చివరిది “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన” 1995లో అధ్యక్షులు గార్డెన్ బి. హింక్లీ చేత సమర్పించబడింది.

ప్రపంచ చరిత్రలో ఈ ముఖ్యమైన సమయాన్ని గురించి మరియు యేసు క్రీస్తు రెండవ రాకడకు సన్నాహకంగా చెల్లాచెదురైన ఇశ్రాయేలీయులను సమకూర్చాలని ప్రభువు చేసిన ఆజ్ఞ గురించి మేము ఆలోచిస్తున్నప్పుడు, మొదటి అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సలహామండలియైన మేము, ఈ క్రింది ప్రకటనను జారీ చేస్తున్నాము. దాని శీర్షిక, “యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన: లోకమునకు ఒక ద్విశతాబ్ది ప్రకటన.” ఇది యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండు మంది అపొస్తలుల సలహామండలి చేత రచించబడింది. దీని తారీఖు ఏప్రిల్ 2020. ఈ రోజు కోసం సిద్ధపడడానికి, నేను ఇంతకుముందు పరిశుద్ధ వనములో ఈ ప్రకటనను నమోదు చేసాను, అక్కడ జోసెఫ్ స్మిత్ మొదట తండ్రిని మరియు కుమారుడిని చూశాడు.

6:15

“దేవుడు ప్రపంచంలోని ప్రతి దేశంలో ఉన్న తన పిల్లలను ప్రేమిస్తున్నారని మేము గంభీరంగా ప్రకటిస్తున్నాము. తండ్రియైన దేవుడు మనకు దైవిక పుట్టుకను, సాటిలేని జీవితాన్ని, తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క అనంతమైన ప్రాయశ్చిత్త త్యాగాన్ని అనుగ్రహించారు. తండ్రి యొక్క శక్తి ద్వారా యేసు తిరిగి లేచి, మరణముపైన విజయం సాధించారు. ఆయన మన రక్షకుడు, మన మాదిరి, మన విమోచకుడై ఉన్నాడు.

“రెండు వందల సంవత్సరాల క్రితం, 1820లో ఒక అందమైన వసంతకాల ఉదయం, ఏ సంఘంలో చేరాలో తెలుసుకోవాలనుకొని యువ జోసెఫ్ స్మిత్, అమెరికాలోని ఉత్తర న్యూయార్క్‌లో తన ఇంటికి సమీపంలోని అడవిలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. తన ఆత్మ యొక్క రక్షణకు సంబంధించి అతడు ప్రశ్నలు కలిగియున్నాడు మరియు దేవుడు తనను నిర్దేశిస్తారని విశ్వసించాడు.

“ఆయన ప్రార్థనకు సమాధానంగా, తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు జోసెఫ్‌కు ప్రత్యక్షమయ్యారని మరియు బైబిలులో ముందే చెప్పినట్లుగా ‘అన్నిటి పునఃస్థాపన’ (అపొస్తలుల కార్యములు 3:21) ను ప్రారంభించారని మేము వినయంగా ప్రకటిస్తున్నాము. ఈ దర్శనములో, మొదటి అపొస్తలుల మరణం తరువాత, క్రీస్తు యొక్క క్రొత్త నిబంధన సంఘము భూమిపైన కోల్పోబడిందని అతడు తెలుసుకున్నాడు. అది తిరిగి రావడంలో జోసెఫ్ కీలకపాత్ర పోషించబోవుచున్నాడు.

“తండ్రి మరియు కుమారుని ఆదేశాల మేరకు, పరలోకపు దూతలు జోసెఫ్‌కు బోధించడానికి మరియు యేసు క్రీస్తు సంఘాన్ని పునఃస్థాపించడానికి వచ్చారని మేము ధృవీకరిస్తున్నాము. పునరుత్థానం చెందిన బాప్తీస్మమిచ్చు యోహాను, పాప విమోచన కొరకు ముంచడం ద్వారా బాప్తీస్మం ఇచ్చే అధికారాన్ని పునఃస్థాపించెను. మొదటి పన్నెండు మంది అపొస్తలులలో ముగ్గురైన—పేతురు, యాకోబు, యోహాను—యాజకత్వ అధికారం యొక్క తాళపుచెవులను మరియు అపొస్తలత్వమును పునఃస్థాపించారు. ఏలియాతో సహా ఇతరులు కూడా వచ్చారు, మరణాన్ని అధిగమించే నిత్య సంబంధాలలో కుటుంబాలను ఎప్పటికీ కలిపియుంచే అధికారాన్ని పునఃస్థాపించారు.

“జోసెఫ్ స్మిత్‌కు ఒక పురాతన గ్రంథమైన మోర్మన్ గ్రంథము—యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధనను అనువదించడానికి దేవుని వరము మరియు శక్తి ఇవ్వబడిందని కూడా మేము సాక్ష్యమిస్తున్నాము. ఈ పవిత్ర గ్రంథం యొక్క పుటలలో ఆయన పునరుత్థానం తరువాత పశ్చిమ అర్ధగోళంలోని ప్రజల మధ్య యేసు క్రీస్తు వ్యక్తిగత పరిచర్య గురించి వివరించబడింది. ఇది జీవితం యొక్క ఉద్దేశం గురించి బోధిస్తుంది మరియు ఆ ఉద్దేశానికి కేంద్రమైన క్రీస్తు సిద్ధాంతాన్ని వివరిస్తుంది. మానవులందరూ పరలోకంలో ఉన్న ప్రేమగల తండ్రి కుమారులు మరియు కుమార్తెలు అని, ఆయన మన జీవితం కొరకు దైవిక ప్రణాళిక కలిగియున్నారని, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు పూర్వకాలపు దినములలో వలె నేడు కూడా మాట్లాడుతున్నారని బైబిలుకు తోడుగా ఉన్న లేఖనముగా మోర్మన్ గ్రంథము సాక్ష్యమిస్తుంది.

“1830 ఏప్రిల్ 6న ఏర్పాటు చేయబడిన యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము, క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన క్రొత్త నిబంధన సంఘమని మేము ప్రకటిస్తున్నాము. ఈ సంఘము దాని ప్రధాన మూలరాయియైన యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణ జీవితం, ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తం మరియు అక్షరార్థ పునరుత్థానంలో స్థిరంగా పునాది వేయబడింది. యేసు క్రీస్తు మరోసారి అపొస్తలులను పిలిచి, వారికి యాజకత్వపు అధికారాన్ని ఇచ్చారు. పరిశుద్ధాత్మను పొందడానికి, రక్షణ విధులను స్వీకరించడానికి, శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి ఆయన యొద్దకు, ఆయన సంఘము యొద్దకు రమ్మని ఆయన మనందరినీ ఆహ్వానిస్తున్నారు.

“ఈ పునఃస్థాపనను తండ్రియైన దేవుడు మరియు ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటికి రెండు వందల సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్లమంది ఈ ప్రవచనాత్మక సంఘటనల జ్ఞానాన్ని స్వీకరించారు.

“వాగ్దానం చేయబడిన పునఃస్థాపన నిరంతర బయల్పాటు ద్వారా ముందుకు సాగుతుందని మేము సంతోషంగా ప్రకటిస్తున్నాము. దేవుడు ‘సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చినప్పుడు’ (ఎఫెసీయులకు 1:10), భూమి మరలా ఎప్పటికీ ఒకేలా ఉండదు.

“పరలోకములు తెరువబడెనని—మేము తెలుసుకొన్నట్లుగా—తెలుసుకోవాలని అందరిని భక్తితో మరియు కృతజ్ఞతతో, ఆయన అపొస్తలులుగా మేము ఆహ్వానిస్తున్నాము. దేవుడు తన ప్రియమైన కుమారులు మరియు కుమార్తెల కోసం తన చిత్తాన్ని తెలియజేస్తున్నారని మేము ధృవీకరిస్తున్నాము. “పునఃస్థాపన సందేశాన్ని ప్రార్థనాపూర్వకంగా అధ్యయనం చేసి, విశ్వాసంతో పనిచేసే వారు, దాని దైవత్వం గురించి మరియు మన ప్రభువు, రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క వాగ్దానం చేయబడిన రెండవ రాకడ కోసం ప్రపంచాన్ని సిద్ధం చేయాలనే దాని ఉద్దేశం గురించి వారి స్వంత సాక్ష్యాన్ని పొందడానికి ఆశీర్వదించబడతారు”15 అని మేము సాక్ష్యమిస్తున్నాము.

ప్రియ సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు సువార్త దాని సంపూర్ణతతో పునఃస్థాపించబడడం గురించి ప్రపంచానికది మన ద్విశతాబ్ది ప్రకటన. ఇది 12 భాషల్లోకి అనువదించబడింది. ఇతర భాషలలోకి త్వరలో అనువదించబడుతుంది. ఇది సంఘ వెబ్‌సైట్‌లో వెంటనే అందుబాటులో ఉంటుంది, దాని నుండి మీరు కాపీని పొందవచ్చు. దీన్ని వ్యక్తిగతంగా మరియు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో అధ్యయనం చేయండి. సత్యాలను ధ్యానించండి మరియు మీరు వాటిని విని, ఆలకించి, వాటితో వచ్చు ఆజ్ఞలు, నిబంధనలకు శ్రద్ధ చూపినట్లైతే ఆ సత్యాలు మీ జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఆలోచించండి.

జోసెఫ్ స్మిత్ ఈ చివరి యుగమును తెరవడానికి ప్రభువు ఎంచుకున్న, సృష్టికి ముందే నియమించబడిన ప్రవక్త అని నాకు తెలుసు. అతని ద్వారా, ప్రభువు సంఘము భూమిపైన పునఃస్థాపించబడింది. జోసెఫ్ తన సాక్ష్యన్ని తన రక్తంతో ముద్రించాడు. నేను ఆయనను ఎంతగానో ప్రేమిస్తున్నాను మరియు గౌరవిస్తాను!

దేవుడు జీవిస్తున్నారు! యేసే క్రీస్తు! ఆయన సంఘము పునఃస్థాపించబడింది! ఆయన మరియు ఆయన తండ్రి, మన పరలోకపు తండ్రి మనలను చూస్తున్నారు. ఈవిధంగా నేను యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.