దేవాలయము మరియు మీ ఆత్మీయ పునాది
మీ జీవితంలో ఏదైనా ఉపద్రవం సంభవించినప్పుడు, ఆత్మీయంగా ఉండడానికి సురక్షితమైన ప్రదేశం ఏమిటంటే దేవాలయ నిబంధనల పరిధిలో జీవించడమే!
నా ప్రియమైన సహోదర సహోదరిలారా, నా హృదయపు భావాలను పంచుకునేందుకు ఈ ఉదయం మీతో ఉన్నందుకు నేను కృతజ్ఞుడ్ని.
మీకు తెలిసినట్లుగా, చారిత్రాత్మక సాల్ట్‌లేక్ దేవాలయంలో మేము భారీ పునర్నిర్మాణాలు చేపట్టాము. దాని తొలి పునాదికి భారీగా అదనపు బలాన్ని చేకూర్చడం ఈ సంక్లిష్టమైన ప్రాజెక్ట్‌లో భాగము, ఇది ఒక శతాబ్దానికి పైగా బాగా పనిచేసింది. అయితే ఈ దేవాలయం చాలా కాలం పాటు నిలబడాలి. మే చివరలో, ఈ భారీ ప్రాజెక్టు యొక్క పురోగతిని నేను పరిశీలించాను. నేను మరియు నా భార్య వెండీ చూసినదాన్ని చూసినప్పుడు మీరు కూడా ప్రశంసిస్తారని నేను అనుకున్నాను. “ఎంత దృఢమైన పునాది”1 అనే కీర్తన ఎందుకు నాకు కొత్త అర్థాన్ని తెచ్చిందో మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను.
సాల్ట్ లేక్ దేవాలయ పునర్నిర్మాణ స్థలం నుండి వీడియో: “మనము సాల్ట్ లేక్ దేవాలయం యొక్క అసలు పునాదిని చూస్తున్నాము. వనము గది క్రింద ఉన్న ప్రాంతంలో నేను నిలబడి ఉన్నాను. ఈ మొత్తం భవనం యొక్క హస్తకళను నేను పరిశీలిస్తున్నప్పుడు, అగ్రగాములు ఏమి సాధించారో నేను ఆశ్చర్యపోతున్నాను. ఒక శతాబ్దం క్రితం వారికి అందుబాటులో ఉన్న సాధనాలు మరియు సాంకేతికతలతో మాత్రమే వారు ఈ అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారని నేను భావించినప్పుడు నేను పూర్తిగా విస్మయం చెందాను.
“ఇన్ని దశాబ్దాల తరువాత, మనము పునాదిని నిశితంగా పరిశీలించినట్లయితే, అరుగుదల యొక్క ప్రభావాలు, తొలి రాతిపనిలో ఖాళీలు మరియు రాళ్ళలోని స్థిరత్వం యొక్క వివిధ దశలను మనం చూడవచ్చు.
“ఆధునిక ఇంజనీర్లు, వాస్తుశిల్పులు మరియు నిర్మాణ నిపుణులు ఆ తొలి పునాదిని బలోపేతం చేయడానికి ఏమి చేయగలరో ఇప్పుడు నేను చూసినప్పుడు, నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. వారి పని అద్భుతముగా ఉంది!
“ఏ పెద్ద భవనం యొక్క పునాది అయినా, ముఖ్యంగా ఇంత పెద్ద భవనం యొక్క పునాది భూకంపాలు, తుప్పుపట్టడం, బలమైన ఈదురు గాలులు మరియు అన్ని భవనాలను ప్రభావితం చేసే భూమిలోనికి కృశించే అనివార్యమైన ప్రక్రియను తట్టుకునేంత బలంగా మరియు స్థితిస్థాపకంగా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న బలపరిచే సంక్లిష్టమైన పని చరిత్ర అంతటా నిలిచియుండగల పునాదితో ఈ పవిత్ర దేవాలయాన్ని బలోపేతం చేస్తుంది.”
బలహీనంగా మారిన గౌరవప్రదమైన ఈ దేవాలయానికి ప్రకృతి శక్తులను తట్టుకుని, వెయ్యేండ్ల పరిపాలనలో ప్రవేశించేవరకు నిలిచియుండే పునాది ఇవ్వడానికి మేము సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తున్నాము. అదేవిధంగా, మన వ్యక్తిగత ఆత్మీయ పునాదులను బలోపేతం చేయడానికి మనలో ప్రతి ఒక్కరూ అసాధారణమైన చర్యలు—మునుపెన్నడు చేయని చర్యలు—అమలు చేయవలసిన సమయం ఆసన్నమయింది. అపూర్వమైన సమయాలు అపూర్వమైన చర్యలకు పిలుపునిస్తాయి.
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఇవి కడవరి దినములు. మీరు మరియు నేను రాబోయే అపాయకర దినములను మరియు ఒత్తిళ్ళను తట్టుకోవాలంటే, మన విమోచకుడైన యేసు క్రీస్తు బండ మీద దృఢమైన ఆత్మీయ పునాదిపై నిర్మించబడటం మనలో ప్రతి ఒక్కరికి అత్యవసరం.2
కాబట్టి నేను మీలో ప్రతి ఒక్కరిని అడుగుచున్నాను, “మీ పునాది ఎంత దృఢంగా ఉంది? మీ సాక్ష్యాన్ని మరియు సువార్త యొక్క మీ అవగాహనను ఏవిధంగా బలోపేతం చేయడం అవసరం?
దేవాలయం మన విశ్వాసం మరియు ఆత్మీయ స్థైర్యాన్ని బలోపేతం చేసే ముఖ్యమైన భాగంగా ఉన్నది, ఎందుకంటే రక్షకుడు మరియు ఆయన సిద్ధాంతము దేవాలయంలో అత్యంత కీలకమైన భాగములుగా ఉన్నాయి. బోధన ద్వారా మరియు ఆత్మ ద్వారా దేవాలయంలో బోధింబడే ప్రతి విషయము యేసు క్రీస్తుపై మన అవగాహన పెరుగుతుంది. పవిత్రమైన యాజకత్వపు నిబంధనల ద్వారా ఆయన ఆవశ్యకమైన విధులు మనల్ని ఆయనతో బంధించి ఉంచుతాయి. తరువాత, మనం మన నిబంధనలను పాటించినప్పుడు, ఆయన యొక్క స్వస్థపరచే, బలపరిచే శక్తిని ఆయన మనకు వరముగా ఇస్తారు.3 మరియు ఓహ్, రాబోయే రోజుల్లో ఆయన శక్తి మనకు ఎంతో అవసరం.
“[మనము] సిద్ధపడియున్న యెడల [మనము] భయపడనవసరము లేదు”4 అని మనకు వాగ్దానము చేయబడ్డాము. ఈ అభయము నేడు తీవ్ర ప్రభావాలను కలిగి ఉంది. నేడు అసాధారణమైన సవాళ్ళు ఉన్నప్పటికీ, యేసు క్రీస్తుపై తమ పునాదులను నిర్మించుకునేవారు మరియు ఆయన శక్తిని ఎలా పొందాలో నేర్చుకున్నవారు మన కాలానికి చెందిన ఆందోళన లేక ఒత్తిడి భావాలకు లొంగిపోనవసరం లేదని ప్రభువు ప్రకటించారు.
దేవాలయ విధులు మరియు నిబంధనలు ప్రాచీనమైనవి. ఆదాము మరియు హవ్వలను ప్రార్థించమని, నిబంధనలు చేయమని మరియు బలులు అర్పించమని ప్రభువు ఆదేశించారు.5 నిజానికి, “దేవుడు భూమిపై తన మాటకు కట్టుబడి ఉండే ప్రజలను కలిగి ఉన్నప్పుడు, వారు దేవాలయాలను నిర్మించమని ఆదేశించబడ్డారు.”6 దేవాలయ బోధనలు, వస్త్రధారణ, భాష మరియు మరెన్నో7 సూచనలతో ప్రామాణిక గ్రంథములు నిండి ఉన్నాయి. మనం నమ్మే ప్రతిదీ మరియు దేవుడు తన నిబంధన జనులకు చేసిన ప్రతి వాగ్దానం దేవాలయంలో నెరవేరుతుంది. ప్రతి యుగములో, దేవునితో నిబంధనలు చేసి, వాటిని పాటించేవారు నిబంధన పిల్లలు అవుతారనే విలువైన సత్యాన్ని దేవాలయం ఉద్ఘాటిస్తుంది.
అందువలన, ప్రభువు యొక్క మందిరములో అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు చేసిన అదే నిబంధనలను మనం దేవునితో చేయగలము. మరియు వారు పొందిన దీవెనలను పొందగలము!
దాని తొలి దినముల నుండి దేవాలయాలు ఈ యుగములో భాగంగా ఉన్నాయి.8 కర్ట్‌లాండ్ దేవాలయములో ఏలీయా జోసెఫ్ స్మిత్‌కు ముద్రవేయు తాళపుచేతులను అప్పగించారు. నావూ దేవాలయంలో యాజకత్వము యొక్క సంపూర్ణత్వము పునఃస్థాపించబడింది.9
ఆయన హతసాక్షి అయ్యే వరకు, జోసెఫ్ స్మిత్ బయల్పాటులు పొందుతూనే ఉన్నాడు, అది దేవాలయ వరము మరియు ముద్రవేయు విధుల యొక్క పునఃస్థాపనకు సహాయపడింది.10 అయితే, మరింత మెరుగుదల అవసరమని ఆయన గుర్తించారు. 1842 మేలో బ్రిగం యంగ్‌కు వరమును ఇచ్చిన తరువాత, జోసెఫ్ బ్రిగంతో ఇలా అన్నారు, “ఇది సరిగ్గా అమర్చబడలేదు, కానీ మనమున్న పరిస్థితులలో మనము చేయగలిగినంత ఉత్తమంగా చేసాము మరియు ఈ విషయాన్ని మెరుగుపరిచే బాధ్యత నీవు తీసుకొని, ఈ ఆచారక్రయలన్నిటిని వ్యవస్థీకరించి మరియు ఒక క్రమపద్ధతిలో ఏర్పరచవలెనని నేను కోరుచున్నాను.”11
ప్రవక్త మరణం తరువాత, అధ్యక్షులు యంగ్ నావూ దేవాలయము12 పూర్తి చేయబడడాన్ని పర్యవేక్షించారు మరియు తరువాత యూటా భూభాగములో దేవాలయాలను నిర్మించారు. సెయింట్ జార్జ్ దేవాలయము యొక్క దిగువ అంతస్తులు సమర్పించబడినప్పుడు, బ్రిగం యంగ్ ప్రాతినిధ్య దేవాలయ కార్యము యొక్క అత్యావశ్యకతను శక్తివంతంగా ప్రకటించారు, “నేను ఈ విషయం గురించి ఆలోచించినప్పుడు, ఈ విషయాలు గురించి ప్రజలు తెలుసుకొనేలా చేయాలని చాలా బిగ్గరగా, శక్తివంతమైన స్వరం పొందాలని కోరుకుంటున్నాను.”13
ఆ సమయం నుండి, దేవాలయ విధులు క్రమంగా శుద్ధి చేయబడ్డాయి. రక్షకుని యొక్క పునఃస్థాపించబడిన సంఘములో విధి విధానాలు మరియు దేవాలయ విధుల నిర్వహణ కూడ ఎందుకు మారుతూ ఉన్నాయో అధ్యక్షులు హెరాల్డ్ బి. లీ వివరించారు. అధ్యక్షులు లీ ఇలా అన్నారు: “యేసు క్రీస్తు సువార్త సూత్రాలు దైవికమైనవి. ప్రభువు బయల్పాటు ద్వారా సంఘము యొక్క సూత్రాలను మరియు [సిద్ధాంతాన్ని] మారుస్తారు తప్ప ఇంకెవ్వరూ మార్చరు. కానీ నిర్ణీత సమయంలో అధ్యక్షత్వము వహించే వారికి ప్రేరేపించబడిన నడిపింపు వచ్చినప్పుడు పద్ధతులు మారతాయి.”14
కాలక్రమేణా సంస్కార నిర్వహణ ఎలా మారిందో పరిశీలించండి. ఆరంభ కాలములో, సంస్కారపు నీటిని ఒక పెద్ద పాత్రలో సమూహానికి అందించేవారు. అందరూ దానిలోనిది తాగేవారు. ఇప్పుడు మనము వ్యక్తిగతముగా వాడిపారవేసే కప్పులను ఉపయోగిస్తాము. విధానం మార్చబడింది, కానీ నిబంధనలు అదేవిధంగా నిలిచియుంటాయి.
ఈ మూడు సత్యాలను లోతుగా ఆలోచించండి:
-
ఒకటి: పునఃస్థాపన అనేది ఒక ప్రక్రియ, కానీ ఒక సంఘటన కాదు మరియు ప్రభువు మరలా వచ్చే వరకు కొనసాగుతుంది.
-
రెండు: ఇశ్రాయేలు సమకూర్పు15 యొక్క అంతిమ లక్ష్యం దేవుని యొక్క విశ్వాసులైన పిల్లలకు దేవాలయ దీవెనలను అందించడం.
-
మూడు: ఆ లక్ష్యాన్ని మరింత సమర్థవంతంగా ఎలా సాధించాలోనని మనం అపేక్షించినప్పుడు, ప్రభువు మరిన్ని అంతరార్థములను బయలుపరుస్తారు. కొనసాగుతున్న పునఃస్థాపనకు నిరంతర బయల్పాటు అవసరం.
దేవాలయ దీవెనలను ఆయన విశ్వాసులైన పిల్లలకు తీసుకొని వెళ్ళడానికి ఉత్తమమైన మార్గాలు ఉన్నాయా అని ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండు మంది అపొస్తలుల సమూహము తరచుగా ప్రభువును అడిగారు. భాష మరియు సంస్కృతిలో తేడాలు ఉన్నప్పటికీ దేవాలయ సూచనలు, నిబంధనలు మరియు విధుల యొక్క ప్రపంచవ్యాప్త ఖచ్చితత్వం మరియు స్థిరత్వాన్ని ఎలా నిర్ధారించాలో నడిపింపును మేము క్రమంగా వెదకుతాము.
ప్రభువు నిర్దేశకత్వంలో మరియు మా ప్రార్థనలకు సమాధానంగా, ఇటీవలి విధానపరమైన సర్దుబాట్లు చేయబడ్డాయి. మీరు నిబంధనలు దేనికి చేస్తున్నారో మీరు గొప్ప స్పష్టతతో అర్థం చేసుకోవాలని కోరేది ఆయనే. ఆయన పవిత్ర విధులను మీరు పూర్తిగా అనుభవించాలని కోరేది ఆయనే. మీ విశేషాధికారాలను, వాగ్దానాలను మరియు బాధ్యతలను మీరు అర్థం చేసుకోవాలని ఆయన కోరుచున్నారు. మీరు ఇంతకు ముందెన్నడూ పొందని ఆత్మీయ అంతరార్థములను మరియు మేల్కొలుపులను పొందాలని ఆయన కోరుచున్నారు. వారు ఎక్కడ నివసించుచున్నప్పటికీ, దేవాలయ పోషకులు అందరి కొరకు, దీనిని ఆయన కోరుచున్నారు.
దేవాలయ విధానాలలో ప్రస్తుత సర్దుబాట్లు, మరియు వాటి తరువాత ఇతర సర్దుబాట్లు, ప్రభువు తన సంఘాన్ని క్రియాశీలకంగా నడిపిస్తున్నారని చెప్పడానికి నిరంతర సాక్ష్యాలు. మన జీవితాలను ఆయనపై మరియు ఆయన దేవాలయం యొక్క విధులు మరియు నిబంధనలపై కేంద్రీకరించడం ద్వారా మన ఆత్మీయ పునాదులను మరింత సమర్థవంతంగా బలపరచడానికి ఆయన మనలో ప్రతి ఒక్కరికీ అవకాశాలను కల్పిస్తున్నారు. మీ దేవాలయ సిఫార్సు, నలిగిన హృదయము మరియు నేర్చుకోవాలనే కోరికగల మనస్సును ప్రభువు యొక్క అభ్యాస మందిరమునకు మీరు తీసుకువచ్చినప్పుడు, ఆయన మీకు బోధిస్తారు.
దూరము, ఆరోగ్య సవాళ్ళు, లేదా ఇతర అడ్డంకులు కొంతకాలం మీరు దేవాలయానికి హాజరుకాకుండా నిషేధించినట్లయితే, మీరు చేసిన నిబంధనలను మీ మనస్సులో అభ్యాసము చేయడానికి ఒక క్రమమైన సమయాన్ని కేటాయించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
మీరు ఇప్పటికీ దేవాలయానికి వెళ్ళడానికి ఇష్టపడకపోతే, ఇంకా ఎక్కువ తరచుగా వెళ్ళండి, కానీ తక్కువగా కాదు. ప్రభువు తన ఆత్మ ద్వారా అక్కడ మీకు బోధించి, మిమ్మల్ని ప్రేరేపించనివ్వండి. కాలక్రమేణా, దేవాలయం భద్రత, ఓదార్పు మరియు బయల్పాటు పొందే ప్రదేశంగా మారుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను.
నేను ప్రతి యువజనుడితో ఒకరి తరువాత మరొకరితో మాట్లాడే అవకాశం ఉంటే, దేవాలయంలో మీతోపాటు ముద్రవేయబడగల ఒక సహచరురాలిని వెదకమని నేను మిమ్మల్ని వేడుకుంటాను. ఇది మీ జీవితంలో ఎలాంటి మార్పు తెస్తుందో అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇది గొప్ప ప్రభావాన్ని చూపుతుందని నేను హామీ ఇస్తున్నాను! మీరు దేవాలయంలో వివాహం చేసుకుని, పలుమార్లు తిరిగి వచ్చినప్పుడు, మీ నిర్ణయాలలో మీరు బలపడతారు మరియు మార్గనిర్దేశం చేయబడతారు.
దేవాలయంలో ఇప్పటికీ ముద్రవేయబడని ప్రతి భార్య మరియు ప్రతి భర్తతో నేను మాట్లాడగలిగినట్లయితే, అత్యంత ప్రధానమైన, జీవితాన్ని మార్చే ఆ విధిని పొందడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని వేడుకుంటాను.16 ఇది మీ జీవితంలో వ్యత్యాసాన్ని చూపిస్తుందా? మీరు శాశ్వతంగా అభివృద్ధి చెందాలని మరియు శాశ్వతంగా కలిసి ఉండాలని కోరుకుంటే మాత్రమే అది జరుగుతుంది. ఎప్పటికీ కలిసి ఉండాలనే కోరిక మాత్రమే ఉంటే సరిపోదు. ఏ ఇతర ఆచారక్రియ లేదా ఒప్పందము కూడా అలా చేయదు.17
వివాహం కోసం ఆకాంక్షిస్తూ, ఇంకా వారి శాశ్వత సహచరుడిని కనుగొనని ప్రతి స్త్రీ లేదా సహచరురాలిని కనుగొనని ప్రతి పురుషునితో నేను మాట్లాడగలిగితే, ప్రభువు యొక్క మందిరములో వరము పొందుటకు వివాహం జరిగే వరకు వేచి ఉండవద్దని నేను మిమ్మల్ని కోరతాను. యాజకత్వ శక్తితో సాయుధులై ఉండడం అంటే ఏమిటో తెలుసుకోవడానికి మరియు అనుభవించడానికి ఇప్పుడు ప్రారంభించండి.
మరియు దేవాలయ నిబంధనలను చేసిన మీలో ప్రతి ఒక్కరితో, దేవాలయ నిబంధనలను మరియు విధులను అర్థం చేసుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా మరియు ఏకరీతిగా కోరుకోవాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.18 ఆత్మీయ ద్వారాలు తెరువబడతాయి. పరలోకము మరియు భూమికి మధ్య తెరను ఎలా విభజించాలో, దేవుని యొక్క దేవదూతల సహాయము కోసం మీరు ఎలా అడగాలో మరియు పరలోకమునుండి నడిపింపును ఎలా పొందాలో మీరు నేర్చుకుంటారు. ఆ విధంగా చేయడానికి మీరు చేసే శ్రద్ధగల ప్రయత్నాలు మీ ఆత్మీయ పునాదిని బలోపేతం చేస్తాయి మరియు బలపరుస్తాయి.
నా ప్రియమైన సహోదర సహోదరిలారా, సాల్ట్ లేక్ దేవాలయంలో పునర్నిర్మాణాలు పూర్తయినప్పుడు, సాల్ట్లేక్ లోయలో భూకంపం వచ్చే సమయంలో ఆ దేవాలయం లోపల కంటే సురక్షితమైన ప్రదేశం మరొకటి ఉండదు.
అదేవిధంగా, మీ జీవితంలో ఏరకమైన ఉపద్రవం సంభవించినప్పుడు, ఆత్మీయంగా ఉండడానికి సురక్షితమైన ప్రదేశం ఏమిటంటే మీ నిబంధనల పరిధిలో జీవించడమే!
యేసు క్రీస్తుపై మీ ఆత్మీయ పునాది పటిష్టంగా నిర్మించబడినప్పుడు, మీరు భయపడవలసిన అవసరం లేదని నేను చెప్పినప్పుడు దయచేసి నన్ను నమ్మండి. మీరు దేవాలయంలో చేసిన మీ నిబంధనలకు యధార్ధంగా ఉన్నప్పుడు, మీరు ఆయన శక్తి ద్వారా బలపరచబడతారు. అప్పుడు, ఆత్మీయ భూకంపాలు సంభవించినప్పుడు, మీరు బలంగా నిలబడగలుగుతారు ఎందుకంటే మీ ఆత్మీయ పునాది దృఢమైనది మరియు కదిలింపబడలేనిది.
ప్రియమైన సహోదర సహోదరిలాలా, నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను. ఈ సత్యాలు నాకు తెలుసు: మన పరలోక తండ్రియైన దేవుడు, మీరు ఆయన గృహానికి వచ్చుటకు ఎంచుకోవాలని కోరుచున్నారు. శాశ్వతమైన పురోగతి యొక్క ఆయన ప్రణాళిక సంక్లిష్టమైనది కాదు, మరియు అది మీ కర్తృత్వమును గౌరవిస్తుంది. రాబోయే ప్రపంచంలో—మీరు ఎవరో మరియు—మీరు ఎవరితో ఉంటారో ఎంచుకోవడానికి మీరు స్వతంత్రులు!
దేవుడు జీవిస్తున్నారు! యేసే క్రీస్తు! మీ దైవిక గమ్యస్థానాన్ని చేరుకోవడంలో మీకు సహాయపడడానికి ఇది ఆయన పునఃస్థాపించబడిన సంఘము. ఈవిధంగా నేను యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.