7వ అధ్యాయము
ప్రధాన న్యాయాధిపతి హత్య చేయబడెను, ప్రభుత్వము నాశనము చేయబడెను మరియు జనులు గోత్రములుగా విభజింపబడుదురు—క్రీస్తు విరోధియైన జేకబ్ ఒక రహస్య కూడికకు రాజగును—నీఫై పశ్చాత్తాపమును, క్రీస్తు నందు విశ్వాసమును బోధించును—దేవదూతలు అతనికి ప్రతిదినము పరిచర్య చేసిరి మరియు అతడు తన సహోదరుడిని మృతులలో నుండి లేపును—అనేకులు పశ్చాత్తాపపడి, బాప్తిస్మము పొందిరి. సుమారు క్రీ. శ. 30–33 సం.
1 ఇప్పుడు, వారు దేశముపై ఒక రాజును నియమించలేదని నేను మీకు చూపెదను; కానీ ఇదే సంవత్సరమందు, అనగా ముప్పైయవ సంవత్సరమందు దేశము యొక్క ప్రధాన న్యాయాధిపతిని వారు న్యాయపీఠముపై నాశనము చేసిరి, అనగా హత్యచేసిరి.
2 మరియు జనులు ఒకరికి వ్యతిరేకముగా మరొకరు విభజింపబడిరి; ప్రతి మనుష్యుడు అతని కుటుంబము, అతని బంధువులు మరియు స్నేహితులను బట్టి ఒకరి నుండి మరొకరు గోత్రములుగా వేరుపడిరి; ఆ విధముగా వారు దేశము యొక్క ప్రభుత్వమును నాశనము చేసిరి.
3 ప్రతి గోత్రము తమపైన ఒక ప్రధానిని లేదా నాయకుడిని నియమించుకొనెను; ఆ విధముగా వారు గోత్రములు మరియు గోత్రముల యొక్క నాయకులైరి.
4 పెద్ద కుటుంబము మరియు అనేకమంది బంధువులు, స్నేహితులు లేకుండా అక్కడ ఏ మనుష్యుడూ లేకుండెను; కావున వారి గోత్రములు మిక్కిలి గొప్పవాయెను.
5 ఇప్పుడిదంతయూ చేయబడెను మరియు వారి మధ్య ఇంకను ఎట్టి యుద్ధములు లేకుండెను; వారు తమనుతాము సాతాను శక్తికి అప్పగించుకొనినందున, జనులపై ఈ సమస్త దుర్నీతి వచ్చియుండెను.
6 మరియు ప్రవక్తలను హత్య చేసిన వారి స్నేహితులు, బంధువుల యొక్క రహస్య కూడికను బట్టి ప్రభుత్వము యొక్క నియమములు నాశనము చేయబడెను.
7 వారు దేశమందు గొప్ప వివాదము కలుగజేసిరి, ఎంతగాననగా జనులలో అధిక నీతిమంతులైన వారందరు దాదాపుగా దుర్మార్గులైరి; వారి మధ్య నీతిమంతులు బహు కొద్దిమంది ఉండిరి.
8 ఆ విధముగా కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును జనులలో అధికభాగము తమ నీతి నుండి మరలిపోయి ఆరు సంవత్సరములు కూడా గతించిపోలేదు.
9 ఇప్పుడు జనుల మధ్య అంత గొప్ప దుష్టత్వము జరిగించిన ఈ రహస్య కూడిక ఏకముగా సమకూడి, జేకబ్ అని వారు పిలిచిన వానిని వారి నాయకునిగా నియమించెను;
10 మరియు వారు అతడిని తమ రాజు అని పిలిచిరి; కావున, అతడు ఈ దుష్టుల ముఠాపై రాజు ఆయెను; అతడు యేసును గూర్చి సాక్ష్యమిచ్చిన ప్రవక్తలకు వ్యతిరేకముగా తమ స్వరమునెత్తిన ప్రధానులలో ఒకడైయుండెను.
11 ఏకముగా కలిసిన జనుల యొక్క గోత్రములవలే సంఖ్యలో వారు అంత బలముగా లేకుండిరి, వారి నాయకులలో ప్రతి ఒక్కరు తమ గోత్రమును బట్టి తమ చట్టములు స్థాపించుకొనిరి; అయినప్పటికీ వారు శత్రువులైయుండిరి; వారు నీతిమంతులు కానప్పటికీ, ప్రభుత్వమును నాశనము చేయుటకు నిబంధనలోనికి ప్రవేశించిన వారి యెడల ద్వేషమందు వారు ఐక్యముగానుండిరి.
12 కావున ముఠా యొక్క రాజైన జేకబ్, తమ శత్రువులు తమ కంటే అధిక సంఖ్యాకులని చూచి, మిక్కిలి ఉత్తర భాగమందున్న దేశములోనికి వారు తమ పలాయనము సాగించవలెనని, అసమ్మతీయులు తమను చేరువరకు (ఏలయనగా అనేకమంది అసమ్మతీయులు చేరెదరని అతడు వారికి ఆశలు కల్పించెను) మరియు జనుల యొక్క గోత్రములతో పోరాడుటకు వారు తగినంత బలవంతులగువరకు వారి కొరకు అక్కడొక రాజ్యమును నిర్మించవలెనని తన జనులను ఆజ్ఞాపించగా, వారట్లు చేసిరి.
13 వారి నడక ఎంత వేగముగా ఉండెననగా, వారు జనులకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోవు వరకు వారు అడ్డగించబడలేకపోయిరి. ఆ విధముగా ముప్పైయవ సంవత్సరము ముగిసెను; మరియు నీఫై జనుల యొక్క వ్యవహారములు ఆ విధముగానుండెను.
14 ముప్పది ఒకటవ సంవత్సరమందు ప్రతి మనుష్యుడు అతని కుటుంబము, బంధువులు మరియు స్నేహితులను బట్టి గోత్రములుగా విభజింపబడిరి; అయినప్పటికీ, వారు ఒకరితోనొకరు యుద్ధము చేయరని వారొక ఒప్పందమునకు వచ్చిరి; కానీ, వారి చట్టములు మరియు వారి ప్రభుత్వ విధాన విషయమై వారు ఐక్యముగా ఉండలేదు, ఏలయనగా అవి వారి ప్రధానులు మరియు వారి నాయకుల మనస్సులను బట్టి స్థాపించబడినవి. కానీ, ఒక గోత్రము మరియొక గోత్రముపై దాడి చేయరాదని చాలా కఠినమైన చట్టములను వారు ఏర్పాటు చేసిరి, ఎంతగాననగా కొంత స్థాయిలో దేశమందు వారు సమాధానమును కలిగియుండిరి; అయినప్పటికీ, వారి హృదయములు వారి దేవుడైన ప్రభువు నుండి త్రిప్పివేయబడెను మరియు వారు ప్రవక్తలను రాళ్ళతో కొట్టి, వారిని తమ మధ్య నుండి బయటకు గెంటివేసిరి.
15 మరియు నీఫై—దేవదూతలచేత, ప్రభువు యొక్క స్వరము చేత దర్శింపబడియుండెను; కావున దేవదూతలను చూచియుండి, ప్రత్యక్ష సాక్షియైయుండి, క్రీస్తు యొక్క పరిచర్యను గూర్చి అతడు ఎరుగునట్లు అతనికి శక్తి ఇవ్వబడియుండెను; నీతి నుండి దుష్టత్వము మరియు హేయకార్యములకు వారు వేగముగా తిరుగుటను కూడా అతడు ప్రత్యక్షముగా చూచియుండెను;
16 కావున, వారి హృదయ కాఠిన్యము మరియు వారి మనస్సుల యొక్క గ్రుడ్డితనము నిమిత్తము నొచ్చుకొనినవాడై—అదే సంవత్సరమందు వారి మధ్యకు వెళ్ళి, పశ్చాత్తాపము మరియు ప్రభువైన యేసు క్రీస్తుపై విశ్వాసము ద్వారా పాప క్షమాపణను గూర్చి ధైర్యముగా సాక్ష్యమిచ్చుట మొదలుపెట్టెను.
17 అతడు వారికి అనేక విషయములలో పరిచర్య చేసెను; అవన్నియు వ్రాయబడలేవు, వాటిలో కొంతభాగము వ్రాయుట చాలదు, కావున అవి ఈ గ్రంథములో వ్రాయబడలేదు. మరియు నీఫై శక్తితో, గొప్ప అధికారముతో పరిచర్య చేసెను.
18 అతడు వారికంటే ఎక్కువ శక్తి కలిగియున్నందున వారు అతనితో కోపముగానుండిరి, ఏలయనగా అతని మాటలను వారు నమ్మకుండుట అసాధ్యమాయెను, ఏలయనగా ప్రభువైన యేసు క్రీస్తుపై అతని విశ్వాసము ఎంత గొప్పదనగా దేవదూతలు అతనికి ప్రతిదినము పరిచర్య చేసిరి.
19 అతడు యేసు నామమందు దయ్యములను, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టెను; అతని సహోదరుడు జనుల చేత రాళ్ళతో కొట్టబడి మరణముననుభవించిన తరువాత అతడిని మృతులలో నుండి లేపెను.
20 జనులు దానిని చూచి, దానికి సాక్ష్యముండి, అతని శక్తిని బట్టి అతనితో కోపముగానుండిరి; అతడు యేసు నామమందు జనుల దృష్టిలో అనేకమైన అద్భుతకార్యములను చేసెను.
21 ఇప్పుడు ముప్పది ఒకటవ సంవత్సరము గతించిపోయెను మరియు ప్రభువుకు పరివర్తన చెందినవారు బహు కొద్దిమంది ఉండిరి; కానీ పరివర్తన చెందిన వారందరు తాము విశ్వాసముంచిన యేసు క్రీస్తునందున్న శక్తి మరియు దేవుని ఆత్మ ద్వారా వారు దర్శింపబడిరని జనులకు నిజముగా తెలియజేసిరి.
22 తమ నుండి దయ్యములు వెళ్ళగొట్టబడి, తమ రోగముల నుండి, అనారోగ్యముల నుండి స్వస్థత పొందిన వారందరూ దేవుని ఆత్మ వారిపై పని చేసినదని మరియు వారు స్వస్థపరచబడిరని జనులకు నిజముగా విశదపరచిరి; జనుల మధ్య వారు సూచకక్రియలు చూపి, కొన్ని అద్భుతకార్యములను కూడా చేసిరి.
23 ఆ విధముగా ముప్పది రెండవ సంవత్సరము కూడా గడిచిపోయెను. ముప్పది మూడవ సంవత్సరము యొక్క ప్రారంభమందు జనులకు నీఫై మొరపెట్టెను; అతడు వారికి పశ్చాత్తాపమును, పాప క్షమాపణను బోధించెను.
24 ఇప్పుడు పశ్చాత్తాపమునకు తేబడిన వారిలో నీటితో బాప్తిస్మము పొందని వారు ఒక్కరు కూడా అక్కడ లేరని మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని నేను కోరుచున్నాను.
25 కావున, అట్టి వారందరు వారి యొద్దకు వచ్చి నీటితో బాప్తిస్మము పొందవలెనని ఈ పరిచర్య కొరకు నీఫైచేత మనుష్యులు నియమింపబడిరి; ఇది, వారు పశ్చాత్తాపపడిరని, వారి పాప క్షమాపణను పొందిరని దేవుని యెదుట మరియు జనుల యెదుట ఒక సాక్ష్యముగా, ఒక ప్రమాణముగా ఉండెను.
26 ఇప్పుడు పశ్చాత్తాపము నిమిత్తము బాప్తిస్మము పొందిన వారు ఈ సంవత్సరము యొక్క ప్రారంభమందు అనేకులుండిరి; మరియు సంవత్సరములో అధికభాగము ఆ విధముగా గడిచిపోయెను.