101వ ప్రకరణము
1833, డిసెంబరు 16 మరియు 17లలో కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ కివ్వబడిన బయల్పాటు. మిస్సోరిలో కూడివచ్చిన పరిశుద్ధులు ఈ సమయములో గొప్ప హింసను అనుభవించుచుండెను. అల్లరిమూకలు జాక్సన్ కౌంటీలో తమ గృహముల నుండి వారిని వెళ్ళగొట్టిరి; పరిశుద్ధులలో కొందరు వ్యాన్ బ్యురెన్, లాఫెయెట్ మరియు రే కౌంటీలలో స్థిరపడుటకు ప్రయత్నించిరి, గాని అక్కడ కూడా వారు హింసించబడిరి. పరిశుద్ధులలో ఎక్కువమంది ఆ సమయములో క్లే కౌంటీ, మిస్సోరిలో ఉండెను. సంఘములో సభ్యులనేకులు వ్యక్తిగతంగా మరణపు బెదిరింపులను ఎదుర్కొనిరి. జాక్సన్ కౌంటీలోని పరిశుద్ధులు గృహోపకరణములను, వస్త్రములను, పశువులను, ఇతర వ్యక్తిగత ఆస్తులను కోల్పోయిరి; వారి పంటలలో అనేకము నాశనము చేయబడినవి.
1–8, వారి అతిక్రమముల వలన పరిశుద్ధులు శిక్షింపబడి, బాధలనుభవించిరి; 9–15, ప్రభువు కోపము జనములమీదకు వచ్చును, కానీ ఆయన ప్రజలు పోగుచేయబడి, ఆదరణ పొందుదురు; 16–21, సీయోను, ఆమె స్టేకులు స్థాపించబడును; 22–31, వెయ్యేండ్ల పరిపాలన కాలములో జీవన విధానము వివరించబడినది; 32–42, అప్పుడు పరిశుద్ధులు దీవించబడి, ప్రతిఫలము పొందుదురు; 43–62, రాజకుమారుడు, ఒలీవ చెట్ల ఉపమానము, కష్టాలు క్రమముగా సీయోను యొక్క విమోచనను తెలియజేయును; 63–75, పరిశుద్ధులు ఒకచోట చేరుటను కొనసాగించవలెను; 76–80, సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగమును ప్రభువు నిర్మించెను; 81–101, స్త్రీ మరియు అన్యాయస్థుడైన న్యాయాధిపతి యొక్క ఉపమానము ప్రకారము పరిశుద్ధులు అన్యాయముగా బాధపడినందులకు తగిన నష్టపరిహారము కొరకు వేడుకొనవలెను.
1 బాధింపబడి, హింసించబడి, వారి స్వాస్థ్యపు ప్రదేశము నుండి తరిమివేయబడిన మీ సహోదరులను గూర్చి నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను—
2 ప్రభువైన నేను, వారి అతిక్రమములకు పర్యవసానముగా వారు బాధింపబడుచున్న బాధ వారిపైకి వచ్చునట్లు అనుమతించితిని;
3 అయినప్పటికీ నేను వారిని నా వారిగా ఒప్పుకొందును, నా ఆభరణములను చేయుటకు నేను వచ్చు దినమున వారు నా వారగుదురు.
4 కాబట్టి అబ్రాహాము వలే వారు శిక్షింపబడి, పరీక్షింపబడవలసిన అవసరమున్నది, ఆయన తన ఏకైక కుమారుని అర్పించమని ఆజ్ఞాపించబడెను.
5 ఏలయనగా గద్దింపును భరింపక, నన్ను ఎరుగనను వారందరు పరిశుద్ధపరచబడలేరు.
6 ఇదిగో నేను చెప్పునదేమనగా, గొడవలు, కలహములు, క్రోధములు, మత్సరములు, కామముతో నిండి, పొరుగువానివి ఆశించు కోరికలు వారి మధ్య కలవు; కాబట్టి ఈ సంగతులను బట్టి వారి స్వాస్థ్యములను వారు మలినము చేసియున్నారు.
7 వారు తమ ప్రభువు స్వరమును వినుటకు త్వరపడలేదు; గనుక వారి ప్రార్థనలు వినుటకు, వారి కష్టకాలములో జవాబిచ్చుటకు వారి దేవుడైన ప్రభువు త్వరపడడు.
8 వారి శాంతికరదినములో నా ఉపదేశమును వారు తేలికగా తీసుకొనిరి; కానీ, వారి కష్టకాలములో అవసరతను బట్టి వారు నన్ను తడవులాడుచున్నారు.
9 వారు పాపములు చేసినప్పటికీ, వారి యెడల నా ఆంత్రములు కనికరముతో నిండియున్నవని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వారిని పూర్తిగా తృణీకరించను; ఉగ్రత దినమందు నేను కరుణ కలిగియుందును.
10 నా ప్రజల పక్షమున నా ఉగ్రత ఖడ్గము వారిమీద పడునట్లు చేసెదనని నేను ప్రమాణము చేసియున్నాను, గతములో నేను మీకు ఇచ్చియున్న ఒక ఆజ్ఞద్వారా శాసనము బయలువెళ్ళెను; నేను సెలవిచ్చిన విధముగానే అది జరుగును.
11 కొలుచుటకు వీలుకానీ నా కోపము సమస్త జనములపైన త్వరలో క్రుమ్మరించబడును; వారి పాపపు పాత్ర నిండినప్పుడు నేను దీనిని చేసెదను.
12 ఆ దినమందు కావలి బురుజుమీద కనుగొనబడువారు లేదా మరియొక మాటలో నా ఇశ్రాయేలు జనులందురును రక్షింపబడుదురు.
13 చెదిరిపోయిన వారు పోగుచేయబడుదురు.
14 దుఃఖపడిన వారందరు ఓదార్చబడుదురు.
15 నా నామము నిమిత్తము ప్రాణముపెట్టిన వారందరు మహిమ కీరీటమును పొందుదురు.
16 కాబట్టి, సీయోను గూర్చి మీ హృదయములందు ఆదరణ పొందుడి; ఏలయనగా, సర్వశరీరులు నా వశములోనున్నారు; ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి.
17 తన సంతానము చెదిరిపోయినప్పటికి, సీయోను తన స్థానము నుండి కదిలింపబడదు.
18 అక్కడ మిగిలిన వారు, హృదయశుద్ధి కలవారు తిరిగి తమ స్వాస్థ్యములకు వచ్చెదరు, వారును వారి పిల్లలును నిత్య సంతోషకరమైన కీర్తనలతో సీయోనులో పాడైపోయిన స్థలములను కట్టుటకు వచ్చెదరు—
19 ప్రవక్తల లేఖనములు నెరవేరుటకు ఇదంతయు జరుగును.
20 ఇదిగో, నా పరిశుద్ధులు కూడివచ్చు కార్యము కొరకు నేను నియమించిన స్థలము తప్ప వేరొక స్థలము నియమించబడలేదు; నేను నియమించిన స్థలము తప్ప, వేరొక స్థలము నియమించబడదు—
21 వారికిక స్థలములేని దినము వచ్చువరకు ఇది జరుగును; అప్పుడు నావద్ద గల ఇతర ప్రదేశములను వారికి నియమించెదను, తెరలు లేదా సీయోను బలము కొరకు అవి స్టేకులుగా పిలువబడును.
22 ఇదిగో నా నామమందు నాకు ప్రార్థించి, నా నిత్య సువార్త ప్రకారము నన్ను ఆరాధించు వారందరు కూడివచ్చి, పరిశుద్ధ స్థలములలో నిలిచియుండుట నా చిత్తమైయున్నది;
23 నా నివాసములో, భూమిని మరుగుచేయు నా దేవాలయపు తెర తొలగించబడి, సర్వశరీరులు కలిసి నన్ను చూచినప్పుడు రాబోవు బయల్పాటు కొరకు సిద్ధపడుడి.
24 మనుష్యుడు, లేదా పశువులు, లేదా ఆకాశ పక్షులు లేదా సముద్రపు చేపలు, భూమియంతటిపై జీవించు అపవిత్రమైన ప్రతి వస్తువు దహించి వేయబడును;
25 పంచభూతములు తీక్షణమైన వేడితో కరిగిపోవును; సమస్తము నూతనమగును, తద్వారా నా జ్ఞానము, మహిమ భూమిమీద నివశించును.
26 ఆ దినమందు మనుష్యుల శత్రుత్వము, జంతువుల శత్రుత్వము, సర్వశరీరుల శత్రుత్వము నా యెదుట గతించిపోవును.
27 ఆ దినమందు ఎవడు దేనిని అడిగినను, అది వానికి ఇవ్వబడును.
28 ఆ దినమందు ఎవనినైనా శోధించుటకు సాతానుకు శక్తి ఉండదు.
29 మరణము ఇక ఉండదు గనుక దుఃఖము ఉండదు.
30 ఆ దినమందు వృద్ధుడగువరకు ఏ శిశువు మరణమునొందడు; వాని జీవితకాలము వృక్షపు జీవితకాలము వలెనుండును;
31 అతడు మరణించినప్పుడు నిద్రించడు, అనగా భూమిలో నిద్రించడు, కానీ కనురెప్పపాటులో మార్పునొంది పైకి కొనిపోబడును, అతనికి కలుగు విశ్రాంతి మహిమకరముగా ఉండును.
32 అవును, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ప్రభువు వచ్చు ఆ దినమందు, ఆయన అన్ని సంగతులను—
33 గతించిపోయిన సంగతులు, ఏ మనుష్యుడు యెరుగని రహస్య సంగతులు, భూమిని గూర్చిన సంగతులు, అది దేనితో చేయబడినదో దాని ఉద్దేశ్యము, దాని యొక్క అంతము—
34 విలువైన సంగతులు, పైనున్న సంగతులు, క్రిందనున్న సంగతులు, భూమియందున్న సంగతులు, భూమి మీదనున్న సంగతులు, పరలోకమందున్న సంగతులను బయలుపరచును.
35 నా నామము కొరకు హింసను అనుభవించి విశ్వాసముతో సహించువారు, నా నామము కొరకు వారి ప్రాణములు పెట్టుటకు పిలువబడినను, ఈ మహిమయంతటిలో వారు పాలుపొందెదరు.
36 కాబట్టి, మరణమునకైనను భయపడకుడి; ఏలయనగా ఈ లోకములో మీ ఆనందము సంపూర్ణము కాదు, కానీ నా యందు మీ ఆనందము సంపూర్ణమగును.
37 కాబట్టి, దేహము కొరకైనను, దాని ప్రాణము కొరకైనను లక్ష్యపెట్టకుడి; కానీ ఆత్మకొరకు, దాని ప్రాణము కొరకు లక్ష్యపెట్టుడి.
38 దేవుని సన్నిధిని ఎల్లప్పుడు వెదకుడి, తద్వారా సహనముతో మీ ఆత్మలను మీరు లోబరచుకొని నిత్యజీవమును పొందెదరు.
39 మనుష్యులు నా నిత్య సువార్తకు పిలువబడి, నిత్యనిబంధనతో నిబంధన చేసుకొనినప్పుడు వారు లోకమునకు ఉప్పుగా, మనుష్యులకు సారముగా యెంచబడుదురు;
40 వారు మనుష్యులకు సారముగానుండుటకు పిలువబడిరి; కాబట్టి, ఉప్పు నిస్సారమైతే, అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.
41 ఇదిగో, సీయోను పిల్లలను గూర్చిన జ్ఞానము ఇందులో కలదు—అందరు కాదు కానీ వారిలో అనేకులు అపరాధులుగా కనుగొనబడిరి, కాబట్టి వారు తప్పక గద్దింపబడవలెను—
42 తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును.
43 ఇప్పుడు సీయోను విమోచనను గూర్చి నా చిత్తము తెలుసుకొనుటకు ఒక ఉపమానమును నేను మీకు చూపెదను.
44 రాజకుమారుడొకడు బహు రమ్యమైన ఒక పొలమును కలిగియుండెను; అతడు తన దాసులకు ఇలా చెప్పెను: నా ద్రాక్షతోటలోనికి వెళ్ళి, ఈ రమ్యమైన పొలములో పన్నెండు ఒలీవ మొక్కలను నాటుడి;
45 శత్రువు దానిని పాడుచేసి, నా ద్రాక్షతోట ఫలములను పట్టుకొనిపోయినప్పుడు నా ఒలీవ మొక్కలు నాశనము చేయబడకుండునట్లు వాటి చుట్టూ కావలివారిని నియమించుడి, ఒకడు కాపలా ఉండి చూట్టు ఉన్న ప్రదేశమును చూచుటకు ఒక గోపురమును కట్టుడి.
46 ఆ రాజకుమారుని దాసులు తమ యజమాని ఆజ్ఞాపించిన విధముగా చేసి, ఒలీవ మొక్కలు నాటించి, వాటి చుట్టూ కంచె వేయించి, కావలివారిని నియమించి, ఒక గోపురమును కట్టుటకు మొదలు పెట్టిరి.
47 వారింకను పునాది వేయుచుండగా, తమలోతాము ఈవిధముగా చెప్పుకొనిరి: మన యజమానికి ఈ గోపురము ఎందుకు అవసరము?
48 వారు చాలాసేపు ఈ విధముగా ఆలోచన చేసిరి: ఇది శాంతికరమైన సమయమైయుండగా, మన యజమానికి ఈ గోపురము ఎందుకు అవసరము?
49 ఈ ధనము సాహుకారులకు ఇవ్వవచ్చు కదా? ఇవి చేయవలసిన అవసరము లేదు.
50 వారీవిధముగా ఒకనితో నొకడు తర్కించుకొనుచు, సోమరులుగా మారి, వారి యజమాని చెప్పిన ఆజ్ఞలను పాటించలేదు.
51 శత్రువు రాత్రి సమయములో వచ్చి, దాని కంచెను పగులగొట్టెను; రాజకుమారుని దాసులు నిద్రలేచి, భయపడి పారిపోయిరి; శత్రువు వారి కార్యములను నాశనము చేసి, ఒలీవ చెట్లను విరుగగొట్టెను.
52 ఇదిగో, ఆ రాజకుమారుడు, ద్రాక్షతోట యజమాని, తన దాసులను పిలిచి వారిని ప్రశ్నించెను, ఎందుకు! ఈ దుష్కార్యము జరుగుటకు కారణమేమిటి?
53 మీరు ద్రాక్షతోటను నాటిన తరువాత, దానికి కంచెను వేసి, దాని ప్రాకారములపైన కావలివారినుంచిన తరువాత, గోపురమును నిర్మించి, గోపురముపైన కావలివారినుంచి, నా ద్రాక్షతోటను కనిపెట్టుకొనియుండి, మీ శత్రువు మీ పైకి రాకుండునట్లు నిద్రింపక, నేను మీకాజ్ఞాపించిన విధముగా మీరు చేయవలసినది కదా?
54 ఇదిగో, గోపురముపైన కావలివాడు వారు ఇంకను దూరములోనుండగా శత్రువును చూచియుండెడివాడు, అప్పుడు శత్రువు దాని కంచెను పగులగొట్టకుండా మీరు సిద్ధపడి, నాశనకారుని నుండి నా ద్రాక్షతోటను రక్షించి యుండెడివారు కదా.
55 ద్రాక్షతోట యజమాని తన దాసులలో ఒకనితో చెప్పెను: నీవు వెళ్ళి నా దాసులలో మిగిలిన వారిని పోగుచేసి, నిలిచియుండుటకు నేను నియమించిన వారు తప్ప నా మందిరములోనున్న బలగమునంతటిని అనగా నా మందిరములో బలమైయున్న నా సేవకులలో యుద్ధవీరులైన నా యౌవనులు, మధ్య వయస్కులైన వారందరిని తీసుకొనివెళ్ళుము;
56 నా ద్రాక్షతోటగల ప్రదేశమునకు వెళ్ళి, నా ద్రాక్షతోటను విడిపించుము; ఏలయనగా అది నాది; నా ధనముతో దానిని కొనియున్నాను.
57 కాబట్టి, నా ప్రదేశములోనికి తిన్నగా వెళ్ళుము; నా శత్రువుల ప్రాకారములను పగులగొట్టుము; వారి గోపురమును త్రోసివేయుము; వారి కావలివారిని తరిమివేయుము.
58 వారు నీకు విరోధముగా కూడివచ్చిన యెడల, నా శత్రువుల యెడల ప్రతీకారము తీర్చుకొనుము, తద్వారా వెంటనే నా ఇంట మిగిలినవారితో వచ్చి నేను స్థలమును వశపరచుకొందును.
59 ఆ దాసుడు తన యజమానితో ఈ సంగతులు ఎప్పుడు జరుగునని అడిగెను.
60 అతడు తన సేవకునితో ఈలాగు చెప్పెను: నా చిత్తమైనప్పుడు జరుగును; నీవు తిన్నగా వెళ్ళి, నేను నీకాజ్ఞాపించిన సంగతులన్నింటిని చేయుము;
61 మరియు నా గృహమంతటిలో నమ్మకమైన, తెలివిగల గృహనిర్వాహకుడు, నా రాజ్యములో పరిపాలకుడైన నీకు ఇది నా ముద్రగా, దీవెనగానుండును.
62 అతని దాసుడు తిన్నగా వెళ్ళి, తన యజమాని చెప్పినవన్నీ చేసెను; అనేక దినముల తరువాత సమస్తము నెరవేరెను.
63 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, వారి రక్షణ గూర్చి వారు సరియైన, మంచి మార్గములో నడిపించబడుటకు సమ్మతించిన యెడల, సంఘములన్నిటిని గూర్చి నా యందు జ్ఞానమును నేను మీకు చూపెదను—
64 తద్వారా నా పరిశుద్ధులు పోగుచేయబడు కార్యము కొనసాగవచ్చును, పరిశుద్ధ స్థలములలో వారిని నేను నా నామమున నెలకొల్పవచ్చును; ఏలయనగా కోతకోయు సమయము సమీపించినది మరియు నా వాక్యము తప్పక నెరవేరవలెను.
65 కాబట్టి గోధుమలు, గురుగుల ఉపమానము ప్రకారము నా జనులను నేను పోగుచేయవలెను, ప్రతి మనుష్యునికి అతని కార్యమును బట్టి బహుమానమిచ్చుటకు నా తండ్రి రాజ్యమునకు నేను వచ్చినప్పుడు నిత్యజీవము పొందుటకు, సిలెస్టియల్ మహిమతో కిరీటము ధరించుటకు గోధుమలు కొట్లలో జాగ్రత్తపరచబడును;
66 గురుగులు కట్టలుగా కట్టబడును, ఆరని అగ్నితో కాల్చబడుటకు వాటి కట్లు బిగించబడును.
67 కాబట్టి, నేను నియమించు ప్రదేశములందు సమకూడుట కొనసాగించవలెనని అన్ని సంఘములకు నేనొక ఆజ్ఞనిచ్చుచున్నాను.
68 అయినప్పటికీ, మునుపటి ఆజ్ఞలో నేను మీకు చెప్పిన విధముగా, మీరు సమకూడుట తొందరపాటుతోను, పారిపోవుట వలన కాక, మీ యెదుట అన్ని సంగతులు సిద్ధపరచబడనీయుడి.
69 మీ యెదుట అన్ని సంగతులు సిద్ధపరచబడుటకు ఈ సంగతులను గూర్చి నేను మీకు ఇచ్చియున్న ఆజ్ఞను పాటించుడి—
70 నా పరిశుద్ధులు సమకూడుటను ప్రారంభించుటకు, సీయోను ప్రదేశముగా ఉండుటకు నేను నియమించియున్న స్థలము చుట్టుప్రక్కలనున్న ప్రాంతములో డబ్బుతో కొనగలిగిన స్థలములన్నిటిని కొనుగోలు చేయవలెనని ఆ ఆజ్ఞ చెప్పును లేదా బోధించును;
71 జాక్సన్ కౌంటీలో చుట్టుప్రక్కలనున్న దేశములలో కొనుగోలు చేయగలిగిన స్థలమంతటిని కొనుగోలు చేసి, మిగిలిన దానిని నా చేతులకు అప్పగించుడి.
72 ఇప్పుడు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, సంఘములన్నియు వాటి ధనమును పోగుచేయవలెను; వారికి వీలైన సమయములో దీనిని చేయవలెను, కానీ తొందరపాటుతో కాదు; మీ యెదుట సమస్తము సిద్ధపరచబడియుండునట్లు చూడవలెను.
73 ఘనతగల మనుష్యులు అనగా తెలివిగల మనుష్యులు నియమించబడవలెను, ఈ స్థలములు కొనుగోలు చేయుటకు వారిని పంపవలెను.
74 తూర్పు దేశములలోనున్న సంఘములు నిర్మించబడినప్పుడు, వారు ఈ ఉపదేశమును వినిన యెడల స్థలములు కొనుగోలు చేసి వాటిలో చేరుదురు; ఈ విధముగా వారు సీయోనును స్థాపించవచ్చును.
75 తమను తాము నా నామముతో పిలుచుకొను సంఘములు నా స్వరమును వినుటకు సమ్మతించిన యెడల సీయోనును విమోచించుటకు, పడవేయబడకుండా పాడైన తన స్థలములను స్థిరపరచుటకు ఇప్పుడే సరిపడేంత దాచబడియున్నది, అవును అత్యధికముగా నున్నది.
76 మరలా తమ శత్రువుల వలన చెదిరిపోయిన వారితో నేను చెప్పునదేమనగా, మీపైన అధికారము కలిగి, పాలకులుగా నియమించబడిన వారి చేతులద్వారా నష్టపరిహారము, విమోచన కొరకు వారిని వేడుకొనుచు ఉండుట నా చిత్తమైయున్నది—
77 అవి స్థాపించబడునట్లు నేను చేసిన ప్రజల యొక్క చట్టములు, రాజ్యాంగమును బట్టి దీనిని చేయవలెను, సర్వశరీరుల హక్కులు, ఆత్మరక్షణ కొరకు న్యాయమైన, పరిశుద్ధమైన నియమములను బట్టి దానిని నిర్వహించవలెను;
78 తద్వారా భవిష్యత్తును గూర్చి ప్రతి మనుష్యుడు సిద్ధాంతమునందు, నియమమునందు నేను వానికిచ్చిన నైతిక స్వతంత్రతను బట్టి ప్రవర్తించవచ్చును, తద్వారా తీర్పు దినమందు ప్రతి మనుష్యుడు తన పాపములకు లెక్క అప్పగించవలసియుండును.
79 కాబట్టి, ఏ మనుష్యుడు మరొకనికి బానిసగానుండుట సరికాదు.
80 ఈ ఉద్దేశ్యము కొరకే ఈ దేశపు రాజ్యాంగమును, ఈ ఉద్దేశ్యమునకు పుట్టించిన తెలివిగల మనుష్యుల చేతులద్వారా నేను స్థాపించితిని, రక్తము చిందించుట చేత దేశమును విమోచించితిని.
81 ఇప్పుడు సీయోను సంతానమును దేనితో నేను పోల్చెదను? మనుష్యులు విసుగుచెందక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు స్త్రీ మరియు అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఉపమానముతో నేను పోల్చెదను, అది ఇలా చెప్పును—
82 దేవునికి భయపడక, మనుష్యులను లక్ష్యపెట్టకుండా ఉండు న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను.
83 ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను, ఆమె అతని యొద్దకు వచ్చి—నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడిగెను.
84 అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు—నేను దేవునికి భయపడక మనుష్యులను లెక్కపెట్టకుండా ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది, గనుక ఆమె మాటిమాటికి వచ్చి నన్ను విసిగించకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చెదనని తనలోతాను అనుకొనెను.
85 ఆవిధముగా సీయోను సంతానమును నేను పోల్చెదను.
86 వారు న్యాయాధిపతి కాళ్ళపై పడి వేడుకొనవలెను;
87 వారినతడు లక్ష్యపెట్టని యెడల, పాలకుని కాళ్ళపై పడి వారు వేడుకొనవలెను;
88 పాలకుడు కూడా వారిని లక్ష్యపెట్టని యెడల, అధ్యక్షుని కాళ్ళపై పడి వారు వేడుకొనవలెను;
89 అధ్యక్షుడు కూడా లక్ష్యపెట్టని యెడల, అప్పుడు తన మరుగైన ప్రదేశమునుండి ప్రభువు లేచును, మహాకోపముతో దేశమును బాధించును;
90 ఆయన తన తీవ్ర విచారమందు, తీవ్ర కోపమందు, తన అనుకూల సమయములో, ఆ దుష్టులు, అవిశ్వాసులు, అవినీతిమంతులైన గృహనిర్వాహకులను తొలగించి, వారి పాలును వేషధారులును, అపనమ్మకము గలవారి మధ్య—
91 అనగా వెలుపలి చీకటినందు నియమించును, అక్కడ ఏడ్పుయు, రోదనయు, పండ్లు కొరుకుటయు ఉండును.
92 వారి చెవులు మీ మొరలకు తెరువబడునట్లు మీరు ప్రార్థించుడి, తద్వారా ఈ సంగతులు వారిపై రాకుండునట్లు నేను వారియెడల కరుణ కలిగియుందును.
93 మనుష్యులందురు క్షమాపణ లేకయుండుటకు నేను మీకు చెప్పినది తప్పక నెరవేరవలెను;
94 తద్వారా తెలివిగల మనుష్యులు, పరిపాలకులు వారెప్పుడూ పరిగణించని దానిని విని, తెలుసుకొందురు;
95 తద్వారా నా కార్యమును, నా ఆశ్చర్యమైన కార్యమును జరిగించుటకు నేను ముందుకు సాగి, నా కార్యమును అనగా నా ఆశ్చర్యమైన కార్యమును ప్రదర్శించెదను, తద్వారా మనుష్యులు నీతిమంతులను, దుష్టులను తెలుసుకొందురని మీ దేవుడు సెలవిచ్చుచున్నాడు.
96 మరలా నేను చెప్పునదేమనగా, నా సేవకుడైన సిడ్నీ గిల్బర్ట్ నేను నా జనులకు నియమించిన నా గిడ్డంగిని నా శత్రువులకు అమ్ముట నా ఆజ్ఞకు, నా చిత్తమునకు వ్యతిరేకముగానున్నది.
97 నా నామముతో పిలువబడు వారి అంగీకారముతో నేను నియమించిన దానిని నా శత్రువుల వలన మలినపరచబడనీయకుడి.
98 ఏలయనగా నేను శాసించిన సంగతులు, త్వరలో జనముల మీదకు రాబోవు వాటికి పర్యవసానముగా నా యెడల, నా జనుల యెడల ఇది చాలా బాధాకరమైన పాపమైయున్నది.
99 కాబట్టి వారక్కడ నివసించుటకు అనుమతించబడనప్పటికి, నేను వారికి నియమించిన దానిపై నా జనులు ఆరోపించి, దానిపై హక్కును కలిగియుండట నా చిత్తమైయున్నది.
100 అయినప్పటికీ, వారక్కడ నివసించరాదని నేను చెప్పుట లేదు; నా రాజ్యమునకు తగిన ఫలములను, కార్యములను తెచ్చినయెడల వారక్కడ నివసించెదరు.
101 వారు కట్టిన ఇండ్లలో వేరొకరు కాపురముండరు; వారు ద్రాక్షతోటలను నాటెదరు, దాని ఫలములను వారు తిందురు. అలాగే జరుగును గాక. ఆమేన్.