103వ ప్రకరణము
1834, ఫిబ్రవరి 24న కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటు పార్లీ పి. ప్రాట్, లైమన్ వైట్ కర్ట్లాండ్కు చేరుకున్నప్పుడు పొందబడినది, జాక్సన్ కౌంటీలోనున్న పరిశుద్ధుల స్థలములను తిరిగి సంపాదించుటకు, వారి ఉపశమనము కొరకు ప్రవక్తతో ఆలోచన చేయుటకు వారు మిస్సోరి నుండి వచ్చిరి.
1–4, జాక్సన్ కౌంటీలోనున్న పరిశుద్ధులు హింసించబడుటకు ప్రభువు ఎందుకు అనుమతించెను; 5–10, పరిశుద్ధులు ఆజ్ఞలను పాటించిన యెడల వారు జయము పొందెదరు; 11–20, శక్తివలన సీయోను విమోచన కలుగును, ప్రభువు తన జనులకు ముందుగా వెళ్ళును; 21–28, సీయోనులో పరిశుద్ధులు కూడిరావలెను, తమ ప్రాణములను పోగొట్టుకొనువారు తిరిగి వాటిని దక్కించుకొందురు; 29–40, సీయోను యాత్రను ఏర్పరచి, సీయోనుకు వెళ్ళుటకు వేర్వేరు సహోదరులు పిలువబడిరి; విశ్వాసముగానుండిన యెడల జయము పొందుదురని వారు వాగ్దానము చేయబడిరి.
1 నా స్నేహితులైన మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, ఇదిగో, సీయోను ప్రదేశములో చెదిరిపోయిన మీ సహోదరుల రక్షణ మరియు విమోచన గూర్చి మీ బాధ్యతలను నెరవేర్చుటలో మీరేవిధముగా పనిచేయవలెనో తెలుసుకొనుటకు నేను మీకొక బయల్పాటును, ఆజ్ఞనిచ్చెదను;
2 వారిని తరిమికొట్టిన నా శత్రువులపై నా యుక్తకాలములో నా ఉగ్రతను నేను విస్తారముగా క్రుమ్మరించెదను.
3 ఏలయనగా, వారి పాత్ర నిండునట్లు పాపములతో దానిని నింపువరకు వారిని నేను ఇంతవరకు సహించితిని;
4 నా నామమున పిలువబడువారు కొద్దికాలము పాటు మిక్కిలి బాధాకరమైన శిక్షతో శిక్షింపబడుదురు, ఏలయనగా నేను వారికిచ్చిన నియమములను, ఆజ్ఞలను వారు ఏ మాత్రము ఆలకించలేదు.
5 కానీ నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, ఈ గడియనుండి వారి దేవుడును, ప్రభువునైన నేను వారికిచ్చు ఉపదేశమును వినిన యెడల, నా జనులు పొందబోవు ఒక శాసనమును నేను శాసించితిని.
6 ఇదిగో ఈ గడియనుండి మొదలుకొని వారు నా శత్రువులను జయించెదరు, ఏలయనగా నేను దానిని శాసించితిని.
7 వారి దేవుడును, ప్రభువునైన నేను వారితో పలుకు మాటలన్నిటిని గైకొనుటలో జాగ్రత్త వహించుట వలన భూలోక రాజ్యములు నా కాలిక్రింద ఉంచబడువరకు వారు జయమును పొందుట మానరు మరియు భూమిని వశపరచుకొనుటకు యుగయుగముల వరకు అది పరిశుద్ధులకు ఇవ్వబడును.
8 కానీ వారు నా ఆజ్ఞలను గైకొనక, నా మాటలన్నిటిని పాటించుటకు జాగ్రత్త వహించని యెడల, భూలోక రాజ్యములు వారిని జయించును.
9 ఏలయనగా వారు లోకమునకు వెలుగును, మనుష్యులకు రక్షకులుగా ఉండుటకు ఏర్పరచబడిరి;
10 వారు లోకమునకు రక్షకులైయుండని యెడల, వారు నిస్సారమైన ఉప్పు వలెనున్నారు, గనుక అది బయట పారవేయబడి, మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.
11 కానీ మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, చెదిరిపోయిన మీ సహోదరులు వారి స్వాస్థపు ప్రదేశములకు తిరిగిరావలెనని, పాడైన సీయోను స్థలములను కట్టవలెనని నేను శాసించితిని.
12 ఏలయనగా గత ఆజ్ఞయందు నేను మీకు చెప్పినవిధముగా అనేక శ్రమల తరువాత దీవెనలు కలుగును.
13 మీ శ్రమలు, మీ సహోదరుల శ్రమల తరువాత నేను వాగ్దానము చేసిన దీవెన ఇదియే—మీ విమోచన మరియు మీ సహోదరుల విమోచన, అనగా ఇక ఎంతమాత్రము త్రోసివేయబడకుండా ఏర్పరచవలసియున్న సీయోను ప్రదేశమునకు వారు పునఃస్థాపించబడుదురు.
14 అయినప్పటికీ, వారు తమ స్వాస్థ్యములను మలినపరచిన యెడల వారు త్రోసివేయబడుదురు; ఏలయనగా తమ స్వాస్థ్యములను వారు మలినపరచిన యెడల వారిని నేను విడిచిపెట్టను.
15 ఇదిగో నేను చెప్పునదేమనగా, సీయోను విమోచన శక్తితో రావలసియున్నది;
16 కాబట్టి, నా జనుల కొరకు ఒక మనుష్యుని లేవనెత్తెదను, మోషే ఇశ్రాయేలు సంతానమును నడిపించినట్లుగా అతడు వారిని నడిపించును.
17 ఏలయనగా మీరు ఇశ్రాయేలు సంతానము, అబ్రాహాము సంతానమైయున్నారు, శక్తితోను, చాపబడిన బాహువుతోను బానిసత్వము నుండి మీరు విడిపించబడవలసియున్నది.
18 మీ పితరులు మొదట విడిపించబడిరి, గనుక సీయోను విమోచన కూడా జరుగును.
19 కాబట్టి, మీ హృదయములు కలవరపడనియ్యకుడి, ఏలయనగా—నా దూత మీకు ముందుగా వెళ్ళును గాని నా సన్నిధి కాదని మీ పితరులకు చెప్పిన విధముగా నేను మీతో చెప్పుటలేదు.
20 కానీ నేను మీతో చెప్పుచున్నాను: నా దూతలును, నా సన్నిధియు మీకు ముందుగా నడుచును, సరియైన సమయములో మంచి ప్రదేశమును మీరు వశపరచుకొందురు.
21 నేను మీకిచ్చియున్న ఉపమానములో ద్రాక్షతోట యజమాని మాట్లాడిన సేవకునితో నేను సరిపోల్చిన మనుష్యుడే నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
22 కాబట్టి నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. నా మందిరమునకు బలమైయున్న నా యౌవనులు, మధ్య వయస్కులైన వారికి ఈలాగు చెప్పవలెను—సీయోను ప్రదేశమునకు అనగా నాకు ప్రతిష్ఠించబడి, నేను ధనముతో కొనిన ప్రదేశమునకు మీరు కూడిరావలెను.
23 సంఘములన్నియు వారి ధనమును తెలివైన మనుష్యులతో పంపి, వారికి నేనాజ్ఞాపించియున్న స్థలములను కొనుగోలు చేయవలెను.
24 మీరు వారికి విరోధముగా నా యెదుటకు తెచ్చిన ఈ సాక్ష్యముల తరువాత సీయోను ప్రదేశముగా నుండుటకు నేను ప్రతిష్ఠించిన మంచి ప్రదేశము నుండి అనగా మీ స్వస్థలముల నుండి మిమ్ములను తరిమివేయుటకు నా శత్రువులు మీకు విరోధముగా వచ్చిన యెడల, వారిని మీరు శపించవలెను;
25 మీరు శపించిన వారిని నేను శపించెదను, నా శత్రువుల యెడల మీరు ప్రతీకారము తీర్చుకొందురు.
26 నన్ను ద్వేషించువారి యొక్క మూడు నాలుగు తరములవరకు నా శత్రువుల యెడల ప్రతీకారము తీర్చుకొనుటలో నేను మీకు తోడైయుందును.
27 నా నిమిత్తము తన ప్రాణమును పెట్టుటకు ఏ మనుష్యుడును భయపడకూడదు; ఏలయనగా నా నిమిత్తము తన ప్రాణమును పెట్టువాడు దానిని మరలా పొందును.
28 నా నిమిత్తము తన ప్రాణమును పెట్టుటకు సమ్మతించనివాడు నా శిష్యుడు కాడు.
29 సీయోను పునఃస్థాపన, విమోచన గూర్చి నేను వారికిచ్చిన ఆజ్ఞలను పాటించుటకు సంఘములను సిద్ధపరచుటకు నా సేవకుడైన సిడ్నీ రిగ్డన్ తూర్పు దేశములలోనున్న సమూహములలో తన స్వరమెత్తుట నా చిత్తమైయున్నది.
30 నా సేవకుడైన పార్లీ పి. ప్రాట్, నా సేవకుడు లైమన్ వైట్ సీయోను ప్రదేశమునకు వెళ్ళుటకు పదిమందిగా, ఇరువదిమందిగా లేదా యాబదిమందిగా లేదా వందమందిగా నా మందిర బలము ఐదువందల మందిని వారు పొందువరకు వారి సహోదరుల స్థలమునకు తిరిగి వెళ్ళకూడదు అనునది నా చిత్తమైయున్నది.
31 ఇదిగో ఇది నా చిత్తము; అడుగుడి మీకది ఇవ్వబడును; కానీ మనుష్యులు ఎల్లప్పుడు నా చిత్తమును చేయుటలేదు.
32 కాబట్టి, మీరు ఐదువందల మందిని పొందలేకపోయిన యెడల, శ్రద్ధగా వెదకుడి, ఒకవేళ మీరు మూడు వందల మందిని పొందవచ్చునేమో.
33 మీరు మూడు వందల మందిని పొందలేకపోయిన యెడల, శ్రద్ధగా వెదకుడి, ఒకవేళ మీరు వందమందిని పొందవచ్చునేమో.
34 కానీ నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, సీయోను ప్రదేశమునకు మీతో వెళ్ళుటకు నా మందిర బలము వందమందిని పొందువరకు మీరు సీయోను ప్రదేశమునకు వెళ్ళకూడదని నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను.
35 కాబట్టి, నేను చెప్పిన విధముగా అడుగుడి, మీకది ఇవ్వబడును; నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. ఒకవేళ మీతో వచ్చి, నా జనుల మధ్య అధ్యక్షత్వము వహించి, నా రాజ్యమును ప్రతిష్ఠిత స్థలము మీద సంస్థాపించి, ఇంతవరకు ఉన్నవి ఇకపై మీకివ్వబడు నియమములు, ఆజ్ఞలపై సీయోను బిడ్డలను నెలకొల్పునేమోనని మీరు హృదయపూర్వకముగా ప్రార్థన చేయుడి.
36 మీ శ్రద్ధ, విశ్వాస్యత మరియు విశ్వాస సహితమైన ప్రార్థనలవలన జయము, మహిమ అంతయు మీకివ్వబడును.
37 నా సేవకుడైన పార్లీ పి. ప్రాట్, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. తో ప్రయాణము చేయవలెను.
38 నా సేవకుడైన లైమన్ వైట్, నా సేవకుడైన సిడ్నీ రిగ్డన్ తో ప్రయాణము చేయవలెను.
39 నా సేవకుడైన హైరం స్మిత్ నా సేవకుడైన ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్‌తో ప్రయాణము చేయవలెను.
40 నేను మీకు ఇచ్చియున్న ఈ ఆజ్ఞల నెరవేర్పును పొందుటలో నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. వారికి ఉపదేశించిన ప్రకారము నా సేవకుడైన ఓర్సన్ హైడ్, నా సేవకుడైన ఓర్సన్ ప్రాట్‌తో ప్రయాణము చేయవలెను, మిగిలినది నాకు విడిచిపెట్టుడి. అలాగే జరుగును గాక. ఆమేన్.