104వ ప్రకరణము
ఐక్య సంస్థ గురించి 1834, ఏప్రిల్ 23న కర్ట్‌లాండ్, ఒహైయో వద్ద లేదా సమీపములో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కు ఇవ్వబడిన బయల్పాటు (78 మరియు 82వ ప్రకరణముల శీర్షికలు చూడుము). ఈ సందర్భము బహుశా ఐక్య సంస్థ యొక్క సభ్యుల సలహామండలి కావచ్చును, వారు సంఘము యొక్క అత్యవసరమైన లౌకిక అవసరాల గురించి చర్చించారు. అంతకుముందు ఏప్రిల్ 10న ఆ సంస్థ యొక్క సమావేశములో, ఆ సంస్థను రద్దు చెయ్యాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. దానికి బదులుగా సంస్థను పునఃవ్యవస్థీకరించాలని ఈ బయల్పాటు సూచిస్తుంది; దాని ఆస్థులు, సంస్థ యొక్క సభ్యుల మధ్య వారి కార్యనిర్వాహకత్వములుగా విభజించాలి. జోసెఫ్ స్మిత్ మార్గదర్శకత్వములో “ఐక్య సంస్థ” అనే పదము తరువాత బయల్పాటులో “ఐక్య క్రమము” అనే పదముతో భర్తీచేయబడింది.
1–10, ఐక్య క్రమమునకు వ్యతిరేకముగా అపరాధము చేయు పరిశుద్ధులు శపించబడుదురు; 11–16, తన స్వకీయ మార్గములో ప్రభువు తన పరిశుద్ధులకు సమకూర్చును; 17–18, బీదల సంరక్షణను సువార్త ధర్మశాస్త్రము పరిపాలించును; 19–46, వేర్వేరు సహోదరుల గృహనిర్వాహకత్వములు రూపించబడినవి; 47–53, కర్ట్లాండ్లోని ఐక్య క్రమము, సీయోనులోని క్రమము వేరు వేరుగా నడిపించబడవలెను; 54–66, లేఖనముల ముద్రణ నిమిత్తము ప్రభువు యొక్క పవిత్ర ధనాగారము ఏర్పాటు చేయబడినది; 67–77, ఐక్య క్రమము యొక్క ఉమ్మడి అంగీకారముతో సాధారణ ధనాగారము నడిపించబడవలెను; 78–86, ఐక్య క్రమములోనున్న వారు తమ అప్పులన్నింటిని చెల్లించవలెను, ప్రభువు వారిని ఆర్థిక బానిసత్వము నుండి విడిపించును.
1 నా స్నేహితులైన మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను వచ్చువరకు నా సంఘ ప్రయోజనము కొరకు మనుష్యుల రక్షణ కొరకు ఒక ఐక్య క్రమముగా, ఒక నిత్యక్రమముగా ఉండుటకు స్థాపించమని, నెలకొల్పమని నేనాజ్ఞాపించిన క్రమమునకు చెందిన ఆస్థులన్నిటిని గూర్చి నేను మీకు ఉపదేశమును, ఒక ఆజ్ఞను ఇచ్చుచున్నాను—
2 మారని, ఒకేరీతిగానున్న వాగ్దానముతో, నేనాజ్ఞాపించిన వారు విశ్వాసముగానుండిన యెడల, వారు విస్తారమైన దీవెనలతో దీవించబడుదురు;
3 వారు విశ్వాసముగానుండని యెడల శాపము పొందదగినవారైయున్నారు.
4 కాబట్టి, నా సేవకులలో కొందరు ఆజ్ఞలను పాటించక, దురాశ వలన, మోసకరమైన మాటలతో నిబంధనను ఉల్లంఘించినందున బాధాకరమైన, దుఃఖకరమైన శాపముతో వారిని నేను శపించితిని.
5 ఏలయనగా, క్రమమునకు చెందిన ఏ మనుష్యుడైనను అపరాధిగా కనుగొనబడిన యెడల, లేదా మరియొక మాటలో, మీరు లోబడియున్న నిబంధనను అతిక్రమించిన యెడల, అతడు తన జీవితములో శాపమును పొందునని, నేను నియమించువానిచే త్రొక్కివేయబడునని ప్రభువైన నేను నా హృదయములో శాసనమును వ్రాసియున్నాను;
6 ఏలయనగా ప్రభువైన నేను, ఈ విషయములలో అపహాస్యము చేయబడకూడదు—
7 మీ మధ్యనున్న నిరపరాధులు అవినీతిమంతులతో శిక్షింపబడక, మీ మధ్యనున్న దోషులు తప్పించుకొనకుండు నిమిత్తము ఇదంతయు క్రమములోనున్నది; ఎందుకనగా ప్రభువైన నేను, నా కుడిచేతివైపున మహిమ కిరీటమును మీకు వాగ్దానము చేసియున్నాను.
8 కాబట్టి మీరు అపరాధులుగా కనుగొనబడిన యెడల, మీ జీవితాలలో నా ఉగ్రత నుండి మీరు తప్పించుకొనలేరు.
9 అపరాధము వలన కొట్టివేయబడిన యెడల, విమోచన దినము వరకు సాతాను యొక్క దెబ్బలనుండి మీరు తప్పించుకొనలేరు.
10 క్రమములో ఏ మనుష్యుడైనను అపరాధిగా కనుగొనబడి, ఆ కీడు నిమిత్తము పశ్చాత్తాపపడని యెడల, సాతాను యొక్క దెబ్బలకు మీరతనిని అప్పగించుటకు ఈ గడియనుండి నేను మీకు అధికారమిచ్చుచున్నాను; మీ మీదకు కీడు తెచ్చుటకు అతడు శక్తిని కలిగియుండడు.
11 ఇది నా యందు జ్ఞానమైయున్నది; కాబట్టి, మిమ్ములను మీరు ఏర్పాటుచేసుకొని, ప్రతి మనుష్యునికి అతని గృహనిర్వాహకత్వమును నియమించవలెనని నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను;
12 తద్వారా ప్రతి మనుష్యుడు తనకు నియమించబడిన గృహనిర్వాహకత్వపు లెక్కను నాకు అప్పగించవచ్చును.
13 ఏలయనగా ప్రభువైన నేను, నా జీవుల కొరకు తయారుచేసి సిద్ధపరచియుంచిన భూలోక దీవెనలపై గృహనిర్వాహకునిగానున్న ప్రతి వాడు లెక్క అప్పగించునట్లు చేయుట యుక్తము.
14 ప్రభువైన నేను, పరలోకములను విశాలపరచి, నా హస్తకృత్యముతో భూమిని నిర్మించితిని; దానియందున్న సమస్తము నావే.
15 నా పరిశుద్ధులకు సమకూర్చుట నా ఉద్దేశ్యమైయున్నది, ఏలయనగా సమస్తము నాదే.
16 కానీ అది నా స్వంత విధానములోనే జరుగవలెను; ఇదిగో, నా పరిశుద్ధుల కొరకు సమకూర్చుటకు ప్రభువైన నేను శాసించిన విధానమిదియే, బీదలు హెచ్చింపబడవలెను, ధనికులు తగ్గింపబడవలెను.
17 ఏలయనగా భూమి వనరులతో నిండియుండి, కావలసినదానికంటే అధికముగా కలిగి ఉన్నది; నేను సమస్తమును సిద్ధపరచి, మనుష్యకుమారులు తమకు తామే ప్రతినిధులుగా ఉండుటకు వారికిచ్చితిని.
18 కాబట్టి, నేను చేసిన సమృద్ధిగల వాటిలోనుండి ఏ మనుష్యుడైనను తీసుకొని, నా సువార్త ధర్మశాస్త్రమును బట్టి తన భాగమును బీదలకు, అవసరతలో నున్నవారికి ఇవ్వనియెడల, దుష్టులతో అతడు నరకములో యాతనపడుచు తన కన్నులెత్తి చూచును.
19 ఇప్పుడు, క్రమము యొక్క ఆస్థులను గూర్చి నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను—
20 నా సేవకుడైన సిడ్నీ రిగ్డన్ నా ద్రాక్షతోటలో పనిచేయుచుండగా, నేనతనిని ఆజ్ఞాపించునప్పుడు, నా చిత్తప్రకారము ప్రస్తుతము అతడు నివసించుచున్న ప్రదేశము మరియు తోళ్ళపరిశ్రమ గల భూభాగము గృహనిర్వాహకత్వముగా, అతనికి ఆధారముగా నియమించబడవలెను.
21 సమస్తము కర్ట్‌లాండ్ ప్రదేశమునందున్న క్రమము యొక్క ఉపదేశమును బట్టి, క్రమము యొక్క ఉమ్మడి అంగీకారము లేదా స్వరమును బట్టి జరుగవలెను.
22 ఈ గృహనిర్వాహకత్వమును, దీవెనను నా సేవకుడైన సిడ్నీ రిగ్డన్ మీద, అతని తరువాత అతని సంతానముమీద ప్రభువైన నేను నియమించుచున్నాను;
23 అతడు నా యెదుట వినయముగా నుండిన యెడల, అతనికి విస్తారముగా దీవెనలనిచ్చెదను.
24 మరలా, నా సేవకుడైన జాన్ జాన్సన్ అతని కొరకు, అతని తరువాత అతని సంతానము కొరకు అతని పూర్వపు స్వాస్థ్యమునకు బదులుగా పొందిన స్థలము యొక్క భాగము నా సేవకుడైన మార్టిన్ హారిస్‌కు అతని గృహనిర్వాహకత్వముగా నియమించబడవలెను;
25 అతడు విశ్వాసముగానుండిన యెడల అతనికి, అతని తరువాత అతని సంతానమునకు విస్తారముగా నేను దీవెనలనిచ్చెదను.
26 నా సేవకుడైన మార్టిన్ హారిస్ నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ నిర్దేశించినట్లుగా నా మాటలను చాటించుటకు తన ధనమును సమర్పించవలెను.
27 మరలా, నా సేవకుడైన ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్ ప్రస్తుతము నివసించుచున్న స్థలమును కలిగియుండవలెను.
28 నా సేవకుడైన ఆలీవర్ కౌడరీ ఒకటవ భాగములోనున్న, ముద్రణాలయము కొరకు ఉంచబడిన, గృహమునకు ఆనుకొనియున్న స్థలమును, అతని తండ్రి నివాసమున్న స్థలమును కూడా కలిగియుండవలెను.
29 నా సేవకుడైన ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్, ఆలీవర్ కౌడరీ ముద్రణాలయమును, దానికి సంబంధించిన అన్నిటిని కలిగియుండవలెను.
30 వారికి నియమించబడు గృహనిర్వాహకత్వము ఇదియే.
31 వారు విశ్వాసముగానుండిన యెడల, ఇదిగో నేను వారిని దీవించి, వారిపై దీవెనలను హెచ్చించెదను.
32 వారి కొరకు, వారి తరువాత వారి సంతానము కొరకు వారికి నియమించబడిన గృహనిర్వాహకత్వమునకు ఆరంభము ఇదియే.
33 వారు విశ్వాసముగా నుండిన యెడల వారిపైన, వారి తరువాత వారి సంతానముపైన దీవెనలను, అనగా అత్యధికమైన దీవెనలను హెచ్చించెదను.
34 మరలా, నా సేవకుడైన జాన్ జాన్సన్ స్వాస్థ్యమునకు సంబంధించి—నా మందిరములు నిర్మించబడుటకు ప్రత్యేకింపబడిన భూమి, నా సేవకుడైన ఆలీవర్ కౌడరీ కొరకు ఉంచబడిన ఆ భూభాగములు తప్ప అతడు నివసించుచున్న గృహమును, స్వాస్థ్యములన్నిటిని కలిగియుండవలెను.
35 అతడు విశ్వాసముగాడిన యెడల, అతనిపై నేను దీవెనలను హెచ్చించెదను.
36 ఆత్మ స్వరము వలనను, క్రమము యొక్క ఉపదేశమును బట్టియు, క్రమము యొక్క స్వరము వలనను అతనికి తెలియజేయబడిన యెడల, నా పరిశుద్ధుల పట్టణము నిర్మించుటకు ఉంచబడిన భూభాగములను అతడు అమ్ముట నా చిత్తమైయున్నది.
37 అతనికి, అతని తరువాత అతని సంతానమునకు ఒక దీవెనగా ఉండుటకు నేనతనికి నియమించిన గృహనిర్వాహకత్వమునకు ఆరంభము ఇదియే.
38 అతడు విశ్వాసముగానుండిన యెడల, అత్యధికమైన దీవెనలను అతనిపై నేను హెచ్చించెదను.
39 మరలా, నా సేవకుడైన న్యూయెల్ కె. విట్నీ గృహములు, ప్రస్తుతము అతడు నివసించుచున్న భూభాగము, సరుకుల అంగడి ఉన్న భూభాగము, భవనము, సరుకుల అంగడికి దక్షిణపు మూలనున్న భూభాగము, బూడిద కర్మాగారము ఉన్న భూభాగము కూడా అతనికి నియమించబడవలెను.
40 దీనినంతటిని నా సేవకుడైన న్యూయెల్ కె. విట్నీకి అతని గృహనిర్వాహకత్వముగాను, అతనికి, అతని తరువాత అతని సంతానమునకు దీవెనగాను, కర్ట్‌లాండ్ ప్రదేశములో నా స్టేకు కొరకు నేను స్థాపించిన నా క్రమమునకు చెందిన సరుకుల దుకాణము యొక్క ప్రయోజనము కొరకు నేను నియమించితిని.
41 ఈ సరుకుల అంగడియంతయు నా సేవకుడైన ఎన్. కె. విట్నీకి—అతనికి, అతని ప్రతినిధికి, అతని తరువాత అతని సంతానమునకు నియమించిన గృహనిర్వాహకత్వము నిశ్చయముగా ఇదియే.
42 నేనతనికి ఇచ్చియున్న నా ఆజ్ఞలను గైకొనుటలో విశ్వాసముగానుండిన యెడల అతనిపైన, అతని తరువాత అతని సంతానముపైన నేను దీవెనలను అనగా అత్యధికమైన దీవెనలను హెచ్చించెదను.
43 మరలా, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. నకు నలభై దండముల పొడవు, పన్నెండు దండముల వెడల్పును కలిగియుండి, నా మందిర నిర్మాణము కొరకు ఉంచబడిన భూభాగము, అతని తండ్రి ప్రస్తుతము నివసించుచున్న స్వాస్థ్యము కూడా నియమించబడవలెను;
44 అతనికి, అతని తండ్రికి ఒక దీవెనగానుండుటకు నేను నియమించిన గృహనిర్వాహకత్వమునకు ఆరంభము ఇదియే.
45 ఇదిగో, అతని తండ్రి కొరకు, అతని ఆధారము కొరకు ఒక స్వాస్థ్యమును నేను ప్రత్యేకపరచియున్నాను; కాబట్టి అతడు నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. గృహమునకు చెందినవానిగా పరిగణించబడును.
46 అతడు విశ్వాసముగానుండిన యెడల, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. గృహముపైన నేను దీవెనలను అనగా అత్యధికమైన దీవెనలను హెచ్చించెదను.
47 ఇప్పుడు, సీయోను గూర్చి నేనొక ఆజ్ఞనిచ్చుచున్నాను, అదేమనగా ఈ విధముగా తప్ప మరేవిధముగాను సీయోనులోనున్న మీ సహోదరులకు మీరు ఐక్యక్రమముగా లోబడి ఉండరు—
48 మీరు ఏర్పాటు చేయబడిన తరువాత, కర్ట్‌లాండ్ పట్టణము, సీయోను స్టేకు యొక్క ఐక్యక్రమము అని మీరు పిలువబడుదురు. మీ సహోదరులు, వారు ఏర్పాటుచేయబడిన తరువాత, సీయోను పట్టణము యొక్క ఐక్యక్రమము అని పిలువబడుదురు.
49 వారు తమ స్వంత నామములతో, స్వంత నామముతో ఏర్పాటు చేయబడవలెను; వారు తమ కార్యకలాపములను తమ స్వంత నామములో మరియు స్వంత నామములలో చేయవలెను;
50 మీరు మీ కార్యకలాపములను మీ స్వంతనామములో మరియు మీ స్వంతనామములలో చేయవలెను.
51 వారు తరిమివేయబడినందుకు రాబోవు దానికి పర్యవసానముగా దీనిని మీ రక్షణ కొరకు, వారి రక్షణ కొరకు చేయమని నేనాజ్ఞాపించితిని.
52 దురాశ, కృత్రిమమైన మాటల వలన అపరాధము ద్వారా నిబంధనలు అతిక్రమించబడినవి—
53 కాబట్టి, మీ సహోదరులతో ఐక్య క్రమముగా మీరు రద్దుచేయబడిరి, మీ పరిస్థితులకనుగుణముగా రుణము వలన సలహామండలిలో ఈ క్రమముచేత సమ్మతించబడుటను బట్టి, సలహామండలి స్వరము నిర్దేశించిన విధముగా నేను చెప్పినట్లుగా ఈ గడియ వరకు, ఈ విధముగా తప్ప మీరు లోబడియుండరు.
54 నేను మీకు నియమించిన గృహనిర్వాహకత్వమును గూర్చి మరలా నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను.
55 ఇదిగో, ఈ స్థలములన్నియు నావే, లేనియెడల మీ విశ్వాసము వ్యర్థము మీరు వేషధారులుగా కనుగొనబడుదురు, మీరు నాతో చేసిన నిబంధనలు ఉల్లంఘించబడినవి;
56 స్థలములు నావైతే, అప్పుడు మీరు గృహనిర్వాహకులు; లేనియెడల మీరు గృహనిర్వాహకులు కారు.
57 కానీ నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా మందిరముపైన గృహనిర్వాహకులుగా, నిజమైన గృహనిర్వాహకులుగా ఉండుటకు నేను మిమ్ములను నియమించితిని.
58 ఈ ఉద్దేశ్యము కొరకై మిమ్ములను మీరు ఏర్పాటు చేసుకొనమని, నా వాక్యములను, నా సంపూర్ణ లేఖనములను, నేను మీకిచ్చియున్న కాలానుగుణముగా ఇకమీదట ఇవ్వబోవు బయల్పాటులను ముద్రించమని—
59 భూమిమీద నా సంఘమును, రాజ్యమును నిర్మించు ఉద్దేశ్యము కొరకు, నేను వారితో నివసించు సమయము అతి సమీపములో ఉన్నందున, నా జనులను సిద్ధపరచమని నేను మిమ్ములను ఆజ్ఞాపించితిని.
60 ధనాగారముగా ఉండుటకు మీ కొరకు మీరు ఒక స్థలమును సిద్ధపరచుకొని, నా నామమునకు దానిని సమర్చించవలెను.
61 ధనాగారమును నిర్వహించుటకు మీలో ఒకనిని నియమించవలెను, ఈ దీవెనకు అతడు నియమించబడవలెను.
62 ధనాగారముపైన ఒక ముద్ర ఉండవలెను, ధనాగారములోనికి పరిశుద్ధమైనవన్నియు తేబడవలెను; మీలో ఏ మనుష్యుడు దానిని లేదా దానిలో కొంత భాగమును తనదిగా పిలువకూడదు, ఏలయనగా అది మీ అందరికి, ప్రతి ఒక్కరికి చెందును.
63 దానిని ఈ గడియనుండే నేను మీకు ఇచ్చుచున్నాను; నేను చెప్పినట్లుగా ఈ పరిశుద్ధమైన సంగతులు ముద్రించుట కొరకు ఆ పరిశుద్ధ సంగతులు తప్ప, నేను మీకు నియమించిన గృహనిర్వాహకత్వమును సద్వినియోగము చేసుకొనునట్లు ఇప్పుడు మీరు చూచుకొనుడి.
64 పరిశుద్ధమైన సంగతులనుండి వచ్చు రాబడిని ధనాగారములో ఉంచి, దానిపై ముద్ర వేయవలెను; కేవలము క్రమము యొక్క స్వరము లేదా ఆజ్ఞవలన తప్ప అది ఎవరిచేతనైనను ఉపయోగించబడకూడదు లేదా ధనాగారములోనుండి తీయబడకూడదు, అంతేకాక దానిపై ఉంచబడు ముద్ర విప్పబడకూడదు.
65 ఈవిధముగా పరిశుద్ధ సంగతులవలన వచ్చు రాబడిని పవిత్రమైన, పరిశుద్ధ కార్యముల కొరకు ధనాగారములో మీరు భద్రపరచవలెను.
66 ఇది ప్రభువు యొక్క పరిశుద్ధ ధనాగారముగా పిలువబడును; దానిపై ఒక ముద్ర ఉంచబడవలెను తద్వారా అది పరిశుద్ధముగానుండి ప్రభువుకు సమర్చించబడును.
67 మరలా మరియొక ధనాగారము సిద్ధపరచబడి, ధనాగారమును చూచుకొనుటకు కోశాధిపతి నియమించబడవలెను, దానిపై ఒక ముద్ర వేయబడవలెను;
68 పవిత్రమైన, పరిశుద్ధమైన ఉద్దేశ్యము నిమిత్తము నా కొరకు నేను ప్రత్యేకపరచిన పవిత్రమైన, పరిశుద్ధమైన సంగతులు తప్ప నేను మీకు నియమించిన స్వాస్థ్యములను, అనగా గృహములను లేదా భూములను లేదా పశువులను లేదా అన్నింటిని అభివృద్ధి చేయుట ద్వారా మీ గృహనిర్వాహకత్వములలో మీరు పొందు ధనమంతటిని, వందలుగా లేదా యేబదులుగా లేదా ఇరువదులుగా లేదా పదులుగా లేదా ఐదులుగా మీరు ధనము పొందిన వెంటనే ధనాగారములో వేయవలెను.
69 లేక మరియొక మాటలో, మీలో ఏ మనుష్యుడైనను ఐదు డాలర్లను పొందిన యెడల, అతడు ధనాగారములో వేయవలెను; లేదా అతడు పది లేదా ఇరవై లేదా యాభై లేదా వంద డాలర్లను పొందిన యెడల, అతడు ఆవిధముగానే చేయవలెను;
70 మీలో ఎవడైనను అది తనదని అనకూడదు; ఏలయనగా అది గాని, దానిలో భాగము గాని అతనిదిగా పిలువబడదు.
71 క్రమము యొక్క ఉమ్మడి అంగీకారము లేదా స్వరమువలన తప్ప, దానిలో ఏ భాగమైనను ఉపయోగించబడరాదు లేదా ధనాగారము నుండి తీసివేయబడరాదు.
72 క్రమము యొక్క ఉమ్మడి అంగీకారము లేదా స్వరము ఈ విధముగా ఉండవలెను—అదేమనగా మీలో ఏ మనుష్యుడైనను—నా గృహనిర్వాహకత్వములో సహాయపడుటకు నాకిది అవసరము అని కోశాధిపతితో చెప్పినప్పుడు:
73 అది ఐదు డాలర్లు లేదా పది డాలర్లు లేదా ఇరవై లేదా యాభై లేదా వందైనను, తన గృహనిర్వాహకత్వములో సహాయపడుటకు అతనికి కావలసిన మొత్తమును కోశాధిపతి అతనికి ఇయ్యవలెను—
74 అతడు అపరాధిగా కనుగొనబడువరకు, అతడు విశ్వాసఘాతకుడును, అవివేకియని అది క్రమము యొక్క సలహామండలి యెదుట స్పష్టముగా ప్రత్యక్షపరచబడువరకు ఇయ్యవలెను.
75 కానీ అతడు పూర్తి సహవాసములో ఉన్నప్పుడు తన గృహనిర్వాహకత్వములో నమ్మకముగా, జ్ఞానవంతునిగా ఉన్నప్పుడు, కోశాధిపతి అతనికిచ్చుటకు వెనుతీయకూడదు, ఇది కోశాధిపతికి అతని గురుతుగానుండును.
76 కానీ అపరాధము విషయములో కోశాధిపతి, క్రమము యొక్క సలహామండలి స్వరమునకు లోబడియుండును.
77 కోశాధిపతి విశ్వాసఘాతకునిగాను, అవివేకిగాను కనుగొనబడిన యెడల, అతడు క్రమము యొక్క సలహామండలి స్వరమునకు లోబడియుండును, అతని స్థానము నుండి అతడు తొలగించబడి, ఆ స్థానములో వేరొకడు నియమించబడును.
78 మరలా, మీ అప్పులను గూర్చి నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను—ఇదిగో మీరు మీ అప్పులన్నియు చెల్లించవలెననునది నా చిత్తమైయున్నది.
79 నా యెదుట మిమ్ములను మీరు తగ్గించుకొని, మీ శ్రద్ధవలన, దీనమనస్సు, విశ్వాససహితమైన ప్రార్థన వలన ఈ దీవెనను పొందుట నా చిత్తమైయున్నది.
80 మీరు శ్రద్ధను, వినయమును కలిగియుండి, విశ్వాససహితమైన ప్రార్థనను సాధన చేసిన యెడల, ఇదిగో, మీ విడుదలకు కావలసిన వనరులను మీకు పంపువరకు మీ ఋణదాతల హృదయాలను నేను కరిగించెదను.
81 కాబట్టి న్యూయార్క్‌కు వేగిరమే లేఖ వ్రాయుము, నా ఆత్మ చెప్పిన దానిని బట్టి వ్రాయుము; మీ ఋణదాతల హృదయాలను నేను కరిగించెదను, తద్వారా మీ మీదకు శ్రమను తేవాలనే తలంపు వారి మనస్సులలోనుండి తీసివేయబడును.
82 మీరు వినయముగా, విశ్వాసముగానుండి, నా నామమున ప్రార్థించిన యెడల, ఇదిగో నేను మీకు జయమునిచ్చెదను.
83 నేను మీకొక వాగ్దానమిచ్చుచున్నాను, అదేమనగా ఈ ఒక్కసారి మీరు మీ చెరనుండి విడిపించబడుదురు.
84 చెరనుండి మిమ్ములను మీరు విడిపించుకొనుటకు సరిపడేంత రుణము తీసుకొనువరకు, మీరు వందలు లేదా వేలల్లో ధనమును రుణము తీసుకొనుటకు అవకాశమున్న యెడల, అది మీ విశేషాధికారమైయున్నది.
85 ఉమ్మడి అంగీకారము వలన మీ పేర్లను ఇచ్చుట ద్వారా లేదా మీకు మంచిగా కనిపించు దానిని బట్టి మీ చేతులకప్పగించిన ఆస్థులను ఈ ఒక్కసారి పూచికత్తుగా ఉంచుము;
86 ఇదిగో, నా ఆజ్ఞలను బట్టి నేను మీ యెదుట ఉంచిన వాటిని చేయుటకు ముందుకు సాగిన యెడల, ఈ విశేషాధికారమును ఈ ఒక్కసారి నేను మీకిచ్చుచున్నాను; ఇవన్నియు నావే, మీరు నా గృహనిర్వాహకులు, యజమాని తన గృహము పతనమగుటను సహించడు. అలాగే జరుగును గాక. ఆమేన్.