115వ ప్రకరణము
ప్రభువు యొక్క మందిరము యొక్క నిర్మాణము మరియు ఆ స్థలము గూర్చి దేవుని చిత్తమును తెలియజేయుచు 1838, ఏప్రిల్ 26న ఫార్ వెస్ట్, మిస్సోరిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటు సంఘము యొక్క అధ్యక్షత్వము వహించు అధికారులు మరియు సభ్యుల కొరకు ఉద్దేశించబడినది.
1–4, ప్రభువు తన సంఘమునకు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము అని పేరు పెట్టెను; 5–6, సీయోను, ఆమె స్టేకులు పరిశుద్ధులకు రక్షణ, ఆశ్రయ దుర్గములు; 7–16, ఫార్‌వెస్ట్ నందు ప్రభువు కొరకు ఒక మందిరమును నిర్మించమని పరిశుద్ధులు ఆజ్ఞాపించబడిరి; 17–19, జోసెఫ్ స్మిత్ భూమిపై దేవుని రాజ్యపు తాళపుచెవులను కలిగియుండును.
1 నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. తో, నా సేవకుడైన సిడ్నీ రిగ్డన్‌తో, నా సేవకుడైన హైరం స్మిత్‌తో మరియు ఇకమీదట నియమించబడు, నియమించబడబోవు సలహాదారులతో;
2 నా సేవకుడైన ఎడ్వర్డ్ పాట్రిడ్జ్, అతని సలహాదారులతో కూడా;
3 సీయోనులోనున్న నా సంఘపు ఉన్నత సలహామండలికి చెందిన విశ్వాసులైన సేవకులతో, విదేశాలలో లోకమంతటా చెదిరిపోయిన నా యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘమునకు చెందిన పెద్దలు మరియు జనులతో కూడా నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఏలయనగా ఇకమీదట వారు ఈవిధముగా పిలువబడెదరు;
4 ఏలయనగా అంత్యదినములలో నా సంఘము ఈ విధముగా పిలువబడును, అదేమనగా యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము.
5 నేను మీ అందరితో నిశ్చయముగా చెప్పుచున్నాను: మీ వెలుగు జనములకు ఒక ప్రమాణముగా నుండునట్లు లేచి, ప్రకాశించుడి;
6 సీయోను ప్రదేశములో, ఆమె స్టేకులలో సమకూడుట రక్షణ కొరకు, తుఫాను నుండి రక్షణ కొరకు ఏమియు కలపబడకుండా భూమియంతటిపై క్రుమ్మరించబడబోవు దేవుని ఉగ్రతనుండి తప్పించుకొనుట కొరకు జరుగును.
7 ఫార్‌వెస్ట్ పట్టణము పరిశుద్ధమైనదిగా, నాకు ప్రతిష్ఠించబడిన ప్రదేశముగా ఉండవలెను; అది అత్యంత పరిశుద్ధమైనదిగా పిలువబడును, ఏలయనగా నీవు నిలువబడియున్న నేల పరిశుద్ధమైనది.
8 కాబట్టి, నా పరిశుద్ధులు కూడివచ్చి, నన్ను పూజించునట్లు నా కొరకు ఒక మందిరమును నిర్మించమని నేను మీకాజ్ఞాపించుచున్నాను.
9 రాబోవు వేసవిలో ఈ కార్యమునకు ఒక ఆరంభము, పునాది, సిద్ధపాటు కార్యము జరుగవలెను;
10 రాబోవు జూలై నాల్గవ దినమున దానిని ఆరంభించవలెను; ఆ సమయము నుండి నా జనులు నా నామము కొరకు ఒక మందిరమును నిర్మించుటకు శ్రద్ధతో పనిచేయవలెను;
11 ఈ దినము నుండి ఒక సంవత్సరములో వారు నా మందిరపు పునాది వేయుటను తిరిగి ప్రారంభించవలెను.
12 ఆవిధముగా ఆ సమయమునుండి అది సమాప్తమగువరకు, దాని మూలరాయి నుండి దాని శిఖరము వరకు, పూర్తికానీదేది మిగులకుండునట్లు వారు శ్రద్ధతో పనిచేయవలెను.
13 నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్, నా సేవకుడైన సిడ్నీ రిగ్డన్, నా సేవకుడైన హైరం నా నామము కొరకు ఒక మందిరమును నిర్మించుటకు ఇక ఏ మాత్రము రుణపడకూడదు;
14 కానీ వారికి నేను చూపించు విధానముననుసరించి నా నామము కొరకు వారు ఒక మందిరమును నిర్మించవలెను.
15 నా జనులు వారి అధ్యక్షత్వమునకు నేను చూపించు విధానముననుసరించి దానిని నిర్మించని యెడల, వారి నుండి నేను దానిని అంగీకరించను.
16 కానీ నా జనులు వారి అధ్యక్షత్వమునకు అనగా నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ అతని సలహాదారులకు నేను చూపించు విధానముననుసరించి దానిని నిర్మించిన యెడల, అప్పుడు నేను నా జనుల నుండి దానిని అంగీకరించెదను.
17 నా పరిశుద్ధులు కూడివచ్చుట ద్వారా త్వరితముగా ఫార్‌వెస్ట్ పట్టణము నిర్మించబడుట నా చిత్తమైయున్నదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను;
18 మరలా కాలక్రమేణా నా సేవకుడైన జోసెఫ్ స్మిత్‌కు ప్రత్యక్షపరచబడినప్పుడు చుట్టుప్రక్కలనున్న ప్రాంతములలో స్టేకులుగా ఇతర ప్రదేశములు నియమించబడవలెను.
19 ఏలయనగా ఇదిగో, నేను అతనితోనుందును, జనుల యెదుట అతడిని నేను పవిత్రపరిచెదను; అతనికి నేను ఈ రాజ్యము యొక్క, పరిచర్య యొక్క తాళపుచెవులు ఇచ్చియున్నాను. అలాగే జరుగును గాక. ఆమేన్.