లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 117


117వ ప్రకరణము

1838, జులై 8న ఫార్‌వెస్ట్, మిస్సోరిలో విలియం మార్క్స్, న్యూయెల్ కె. విట్నీ మరియు ఆలీవర్ గ్రేంజర్‌లు వెంటనే నిర్వర్తించవలసిన బాధ్యతలను గూర్చి ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు.

1–9, ప్రభువు సేవకులు ఐహికమైన వాటిని ఆశింపకూడదు, ఏలయనగా “ప్రభువు ఆస్థిని లెక్కచేయునా?”; 10–16, వారు ఆత్మీయలేమిని విడనాడవలెను, వారి త్యాగములు ప్రభువుకు పరిశుద్ధముగా ఉండును.

1 నా సేవకుడైన విలియం మార్క్స్‌కు, నా సేవకుడైన న్యూయెల్ కె. విట్నీకి నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, వారి వ్యాపారమును త్వరగా చక్కబెట్టుకొని, ప్రభువైన నేను మరలా భూమిపై మంచును పంపుటకు ముందే కర్ట్‌లాండ్ ప్రదేశమునుండి ప్రయాణము చేయవలెను.

2 వారు మేల్కొని, పైకిలేచి, నిలిచియుండక ముందుకు సాగవలెను, ఏలయనగా ప్రభువైన నేను దీనిని ఆజ్ఞాపించితిని.

3 కాబట్టి, వారు నిలిచియుండిన యెడల వారికి మేలు కలుగదు.

4 వారి పాపములన్నిటి నిమిత్తము వారి పొరుగువారివి ఆశించు కోరికల నిమిత్తము నా యెదుట వారు పశ్చాత్తాపపడవలెనని ప్రభువు సెలవిచ్చెను; ఏలయనగా ఆస్థిని నేను లెక్కచేయుదునా? అని ప్రభువు ప్రశ్నించుచున్నాడు.

5 రుణములను తీర్చుటకు కర్ట్‌లాండ్ ఆస్థులను ఉపయోగించవలెనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. వారు వెళ్ళవలెనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు; మిగిలినదంతయు మీ చేతులలో ఉంచుకొనుడని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

6 ఏలయనగా ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, పర్వతములలో నుండు జంతువులను నేను కలిగియుండలేదా? భూమిని నేను సృజించియుండలేదా? భూలోక జనముల సైన్యములన్నింటి అంతము నా వశమున లేదా?

7 కాబట్టి, సంచారము లేని ప్రదేశములు మొగ్గతొడిగి, వికసించి, సమృద్ధిగా ఫలించునట్లు నేను చేయకుందునా? అని ప్రభువు ప్రశ్నించెను.

8 మీరు నీటిబిందువు వంటి దానిని ఆశించి, భారమైన విషయములను నిర్లక్ష్యము చేయుటకు ఆడమ్-ఓన్డై-అహ్‌మన్‌ పర్వతములపై మరియు ఒలాహ షినేహా మైదానములలో లేదా ఆదాము నివసించిన ప్రదేశములో సరిపడునంత స్థలము లేదా?

9 కాబట్టి ఇక్కడకు, నా జనుల ప్రదేశమునకు అనగా సీయోను యొద్దకు రండి.

10 నా సేవకుడైన విలియం మార్క్స్ కొన్నింటిపైన విశ్వాసముగానుండవలెను, అతడు అనేకమైన వాటిపైన అధికారిగా చేయబడును. అతడు ఫార్‌వెస్ట్ పట్టణములో నా జనులమధ్య అధ్యక్షత్వము వహించవలెను, నా జనుల దీవెనలతో అతడు దీవించబడవలెను.

11 నీకొలాయితుల సమూహము వారి రహస్యపు హేయక్రియల విషయమై అతని ఆత్మీయలేమిని గూర్చి నా సేవకుడైన న్యూయెల్ కె. విట్నీ నా యెదుట సిగ్గుపడవలెనని ప్రభువు సెలవిచ్చెను, ఆడమ్-ఓన్డై-అహ్‌మన్‌ ప్రదేశమునకు వచ్చి నా జనులకు బిషప్పుగా ఉండవలెనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు, మాటలలో కాక క్రియలలో అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

12 మరలా నేను మీతో చెప్పుచున్నాను, నా సేవకుడైన ఆలీవర్ గ్రేంజర్‌ను నేను జ్ఞాపకము చేసుకొనియున్నాను; ఇదిగో, నిశ్చయముగా నేను వానితో చెప్పునదేమనగా అతడి పేరు ప్రతి తరములోను, నిరంతరము పరిశుద్ధముగా జ్ఞాపకము చేసుకొనబడునని ప్రభువు సెలవిచ్చెను.

13 కాబట్టి, ప్రథమ అధ్యక్షత్వము యొక్క విడుదల కొరకు అతడు మనఃపూర్వకముగా పోరాడవలెనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు; అతడు పడిపోయినప్పుడు మరలా అతడు లేచి నిలబడవలెను, ఏలయనగా అతని ఎదుగుదల కంటె అతని త్యాగము నాకు పవిత్రమైనదని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

14 కాబట్టి, అతడు వేగిరమే ఇక్కడకు, సీయోను ప్రదేశమునకు రావలెను; మరియు కాలానుగుణముగా అతడు నా జనుల ప్రయోజనము కొరకు నా నామమునకు వర్తకునిగా చేయబడునని ప్రభువు సెలవిచ్చెను.

15 కాబట్టి నా సేవకుడైన ఆలీవర్ గ్రేంజర్‌ను ఏ మనుష్యుడు తృణీకరింపకూడదు, కానీ నా జనుల దీవెనలు ఎప్పటికీ అతనిపై ఉండవలెను.

16 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, కర్ట్‌లాండ్ ప్రదేశములోనున్న నా సేవకులందరు వారి దేవుడైన ప్రభువును, నా మందిరమును పరిశుద్ధముగా ఉంచి, కాపాడుటకు రూకలు మార్చువారిని నా యుక్తకాలములో త్రోసివేయుటకు కూడా జ్ఞాపకము చేసుకొనవలెనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అలాగే జరుగును గాక. ఆమేన్.