119వ ప్రకరణము
“ఓ ప్రభువా! దశమభాగముగా నీ జనుల ఆస్థులు ఎంతవరకు నీవు కోరుచున్నావో నీ సేవకులకు కనబరచుము” అన్న తన విన్నపమునకు సమాధానముగా 1838, జులై 8న ఫార్ వెస్ట్, మిస్సోరిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఈ దినమున గ్రహించినట్లుగా దశమభాగ చట్టము ఈ బయల్పాటుకు ముందు సంఘమునకు ఇవ్వబడలేదు. ఇప్పుడే ఉదహరించిన ప్రార్థనలో గత బయల్పాటులలో (64:23; 85:3; 97:11) దశమభాగము అను పదమునకు అర్థము పదియవ వంతు అని మాత్రమే కాదు, కానీ సంఘ నిధులకిచ్చు అన్ని స్వేచ్ఛార్పణములు లేదా విరాళములని అర్థము. ప్రభువు సమర్పణ చట్టము మరియు ఆస్థుల గృహనిర్వాహకత్వమును గతములో సంఘమునకు ఇచ్చెను, ఆ సభ్యులు (ముఖ్యముగా నడిపించు పెద్దలు) నిత్యము నిలుచు ఒక నిబంధనలోనికి ప్రవేశించిరి. ఈ నిబంధనకు లోబడియుండుటలో చాలామంది విఫలమగుట వలన, కొంతకాలము ప్రభువు దానిని ఉపసంహరించుకొని, దానికి మారుగా సంఘమంతటికి దశమభాగ చట్టమును ఇచ్చెను. పరిశుద్ధ ఉద్దేశ్యముల కొరకు తమ ఆస్థులలో ఆయన ఎంత కోరుచుండెనోయని ప్రవక్త ప్రభువును అడిగెను. దానికి సమాధానమే ఈ బయల్పాటు.
1–5, పరిశుద్ధులు తమ అధిక ఆదాయాన్ని ఇచ్చివేసి, తమ వార్షిక అభివృద్ధిలో పదియవ వంతును దశమభాగముగా ఇయ్యవలెను; 6–7, ఇటువంటి చర్య సీయోను ప్రదేశమును పవిత్రపరచును.
1 నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, వారికి అవసరములేని ఆస్థి అంతయు సీయోనులో,
2 నా మందిరమును నిర్మించుటకు, సీయోను యొక్క పునాది వేయుటకు, యాజకత్వము కొరకు, నా సంఘ అధ్యక్షత్వము యొక్క రుణముల కొరకు నా సంఘ బిషప్పు చేతులలో పెట్టవలెనని నేను కోరుచున్నాను.
3 నా జనుల దశమభాగమునకు ఇది ఆరంభముగా ఉండును.
4 దాని తరువాత, దశమభాగము చెల్లింపగోరువారు తమ వార్షిక అభివృద్ధిలో పదియవ వంతును చెల్లించవలెను; నా పరిశుద్ధ యాజకత్వము కొరకు వారికి ఎప్పటికీ ఇది శాశ్వత ధర్మశాస్త్రముగా ఉండునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
5 నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, సీయోను ప్రదేశములో సమకూడు వారందరు తన అధిక ఆదాయాన్ని దశమభాగముగా చెల్లించవలెను, వారు ఈ ధర్మశాస్త్రమును పాటించవలెను, లేనియెడల మీ మధ్య నివసించుటకు వారు యోగ్యులుగా యెంచబడరు.
6 నా జనులు ఈ ధర్మశాస్త్రమును పరిశుద్ధముగా పాటించకుండా, ఈ ధర్మశాస్త్రముచేత సీయోను ప్రదేశములో నా కట్టడలు, తీర్పులు గైకొనబడునట్లు, అది మరింత పరిశుద్ధముగా ఉండునట్లు నా కొరకు దానిని పవిత్రపరచని యెడల, ఇదిగో, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, అది మీకు సీయోను ప్రదేశముగా ఉండదు.
7 సీయోను స్టేకులన్నింటికి ఇది మాదిరికరముగానుండును. అలాగే జరుగును గాక. ఆమేన్.