లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 138


138వ ప్రకరణము

1918, అక్టోబరు 3న సాల్ట్ లేక్ సిటీ, యూటాలో అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ కివ్వబడిన ఒక దర్శనము. 1918, అక్టోబరు 4న సంఘ 89వ అర్థవార్షిక సర్వసభ్య సమావేశములో ఆయన ప్రారంభపు ప్రసంగములో అధ్యక్షులు స్మిత్ మునుపటి మాసములలో అనేక దైవిక సందేశములను తాను పొందెనని ప్రకటించెను. వాటిలో ఒకటి, తన శరీరము సమాధిలోనుండగా రక్షకుడు మృతులైనవారి ఆత్మలను దర్శించుటను గూర్చి అధ్యక్షులు స్మిత్ మునుపటి దినమున పొందెను. సమావేశము ముగిసిన వెంటనే అది వ్రాయబడెను. 1918, అక్టోబరు 31న ప్రథమ అధ్యక్షత్వమునందు సలహాదారులకు, పన్నెండుమంది సలహామండలికి, గోత్రజనకునికి అది సమర్పించబడెను మరియు వారిచేత ఏకగ్రీవముగా అంగీకరించబడెను.

1–10, పేతురు వ్రాసిన వాటిని, ఆత్మలోకమును ప్రభువు దర్శించుటను గూర్చి అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ ధ్యానించుచుండెను; 11–24, మృతులైన నీతిమంతులు పరదైసులో సమావేశమగుట, వారి మధ్య క్రీస్తు పరిచర్య చేయుటను అధ్యక్షులు స్మిత్ చూచెను; 25–37, ఆత్మల మధ్య సువార్త ప్రకటించుట ఏవిధముగా ఏర్పాటు చేయబడెనో ఆయన చూచెను; 38–52, ఆయన ఆదామును, హవ్వను, ఆత్మలోకములోనున్న పరిశుద్ధ ప్రవక్తలలో అనేకులను చూచెను, వారు పునరుత్ధానమునకు మునుపు తమ ఆత్మ స్థితిని నిర్భంధముగా భావించిరి; 53–60, ఈ కాలములో మృతులైన నీతిమంతులు తమ కార్యములను ఆత్మల లోకములో కొనసాగించెదరు.

1 పంతొమ్మిది వందల పదునెనిమిదవ సంవత్సరము, అక్టోబరు మూడవ తేదీన, నేను లేఖనములను ధ్యానించుచు నా గదిలో కూర్చొనియుంటిని;

2 లోక విమోచన కొరకు దేవుని కుమారుడు చేసిన గొప్ప ప్రాయశ్చిత్త త్యాగమును;

3 విమోచకుడు లోకమునకు వచ్చుటలో తండ్రి కుమారులు కనపరచిన గొప్ప అద్భుతమైన ప్రేమను;

4 తద్వారా ఆయన ప్రాయశ్చిత్తము వలన, సువార్త సూత్రములకు విధేయత చూపుట ద్వారా మానవులు రక్షింపబడుదురు అనే దాని గూర్చి ఆలోచించుచుంటిని.

5 ఆవిధముగా నేను నిమగ్నమైయుండగా, పొంతు, గలతీయ, కపదొకియ, ఆసియాలోని ఇతర భాగములలో చెదిరిపోయిన ప్రాచీన పరిశుద్ధులకు అపొస్తలుడైన పేతురు వ్రాసిన వాటిపై నా మనస్సు మళ్ళెను, ప్రభువు సిలువ వేయబడిన తరువాత అక్కడ సువార్త ప్రకటించబడెను.

6 నేను బైబిలు గ్రంథమును తెరచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడు, నాలుగు అధ్యాయములను చదివితిని, నేను చదవగా మునుపెన్నడు లేని విధముగా మరింతగా ఈ వచనములతో నేను బాగా ప్రభావితము చేయబడితిని:

7 “ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అవినీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి, ఆత్మ విషయములో బ్రతికింపబడి, పాపముల విషయములో ఒక్క సారే శ్రమపడెను:

8 “చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ స్వరూపిగానే వెళ్ళి ప్రకటించెను;

9 “దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా వారు ఒక సమయములో అవిధేయులుగానుండిరి, ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.” (1 పేతురు 3:18–20.)

10 “మృతులు శరీర విషయములో మానవరీత్య తీర్పు పొందునట్లును ఆత్మవిషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను.” (1 పేతురు 4:6.)

11 వ్రాయబడియున్న ఈ సంగతులను గూర్చి నేను ధ్యానించుచుండగా, నా మనోనేత్రములు తెరువబడెను మరియు ప్రభువు ఆత్మ నా మీద నిలిచెను; మృత సమూహములలో కొద్దివారిని మరియు గొప్పవారిని నేను చూచితిని.

12 మర్తత్వములో జీవించియున్నప్పుడు యేసుని సాక్ష్యములో నమ్మకముగానుండిన వారు;

13 దేవుని కుమారుని గొప్ప త్యాగమును పోలిన త్యాగము చేసినవారు, తమ విమోచకుని నామమున శ్రమను అనుభవించిన నీతిమంతులైన అసంఖ్యాకమైన ఆత్మల సమూహము ఒకచోట చేరెను;

14 వీరందరు తండ్రియైన దేవుడు, ఆయన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు కృపను బట్టి మహిమకరమైన పునరుత్థానమునందు గట్టి నిరీక్షణతో మర్త్య జీవితమును వదిలివెళ్ళిరి.

15 వారు ఆనందముతో, సంతోషముతో నింపబడుటను, వారి విడుదల దినము సమీపములోనున్నది గనుక కలిసి సంతోషించుచుండుటను నేను చూచితిని.

16 వారు సమావేశమై మరణపాశముల నుండి వారి విమోచనను ప్రకటించుటకు ఆత్మ లోకములోనికి దేవుని కుమారుని ఆగమనము కొరకు ఎదురుచూచుచుండిరి.

17 నిద్రించుచున్న వారి ధూళి దాని యొక్క పరిపూర్ణ ఆకారమునకు పునఃస్థాపించబడవలెను, అతని ఎముకకు ఎముక, వాటిపైన నరము మరియు మాంసము, ఇక ఎన్నడూ వేరుకాకుండా శరీరము ఆత్మయు జతపరచబడవలెను, తద్వారా వారు సంపూర్ణ ఆనందమును పొందెదరు.

18 ఈ గొప్ప సమూహము వేచియుండి మాట్లాడుకొనుచు, మరణపు సంకెళ్ళనుండి వారు విమోచన పొందు గడియయందు ఆనందించుచుండగా, నిర్భంధములోనున్న విశ్వాసులకు స్వాతంత్ర్యమును ప్రకటించుచు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యెను;

19 అక్కడ ఆయన వారికి నిత్య సువార్తను, పునరుత్థాన సిద్ధాంతమును, పతనము నుండి మరియు వ్యక్తిగత పాపముల నుండి పశ్చాత్తాపమను షరతులమీద మానవులకు విమోచనను ప్రకటించెను.

20 కానీ దుష్టుల యొద్దకు ఆయన వెళ్ళలేదు, శరీరమందుండగా తమను తాము అపవిత్రపరచుకొనిన భక్తిహీనులు, పశ్చాత్తాపపడని వారితో ఆయన మాట్లాడియుండలేదు;

21 ప్రాచీన ప్రవక్తల హెచ్చరికలను, సాక్ష్యములను తిరస్కరించిన తిరుగుబాటుదారులు ఆయన సన్నిధిని వీక్షించలేదు, ఆయన ముఖమును చూచియుండలేదు.

22 వారు ఎక్కడ ఉండెనో అక్కడ చీకటి రాజ్యమేలెను, కానీ నీతిమంతుల మధ్య సమాధానముండెను;

23 పరిశుద్ధులు వారి విమోచనయందు సంతోషించిరి, వారి మోకాళ్ళపైన సాగిలపడి దేవుని కుమారుని వారి విమోచకునిగా, మరణము నుండి, నరకపు సంకెళ్ళ నుండి విడుదల చేయువానిగా అంగీకరించిరి.

24 వారి ముఖములు ప్రకాశించెను, ప్రభువు సన్నిధినుండి వచ్చు వెలుగు వారిపై నిలిచెను, ఆయన పరిశుద్ధ నామమునకు వారు స్తుతి కీర్తనలను పాడిరి.

25 నేను ఆశ్చర్యపడితిని, ఏలయనగా రక్షకుడు యూదుల మధ్య, ఇశ్రాయేలు వంశమునకు చెందిన వారి మధ్య వారికి నిత్య సువార్తను బోధించుటకు, పశ్చాత్తాపపడుటకు వారిని పిలుచుటకు ప్రయత్నించుచు సుమారు మూడు సంవత్సరములు గడిపెనని నేను అర్థము చేసుకొంటిని;

26 ఆయన యొక్క బలమైన కార్యములు, అద్భుతములు, గొప్ప అధికారముతోను, శక్తితోను సత్యమును ప్రకటించుట జరిగినప్పటికి, అక్కడ కొద్దిమంది మాత్రమే ఆయన స్వరమును వినిరి, ఆయన సన్నిధిలో ఆనందించిరి, ఆయన చేతులనుండి రక్షణను స్వీకరించిరి.

27 కానీ మృతుల మధ్య ఆయన పరిచర్య ఆయన సిలువ వేయబడుట మరియు ఆయన పునరుత్థానమునకు మధ్యనున్న క్లుప్త కాలమునకు పరిమితమయ్యెను;

28 పేతురు మాటలకు నేను ఆశ్చర్యపడితిని—దానిలో ఆయన ఈలాగు చెప్పెను, నోవహు దినములలో దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండగా, ఒక సమయములో అవిధేయులైయుండి చెరలోనున్న ఆత్మలకు దేవుని కుమారుడు ప్రకటించెను—అంత తక్కువ సమయములో ఆ ఆత్మలకు ప్రకటించి, వారి మధ్య ఆవశ్యకమైన కార్యములు చేయుట ఆయనకు ఏవిధముగా సాధ్యపడెను.

29 నేను ఆశ్చర్యపడుచుండగా నా కన్నులు తెరువబడెను, నా గ్రహింపు అధికమయ్యెను, సత్యమును తిరస్కరించిన దుష్టులు, అవిధేయుల మధ్యకు వారికి బోధించుటకు ప్రభువు వ్యక్తిగతముగా వెళ్ళలేదని నేను తెలుసుకొంటిని;

30 కానీ ఇదిగో, నీతిమంతుల మధ్య ఆయన తన సమూహములను ఏర్పాటుచేసి, అధికారమును, శక్తిని ధరించిన సందేశకులను నియమించెను, మరియు ముందుకు సాగి, సువార్త వెలుగును చీకటిలో నున్నవారికి అనగా మనుష్య ఆత్మలందరి యొద్దకు తీసుకొనివెళ్ళమని ఆదేశించెను; ఆవిధముగా మృతులకు సువార్త ప్రకటించబడెను.

31 ప్రభువు యొక్క అంగీకార దినమును ప్రకటించుటకు, బంధింపబడియుండి చెరపట్టబడిన వారికి, తమ పాపములకు పశ్చాత్తాపపడి, సువార్తను అంగీకరించు వారందరికి కూడా స్వాతంత్ర్యమును ప్రకటించుటకు ఎన్నుకోబడిన సందేశకులు ముందుకు సాగిరి.

32 ఆవిధముగా ప్రవక్తలను తిరస్కరించి, సత్యమును గూర్చిన జ్ఞానము లేకుండా తమ పాపములలో లేదా అపరాధములలో మరణించిన వారికి సువార్త ప్రకటించబడెను.

33 వీరందరికి దేవునియందు విశ్వాసము, పాపమునకు పశ్చాత్తాపము, పాప క్షమాపణ కొరకు ప్రాతినిధ్య బాప్తిస్మము, హస్తనిక్షేపణము ద్వారా పరిశుద్ధాత్మ వరము బోధించబడెను,

34 శరీరమందున్న మనుష్యులవలే తీర్పుతీర్చబడుటకు, కానీ దేవుని బట్టి ఆత్మయందు జీవించుటకు తమనుతాము అర్హులుగా చేసుకొనుటకు వారు తెలుసుకోవలసిన ఇతర సువార్త సూత్రములన్నియు బోధించబడెను.

35 ఆవిధముగా సిలువపైన దేవుని కుమారుడు చేసిన త్యాగము వలన విమోచన కలిగెనని మృతులలో కొద్దివారికి మరియు గొప్పవారికి, అవినీతిమంతులకు అదేవిధముగా విశ్వాసులకు తెలుపబడెను.

36 ఆవిధముగా ఆత్మల లోకమునకు తన ప్రయాణములో విమోచకుడు ఆయనను గూర్చి శరీరమందుండగా సాక్ష్యమిచ్చిన ప్రవక్తల యొక్క విశ్వాసముగల ఆత్మలకు బోధించుచు, సిద్ధపరచుచు తన సమయమును గడిపెనని తెలుపబడినది;

37 తద్వారా వారి తిరుగుబాటు, అపరాధము వలన ఆయన స్వయముగా వెళ్ళజాలని వారియొద్దకు, మృతులైన వారందరి యొద్దకు వారు విమోచన వర్తమానమును తీసుకొనివెళ్ళుదురు, తద్వారా ఆయన సేవకుల పరిచర్య ద్వారా వారు కూడా ఆయన మాటలను విందురు.

38 ఈ నీతిమంతుల విస్తార జనసమూహములో సమావేశమైన గొప్పవారు, బలవంతుల మధ్య మహావృద్ధుడును, అందరికి తండ్రియైన తండ్రి ఆదాము,

39 మహిమకరమైన తల్లి హవ్వతో పాటు అన్నియుగములలో జీవించి, సత్యవంతుడగు సజీవుడైన దేవుని ఆరాధించిన విశ్వాసముగల ఆమె కుమార్తెలు అనేకమంది ఉండిరి.

40 మొదటి హతసాక్షి హేబేలు, బలవంతులలో ఒకడైన అతని సహోదరుడు సేతు అక్కడుండెను, అతడు పూర్తిగా తన తండ్రి ఆదాము స్వరూపములో ఉండెను.

41 వరదలను గూర్చి హెచ్చరించిన నోవహు; గొప్ప ప్రధాన యాజకుడు షేము; విశ్వాసులకు తండ్రియైన అబ్రాహాము; ఇస్సాకు, యాకోబు మరియు ఇశ్రాయేలీయులకు గొప్ప ధర్మశాస్త్రమునిచ్చిన మోషే;

42 విరిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, చెరలోనున్న వారిని విడుదల చేయుటకు విమోచకుడు అభిషేకించబడెనని ప్రవచనము వలన ప్రకటించిన యెషయా కూడా అక్కడుండెను.

43 అంతేకాక, మృతుల పునరుత్థానమందు సజీవముగల ఆత్మలుగా పైకివచ్చుటకు మాంసముతో కప్పబడవలసియున్న ఎండిన యెముకలతో నిండియున్న ఒక లోయను దర్శనమందు చూచిన యెహెజ్కేలు;

44 కడవరి దినములలో ఎన్నటికీ నాశనము కాకుండా, ఇతరులెవరికి చెందని దేవుని రాజ్య స్థాపనను ముందుగా చూచి, ముందుగా చెప్పిన దానియేలు;

45 రూపాంతరపు కొండపై మోషేతోనున్న ఏలీయా;

46 ఏలీయా రాకడను గూర్చి సాక్ష్యమిచ్చిన ప్రవక్త—ప్రభువు యొక్క భయంకరమైన ఆ మహాదినము వచ్చుటకు ముందు అతడు వచ్చునని అతని గూర్చి మొరోనై ప్రవక్త జోసెఫ్ స్మిత్ తో చెప్పిన మలాకీ కూడా అక్కడుండెను.

47 ప్రవక్తయైన ఏలీయా పిల్లల హృదయాలలో తమ తండ్రులకు చేయబడిన వాగ్దానములను నాటవలెను,

48 అది మృతుల విమోచన కొరకు వారి తల్లిదండ్రులతో పిల్లలు ముద్రవేయబడుటకు కాలముల సంపూర్ణ యుగములో ప్రభువు యొక్క దేవాలయములలో చేయవలసిన గొప్ప కార్యమును ముందుగా తెలుపును, లేనియెడల భూమి అంతయు ఒక శాపముతో మొత్తబడి, ఆయన రాకడ సమయములో పూర్తిగా నాశనము చేయబడును.

49 వీరందరు మరియు ఇంకా చాలామంది, అనగా నీఫైయుల మధ్య నివశించి, దేవుని కుమారుని యొక్క రాకడను గూర్చి సాక్ష్యమిచ్చిన ప్రవక్తలు కూడా ఆ విస్తారమైన సమావేశములో ఉండి, వారి విడుదల కొరకు ఎదురుచూచిరి,

50 ఏలయనగా మృతులు తమ శరీరములనుండి తమ ఆత్మలు వేరుగానుండుటను నిర్భంధముగా యెంచిరి.

51 వీరికి ప్రభువు బోధించి, మరణమునుండి తన పునరుత్థానము జరిగిన తరువాత, తన తండ్రి రాజ్యములోనికి ప్రవేశించి, అక్కడ అమర్త్యత్వమును, నిత్యజీవమును కిరీటముగా ధరించుటకు ముందుకు వచ్చుటకు శక్తినిచ్చెను,

52 ప్రభువుచేత వాగ్దానము చేయబడిన విధముగా అక్కడ నుండి తమ కార్యములను కొనసాగించి, ఆయనను ప్రేమించువారి కొరకు దాచబడియున్న దీవెనలన్నిటిలో వారు పాలుపొందెదరు.

53 ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్, నా తండ్రి హైరం స్మిత్, బ్రిగం యంగ్, జాన్ టేలర్, విల్ఫర్డ్ ఉడ్రఫ్‌లు మరియు ఎన్నికచేయబడిన ఇతర ఆత్మలు కాలములు సంపూర్ణమైనప్పుడు ముందుకు వచ్చి, గొప్ప కడవరి దిన కార్యమునకు పునాది వేయుటలో పాలుపంచుకొనుటకు సిద్ధము చేయబడి—

54 పునాది వేయుటతోపాటు దేవాలయములు నిర్మించుట, వాటిలో మృతుల విమోచనకు విధులను నిర్వర్తించుట—కూడా ఆత్మలోకములో నుండెను.

55 దేవుని సంఘములో పరిపాలకులుగానుండుటకు ఆరంభములో ఎన్నుకోబడిన గొప్పవారు, ఘనుల మధ్య వారు కూడా ఉన్నారని నేను గమనించితిని.

56 వారు పుట్టకమునుపే, ఇతరులనేకులతో ఆత్మల లోకములో తమ మొదటి పాఠములను పొందిరి మనుష్యుల ఆత్మల రక్షణ కొరకు ద్రాక్షతోటలో పనిచేయుటకు ప్రభువు యొక్క యుక్త కాలములో ముందుకు వచ్చుటకు సిద్ధపరచబడిరి.

57 విశ్వాసముగల ఈ యుగపు పెద్దలు, ఈ మర్త్య జీవితమును వదిలి వెళ్ళినప్పుడు, దేవుని అద్వితీయ కుమారుని త్యాగము ద్వారా విమోచన, పశ్చాత్తాప సువార్తను ప్రకటించుటలో తమ కార్యములను మృతుల ఆత్మలుండు ఆ గొప్ప లోకములో పాపపు బంధకములోను, అంధకారములోనున్న వారి మధ్య కొనసాగించెదరు.

58 పశ్చాత్తాపపడు మృతులు దేవుని మందిరము యొక్క విధులకు విధేయత చూపుట ద్వారా విమోచింపబడుదురు,

59 తమ అపరాధములకు పరిహారమును చెల్లించి, పవిత్రముగా కడిగివేయబడిన తరువాత, వారి క్రియలను బట్టి ప్రతిఫలమును పొందెదరు, ఏలయనగా వారు రక్షణకు వారసులు.

60 ఈవిధముగా మృతుల విమోచనను గూర్చిన దర్శనము నాకు బయలుపరచబడెను, మన ప్రభువును, రక్షకుడైన యేసు క్రీస్తు దీవెన వలన ఈ వృత్తాంతము సత్యమని నేనెరుగుదును మరియు నేను సాక్ష్యమిచ్చుచున్నాను, అలాగే జరుగును గాక. ఆమేన్.