17వ ప్రకరణము
1829 జూన్, న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో మోర్మన్ గ్రంథము చెక్కబడియున్న పలకలను వారు చూడకమునుపు ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఆలీవర్ కౌడరీ, డేవిడ్ విట్మర్, మార్టిన్ హారిస్‌లకు ఇవ్వబడిన బయల్పాటు. ముగ్గురు ప్రత్యేక సాక్షులు నిర్దేశించబడెదరని మోర్మన్ గ్రంథ పలకల అనువాదము నుండి జోసెఫ్, అతని లేఖకుడైన ఆలీవర్ కౌడరీ నేర్చుకొనిరి (ఈథర్ 5:2–4; 2 నీఫై 11:3; 27:12 చూడుము). ఆ ముగ్గురు ప్రత్యేక సాక్షులుగా నుండుటకు ఆలీవర్ కౌడరీ, డేవిడ్ విట్మర్, మార్టిన్ హారిస్‌లు ప్రేరేపిత కోరిక చేత ప్రభావితము చేయబడిరి. ప్రభువు యొద్ద ప్రవక్త విచారించినప్పుడు ఊరీము తుమ్మీము ద్వారా ఈ బయల్పాటు ఇవ్వబడెను.
1–4, విశ్వాసము వలన ముగ్గురు సాక్షులు పలకలను, ఇతర పవిత్ర వస్తువులను చూచెదరు; 5–9, మోర్మన్ గ్రంథము యొక్క దైవత్వమును గూర్చి క్రీస్తు సాక్ష్యము చెప్పును.
1 ఇదిగో, నేను మీతో చెప్పునదేమనగా, మీరు నా వాక్యముపై తప్పక ఆధారపడవలెను, దానిని మీరు పూర్తి నిబద్ధతతో చేసిన యెడల, మీరు పలకలను, కవచమును, లాబాను ఖడ్గమును, అతడు ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు కొండపై జెరెడ్ సహోదరునికివ్వబడిన ఊరీము తుమ్మీములను, ఎఱ్ఱసముద్రపు సరిహద్దున ఉన్న అరణ్యములోనుండగా లీహైకివ్వబడిన అద్భుత మార్గదర్శులను చూచెదరు.
2 మీ విశ్వాసము వలన, అనగా ప్రాచీన కాలపు ప్రవక్తలు కలిగియున్నటువంటి విశ్వాసమువలననే వాటిని మీరు చూచెదరు.
3 మీరు విశ్వాసమును పొంది, వాటిని మీ నేత్రములతో చూచిన తరువాత, దేవుని శక్తిచేత వాటిని గూర్చి మీరు సాక్ష్యము చెప్పవలెను;
4 నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. నాశనము చేయబడకుండుటకు, తద్వారా ఈ కార్యములో నీతిగల నా ఉద్దేశ్యములను నరుల సంతానము యొద్దకు తెచ్చుటకు దీనిని మీరు చేయవలెను.
5 నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. చూచినట్లుగానే మీరును వాటిని చూచిరని సాక్ష్యము పలుకవలెను; ఏలయనగా అతనికి విశ్వాసమున్నది గనుక నా శక్తి ద్వారా అతడు వాటిని చూచెను.
6 అతడు గ్రంథమును అనగా నేనతనికి ఆజ్ఞాపించిన భాగమును అనువదించెను, ప్రభువైన మీ దేవుని జీవముతోడు అది సత్యము.
7 కాబట్టి, అతనివలే మీరు కూడా అదే శక్తిని, అదే విశ్వాసమును, అదే వరమును పొందిరి;
8 నేను మీకిచ్చిన నా ఈ చివరి ఆజ్ఞలను మీరు పాటించిన యెడల, మీ యెదుట నరకపు ద్వారములు నిలువజాలవు; ఏలయనగా నా కృప మీకు చాలును మరియు అంత్యదినమున మీరు లేపబడెదరు.
9 మీ ప్రభువు, మీ దేవుడైన యేసు క్రీస్తు అను నేను దీనిని మీతో పలికితిని, తద్వారా నేను నరుల సంతానము కొరకు నీతిగల నా ఉద్దేశ్యములను ముందుకు తీసుకురావచ్చును. ఆమేన్.