సిద్ధాంతము మరియు నిబంధనలు
1వ ప్రకరణము
1831 నవంబరు 1న, ఒహైయోలోని హైరంలో జరిగిన సంఘ పెద్దల ప్రత్యేక సమావేశములో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. దీనికి మునుపు ప్రభువు నుండి అనేక బయల్పాటులు అనుగ్రహించబడినవి, వీటిని సమీకరించి ఒక గ్రంథము రూపంలో ప్రచురించుట ఈ సమావేశంలో నిర్ణయించబడిన ముఖ్యాంశాలలో ఒకటి. ఈ యుగములో ఇవ్వబడిన సిద్ధాంతములు, నిబంధనలు, ఆజ్ఞలకు ప్రభువు యొక్క ఉపోద్ఘాతమును ఈ ప్రకరణము కలిగియున్నది.
1–7, హెచ్చరించు స్వరము జనులందరికి వర్తించును; 8–16, రెండవ రాకడకు ముందు భ్రష్టత్వము, దుష్టత్వము సంభవించును; 17–23, ప్రభువు యొక్క సత్యాలను, శక్తులను భూమిపై తిరిగి తెచ్చుటకు జోసెఫ్ స్మిత్ పిలువబడెను; 24–33, మోర్మన్ గ్రంథము బయటకు తేబడును, నిజమైన సంఘము స్థాపించబడును; 34–36, భూమిపై నుండి శాంతి తీసివేయబడును; 37–39, ఈ ఆజ్ఞలను వెదకుము.
1 నా సంఘ జనులారా, వినుడి అని ఉన్నతస్థలమున నివశించుచు, సమస్త జనులపై దృష్టియుంచు ఆయన స్వరము చెప్పుచున్నది; నేను నిశ్చయముగా చెప్పునదేమనగా: సుదూర ప్రాంతాలలోనున్న జనులారా వినుడి; సముద్ర ద్వీపాలలోనున్న మీరందరు కలిసి వినుడి.
2 నిశ్చయముగా ప్రభువు స్వరము జనులందరికి వర్తించును మరియు తప్పించుకొను వారెవరునూ లేరు; చూడని కన్నైననూ, వినని చెవియైననూ, చొచ్చుకొనిపోని హృదయమైననూ ఉండదు.
3 అవిధేయులు తీవ్రవేదనను పొందెదరు; వారి పాపములు మేడలమీద చాటించబడును, వారి రహస్య కార్యములు బహిర్గతమగును.
4 ఈ అంత్య దినములలో నేనెన్నుకొనిన నా శిష్యుల నోటిమాట ద్వారా ఈ హెచ్చరించు స్వరము సమస్త జనులకు వర్తించును.
5 వారు ముందుకు సాగెదరు, వారినెవ్వరూ ఆటంకపరచరు, ఏలయనగా ప్రభువైన నేను వారిని ఆజ్ఞాపించితిని.
6 ఇదిగో, ఇది నా అధికారము మరియు నా సేవకుల అధికారము, ఓ భూలోక నివాసులారా, మీకై ప్రచురించమని వారికిచ్చిన నా ఆజ్ఞల గ్రంథానికి నా ఉపోద్ఘాతము.
7 కాబట్టి, ఓ జనులారా, భీతికలిగి వణకుడి, ఏలయనగా ప్రభువైన నేను వాటిలో ఆజ్ఞాపించినవన్నియూ నెరవేరును.
8 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, ఈ సువర్తమానములను భూలోక నివాసులకు తెలియజేయుటకు బయలువెళ్ళు వారికి—అవిశ్వాసులు మరియు జగడములాడు వారిని ఈ లోకములోను పరలోకములోను బంధించుటకు;
9 దేవుని ఉగ్రత దుష్టులపై విస్తారముగా క్రుమ్మరించబడు దినము వరకు వారిని బంధించుటకు—
10 ప్రతి మనుష్యునికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చి, ప్రతివాడు తన పొరుగు వానికి కొలిచిన కొలతను బట్టి కొలుచుటకు ప్రభువు వచ్చు ఆ దినము వరకు అధికారమివ్వబడెను.
11 కాబట్టి చెవులు గలవారందరు వినునట్లు ప్రభువు స్వరము భూదిగంతముల వరకు వినబడును:
12 ప్రభువు సమీపముగానున్నాడు గనుక, రాబోవు దానిని గూర్చి సిద్ధపడుడి;
13 ప్రభువు ఉగ్రత రగులుకొని, ఆయన ఖడ్గము పరలోకమందు దూయబడెను, అది భూలోక నివాసులపై పడును.
14 దేవుని కార్యము ప్రత్యక్షపరచబడును; ప్రభువు స్వరమును మరియు ఆయన సేవకుల స్వరమును ఆలకించకుండా ప్రవక్తలు, అపొస్తలుల మాటలకు చెవియొగ్గని వారందరు జనుల మధ్య నుండి కొట్టివేయబడు దినము వచ్చును;
15 ఏలయనగా వారు నా విధులనుండి తొలగిపోయి, నా నిత్య నిబంధనను అతిక్రమించిరి;
16 ప్రభువు తన నీతిని నెలకొల్పవలెనని వారు కోరుట లేదు, కానీ ప్రతి మనుష్యుడు తన ఇష్టము చొప్పున, తన దేవుని ప్రతిరూపములో నడుచుకొనుచున్నాడు, ఆ ప్రతిరూపము లోకమును పోలియున్నది, దాని సారాంశము విగ్రహమును తలపించును, అది పాతగిలి బబులోనులో నశించును, ఆ బబులోను మహాపట్టణము పడిపోవును.
17 కాబట్టి, ప్రభువైన నేను, భూలోక నివాసులందరిపైకి రాబోవు విపత్తునెరిగి, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. ను పిలిచి, పరలోకము నుండి మాట్లాడి, ఆజ్ఞలనిచ్చితిని;
18 ఇతరులు కూడా ఈ సంగతులన్నిటిని లోకమునకు ప్రకటించుటకు వారికి ఆజ్ఞలనిచ్చితిని; తద్వారా ప్రవక్తల చేత వ్రాయబడినదంతయు నెరవేర్చబడును—
19 లోకములో బలహీనమైనవి వచ్చి, శక్తివంతమైన, బలమైనవాటిని తుత్తునీయలుగా చేయునని, ఒక మనుష్యుడు తోటివానికి ఆలోచన చెప్పరాదని, శరీరబాహువును నమ్మరాదని—
20 ప్రతి మనుష్యుడు లోక రక్షకుడును, ప్రభువైన దేవుని నామములో మాట్లాడాలని;
21 తద్వారా భూమిపై విశ్వాసము విస్తరించాలని;
22 నా నిత్య నిబంధన స్థిరపరచబడాలని;
23 నా సంపూర్ణ సువార్త భూదిగంతముల వరకు, రాజులు మరియు పరిపాలకుల యెదుట బలహీనులు, సామాన్యులచేత ప్రకటింపబడాలని,
24 ఇదిగో, దేవుడైన నేను దీనిని సెలవిచ్చితిని; ఈ ఆజ్ఞలు నా నుండి నా సేవకులకు వారి బలహీనతయందు, వారు అర్థము చేసుకొనునట్లు వారి భాషానుగుణంగా ఇవ్వబడెను.
25 వారు చేసిన తప్పిదములన్నియు తెలియజేయబడును;
26 వారు జ్ఞానమును కోరినయెడల, వారు ఉపదేశమును పొందెదరు;
27 వారు పాపము చేసినయెడల, పశ్చాత్తాపపడునట్లు వారు శిక్షింపబడుదురు;
28 వారు దీనమనస్కులై ఉన్నప్పుడు బలపరచబడి, పైనుండి దీవించబడి, అనుదినము జ్ఞానమును పొందెదరు.
29 నీఫైయుల వృత్తాంతమును పొందిన తరువాత, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. దేవుని కృప, శక్తిచేత మోర్మన్ గ్రంథమును అనువదించుటకు శక్తిని కలిగియుండును.
30 ఈ ఆజ్ఞలు ఇవ్వబడిన వారు ఈ సంఘ పునాదిని నిర్మించుటకు శక్తిని కలిగియుండి, ప్రభువైన నేను మిక్కిలి ఆనందించే, ఈ భూమిపై ఉన్న ఏకైక జీవము గల సత్య సంఘమును చీకటి అంధకారముల నుండి బయటకు తీసుకొనివచ్చుటకు శక్తిని కలిగియుందురని, ఒక్కొక్కరితో కాకుండా సంఘమంతటితో మాట్లాడుచున్నాను—
31 ప్రభువైన నేను పాపమును ఎంత మాత్రము అంగీకరించను;
32 అయినను, పశ్చాత్తాపపడి ప్రభువు ఆజ్ఞలను గైకొనువాడు క్షమించబడును;
33 పశ్చాత్తాపపడని వాని నుండి అతడు పొందిన వెలుగు కూడా తీసివేయబడును; ఏలయనగా నా ఆత్మ ఎల్లప్పుడు నరునితో పోరాడదని సైన్యములకు అధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
34 ఇదిగో, ఓ భూలోక నివాసులారా, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను: ప్రభువైన నేను ఈ సంగతులన్నింటిని సమస్త శరీరులకు తెలియజేయగోరుచున్నాను;
35 ఏలయనగా నేను పక్షపాతిని కానని, ఆ దినము త్వరగా వచ్చునని మనుష్యులందరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను; ఆ గడియ ఇంకనూ రాలేదు కానీ సమీపములో ఉన్నది, అప్పుడు భూమిపై నుండి శాంతి తీసివేయబడును, అపవాది తన స్వంత రాజ్యముపై శక్తి కలిగియుండును.
36 ప్రభువు తన పరిశుద్ధులపై అధికారము కలిగియుండి, వారి మధ్య పరిపాలించి, ఏదోము లేదా లోకమునకు తీర్పుతీర్చుటకు దిగివచ్చును.
37 ఈ ఆజ్ఞలను వెదకుడి, అవి యథార్థమైనవి మరియు నమ్మకమైనవి, వాటిలో ఉన్న ప్రవచనములు, వాగ్దానములన్నీ నెరవేర్చబడును.
38 ప్రభువైన నేను మాట్లాడవలసినది మాట్లాడితిని, నేను చెప్పినమాట మీరనివాడను, భూమ్యాకాశములు గతించిననూ నా మాట గతించదు, గాని సమస్తము నెరవేరును, నా నోటి మాట ద్వారా గాని లేదా నా సేవకుల నోటి మాట ద్వారా గాని చెప్పునది ఒక్కటే.
39 ఇదిగో చూడుడి, ప్రభువే దేవుడైయున్నాడని ఆత్మ సాక్ష్యమిచ్చును, ఆ సాక్ష్యము సత్యము, ఆ సత్యము నిరంతరము నిలుచును. ఆమేన్.