30వ ప్రకరణము
1830 సెప్టెంబరు, న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో మూడు దినముల సమావేశము తరువాత సంఘ పెద్దలు వేరుకాక మునుపు డేవిడ్ విట్మర్, పీటర్ విట్మర్ జూ., జాన్ విట్మర్‌లకు ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. మొదట ఈ అంశము మూడు బయల్పాటులుగా ప్రచురించబడినది; సిద్ధాంతము మరియు నిబంధనల 1835వ సంచిక కొరకు ప్రవక్తచేత ఇది ఒకే ప్రకరణముగా జతచేయబడినది.
1–4, శ్రద్ధగా సేవచేయుటలో విఫలమైనందుకు డేవిడ్ విట్మర్ మందలించబడెను; 5–8, పీటర్ విట్మర్ జూ., లేమనీయుల యొద్దకు పరిచర్యలో ఆలీవర్ కౌడరీకి తోడుగా వెళ్ళవలెను; 9–11, జాన్ విట్మర్ సువార్తను ప్రకటించుటకు పిలువబడెను.
1 ఇదిగో డేవిడ్, నీవు మనుష్యునికి భయపడితివి, బలము కొరకు నాపై ఆధారపడవలసియుండగా నీవు ఆవిధముగా చేయలేదని నేను నీతో చెప్పుచున్నాను.
2 కానీ నీ మనసు, నీ రూపకర్తనైన నా సంగతులపై, నీవు పిలువబడియున్న పరిచర్యపై కంటే ఎక్కువగా భూలోక సంగతులపైనున్నది; నా ఆత్మను, నీపై నియమించబడియున్న వారిని నీవు ఆలకించలేదు, కానీ నేనాజ్ఞాపించని వారిచేత చెప్పబడిన వాటిని నీవు నమ్ముచున్నావు.
3 కాబట్టి, నీకు నీవుగా నా నుండి విచారించుటకు, నీవు పొందిన సంగతులను ధ్యానించుటకు విడువబడితివి.
4 నేను నీకు అదనపు ఆజ్ఞలు ఇచ్చేంతవరకు నీ నివాసము నీ తండ్రి ఇంటనే ఉండవలెను. నీవు సంఘములో, లోకము యెదుట, చుట్టూ ఉన్న ప్రాంతములలో పరిచర్యకు హాజరుకావలెను. ఆమేన్.
5 ఇదిగో పీటర్, నేను నీకు సెలవిచ్చునదేమనగా, నీ సహోదరుడు ఆలీవర్తో నీవు ప్రయాణము చేయవలెను; ఏలయనగా సమయము ఆసన్నమైనది గనుక, నా సువార్తను ప్రకటించుటకు నీవు నీ నోటిని విప్పుట నా యందు యుక్తమైయున్నది; కాబట్టి భయపడకుము, కానీ నీ సహోదరుడు నీకిచ్చు సలహాను, మాటలను ఆలకించుము.
6 అతని మరియు నీ యొక్క విడుదలకు ఎల్లప్పుడు ప్రార్థనతోను, విశ్వాసముతోను నా యెదుట నీ హృదయమునెత్తుకొనుచు, అతని యావద్బాధలో పాలుపొందుము; ఏలయనగా లేమనీయుల మధ్య నా సంఘమును కట్టుటకు అతనికి నేను శక్తినిచ్చియున్నాను;
7 సంఘ విషయాలను గూర్చి సంఘములో అతనిపై సలహాదారునిగా ఉండుటకు అతని సహోదరుడు జోసెఫ్ స్మిత్ జూ. ను తప్ప ఇంకెవరిని నేను నియమించలేదు.
8 కాబట్టి, ఈ సంగతులను ఆలకించుము, నా ఆజ్ఞలు పాటించుటలో శ్రద్ధ వహించుము, నీవు నిత్యజీవమును పొందునట్లు దీవించబడుదువు. ఆమేన్.
9 ఇదిగో, నా సేవకుడవైన జాన్, ఈ సమయము నుండి బూర ధ్వనివలే నా సువార్తను ప్రకటించుట నీవు మొదలుపెట్టవలెనని నేను నీతో చెప్పుచున్నాను.
10 అక్కడ నుండి వెళ్ళమని నేను నిన్ను ఆజ్ఞాపించు వరకు నీవు చేయవలసిన పని నీ సహోదరుడైన ఫిలిప్ బర్రోస్ ఇంటియొద్ద మరియు ఆ చుట్టూ గల ప్రదేశములో, అనగా నీవు చెప్పునది ఎక్కడ వినబడునో అక్కడ ఉండును.
11 ఇకమీదట నీ పూర్ణాత్మతో నీవు చేయవలసిన పని అంతయు సీయోనులో నుండును; నేను నీకు తోడుగా ఉన్నాను గనుక, మనుష్యుడు ఏమి చేయునో అని భయపడకుండా నా కార్యములో నీవు ఎల్లప్పుడు నీ నోటిని విప్పవలెను. ఆమేన్.