39వ ప్రకరణము
1831 జనవరి 5న, న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా జేమ్స్ కోవెల్కివ్వబడిన బయల్పాటు. సుమారు నలభై సంవత్సరాలు మెథడిస్టు పరిచారకునిగా ఉన్న జేమ్స్ కోవెల్, ప్రవక్తయైన జోసెఫ్ ద్వారా ప్రభువు తనకు ఇచ్చు ఏ ఆజ్ఞనైనా పాటించెదనని ప్రభువుతో నిబంధన చేసెను.
1–4, పరిశుద్ధులకు దేవుని కుమారులుగా అగుటకు శక్తి కలదు; 5–6, సువార్తను స్వీకరించడమనగా క్రీస్తును స్వీకరించుట; 7–14, బాప్తిస్మము పొంది, ప్రభువు ద్రాక్షతోటలో పనిచేయుటకు జేమ్స్ కోవెల్ ఆజ్ఞాపించబడెను; 15–21, ప్రభువు సేవకులు రెండవ రాకడకు ముందు సువార్తను ప్రకటించవలెను; 22–24, సువార్తను స్వీకరించువారు ఈ లోకములోను, నిత్యత్వములోను సమకూర్చబడెదరు.
1 నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు నుండు ఘనమైన ఉన్నవాడు అను యేసు క్రీస్తు స్వరమును విని, ఆలకించుడి—
2 ఆయన లోకమునకు వెలుగును జీవమునైయున్నాడు; ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను;
3 మధ్యస్థకాలములో నా స్వజనుల యొద్దకు వచ్చినవాడను నేనే, కానీ నా స్వజనులు నన్ను చేర్చుకొనలేదు;
4 నన్ను చేర్చుకొనిన వారందరికి, నా కుమారులగుటకు నేను శక్తినిచ్చితిని; అదేవిధముగా నన్నెవరైతే చేర్చుకొందురో వారికి కూడా నా కుమారులగుటకు శక్తినిచ్చెదను.
5 నా సువార్తను స్వీకరించువాడు నన్ను స్వీకరించునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను; నా సువార్తను స్వీకరించని వాడు నన్ను స్వీకరించడు.
6 ఇదియే నా సువార్త—పశ్చాత్తాపము, నీటి చేత బాప్తిస్మము, తరువాత అగ్నిచేత మరియు ఆదరణ కర్తయైన పరిశుద్ధాత్మచేత బాప్తిస్మము కలుగును, అతడు అన్ని సంగతులను చూపును మరియు పరలోకరాజ్యము యొక్క శాంతికరమైన సంగతులను బోధించును.
7 ఇదిగో నా సేవకుడవైన జేమ్స్, ఇప్పుడు నేను నీకు చెప్పునదేమనగా, నేను నీ కార్యములను చూచియున్నాను మరియు నేను నిన్ను యెరిగియున్నాను.
8 ఈ సమయమందు నీ హృదయము నా యెదుట యథార్థముగానున్నది, ఇదిగో నీ శిరస్సుపై నేను గొప్ప దీవెనలను క్రుమ్మరించియున్నానని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను;
9 అయినప్పటికీ, నీవు గొప్ప వేదన అనుభవించియున్నావు, ఏలయనగా నీవు గర్వము వలన, ఐహికవిచారముల వలన అనేకమార్లు నన్ను తిరస్కరించితివి.
10 కానీ ఇదిగో, నీ విడుదల దినములు వచ్చియున్నవి, నీవు నా స్వరమును ఆలకించిన యెడల, అది నీతో ఈలాగు చెప్పును: లేచి, నా నామమును బట్టి ప్రార్థన చేసి, బాప్తిస్మము పొంది, నీ పాపములను కడిగి వేసుకొనుము మరియు నీవు నా ఆత్మను, నీవెన్నడు యెరుగని గొప్ప దీవెనను పొందెదవు.
11 దీనిని నీవు చేసిన యెడల, ఒక గొప్ప కార్యమునకు నేను నిన్ను సిద్ధపరచియున్నాను. ఈ చివరి దినములలో నేను పంపియున్న నా సంపూర్ణ సువార్తను, ఇశ్రాయేలు వంశపువారైన నా జనులను తిరిగి రప్పించుటకు నేను పంపియున్న నిబంధనను నీవు ప్రకటించవలెను.
12 అప్పుడు శక్తి నీ మీద నిలుచును; నీవు గొప్ప విశ్వాసము కలిగియుందువు మరియు నేను నీకు తోడైయుండి నీ ముందు నడిచెదను.
13 నా ద్రాక్షతోటలో పనిచేయుటకు, నా సంఘమును కట్టుటకు, కొండలపై సంతోషించి, వర్ధిల్లునట్లు సీయోనును స్థాపించుటకు నీవు పిలువబడితివి.
14 ఇదిగో, తూర్పు దేశములలోనికి వెళ్ళుటకు నీవు పిలువబడలేదు, కానీ ఒహైయోకు వెళ్ళుటకు నీవు పిలువబడితివి.
15 ఒహైయోలో నా జనులు సమకూడినట్లైతే, నరుల సంతానమునకు తెలియనటువంటి ఒక దీవెనను నేను దాచియుంచితిని, అది వారి శిరస్సులపై క్రుమ్మరించబడును. అక్కడ నుండి మనుష్యులు సమస్త దేశములలోనికి వెళ్ళెదరు.
16 దేశములకు తీర్పు తీర్చకుండా నా చేతిని వెనుకకు తీసుకొందునని తలంచుచు ఒహైయోలోని జనులు అధిక విశ్వాసముతో నాకు మొరపెట్టుచున్నారు, కానీ నా మాట తప్పలేనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
17 కాబట్టి మీ బలమంతటితో పనిచేయుచూ, చివరిసారి అది శుద్ధిచేయబడునట్లు నా ద్రాక్షతోటలో నమ్మకమైన పనివారిని పిలువుము.
18 వారు పశ్చాత్తాపపడి, నా సంపూర్ణ సువార్తను స్వీకరించి, పవిత్రపరచబడిన యెడల, తీర్పు తీర్చకుండా నా చేతిని నేను వెనుకకు తీసుకొందును.
19 కాబట్టి, పరలోకరాజ్యము సమీపములోనున్నది అని చెప్పుచూ హోసన్నా! సర్వోన్నతుడైన దేవుని నామము దీవించబడును గాక అని బిగ్గరగా అరచుచూ ముందుకు సాగుము.
20 నీటితో బాప్తిస్మమిచ్చుచూ, నా రాకడ సమయము కొరకు నా యెదుటనున్న మార్గమును సిద్ధపరచుచూ ముందుకు సాగుము;
21 ఏలయనగా సమయము ఆసన్నమైనది; ఆ దినమైనను, ఆ గడియయైనను ఏ మనుష్యునికి తెలియదు; కానీ అది తప్పక వచ్చును.
22 ఈ సంగతులను స్వీకరించేవాడు నన్ను స్వీకరించును; వారు ఈ లోకములో, నిత్యత్వములో నా యొద్దకు చేర్చబడెదరు.
23 మరలా, మీరు ఎందరికైతే నీటితో బాప్తిస్మమిచ్చెదరో, వారందరిపై మీ చేతులనుంచవలెను; వారు పరిశుద్ధాత్మ వరమును పొంది, నా రాకడ సూచనల కొరకు కనిపెట్టెదరు మరియు నన్ను తెలుసుకొందురు.
24 ఇదిగో, నేను అకస్మాత్తుగా వచ్చెదను. అలాగే జరుగును గాక. ఆమేన్.