42వ ప్రకరణము
1831 ఫిబ్రవరి 9 మరియు 23లలో, ఒహైయోలోని కర్ట్లాండ్లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా రెండు భాగములుగా ఇవ్వబడిన బయల్పాటు. మొదటి భాగము 1 నుండి 72 వచనాలను కలిగియుండి, పన్నెండుమంది పెద్దల సమక్షములో ఒహైయోలో “ధర్మశాస్త్రము” ఇవ్వబడునని గతములో చేయబడిన ప్రభువు వాగ్దానమునకు నెరవేర్పుగా పొందబడినది (ప్రకరణము 38:32 చూడుము). రెండవ భాగము 73 నుండి 93 వచనాలను కలిగియున్నది. ఈ బయల్పాటు “సంఘము యొక్క ధర్మశాస్త్రమును కలిగియున్నది” అని ప్రవక్త స్పష్టపరిచెను.
1–10, పెద్దలు సువార్తను ప్రకటించుటకు, పరివర్తన చెందిన వారికి బాప్తిస్మమిచ్చుటకు, సంఘమును నిర్మించుటకు పిలువబడిరి; 11–12, వారు పిలువబడి, నియమింపబడవలెను మరియు లేఖనములలో కనుగొనబడు సువార్త సూత్రములను బోధించవలెను; 13–17, ఆత్మ శక్తి చేత వారు బోధించి, ప్రవచించవలెను; 18–29, పరిశుద్ధులు నరహత్య, దొంగతనము చేయుట, అబద్ధములాడుట, మోహించుట, వ్యభిచరించుట లేదా ఇతరులను గూర్చి చెడుగా మాట్లాడుట చేయకూడదని ఆజ్ఞాపించబడిరి; 30–39, ఆస్తుల సమర్పణను నియంత్రించు చట్టములు ఇవ్వబడినవి; 40–42, గర్వము, సోమరితనము ఖండించబడినవి; 43–52, దీవెనలు మరియు విశ్వాసము ద్వారా రోగులు స్వస్థపరచబడవలెను; 53–60, లేఖనములు సంఘమును పరిపాలించును మరియు అవి లోకమునకు చాటింపబడవలెను; 61–69, నూతన యెరూషలేము యొక్క స్థలము మరియు పరలోకరాజ్య మర్మములు తెలుపబడును; 70–73, సమర్పిత ఆస్తులు సంఘ అధికారులను ఆదుకొనుటకు ఉపయోగించబడవలెను; 74–93, జారత్వము, వ్యభిచారము, నరహత్య, దొంగతనము, పాపములు ఒప్పుకొనుటను నియంత్రించు చట్టములు ఇవ్వబడినవి.
1 నా నామమున అనగా లోక రక్షకుడును, జీవముగల దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నామమున సమకూడిన ఓ నా సంఘ పెద్దలారా, ఆలకించుడి; ఏలయనగా మీరు నా నామమందు విశ్వసించి, నా ఆజ్ఞలను పాటించిరి.
2 మరలా నేను మీతో చెప్పునదేమనగా, విని ఆలకించుడి, నేను మీకు ఇవ్వబోవు ధర్మశాస్త్రమును పాటించుడి.
3 ఏలయనగా నేను మీకాజ్ఞాపించిన ఆజ్ఞననుసరించి మీయంతట మీరు సమకూడి, ఈ ఒక్క విషయమందు ఏకీభవించి, తండ్రిని నా నామమున అడిగితిరి గనుక, ఆ విధముగానే మీరు పొందెదరని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను.
4 ఇదిగో, నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నా సేవకులైన జోసెఫ్ స్మిత్ జూ. మరియు సిడ్నీ రిగ్డన్ తప్ప మీలో ప్రతిఒక్కరు నా నామమున ముందుకు వెళ్ళవలెనను ఈ మొదటి ఆజ్ఞను నేను మీకిచ్చుచున్నాను.
5 వారికి నేనొక ఆజ్ఞనిచ్చుచున్నాను, అదేమనగా కొంత కాలముపాటు వారు వెళ్ళవలెను మరియు వారెప్పుడు తిరిగి రావలెనో అది ఆత్మ శక్తి ద్వారా వారికివ్వబడును.
6 ఇద్దరిద్దరు చొప్పున మీ స్వరములను బూరధ్వని వలే ఎలుగెత్తుచూ నా నామమున నా సువార్తను, దేవదూతల వలే నా వాక్యమును ప్రకటించుచూ నా ఆత్మ శక్తితో మీరు ముందుకు సాగవలెను.
7 నీటితో బాప్తిస్మమిచ్చుచు—పశ్చాత్తాపపడుడి, పశ్చాత్తాపపడుడి, ఏలయనగా పరలోకరాజ్యము సమీపములోనున్నది అని చెప్పుచూ మీరు ముందుకు సాగవలెను.
8 ఈ స్థలము నుండి పశ్చిమదిశగా ఉన్న ప్రాంతములకు మీరు వెళ్ళవలెను; మిమ్ములను చేర్చుకొను వారిని మీరు కనుగొనునప్పుడు, ప్రతి ప్రాంతములో మీరు నా సంఘమును నిర్మించవలెను—
9 నూతన యెరూషలేము పట్టణము ఎప్పుడు సిద్ధపరచబడునో పరలోకమునుండి మీకు బయలుపరచబడి, మీరందరు ఒకే స్థలములో చేర్చబడి, తద్వారా మీరు నాకు ప్రజలైయుండి నేను మీ దేవుడనైయుండు సమయము వచ్చువరకు చేయవలెను.
10 మరలా, నేను మీతో చెప్పునదేమనగా, నా సేవకుడు ఎడ్వర్డ్ పాట్రిడ్జ్ నేనతనికి నియమించిన అధికారికస్థానములో నిలిచియుండవలెను. అతడు తప్పిదము చేసిన యెడల, అతనికి బదులుగా వేరొకరు నియమించబడుట జరుగును. అలాగే జరుగును గాక. ఆమేన్.
11 మరలా నేను మీతో చెప్పునదేమనగా, అధికారముగల ఎవరో ఒకరిచేత నియమించబడియుండి, అతనికి అధికారమున్నదనియు, సంఘ ప్రధానులచేత అతడు సక్రమముగా నియమింపబడియున్నాడనియు సంఘమునకు తెలిసియుంటే తప్ప, నా సువార్తను ప్రకటించుటకు ముందుకు సాగుటకు లేదా నా సంఘమును నిర్మించుటకు ఎవ్వరికీ అధికారమివ్వబడదు.
12 మరలా, ఈ సంఘ పెద్దలు, యాజకులు, బోధకులు బైబిలు మరియు మోర్మన్ గ్రంథములోనున్న నా సువార్త సూత్రములను బోధించవలెను, వాటియందు నా సంపూర్ణ సువార్త ఉన్నది.
13 వాటిని చేయుటకు వారు నిబంధనలను, సంఘ నియమాలను పాటించవలెను మరియు వారు ఆత్మచేత నడిపించబడినప్పుడు ఇవి వారి బోధనలుగా ఉండవలెను.
14 విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా ఆత్మ మీకు అనుగ్రహించబడును; మీరు ఆత్మను పొందనియెడల, మీరు బోధించరాదు.
15 నా వాక్యము సంపూర్ణముగా ఇవ్వబడువరకు మీ బోధన విషయమై నేను ఆజ్ఞాపించినట్లుగా దీనినంతటిని మీరు పాటించులాగున చూడవలెను.
16 మీరు ఆదరణకర్త చేత మీ స్వరములను ఎలుగెత్తునప్పుడు, నాకు ఏది మంచిగా కనబడునో దానిని మీరు పలికి, ప్రవచించవలెను;
17 ఏలయనగా, ఇదిగో ఆదరణకర్త సమస్త సంగతులను యెరుగును మరియు తండ్రిని గూర్చియు, కుమారుని గూర్చియు సాక్ష్యమిచ్చును.
18 ఇదిగో, ఇప్పుడు నేను సంఘముతో మాట్లాడుచున్నాను. నీవు నరహత్య చేయకూడదు; నరహత్య చేయువాడు ఈ లోకములోనైనను, రాబోవు లోకములోనైనను క్షమాపణ కలిగియుండడు.
19 మరలా నేను చెప్పునదేమనగా, నీవు నరహత్య చేయకూడదు; నరహత్య చేయువాడు మరణపాత్రుడగును.
20 నీవు దొంగిలింపకూడదు; దొంగిలించి, పశ్చాత్తాపపడనివాడు వెళ్ళగొట్టబడవలెను.
21 నీవు అబద్ధమాడకూడదు; అబద్ధమాడి, పశ్చాత్తాపపడనివాడు వెళ్ళగొట్టబడవలెను.
22 నీ పూర్ణహృదయముతో నీ భార్యను ప్రేమించవలెను, ఆమెను తప్ప వేరెవరిని నీవు హత్తుకొనియుండరాదు.
23 ఒక స్త్రీని మోహముతో చూచువాడు విశ్వాసత్యాగము చేయును మరియు ఆత్మను కలిగియుండడు; అతడు పశ్చాత్తాపపడని యెడల, అతడు వెళ్ళగొట్టబడవలెను.
24 నీవు వ్యభిచరించకూడదు; వ్యభిచరించి, పశ్చాత్తాపపడనివాడు వెళ్ళగొట్టబడవలెను.
25 వ్యభిచరించి, తన పూర్ణహృదయముతో పశ్చాత్తాపపడి, దానిని విడిచిపెట్టి, ఇకమీదట చేయని వానిని మీరు క్షమించవలెను;
26 కానీ అతడు దానిని మరలా చేసిన యెడల, అతడు క్షమింపబడక వెళ్ళగొట్టబడవలెను.
27 నీ పొరుగువాని గూర్చి చెడుగా మాట్లాడకూడదు, వానికి ఏ హానియు తలపెట్టకూడదు.
28 ఈ సంగతులను గూర్చి నా నియమములను నీవు యెరిగియున్నావు, అవి నా లేఖనములలో ఇవ్వబడియున్నవి; పాపము చేసి పశ్చాత్తాపపడనివాడు వెళ్ళగొట్టబడవలెను.
29 నీవు నన్ను ప్రేమించిన యెడల నన్ను సేవించి, నా ఆజ్ఞలన్నింటిని నీవు పాటించవలెను.
30 ఇదిగో, నీవు బీదలను జ్ఞాపకము చేసుకొందువు, అతిక్రమించలేని ఒక నిబంధన మరియు ఒక కార్యముతో వారికి నీవు ఇవ్వవలసియున్న భాగమును, అనగా వారి సహాయార్థము నీ ఆస్తులను సమర్పణ చేయుదువు.
31 నీవు నీ ఆస్థిలో భాగమును బీదలకు ఇచ్చిన యెడల, నీవు దానిని నాకు చేయుదువు; అవి నా సంఘ బిషప్పు, అతని సలహాదారులు, పెద్దలలో లేదా ప్రధాన యాజకులలో ఇద్దరి యెదుట సమర్పించవలెను, వారెవరనగా—అతడు నియమించబోవువారు లేదా నియమించి, దాని నిమిత్తము ప్రత్యేకపరచబడినవారు.
32 నా సంఘ బిషప్పు ఎదుట వాటిని సమర్పించి, అవి సంఘము నుండి తీసుకొనబడలేవని నా ఆజ్ఞలకు అంగీకారముగా నా సంఘ ఆస్తుల సమర్పణ గూర్చి అతడు ఈ సాక్ష్యములను పొందియున్న తరువాత, ప్రతి మనుష్యుడు తన స్వంత ఆస్తులకు లేదా అతడు సమర్పణ ద్వారా తనకు, తన కుటుంబమునకు సరిపోవునంతగా పొందియుండిన దానికి గృహనిర్వాహకునిగా నాకు లెక్క అప్పగించువానిగా చేయబడవలెను.
33 మరలా, సంఘము లేదా దానికి చెందిన ఏ వ్యక్తి చేతులలోనైనా ఈ మొదటి సమర్పణ తరువాత వారి సంరక్షణకు చాలిన దానికంటే ఎక్కువ ఆస్తులుండిన యెడల, అది బిషప్పుకు సమర్పణ చేయవలసిన శేషము, అది విభిన్న సమయాలలో లేనివారికి ఇచ్చుటకు ఉంచబడవలెను, తద్వారా ఎవనికైతే అవసరతయున్నదో వానికి సరిపడేంత సరఫరా చేయబడవచ్చును మరియు వాని అవసరతలను బట్టి పొందవచ్చును.
34 కాబట్టి, సంఘ ప్రధాన సలహామండలి, బిషప్పు, అతని సలహామండలి నిర్దేశించు విధముగా బీదలు, అవసరతలోనున్న వారికిచ్చుటకు ఆ శేషము నా గిడ్డంగిలో ఉంచబడవలెను;
35 సంఘ సభ్యుల ఉమ్మడి ప్రయోజనము కొరకు భూములు కొనుగోలు చేయుటకు, ఆరాధన గృహములు నిర్మించుటకు, ఇకపై బయలుపరచబడవలసియున్న నూతన యెరూషలేమును నిర్మించు నిమిత్తము ఉంచబడవలెను—
36 తద్వారా నేను నా దేవాలయమునకు వచ్చు దినమున నా నిబంధన జనులు ఒకే స్థలములో కూడుకొనవచ్చును. మరియు నా జనుల రక్షణార్థము దీనిని నేను చేయుదును.
37 పాపము చేసి, పశ్చాత్తాపపడని వాడు సంఘము నుండి వెళ్ళగొట్టబడును మరియు అతడు నా సంఘము యొక్క బీదల కొరకు, అవసరతలోనున్న వారికొరకు లేదా మరియొక మాటలో, నాకు సమర్పణ చేసిన దానిని తిరిగి పొందడు—
38 ఏలయనగా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికి నీవు చేసిన యెడల, నీవు దానిని నాకు చేయుదువు.
39 నా ప్రవక్తల నోళ్ళద్వారా నేను మాట్లాడినది నెరవేరును; ఏలయనగా అన్యజనులలో నా సువార్తను హత్తుకొనువారి ఐశ్వర్యమును ఇశ్రాయేలు వంశమునకు చెందిన నా జనులలో బీదలకు నేను సమర్పణ చేయుదును.
40 మరలా, నీ హృదయములో నీవు గర్వించకూడదు; నీ వస్త్రములన్నియు సామాన్యముగాను, వాటి సౌందర్యము నీ హస్తకృత్యపు సౌందర్యముగా ఉండవలెను;
41 సమస్త సంగతులు నా యెదుట పవిత్రతతో చేయబడవలెను.
42 నీవు సోమరిగా ఉండకూడదు; ఏలయనగా సోమరి కష్టించువాని ఆహారమును భుజింపకూడదు, వాని వస్త్రములను ధరించకూడదు.
43 మీలో ఎవరైనను అనారోగ్యముగా ఉండి, స్వస్థత పొందుటకు విశ్వాసము లేనప్పటికీ నమ్మినయెడల, శత్రువు చేతి వలన కాక మృదుత్వముతో, ఔషధి మొక్కలు మరియు సాత్వికమైన ఆహారముతో పోషింపబడవలెను.
44 సంఘ పెద్దలు ఇద్దరిని లేదా ఎక్కువమందిని పిలిపించవలెను మరియు ప్రార్థన చేసి, నా నామమున వారిపై తమ చేతులుంచవలెను; వారు మరణించిన యెడల నా యందు మరణించెదరు, వారు జీవించిన యెడల నా యందు జీవించెదరు.
45 మరణించిన వారిని కోల్పోయినందుకు, మరి ముఖ్యముగా ఎవరికైతే మహిమకర పునరుత్థానమును గూర్చి నిరీక్షణ లేదో వారి కొరకు మీరు రోదించునంతగా మీరు కలిసియుండి, ప్రేమతో జీవించవలెను.
46 నా యందు మరణించిన వారు మరణమును రుచి చూడరు, ఏలయనగా అది వారికి మధురముగా నుండును;
47 నా యందు మరణించని వారికి శ్రమ, ఏలయనగా వారి మరణము చేదుగా నుండును.
48 స్వస్థత పొందుటకు నా యందు విశ్వాసము కలిగి, మరణదండన విధింపబడనివాడు స్వస్థపరచబడును.
49 చూచుటకు విశ్వాసము కలవాడు చూచును.
50 వినుటకు విశ్వాసము కలవాడు వినును.
51 గెంతుటకు విశ్వాసము గల కుంటివాడు గెంతును.
52 ఈ సంగతులను చేయుటకు విశ్వాసము కలిగియుండనప్పటికీ, నా యందు నమ్మికయుంచువారు నా కుమారులగుటకు శక్తిని కలిగియుందురు; నా నియమములను అతిక్రమించనంతవరకు నీవు వారి దౌర్భల్యములను భరించవలెను.
53 నీ గృహనిర్వాహకత్వపు స్థానములో నీవు నిలిచియుండవలెను.
54 నీ సహోదరుని వస్త్రమును నీవు తీసుకొనరాదు; నీ సహోదరుని నుండి నీవు పొందిన దాని కొరకు నీవు చెల్లించవలెను.
55 నీ సంరక్షణకు చాలినదాని కంటే నీవు ఎక్కువ సంపాదించిన యెడల, నేను చెప్పియుండిన దాని ప్రకారము అన్నిసంగతులు జరుగునట్లు నీవు దానిని నా గిడ్డంగికి ఇయ్యవలెను.
56 నీవు అడుగవలెను, అప్పుడు నేను నియమించిన ప్రకారము నా లేఖనములు ఇవ్వబడును మరియు అవి సురక్షితముగా భద్రపరచబడవలెను;
57 వాటిని గూర్చి నీవు మౌనముగానుండి, వాటిని సంపూర్ణముగా పొందువరకు వాటిని బోధింపక యుండుట యుక్తము.
58 తరువాత వాటిని మనుష్యులందరికి మీరు బోధించవలెనని నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను; ఏలయనగా అవి సమస్త జనములకు, వంశములకు, భాషలకు, ప్రజలకు బోధించబడవలెను.
59 నీవు పొందిన సంగతులను నీవు అంగీకరించవలెను, అవి ఒక ధర్మశాస్త్రముగా, నా సంఘమును పరిపాలించుటకు నా చట్టముగా నా లేఖనములలో నీకివ్వబడియున్నవి;
60 ఈ విషయముల ప్రకారము చేయువాడు రక్షింపబడును మరియు వాటిని చేయక కొనసాగువాడు శిక్షావిధి పొందును.
61 నీవు అడిగినయెడల, మర్మములను, శాంతికరమైన విషయములు—అనగా సంతోషమును తెచ్చువాటిని, నిత్యజీవమును తెచ్చువాటిని—నీవు తెలుసుకొనులాగున బయల్పాటు వెంబడి బయల్పాటును, జ్ఞానము వెంబడి జ్ఞానమును నీవు పొందెదవు.
62 నీవు అడుగవలెను, అప్పుడు నూతన యెరూషలేము ఎక్కడ నిర్మించబడవలెనో అది నా యుక్తకాలమందు నీకు బయలుపరచబడును.
63 నా సేవకులు తూర్పునకు, పశ్చిమమునకు, ఉత్తరమునకు, దక్షిణమునకు పంపబడుదురు.
64 ఇప్పుడు కూడా, భూమిపై జరుగబోవు సంఘటనలు, రహస్యకూడికల కారణముగా తూర్పునకు వెళ్ళువాడు పరివర్తన చెందువారిని పశ్చిమమునకు పారిపొమ్మని బోధించవలెను.
65 వీటన్నిటిని నీవు పాటించవలెను, అప్పుడు నీ ప్రతిఫలము అధికమగును; పరలోకరాజ్య మర్మములు యెరుగుటకు మీకు అనుగ్రహింపబడియున్నది, కానీ లోకమునకైతే వాటిని ఎరుగుటకు అనుగ్రహింపబడలేదు.
66 మీరు పొందిన నియమములను మీరు పాటించి, విశ్వాసముగా ఉండవలెను.
67 ఇచ్చట మరియు నూతన యెరూషలేములో మిమ్ములను స్థిరముగా స్థాపించుటకు సరిపోవు సంఘ నిబంధనలను ఇక మీదట మీరు పొందెదరు.
68 కాబట్టి, ఎవనికైతే జ్ఞానము కొదువగా నున్నదో, అతడు నన్ను అడుగవలెను, వానిని గద్దింపక, వానికి నేను ధారాళముగా దయచేయుదును.
69 మీ హృదయములెత్తుకొని సంతోషించుడి, ఏలయనగా మీకు పరలోకరాజ్యము లేదా మరియొక మాటలో సంఘము యొక్క తాళపుచెవులు ఇవ్వబడియున్నవి. అలాగే జరుగును గాక. ఆమేన్.
70 సభ్యుల వలే యాజకులు, బోధకులు వారి గృహనిర్వాహకత్వములను కలిగియుందురు.
71 అన్ని విషయములలో బిషప్పుకు సహాయపడుటకు సలహాదారులుగా నియమింపబడిన పెద్దలు లేదా ప్రధాన యాజకుల కుటుంబములు, బీదల మేలు కొరకు ముందు చెప్పబడిన ఇతర ఉద్దేశ్యముల కొరకు బిషప్పుకు సమర్పణ చేయబడిన ఆస్తిచేత సంరక్షింపబడవలెను.
72 లేదా వారి సేవలన్నింటి కొరకు వారు తగిన ప్రతిఫలమును గాని, గృహనిర్వాహకత్వమును గాని, శ్రేష్ఠమైనదని తలంచిన దానిని గాని, బిషప్పు మరియు అతని సలహాదారుల చేత నిర్ణయింపబడిన దానిని గాని పొందవలెను.
73 బిషప్పు కూడా అతని సహాయమును లేదా సంఘములో అతని సేవలన్నింటి కొరకు తగిన ప్రతిఫలమును పొందవలెను.
74 ఇదిగో, మీలో జారత్వము వలన తమ సహచరులను విడిచిపెట్టిన వ్యక్తులెవరైనా ఉన్నయెడల, లేదా మరియొక మాటలో, ఇదీ సంగతియని దీనమనస్సుతో వారు మీ యెదుట సాక్ష్యము చెప్పిన యెడల, మీ మధ్యనుండి వారిని మీరు వెళ్ళగొట్టకూడదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను;
75 కానీ ఏ వ్యక్తులైనను వారి సహచరులను వ్యభిచారము నిమిత్తము విడిచిపెట్టెనని మీరు కనుగొనిన యెడల, వారే నిందితులైయుండి, వారి సహచరులు బ్రతికియున్నయెడల, మీ మధ్యనుండి వారు వెళ్ళగొట్టబడవలెను.
76 మరలా, నేను చెప్పునదేమనగా, వారు వివాహము చేసుకొన్నట్లైతే, మీరు పూర్తిగా విచారించి, అట్టివారిని మీరు చేర్చుకొనకయుండునట్లు జాగ్రత్తతో కనిపెట్టుడి;
77 వారు వివాహము చేసుకోనివారైతే, వారి పాపములన్నింటి నిమిత్తము వారు పశ్చాత్తాపపడవలెను లేదా వారిని మీరు చేర్చుకొనకూడదు.
78 మరలా, ఈ క్రీస్తు సంఘమునకు చెందిన ప్రతి వ్యక్తి, సంఘము యొక్క అన్ని ఆజ్ఞలను, నిబంధనలను ఆచరించునట్లు చూచుకొనవలెను.
79 మీలో ఎవరైనను నరహత్య చేసిన యెడల, వారు అప్పగింపబడి, దేశ పౌర చట్టముల ప్రకారము వ్యవహరింపబడవలెను; ఏలయనగా అతనికి క్షమాపణ లేదని జ్ఞాపకముంచుకొనుము; దేశ పౌర చట్టముల ప్రకారము అది నిరూపించబడును.
80 ఏ పురుషుడైనను, స్త్రీయైనను వ్యభిచారము చేసినయెడల, ఇద్దరు లేదా ఎక్కువ మంది పెద్దల యెదుట వారు విచారింపబడవలెను, అతడు లేదా ఆమెపై చేయబడిన ప్రతి ఆరోపణ ఇద్దరు సంఘ సాక్షుల చేత స్థిరపరచబడవలెను, కానీ విరోధి చేత కాదు, అయితే ఇద్దరి కంటే ఎక్కువ సాక్షులున్న యెడల మేలు.
81 కానీ అతని లేదా ఆమె నేరము ఇద్దరు సాక్షుల నోట నిరూపించబడవలెను; పెద్దలు వ్యాజ్యమును సంఘము యెదుట ఉంచవలెను మరియు సంఘము అతనికి లేదా ఆమెకు విరోధముగా తమ చేతులనెత్తవలెను, తద్వారా వారు దేవుని ధర్మశాస్త్రము ప్రకారము వ్యవహరించబడవలెను.
82 సాధ్యమైతే, బిషప్పు కూడా హాజరగుట ఆవశ్యకము.
83 మీ యెదుటకు వచ్చు అన్ని విషయాలలో ఈ విధముగా మీరు చేయవలెను.
84 ఒక పురుషుడైనను, స్త్రీయైనను దోచుకొనిన యెడల, అతడు లేదా ఆమె దేశ పౌరచట్టమునకు అప్పగించబడవలెను.
85 అతడు లేదా ఆమె దొంగిలించిన యెడల, అతడు లేదా ఆమె దేశ పౌరచట్టమునకు అప్పగించబడవలెను.
86 అతడు లేదా ఆమె అబద్ధమాడిన యెడల, అతడు లేదా ఆమె దేశ పౌరచట్టమునకు అప్పగించబడవలెను.
87 అతడు లేదా ఆమె ఏవిధమైన పాపము చేసినను, అతడు లేదా ఆమె ధర్మశాస్త్రమునకు అనగా దేవుడు అనుగ్రహించిన దానికి అప్పగించబడవలెను.
88 నీ సహోదరుడైనను, నీ సహోదరియైనను నీ యెడల తప్పిదము చేసిన యెడల, అతడు లేదా ఆమె ఒంటరిగానున్నప్పుడు, నీవు అతడిని లేదా ఆమెను నీతో తీసుకొనివెళ్ళవలెను; అతడు లేదా ఆమె తప్పిదమును అంగీకరించిన యెడల, నీవు సమాధానపరచబడెదవు.
89 అతడు లేదా ఆమె తప్పిదమును అంగీకరించని యెడల, అతడిని లేదా ఆమెను సంఘమునకు—సభ్యులకు కాదు, కానీ పెద్దలకు అప్పగించవలెను. అది ఒక కూడికలో జరుగవలెను, కానీ లోకము యెదుట కాదు.
90 నీ సహోదరుడు లేదా నీ సహోదరి అనేకుల యెడల తప్పిదము చేసిన యెడల, అతడు లేదా ఆమె అనేకుల యెదుట గద్దింపబడవలెను.
91 ఎవరైనా బాహిరంగముగా తప్పిదము చేసిన యెడల, అతడు లేదా ఆమె సిగ్గుపరచబడునట్లు బహిరంగముగా గద్దింపబడవలెను. అతడు లేదా ఆమె తప్పిదమును అంగీకరించని యెడల, దేవుని ధర్మశాస్త్రమునకు అప్పగించబడవలెను.
92 ఎవరైనా రహస్యముగా తప్పిదము చేసినయెడల, అతడు లేదా ఆమె తాను తప్పిదము చేసిన వారి యొద్ద, దేవుని యొద్ద రహస్యముగా తప్పిదమును అంగీకరించుటకు ఒక అవకాశమును కలిగియుండునట్లు, తద్వారా సంఘము అతని లేదా ఆమెను గూర్చి నిందించి, మాట్లాడకుండునట్లు రహస్యముగా గద్దింపబడవలెను.
93 ఈ విధముగా మీరు సమస్త విషయములలో ప్రవర్తించవలెను.