51వ ప్రకరణము
1831 మే 20న, ఒహైయోలోని థాంప్సన్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఈ సమయములో తూర్పు రాష్ట్రముల నుండి వలస వచ్చుచున్న పరిశుద్ధులు ఒహైయోకు చేరుకొనుట మొదలుపెట్టిరి మరియు వారికి స్థిర నివాసము ఏర్పరచుటకు నిర్దిష్టమైన ఏర్పాట్లు చేయుట ఆవశ్యకమయ్యెను. ఈ బాధ్యత బిషప్పు స్థానమునకు చెందియుండెను గనుక, బిషప్పు ఎడ్వర్డ్ పాట్రిడ్జ్ ఈ విషయముపై సూచనను కోరగా, ప్రవక్త ప్రభువును విచారించెను.
1–8, గృహనిర్వాహకత్వములను, ఆస్థులను నియంత్రించుటకు ఎడ్వర్డ్ పాట్రిడ్జ్ నియమించబడెను; 9–12, పరిశుద్ధులు నిజాయితీగా నడుచుకొని, ఒకే విధముగా పొందవలెను; 13–15, వారు బిషప్పు గిడ్డంగిని కలిగియుండి, ప్రభువు ధర్మశాస్త్రము ప్రకారము ఆస్థులను సక్రమముగా నిర్వహించవలెను; 16–20, తాత్కాలికముగా కూడుకొను స్థలముగా ఒహైయో ఉండవలెను.
1 నన్ను ఆలకించుడని దేవుడైన మీ ప్రభువు సెలవిచ్చుచున్నాడు; నా సేవకుడైన ఎడ్వర్డ్ పాట్రిడ్జ్‌తో నేను మాట్లాడి, అతనికి నిర్దేశములను ఇచ్చెదను, ఏలయనగా ఈ జనులను వ్యవస్థీకరించుటకు అతడు నిర్దేశములు పొందుట ఆవశ్యకమైయున్నది.
2 నా ధర్మశాస్త్రము ప్రకారము వారు వ్యవస్థీకరించబడుట ఆవశ్యకమైయున్నది; అట్లు కానియెడల, వారు కొట్టివేయబడుదురు.
3 కాబట్టి, నా సేవకుడైన ఎడ్వర్డ్ పాట్రిడ్జ్ మరియు అతడు ఎంచుకొనిన వారు, ఎవరియందైతే నేను ఆనందించుచున్నానో వారు ఈ జనులకు వారి భాగములను, ప్రతి మనుష్యునికి అతని కుటుంబమును బట్టి, అతని పరిస్థితులు, అతని అవసరాలు, కోరికలను బట్టి సమానముగా ఇయ్యవలెను.
4 నా సేవకుడైన ఎడ్వర్డ్ పాట్రిడ్జ్, ఒక మనుష్యునికి అతని భాగమును నియమించునప్పుడు, అతని భాగము అతనికి పూచీగా ఉండు ఒక పత్రమును ఇయ్యవలెను, అతడు అపరాధము చేసి, సంఘ నియమములు, నిబంధనలను బట్టి సంఘ స్వరముచేత సంఘమునకు చెందుటకు అతడు అయోగ్యునిగా ఎంచబడు వరకు సంఘములో ఈ హక్కును, ఈ స్వాస్థ్యమును అతని ఆధీనములో ఉంచుకొనును.
5 అతడు అపరాధము చేసి, సంఘమునకు చెందుటకు అయోగ్యునిగా ఎంచబడిన యెడల, నా సంఘ బీదల కొరకు, అవసరతలోనున్న వారి కొరకు బిషప్పునకు ప్రతిష్ఠించిన ఆ భాగము తనదని ఆరోపించుటకు శక్తిని కలిగియుండడు; కాబట్టి, అతడు తన బహుమానమును నిలుపుకొనడు, కానీ అతనికి వ్రాసి ఇచ్చిన ఆ భాగముపైన మాత్రమే అతడు హక్కును కలిగియుండును.
6 ఆ విధముగా దేశ పౌరచట్టముల ప్రకారము అన్ని సంగతులు ఉండునట్లు జాగ్రత్తపడవలెను.
7 ఈ జనులకు చెందినది ఈ జనులకే నియమించబడవలెను.
8 ఈ జనుల దగ్గర మిగిలిన ధనమును—ఈ జనుల అవసరములను బట్టి ఆహారము, వస్త్రములు సమకూర్చుటకై ధనమును స్వీకరించుటకు ఈ జనుల కొరకు ఒక ప్రతినిధి నియమించబడవలెను.
9 ప్రతి మనుష్యుడు నిజాయితీగా వ్యవహరించవలెను, ఈ జనుల మధ్య ఒకే విధముగా ఉండవలెను, ఒకే విధముగా పొందవలెను, తద్వారా నేను మీకాజ్ఞాపించిన విధముగా మీరు ఒకటిగానుందురు.
10 ఈ జనులకు చెందిన దానిని తీసుకొనివెళ్ళి మరియొక సంఘమునకు చెందిన వారికి ఇవ్వనియ్యకుము.
11 కాబట్టి, ఈ సంఘము యొక్క ధనమును మరియొక సంఘము పొందగోరిన యెడల, వారు అంగీకరించు విధముగా తిరిగి వారిని ఈ సంఘమునకు చెల్లించనియ్యుము.
12 ఇది సంఘ స్వరము చేత నియమించబడు బిషప్పు ద్వారా లేదా ప్రతినిధి ద్వారా జరుగవలెను.
13 మరలా, బిషప్పు ఈ సంఘము కొరకు ఒక గిడ్డంగిని ఏర్పాటు చేయవలెను; ఈ జనుల అవసరాలకు మించి ఎక్కువగా ఉన్న ధనము, ఆహారము అన్నియు బిషప్పు ఆధీనములో ఉంచబడవలెను.
14 ఈ కార్యమును చేయుటలో అతడు నిమగ్నమగును గనుక, అతని సొంత అవసరాలకు అతని కుటుంబ అవసరాలకు అతడు దాచుకొనవలెను.
15 ఆ విధముగా నా ధర్మశాస్త్రము ప్రకారము వారంతట వారే వ్యవస్థీకరించుకొను విశేషాధికారమును ఈ జనులకు నేను దయచేయుచున్నాను.
16 ప్రభువైన నేను మరియొక ప్రదేశమును వారికి సమకూర్చి, అక్కడకు వెళ్ళమని ఆజ్ఞాపించు వరకు ఈ ప్రదేశమును కొంతకాలము పాటు వారికి ప్రతిష్ఠించుచున్నాను;
17 ఆ దినమును, ఆ గడియయు వారికి అనుగ్రహించబడలేదు, కాబట్టి ఈ దేశములో అనేక సంవత్సరాలు నివసించునట్లుగా వారిని ప్రవర్తించనియ్యుము మరియు ఇది వారికి మేలుగా మారును.
18 ఇదిగో, ఇతర స్థలములలోను, అన్ని సంఘములలోను నా సేవకుడైన ఎడ్వర్డ్ పాట్రిడ్జ్‌నకు ఇది ఒక మాదిరిగా నుండును.
19 విశ్వాసముగా, నీతిమంతునిగా, తెలివిగల గృహనిర్వాహకునిగా కనుగొనబడిన వాడు తన ప్రభువు యొక్క ఆనందములో ప్రవేశించి, నిత్యజీవమును స్వాస్థ్యముగా పొందును.
20 మీరు ఊహించని గడియలో, త్వరగా వచ్చుచున్న యేసు క్రీస్తును నేనేయని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. అలాగే జరుగును గాక. ఆమేన్.