6వ ప్రకరణము
1829 ఏప్రిల్, పెన్సిల్వేనియాలోని హార్మొనిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలకు ఇవ్వబడిన బయల్పాటు. మోర్మన్ గ్రంథ అనువాదములో లేఖకునిగా ఆలీవర్ కౌడరీ తన పనిని 1829, ఏప్రిల్ 7 న ప్రారంభించెను. మోర్మన్ గ్రంథము యొక్క వృత్తాంతము చెక్కబడిన పలకలను గూర్చి ప్రవక్త సాక్ష్యము సత్యమైనదని ఇదివరకే అతడు దైవిక ప్రత్యక్షతను పొందెను. ప్రవక్త ఊరీము తుమ్మీముల ద్వారా ప్రభువును విచారించి, ఈ ప్రత్యుత్తరమును పొందెను.
1–6, ప్రభువు పొలములో పనిచేయువారు రక్షణ పొందెదరు; 7–13, రక్షణ వరము కన్నా గొప్ప వరము లేదు; 14–27, సత్యమును గూర్చిన సాక్ష్యము ఆత్మ శక్తి వలన కలుగును; 28–37, క్రీస్తు వైపు చూచి, ఎల్లప్పుడు మంచిని చేయుము.
1 ఒక గొప్ప ఆశ్చర్యకార్యము నరుల సంతానము యొద్దకు రాబోవుచున్నది.
2 ఇదిగో, నేను దేవుడను; నా వాక్యమునకు చెవియొగ్గుము, అది సజీవమైనదై బలముగలిగి రెండంచులు గల ఖడ్గముకంటే వాడిగా ఉండి కీళ్ళను, మూలుగును విభజించును; కాబట్టి, నా మాటలకు చెవియొగ్గుము.
3 ఇదిగో, పొలము ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నది; కాబట్టి, ఎవడైతే కోయుటకు ఇష్టపడునో, అతడు తన బలముతో తన కొడవలిని వాడి, దేవుని రాజ్యములో తన ప్రాణమునకు నిత్య రక్షణను దాచిపెట్టుకొనునట్లు దినము గడవక ముందే కోత కోయనిమ్ము.
4 అవును, ఎవడైతే తన కొడవలిని వాడి కోయునో, అట్టివాడు దేవుని చేత పిలువబడెను.
5 కాబట్టి, నీవు నన్ను అడిగిన యెడల నీకు ఇవ్వబడును; నీవు తట్టిన యెడల అది నీకు తెరువబడును.
6 ఇప్పుడు నీవు నన్ను అడిగితివి గనుక, ఇదిగో నేను నీకు చెప్పుచున్నాను, నా ఆజ్ఞలను పాటించుము, సీయోను హేతువును ముందుకు తీసుకువచ్చి స్థాపించుటకు ప్రయత్నించుము;
7 జ్ఞానము కొరకే గాని ఐశ్వర్యము కొరకు వెదకవద్దు, ఇదిగో దేవుని యొక్క మర్మములు నీకు తెలుపబడును, అప్పుడు నీవు ఐశ్వర్యవంతునిగా చేయబడుదువు. నిత్యజీవము గలవాడే ఐశ్వర్యవంతుడు.
8 నీవు నన్ను కోరినట్టే నీకు జరుగునని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను; నీవు కోరిన యెడల, ఈ తరములో అనేకమైన మంచి పనులు చేయుటలో నీవు సాధనమగుదువు.
9 ఈ తరమునకు పశ్చాత్తాపము తప్ప మరి దేనిని గూర్చి చెప్పకుము; నా ఆజ్ఞలను పాటించుము, నా ఆజ్ఞల ప్రకారము నా పనిని ముందుకు తెచ్చుటలో సహాయపడుము, నీవు దీవించబడెదవు.
10 ఇదిగో నీవొక బహుమానమును కలిగియున్నావు, నీకున్న బహుమానమును బట్టి నీవు ధన్యుడవు. ఇది పవిత్రమైనదని, పైనుండి వచ్చెనని జ్ఞాపకముంచుకొనుము—
11 నీవు విచారించిన యెడల, గొప్ప ఆశ్చర్యకరమైన మర్మములను నీవు తెలుసుకొందువు; కాబట్టి నీవు మర్మములను తెలుసుకొని, తద్వారా అనేకులను సత్యమును గూర్చిన జ్ఞానములోనికి తెచ్చుటకు, అనగా వారి మార్గములు తప్పు అని వారిని ఒప్పించుటకు నీకున్న బహుమానమును నీవు సాధన చేయవలెను.
12 నీ విశ్వాసమునకు చెందిన వారికి తప్ప మరెవరికి నీ బహుమానమును తెలుపకుము. పవిత్రమైన విషయములను అపహాస్యము చేయకుము.
13 నీవు మంచిని చేసినయెడల, అంతము వరకు విశ్వాసముగా యుండిన యెడల, దేవుని రాజ్యములో నీవు రక్షించబడుదువు, అది దేవుని బహుమానములన్నింటిలోకెల్లా గొప్పది; ఏలయనగా రక్షణ వరము కంటే గొప్ప వరమేదియు లేదు.
14 నీవు చేసిన వాటి నిమిత్తము నీవు ధన్యుడవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను; ఏలయనగా నీవు నా యొద్ద విచారించితివి, ఇదిగో, నీవు నా యొద్ద విచారించినప్పుడెల్లా నీవు నా ఆత్మ ద్వారా ఉపదేశమును పొందితివి. అది ఆవిధముగా జరిగియుండని యెడల, ఈ సమయమందు నీవున్న ప్రదేశమునకు నీవు వచ్చియుండేవాడవు కావు.
15 ఇదిగో, నీవు నా యొద్ద విచారించితివని, నేను నీ మనస్సును వెలుగుతో నింపితినని నీవెరుగుదువు; నీవు సత్యాత్మతో వెలిగించబడితివని నీవు తెలుసుకొనులాగున ఈ సంగతులను నేనిప్పుడు నీతో చెప్పుచున్నాను;
16 దేవుడు తప్ప మరెవరును నీ హృదయ తలంపులను, ఆలోచనలను యెరుగరని నీవు తెలుసుకొనునట్లు నేను నీతో చెప్పుచున్నాను.
17 నీకొక సాక్ష్యముగా నుండునట్లు ఈ సంగతులను నేను నీకు చెప్పుచున్నాను—అదేమనగా, నీవు వ్రాయుచున్న మాటలు లేదా గ్రంథము సత్యమైనవి.
18 కాబట్టి శ్రద్ధ కలిగియుండుము; వాక్యము నిమిత్తము అతడు ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నను, నా సేవకుడైన జోసెఫ్ ప్రక్కన నమ్మకముగా నిలువుము.
19 అతని తప్పిదములలో అతడిని గద్దించుము, అతని నుండి గద్దింపును స్వీకరించుము. ఓర్పుతో, గంభీరముగా, నిగ్రహముగానుండుము; సహనము, విశ్వాసము, నిరీక్షణ, దాతృత్వము కలిగియుండుము.
20 ఇదిగో, నీ పేరు ఆలీవర్, నీ కోరికలను బట్టి నేను నీతో మాట్లాడితిని; కాబట్టి ఈ మాటలను నీ హృదయమందు భద్రపరచుకొనుము. దేవుని ఆజ్ఞలు పాటించుటలో శ్రద్ధకలిగి, విశ్వాసముగా నుండుము మరియు నా ప్రేమ యొక్క బాహువులలో నేను నిన్ను చుట్టెదను.
21 ఇదిగో, దేవుని కుమారుడైన యేసు క్రీస్తును నేనే. నా స్వజనుల యొద్దకు వచ్చినది నేనే, నా స్వజనులు నన్ను చేర్చుకొనలేదు. చీకటియందు ప్రకాశించు వెలుగును నేనే, చీకటి దానిని గ్రహింపకుండెను.
22 మరింత సాక్ష్యమును నీవు కోరినయెడల, ఈ సంగతుల సత్యమును గూర్చి నీవు తెలుసుకొనుటకు నీ హృదయమందు నీవు నాతో మొరపెట్టుకొనియున్న ఆ రాత్రిని జ్ఞాపకము చేసుకొనమని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను.
23 ఈ విషయమును గూర్చి నీ మనస్సుకు నేను శాంతిని కలుగజేయలేదా? దేవుని నుండి తప్ప మరే గొప్ప సాక్ష్యమును నీవు కలిగియుండగలవు?
24 ఇదిగో, నీవొక సాక్ష్యమును పొందితివి; ఏలయనగా ఏ మనుష్యుడు యెరుగని సంగతులను నేను నీకు చెప్పినయెడల, నీవొక సాక్ష్యమును పొందియుండవా?
25 ఇదిగో, నీవు నన్ను కోరిన యెడల, నా సేవకుడైన జోసెఫ్ వలే అనువాదము చేయుటకు నేను నీకొక బహుమానమిచ్చెదను.
26 జనుల దుష్టత్వము వలన మరుగుపరచబడి, నా సువార్తను అధికముగా కలిగియున్న గ్రంథములు కలవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను;
27 నీకు మంచి కోరికలు—పరలోకమందు నీ కొరకు నిధులను దాచుకొనవలెనను కోరిక—ఉన్నయెడల, పాపము వలన మరుగుపరచబడిన నా లేఖన భాగములను నీ బహుమానముతో వెలుగులోనికి తెచ్చుటలో సహాయపడవలెనని నేను నిన్నాజ్ఞాపించుచున్నాను.
28 ఇదిగో, నేను నీకు, నా సేవకుడైన జోసఫ్‌కు కూడా ఈ బహుమానము యొక్క తాళపుచెవులు ఇచ్చుచున్నాను; అది ఈ పరిచర్యను వెలుగులోనికి తెచ్చును; ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను.
29 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, వారు నా మాటలను, నా సువార్త యొక్క ఈ భాగమును, పరిచర్యను తిరస్కరించిన యెడల మీరు ధన్యులు, ఏలయనగా వారు నాకు చేసిన దానికంటే ఎక్కువ మీకు చేయలేరు.
30 అయినను నాకు చేసిన విధముగా వారు మీకు చేసిన యెడల, మీరు ధన్యులు, ఏలయనగా మీరు మహిమయందు నాతో జీవించెదరు.
31 కానీ, అనుగ్రహించబోవు సాక్ష్యము ద్వారా స్థిరపరచబడు నా మాటలను వారు తిరస్కరించని యెడల వారు ధన్యులు, మీ శ్రమల యొక్క ఫలితములయందు మీకు అధిక సంతోషము కలుగును.
32 ఒక విషయమును గూర్చి ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని నా శిష్యులకు చెప్పిన విధముగానే నేను మీ మధ్యన యున్నానని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
33 నా కుమారులారా, మంచిని చేయుటకు భయపడకుము, ఏలయనగా మీరేమి విత్తుదురో, దానినే మీరు కోయుదురు; కాబట్టి, మీరు మంచిని విత్తినయెడల ప్రతిఫలముగా మీరు మంచినే కోయుదురు.
34 కాబట్టి, చిన్నమందా భయపడకుము; మంచిని చేయుము; భూమియు, నరకమును మీకు వ్యతిరేకముగా కలిసినను, మీరు నా బండమీద కట్టబడిన యెడల, అవి మిమ్ములను జయించలేవు.
35 ఇదిగో, నేను మిమ్ములను అపరాధులుగా యెంచను; మీరు వెళ్ళి ఇక పాపము చేయకుడి; నేను మీకాజ్ఞాపించిన పనిని గంభీరముగా చేయుడి.
36 ప్రతి ఆలోచనలో నా వైపు చూడుడి; సందేహించవద్దు, భయపడవద్దు.
37 నా ప్రక్కను పొడిచిన గాయములను, నా కాళ్ళు, చేతులలోనున్న మేకుల గుర్తులను చూడుడి; విశ్వాసముగా నుండుడి, నా ఆజ్ఞలను పాటించుడి, మీరు పరలోకరాజ్యమును స్వాస్థ్యముగా పొందెదరు. ఆమేన్.