లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 77


77వ ప్రకరణము

సుమారు 1832 మార్చి లో హైరం, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ కివ్వబడిన బయల్పాటు. “లేఖనముల అనువాదమునకు సంబంధించి, పరిశుద్ధుడైన యోహాను యొక్క ప్రకటన కొరకు ఈ వివరణను నేను పొందితిని” అని జోసెఫ్ స్మిత్ చరిత్ర వివరించుచున్నది.

1–4, జంతువులకు ఆత్మలు కలవు, అవి అమర్త్యభూమి మీద నిత్యానందముతో జీవించును; 5–7, ఈ భూమికి 7,000 సంవత్సరముల భౌతిక ఉనికి కలదు; 8–10, అనేక దేవదూతలు సువార్తను పునఃస్థాపించి, భూమి మీద పరిచర్య చేయును; 11, 1,44,000 మంది ముద్రవేయబడుదురు, 12–14, క్రీస్తు ఏడువేల సంవత్సరముల ఆరంభములో వచ్చును; 15, యూదుల దేశము కొరకు ఇద్దరు ప్రవక్తలు సిద్ధపరచబడుదురు.

1 ప్ర. ప్రకటనలు 4వ అధ్యాయము, 6వ వచనములో యోహానుచే చెప్పబడిన గాజువంటి సముద్రము ఏమిటి? జ. అది పరిశుద్ధపరచబడిన, అమర్త్యమైన, నిత్య స్థితిలో ఉన్న భూమి.

2 ప్ర. అదే వచనములో చెప్పబడిన నాలుగు జీవులను గూర్చి మనమేమి అర్థము చేసుకొనవలెను? జ. అవి పరలోకము, దేవుని పరదైసు, మనుష్యుని యొక్క, జీవుల యొక్క, ప్రాకెడువాటి యొక్క, ఆకాశ పక్షుల యొక్క సంతోషమును వివరించుటకు ప్రకటనకారుడైన యోహాను చేత ఉపయోగించబడిన ఉపమానములు; ఆత్మీయమైనది భౌతికమైన దానిని పోలియున్నది; భౌతికమైనది ఆత్మీయమైన దానిని పోలియున్నది; మనుష్యుని ఆత్మ అతని శరీరమును పోలియున్నట్లే, జీవుల మరియు దేవుడు సృజించిన ప్రతి ఇతర జీవి యొక్క ఆత్మ అదేవిధముగా ఉన్నది.

3 ప్ర. ఆ నాలుగు జీవులు విడివిడి జీవులకు పరిమితమా లేదా అవి తరగతులకు లేదా క్రమములకు ప్రాతినిధ్యం వహించునా? జ. అవి నాలుగు విడివిడి జీవులకు పరిమితము, వాటి నియమిత సృష్టి క్రమము లేదా వర్గములో, వాటి నిత్య సంతోషమును అనుభవించుటలో జీవుల తరగతుల యొక్క మహిమను తెలుపుటకు అవి యోహానుకు చూపబడినవి.

4 ప్ర. ఆ జీవులు కలిగియున్న కన్నులు, రెక్కలను బట్టి మనమేమి గ్రహించవలెను? జ. వాటి కన్నులు వెలుగును, జ్ఞానమును తెలియజేయును, అనగా అవి జ్ఞానముతో నిండియున్నవి; వాటి రెక్కలు కదులుటకు, పనిచేయుటకు మొదలగు వాటికి ఉపయోగపడు శక్తిని తెలియజేయును.

5 ప్ర. యోహానుచేత చెప్పబడిన ఇరువది నాలుగు మంది పెద్దలను గూర్చి మనమేమి గ్రహించవలెను? జ. మనము గ్రహించవలసినదేమనగా, యోహాను చూసిన ఈ పెద్దలు, పరిచర్య పనిలో నమ్మకముగానుండి మరణించినవారు; వారు ఏడు సంఘములకు చెందినవారైయుండి, తరువాత దేవుని పరదైసులో నున్నవారు.

6 ప్ర. యోహాను చూచిన వెనుక ఏడు ముద్రలు గట్టిగా వేసియున్న గ్రంథమును గూర్చి మనమేమి గ్రహించవలెను? జ. మనము గ్రహించవలసినదేమనగా, అది దేవుని కార్యములు, మర్మములు మరియు బయలుపరచబడిన చిత్తమును కలిగియున్నది; ఏడు వేల సంవత్సరముల కొనసాగింపు లేదా దాని భౌతిక ఉనికి సమయములో ఈ భూమిని గూర్చి ఆయన నిర్వహణ యొక్క దాచబడిన సంగతులను కలిగియున్నది.

7 ప్ర. అది ముద్రించబడిన ఏడు ముద్రలను గూర్చి మనమేమి గ్రహించవలెను? జ. మనము గ్రహించవలసినదేమనగా, మొదటి ముద్ర మొదటి వెయ్యి సంవత్సరముల సంగతులను, రెండవ ముద్ర రెండవ వెయ్యి సంవత్సరముల సంగతులను కలిగియున్నవి, ఆవిధముగా ఏడు వరకు ఉన్నవి.

8 ప్ర. ప్రకటన 7వ అధ్యాయము 1వ వచనములో చెప్పబడిన నలుగురు దేవదూతలను గూర్చి మనమేమి గ్రహించవలెను? జ. మనము గ్రహించవలసినదేమనగా, వారు దేవుని నుండి పంపబడిన నలుగురు దేవదూతలు; ప్రాణమును రక్షించుటకు, నాశనము చేయుటకు వారికి భూమి యొక్క నలుదిక్కులపైన శక్తి ఇవ్వబడినది; సమస్త జనములకు, వంశములకు, భాషలకు, జనులకు అప్పగించుటకు నిత్య సువార్తను కలిగియున్న వారు; పరలోకములను మూసివేయుటకు, నిత్యజీవము కొరకు ముద్రించుటకు, లేదా చీకటిగల ప్రదేశమునకు త్రోసివేయుటకు అధికారము కలవారు వీరే.

9 ప్ర. ప్రకటన 7వ అధ్యాయము, 2వ వచనములో తూర్పు దిక్కునుండి ఆరోహణమగుచున్న దేవదూతను గూర్చి మనమేమి గ్రహించవలెను? జ. మనము గ్రహించవలసినదేమనగా, తూర్పు దిక్కునుండి ఆరోహణమగుచున్న దేవదూతకు ఇశ్రాయేలు పన్నెండు గోత్రములపైన సజీవుడగు దేవుని ముద్ర ఇవ్వబడెను; కాబట్టి, నిత్య సువార్తను కలిగియున్న నలుగురు దూతలతో ఈ దూత—మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను, సముద్రముకైనను, చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే ఇశ్రాయేలు గోత్రమును పోగుచేయుటకు, అన్ని విషయములను పునఃస్థాపించుటకు రాబోవు ఏలీయా ఇతడే.

10 ప్ర. ఈ అధ్యాయములో చెప్పబడిన విషయములు ఏ సమయంలో నెరవేర్చబడును? జ. ఆరవ వెయ్యి సంవత్సరములలో లేదా ఆరవ ముద్ర విప్పబడినప్పుడు అవి నెరవేర్చబడవలసియున్నవి.

11 ప్ర. ప్రతి గోత్రమునుండి పన్నెండు వేలు చొప్పున ఒక లక్ష నలువది నాలుగు వేలమంది ముద్రవేయబడుటను గూర్చి మనమేమి గ్రహించవలెను? జ. మనము గ్రహించవలసినదేమనగా, ముద్రించబడినవారు ప్రధాన యాజకులు, నిత్య సువార్తను నిర్వహించుటకు దేవుని పరిశుద్ధ క్రమమునకు నియమించబడినవారు; ఏలయనగా సమస్త జనములు, వంశములు, భాషలు, జనుల నుండి దేవదూత వలన నియమించబడిన వారు, వారికి జ్యేష్ఠుల సంఘమునకు వచ్చుటకు మనస్సు కలిగిన వారందరిని తీసుకొని వచ్చుటకు భూలోక రాజ్యములపైన అధికారము ఇవ్వబడెను.

12 ప్ర. ప్రకటన 8వ అధ్యాయములో చెప్పబడిన బూరలు మ్రోగుటను గూర్చి మనమేమి గ్రహించవలెను? జ. మనము గ్రహించవలసినదేమనగా, దేవుడు ఆరు దినములలో లోకమును సృష్టించి, ఏడవ దినమున తన పనిని ముగించి దానిని పరిశుద్ధపరచెను, నేల మంటితో నరుని రూపించెను గనుక, ఆవిధముగానే ఏడవ వెయ్యి సంవత్సరముల ఆరంభములో దేవుడు భూమిని పరిశుద్ధపరచును, ఆయన అన్ని సంగతుల సమాప్తి కొరకు అన్ని సంగతులను బంధించునప్పుడు మనుష్య రక్షణను పూర్తిచేసి, ఆయన అధికారము క్రింద ఉంచని సంగతులు తప్ప అన్నింటికి తీర్పుతీర్చును, అన్నింటిని విమోచించును; యేడుగురు దూతలు బూరలను ఊదుట అనగా ఏడవ వెయ్యి సంవత్సరముల ఆరంభములో ఆయన కార్యమును సిద్ధపరచుట మరియు ముగించుట—ఆయన రాకడ సమయమునకు ముందు మార్గమును సిద్ధపరచుట.

13 ప్ర. ప్రకటన 9వ అధ్యాయములో వ్రాయబడిన సంగతులు ఎప్పుడు నెరవేర్చబడవలసియున్నవి? జ. క్రీస్తు రాకడకు ముందు ఏడవ ముద్ర తెరువబడిన తరువాత అవి నెరవేర్చబడవలసియున్నవి.

14 ప్ర. ప్రకటన 10వ అధ్యాయములో చెప్పబడిన విధముగా యోహాను చేత తినివేయబడిన ఆ చిన్న పుస్తకమును గూర్చి మనమేమి గ్రహించవలెను? జ. మనము గ్రహించవలసినదేమనగా, ఇశ్రాయేలు గోత్రములను పోగుచేయుటకు ఆయన కొరకు అది ఒక పరిచర్య, ఒక విధి; ఇదిగో, అతడు వచ్చి, వ్రాయబడినట్లుగా అన్ని సంగతులను పునఃస్థాపించవలసిన ఏలీయా ఇతడే.

15 ప్ర. ప్రకటనలు, పదకొండవ అధ్యాయములో ఇద్దరు సాక్ష్యులను గూర్చి ఏమి అర్థము చేసుకొనవలెను? జ. జనులు కూడివచ్చి, వారి పితరుల దేశములో యెరూషలేము పట్టణమును నిర్మించిన తరువాత వారికి ప్రవచించుటకు అంత్య దినములలో, పునఃస్థాపన సమయములో యూదుల దేశము కొరకు సిద్ధపరచబడివలసిన ఇద్దరు ప్రవక్తలే వారు.

ముద్రించు