82వ ప్రకరణము
1832, ఏప్రిల్ 26న ఇండిపెండెన్స్, జాక్సన్ కౌంటీ, మిస్సోరిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ కివ్వబడిన బయల్పాటు. సందర్భమేమనగా, సంఘము యొక్క ప్రధాన యాజకులు మరియు పెద్దల సలహాసభ. ఆ సలహాసభలో జోసెఫ్ స్మిత్ ప్రధాన యాజకత్వము యొక్క అధ్యక్షునిగా సమ్మతించబడెను, అంతకుముందు 1832, జనవరి 25న ఆమెర్స్ట్, ఒహైయోలో ప్రధాన యాజకులు, పెద్దలు మరియు సభ్యుల సమావేశములో ఆయన ఆ స్థానమునకు నియమించబడెను (75వ ప్రకరణ శీర్షిక చూడుము). సంఘ వాణిజ్యము మరియు ప్రచురణ ప్రయత్నాలను పరిపాలించుటకు ఐక్య సంస్థ అని పిలువబడిన ఒక సంస్థను (జోసెఫ్ స్మిత్ నిర్దేశకత్వములో “సంస్థ” అను పదము “క్రమము” అనే పదముతో భర్తీ చేయబడినది) నెలకొల్పుటకు ఇంతకు ముందు బయల్పాటులో (78వ ప్రకరణము) ఇవ్వబడిన సూచనలను ఈ బయల్పాటు పునరుద్ఘాటించును.
1–4, ఎక్కడ ఎక్కువగా ఇయ్యబడెనో, అక్కడ ఎక్కువగా కోరబడును; 5–7, లోకములో అంధకారము రాజ్యమేలును; 8–13, ఆయన సెలవిచ్చునది మనము చేసిన యెడల ప్రభువు బద్ధుడైయుండును; 14–18, సౌందర్యమందును, పరిశుద్ధతయందును సీయోను వర్థిల్లవలెను; 19–24, ప్రతి మనుష్యుడు తన పొరుగువాని ఆసక్తిని వెదకవలెను.
1 నా సేవకులైన మీతో నేను నిశ్చయముగా చెప్పునదేమనగా, మీరు ఒకరి అపరాధములను ఒకరు క్షమించుకొనిన యెడల ప్రభువైన నేను మిమ్ములను క్షమించెదను.
2 అయినప్పటికీ, అత్యధికముగా పాపము చేసిన వారు మీ మధ్య ఉన్నారు; అవును, మీరందరు పాపము చేసియున్నారు; కానీ నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, పాపము నుండి తొలగి, ఇకనుండి జాగ్రత్తగానుండుడి, లేనియెడల మీ శిరస్సులపైకి కఠినమైన తీర్పులు వచ్చును.
3 ఎక్కువగా ఇయ్యబడినవాని యొద్దనుండి ఎక్కువగా కోరబడును; గొప్ప వెలుగుకు విరోధముగా పాపము చేసినవాడు, అధికముగా శిక్షపొందును.
4 బయల్పాటుల కొరకు మీరు నా నామమున ప్రార్థించిరి, గనుక నేను వాటిని మీకిచ్చెదను; నేను మీకిచ్చు నా మాటలను మీరు పాటించని యెడల, మీరు అతిక్రమము చేయువారగుదురు; న్యాయమును, తీర్పును శిక్షగా నా ధర్మశాస్త్రముతో జతచేయబడియున్నవి.
5 కాబట్టి, నేను ఒకనితో చెప్పునది, అందరితో చెప్పుచున్నాను; విరోధి తన ప్రభావమును వ్యాపింపజేయుచున్నాడు, అంధకారము రాజ్యమేలుచున్నది గనుక మెలకువగానుండుడి.
6 భూలోక నివాసులకు విరోధముగా దేవుని కోపము రగులుచున్నది; అందరు త్రోవ తప్పియున్నారు, మేలు చేయువాడు ఒక్కడైననూ లేడు.
7 ఇప్పుడు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ప్రభువైన నేను ఏ పాపమును మీపై మోపను; మీరు వెళ్ళి ఇక పాపము చేయకుడి; కానీ పాపము చేయువానిపై గతములో చేసిన పాపములు కూడా తిరిగివచ్చునని దేవుడైన మీ ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
8 మరలా నేను మీతో చెప్పుచున్నాను, మిమ్ములను గూర్చి నా చిత్తమును మీరు గ్రహించవలెనని ఒక క్రొత్త ఆజ్ఞను మీకిచ్చుచున్నాను;
9 లేదా మరొక మాటలో, నా యెదుట మీరు ఏవిధముగా నడుచుకొనవలెననే నిర్దేశములను మీకిచ్చుచున్నాను, తద్వారా అది మీ రక్షణకు కారణమగును.
10 ప్రభువైన నేను సెలవిచ్చునది మీరు చేసిన యెడల, నేను బద్ధుడనైయుందును; కానీ నేను సెలవిచ్చునది మీరు చేయని యెడల మీకు ఏ వాగ్దానము ఉండదు.
11 కాబట్టి, నా సేవకులైన ఎడ్వర్డ్ పాట్రిడ్జ్, న్యూయెల్ కె. విట్నీ, ఎ. సిడ్నీ గిల్బర్ట్, సిడ్నీ రిగ్డన్, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్, జాన్ విట్మర్, ఆలీవర్ కౌడరీ, డబ్ల్యు. డబ్ల్యు. ఫెల్ఫ్స్, మార్టిన్ హారిస్ అనువారు అతిక్రమము వలన మీరజాలని ఒక బంధముతోను, నిబంధనతోను బద్ధులైయుండుట యుక్తమని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, లేనియెడల మీ యొక్క అనేక గృహనిర్వాహకత్వములలో తీర్పులు వెంటనే కలుగును—
12 బీదల కార్యకలాపములను, సీయోను ప్రదేశములో మరియు కర్ట్‌లాండ్ ప్రాంతములో బిషప్రిక్కుకు సంబంధించిన అన్ని సంగతులను నిర్వహించుటకు;
13 మహోన్నతుని పరిశుద్ధుల ప్రయోజనము కొరకు, సీయోనుకు ఒక స్టేకు వలే నా యుక్తకాలమందు కర్ట్‌లాండ్ ప్రదేశమును నేను ప్రతిష్ఠించితిని.
14 ఏలయనగా సౌందర్యమందును, పరిశుద్ధతయందును సీయోను వర్థిల్లవలెను; ఆమె గుడారపు స్థలములు విశాలపరచబడవలెను; ఆమె స్టేకులు బలపరచబడవలెను; సీయోను లేచి, తన సుందర వస్త్రములను ధరించుకొనవలెనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
15 కాబట్టి, ఈ నిబంధన ద్వారా మిమ్మల్ని మీరు బద్ధులుగా చేసుకొనునట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చుచున్నాను, అది ప్రభువు నియమముల ప్రకారము జరుగవలెను.
16 ఇదిగో, మీ మేలు కొరకు దీనియందు మరియు నా యందు జ్ఞానము కలదు.
17 మీ గృహనిర్వాహకత్వపు వ్యవహారములను నిర్వహించుటలో ప్రయోజనము కలుగుట కొరకు మీరు సమానముగానుండవలెను లేదా మరొక మాటలో, ఆస్థులపై మీరు సమాన హక్కులను కలిగియుండవలెను, అతని కోరికలు న్యాయమైనవిగా ఉండిన యెడల ప్రతి మనుష్యుడు తన కోరికలను, తన అవసరతలను బట్టి కలిగియుండవలెను—
18 ఇదంతయు సజీవుడగు దేవుని సంఘ ప్రయోజనము కొరకు, ప్రతి మనుష్యుడు తన ప్రతిభను వృద్ధిచేసికొని, ప్రతి మనుష్యుడు ఇతర ప్రతిభలను ఆర్జించుటకు, నూరంతలుగా ప్రభువు గిడ్డంగిలో వేయుటకు, సంఘమంతటి యొక్క ఉమ్మడి ఆస్థియగుటకు—
19 ప్రతి మనుష్యుడు తన పొరుగు వాని ఆసక్తిని వెదకుటకు, దేవుని మహిమ కొరకు ఏకదృష్టితో అన్ని సంగతులు చేయవలెను.
20 మీరు పాపము చేయకుండిన యెడల, ఈ క్రమము మీకును మీ తరువాత వచ్చువారికిని నిత్య క్రమముగానుండుటకు నేను నియమించితిని.
21 ఈ నిబంధనకు విరోధముగా పాపము చేసి, దానికి విరోధముగా తన హృదయమును కఠినపరచుకొను ఆత్మపట్ల నా సంఘపు చట్టముల ప్రకారము వ్యవహరించబడును, విమోచన దినము వరకు అది సాతాను యొక్క దెబ్బలకు అప్పగించబడును.
22 ఇప్పుడు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఇది జ్ఞానమైయున్నది, స్నేహితులను సంపాదించుకొనుటకు ఈ లోకపు ఐశ్వర్యములను ఉపయోగించుడి, వారు మిమ్ములను నాశనము చేయరు.
23 తీర్పును నాకు విడిచిపెట్టుము, ఏలయనగా అది నాది, నేను తిరిగి చెల్లించెదను. శాంతి మీకు తోడైయుండును; నా దీవెనలు మీ వెంటవచ్చును.
24 ఏలయనగా, మీ విశ్వాసమందు నిలకడగానున్న యెడల, ఇప్పటికీ మరియు నిరంతరము పరలోకరాజ్యము మీదైయుండును. అలాగే జరుగును గాక. ఆమేన్.