9వ ప్రకరణము
1829 ఏప్రిల్, పెన్సిల్వేనియాలోని హార్మొనిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఆలీవర్ కౌడరీకి ఇవ్వబడిన బయల్పాటు. సహనముగా ఉండమని ఆలీవర్ బోధించబడెను, వ్రాయుటలో ఆనందించమని ఒప్పించబడెను, ఏలయనగా అనువదించుటకు ప్రయత్నించుట కంటే అనువాదకుడు చదువగా వ్రాయుటకిది సమయము.
1–6, ఇతర ప్రాచీన గ్రంథములు ఇంకా అనువదించబడవలసియున్నవి; 7–14, అధ్యయనము, ఆత్మీయ నిర్థారణ ద్వారా మోర్మన్ గ్రంథము అనువదించబడెను.
1 ఇదిగో, నా కుమారుడా, నీవు నా నుండి కోరిన విధముగా నీవు అనువదించలేదు, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. కొరకు మరలా వ్రాయుట మొదలుపెట్టితివి గనుక, అతనికి నేనప్పగించిన ఈ గ్రంథమును పూర్తి చేయు వరకు దానిని నీవు కొనసాగించవలెనని నేను నీకు సెలవిచ్చుచున్నాను.
2 తరువాత ఇదిగో, నేను ఇతర గ్రంథములను కలిగియున్నాను, వాటిని అనువదించుటలో నీవు సహాయపడులాగున నేను నీకు శక్తినిచ్చెదను.
3 నా కుమారుడా, సహనముగానుండుము, ఏలయనగా ఇది నా యందు జ్ఞానమైయున్నది, ఈ సమయమందు నీవు అనువదించుట యుక్తము కాదు.
4 ఇదిగో, నీవు చేయుటకు పిలువబడిన పని ఏదనగా నా సేవకుడైన జోసెఫ్ కొరకు వ్రాయుటయే.
5 ఇదిగో, నీవు మొదలుపెట్టిన విధముగా కొనసాగలేదు గనుక, నీవు అనువదించుట మొదలుపెట్టినప్పుడు, నీ నుండి ఈ విశేషాధికారమును నేను తీసివేసితిని.
6 నా కుమారుడా సణుగకుము, ఏలయనగా నేను నీతో ఈ విధముగా వ్యవహరించుట నా యందు వివేకమైయున్నది.
7 ఇదిగో, నీవు అర్థము చేసుకొనలేదు; నన్నడుగుట తప్ప మరే ఆలోచన చేయకుండానే దానిని నేను నీకు ఇచ్చెదనని నీవనుకొంటివి.
8 కానీ, ఇదిగో నేను నీకు చెప్పునదేమనగా, నీ మదిలో దానిని నీవు అధ్యయనము చేయవలెను; తరువాత అది సరియైనదా అని నీవు నన్నడగవలెను, అది సరియైనదైతే నీ ఛాతిలో దహింపబడునట్లు నేను చేయుదును; కాబట్టి, అది సరియైనదని నీవు భావించెదవు.
9 కానీ, అది సరియైనది కానియెడల నీకటువంటి భావనలు ఉండవు, కానీ నీవు స్తబ్ధ తలంపు కలిగియుందువు, అది తప్పైనదానిని మరిచిపోయేలా చేయును; కాబట్టి, నా నుండి ఇవ్వబడితే తప్ప పరిశుద్ధమైన దానిని నీవు వ్రాయలేవు.
10 ఇప్పుడు, దీనిని నీవు తెలుసుకొనియుండిన యెడల నీవు అనువదించగలిగియుండేవాడివి; అయినప్పటికీ, నీవిప్పుడు అనువదించుట యుక్తము కాదు.
11 ఇదిగో, నీవు ప్రారంభించినప్పుడు అది సరియైనదే; కానీ నీవు భయపడితివి, సమయము గడిచిపోయెను, ఇప్పుడది సరికాదు;
12 ఏలయనగా, నేను నా సేవకుడైన జోసఫ్‌కు పని పూర్తిచేయుటకు తగినంత బలమునిచ్చితినని నీవు చూడలేదా? మీ ఇరువురిలో ఎవ్వరిని నేను నిందించలేదు.
13 నేను నీకాజ్ఞాపించిన దానిని చేయుము, నీవు వర్థిల్లెదవు. శోధనకు లొంగక, విశ్వాసముగానుండుము.
14 నేను పిలిచిన పనిలో నిలకడగానుండుము, నీ తలవెంట్రుకలలో ఒక్కటి కూడా నశించదు మరియు అంత్యదినమున నీవు పైకి లేపబడెదవు. ఆమేన్.