లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 7


7వ ప్రకరణము

1829 ఏప్రిల్, పెన్సిల్వేనియాలోని హార్మొనిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలు, ప్రియ శిష్యుడైన యోహాను శరీరమందు నిలిచియుండెనా లేదా మరణించెనా అని ఊరీము తుమ్మీము ద్వారా విచారించినప్పుడు వారికివ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటు యోహాను చేత జంతుచర్మముపై వ్రాయబడి, అతనిచేత దాచబడిన గ్రంథము యొక్క అనువాద వృత్తాంతము.

1–3, ప్రభువు వచ్చు వరకు ప్రియమైన యోహాను జీవించును; 4–8, పేతురు, యాకోబు, యోహానులు సువార్త తాళపుచెవులను కలిగియుందురు.

1 ప్రభువు నాతో చెప్పెను: నా ప్రియమైన యోహాను, నీవేమి కోరుచున్నావు? నీవు కోరుచున్న దానిని నీవు అడిగిన యెడల నీకది అనుగ్రహించబడును.

2 నేనాయనతో చెప్పితిని: ప్రభువా, నేను జీవించియుండి, ఆత్మలను నీ యొద్దకు తెచ్చునట్లు మరణమును జయించు శక్తిని నాకు ప్రసాదించుము.

3 ప్రభువు నాతో చెప్పెను: నీవు దీనిని కోరితివి గనుక నేను నా మహిమతో వచ్చు వరకు నీవు నిలిచియుండి, జనములు, వంశములు, భాషలు, ప్రజల యెదుట ప్రవచించెదవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

4 ఈ కారణము చేతనే ప్రభువు పేతురుతో చెప్పెను: నేను వచ్చునంత వరకు అతడు నిలిచియుండుట నాకిష్టమైతే, నీకేమి? ఏలయనగా అతడు నా యొద్దకు ఆత్మలను తెచ్చుటకు నన్ను కోరెను, కానీ నీవైతే నా రాజ్యములో నా యొద్దకు వేగముగా వచ్చుటకు కోరితివి.

5 పేతురు, ఇది మంచి కోరికయని నేను నీతో చెప్పుచున్నాను; కానీ నా ప్రియ శిష్యుడు తాను మరిన్నికార్యములు లేదా అతడు ఇంతకుముందు చేసిన దానికంటే ఇంకను గొప్పకార్యమును జనుల మధ్య చేయుటకు కోరెను.

6 అవును, అతడు అతిగొప్ప కార్యమును చేపట్టెను; కాబట్టి నేనతనిని అగ్ని జ్వాలవలే, పరిచర్య చేయు దూతవలే చేసెదను; భూమిపై నివసించుచు, రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి అతడు పరిచర్య చేయును.

7 అతనికి, నీ సహోదరుడైన యాకోబుకు పరిచర్య చేయులాగున నేను నిన్ను చేసెదను; నేను వచ్చు వరకు మీ ముగ్గురికి నేను ఈ శక్తిని, ఈ పరిచర్య యొక్క తాళపుచెవులను ఇచ్చెదను.

8 మీరివురు మీ కోరికలను బట్టి పొందియున్నారు, ఏలయనగా మీరివురు మీరు కోరిన వాటియందు ఆనందించెదరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

ముద్రించు