లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 75


75వ ప్రకరణము

1832, జనవరి 25న ఆమెర్స్ట్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఈ ప్రకరణము రెండు వేర్వేరు బయల్పాటులను కలిగియున్నది (మొదటిది 1 నుండి 22 వచనాలు మరియు రెండవది 23 నుండి 36 వచనాలు), అవి ఒకే రోజు ఇవ్వబడినవి. ఈ సందర్భమేమనగా ఒక సమావేశములో జోసెఫ్ స్మిత్ ఆమోదించబడి, ప్రధాన యాజకత్వమునకు అధ్యక్షునిగా నియమించబడెను. కొంతమంది పెద్దలు, వారి తక్షణ కర్తవ్యముల గురించి ఎక్కువ నేర్చుకొనుటకు ఇచ్ఛయించిరి. పిమ్మట ఈ బయల్పాటులు ఇవ్వబడినవి.

1–5, సువార్తను ప్రకటించు విశ్వాసులైన పెద్దలు నిత్యజీవమును పొందుదురు; 6–12, ఆదరణకర్తను పొందుటకు ప్రార్థించవలెను, అతడు అన్ని సంగతులను బోధించును; 13–22, పెద్దలు తమ సందేశమును తిరస్కరించువారితో తీర్పులో కూర్చొనియుందురు; 23–36, సువార్తికుల కుటుంబములు సంఘమునుండి సహాయము పొందవలెను.

1 నా ఆత్మ స్వరముతో మాట్లాడు నేను, అనగా అల్ఫాయు ఓమెగయు, మీ దేవుడును మీ ప్రభువునైన నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను—

2 నా సువార్తను ప్రకటించుటకు, నా ద్రాక్షతోటను శుద్ధిచేయుటకు మీ పేర్లను ఇచ్చిన మీరు ఆలకించుడి.

3 ఇదిగో నేను చెప్పునదేమనగా, మీరు ఆగక ముందుకు సాగవలెను, సోమరులుగా ఉండకూడదు, కానీ మీ శక్తితో పనిచేయవలెను, ఇదియే నా చిత్తము—

4 బూరధ్వని వలే మీ స్వరములెత్తి, నేను మీకు ఇచ్చియున్న బయల్పాటులను, ఆజ్ఞలను బట్టి సత్యమును చాటవలెను.

5 మీరు విశ్వాసముగానుండిన యెడల, మీరు అనేక పనలను మోసుకొనిపోవుదురు, మహిమ, ఘనత, అమర్త్యత్వము, నిత్యజీవములను కిరీటముగా ధరించెదరు.

6 కాబట్టి, నా సేవకుడైన విలియం ఇ. మెక్ లెలిన్‌తో నేను నిశ్చయముగా చెప్పునదేమనగా, తూర్పు దేశములకు వెళ్ళవలెనని నేనతనికి ఇచ్చియున్న నియామకమును రద్దుచేయుదును;

7 మరియు ఒక క్రొత్త నియామకమును, ఒక క్రొత్త ఆజ్ఞను నేనతనికి ఇచ్చుచున్నాను, దానిలో తన హృదయములో అతడు సణగుకొనినందుకు అతడిని మందలించుచున్నాను;

8 అతడు పాపము చేసెను; అయినప్పటికీ, నేనతనిని క్షమించుచున్నాను, దక్షిణ దేశములకు వెళ్ళవలెనని మరలా అతనికి చెప్పుచున్నాను.

9 నా సేవకుడైన లూక్ జాన్సన్ అతనితో వెళ్ళి, వారికి నేనాజ్ఞాపించియున్న సంగతులను చాటవలెను—

10 ఆదరణకర్త కొరకు ప్రభువు నామమున ప్రార్థించవలెను, ఆయన వారి కొరకు యుక్తమైన సంగతులను బోధించును—

11 వారు అలిసిపోకుండునట్లు ఎల్లప్పుడు ప్రార్థన చేయవలెను; వారు దీనిని చేసిన యెడల, అంతము వరకు నేను వారితోనుందును.

12 ఇదిగో, మిమ్ములను గూర్చి మీ దేవుడైన ప్రభువు చిత్తము ఇదియే. అలాగే జరుగును గాక. ఆమేన్.

13 మరలా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడైన ఓర్సన్ హైడ్, నా సేవకుడైన శామ్యుల్ హెచ్. స్మిత్‌లు తూర్పు దేశములకు ప్రయాణము చేసి, వారికి నేనాజ్ఞాపించియున్న సంగతులను చాటవలెను; వారు నమ్మకముగా ఉండిన యెడల, ఇదిగో అంతము వరకు నేను వారితోనుందును.

14 నా సేవకుడైన లైమన్ జాన్సన్, నా సేవకుడైన ఓర్సన్ ప్రాట్‌లు కూడా తూర్పు దేశములకు ప్రయాణము చేయవలెనని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను; ఇదిగో, అంతము వరకు వారితో కూడా నేనుందును.

15 మరలా, నా సేవకుడైన అస డాడ్స్, నా సేవకుడైన కాల్వ్స్ విల్సన్‌లు కూడా పశ్చిమ దేశములకు ప్రయాణము చేసి, నేను వారికి ఆజ్ఞాపించిన విధముగా నా సువార్తను చాటవలెనని సెలవిచ్చుచున్నాను.

16 విశ్వాసముగా ఉండువాడు అన్నింటిని జయించును మరియు అంత్య దినమున లేపబడును.

17 మరలా, నా సేవకుడైన మేజర్ ఎన్. ఆష్లేతో, నా సేవకుడైన బర్ రిగ్స్‌తో నేను చెప్పునదేమనగా, వారు దక్షిణ దేశములకు ప్రయాణము చేయవలెను.

18 వారికి నేనాజ్ఞాపించిన విధముగా వారందరు ప్రయాణము చేసి, ఇంటింటికి, గ్రామ గ్రామానికి, నగర నగరానికి వెళ్ళవలెను.

19 మరియు మీరు ప్రవేశించు ఏ గృహమందైనను వారు మిమ్ములను స్వీకరించిన యెడల, మీ దీవెనను ఆ గృహముపై విడిచిపెట్టవలెను.

20 మీరు ప్రవేశించు ఏ గృహమందైనను వారు మిమ్ములను స్వీకరించని యెడల, ఆ గృహమునుండి మీరు త్వరితముగా వెళ్ళి, వారికి విరోధముగా మీ పాద ధూళిని దులిపివేయవలెను.

21 మీరు సంతోషము, ఆనందముతో నింపబడుదురు; తీర్పుదినమందు ఆ గృహముపై న్యాయాధిపతులుగా నుండి, వారిని మీరు గద్దించెదరని దీనిని తెలుసుకొనుడి;

22 తీర్పుదినమందు ఆ ఇంటి స్థితికంటే, అన్యజనులు మరింత మేలుకరముగానుందురు; కాబట్టి, మీ నడుములకు దట్టీలను కట్టుకొని, విశ్వాసముగా నుండుడి, మీరు అన్నింటిని జయించి, అంత్య దినమందు పైకి లేపబడెదరు. అలాగే జరుగును గాక. ఆమేన్.

23 మరలా, మిమ్ములను గూర్చి ఆయన చిత్తమును తెలుసుకొనుటకు మీ పేర్లను ఇచ్చిన ఓ నా సంఘ పెద్దలారా, ప్రభువు మీకు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—

24 ఇదిగో, లోకమునకు సువార్తను చాటుటకు పిలువబడి, లోకములోనికి పంపబడవలసియున్న వారి కుటుంబములకు సహకారమందించుట, ఆ కుటుంబములకు సహకారమందించుటలో సహకరించుట, ఇది సంఘ బాధ్యతయైయున్నదని నేను మీతో చెప్పుచున్నాను.

25 కాబట్టి ప్రభువైన నేను ఈ ఆజ్ఞనిచ్చుచున్నాను, మీ సహోదరులు ఉదారముగా ఉండుటకు సమ్మతించినంత వరకు మీ కుటుంబముల కొరకు స్థలములు పొందవలెను.

26 తమ కుటుంబముల కొరకు స్థలములను, తమ కొరకు సంఘ సహకారమును పొందగలిగిన వారు లోకములోనికి తూర్పుకైనను, పశ్చిమముకైనను, ఉత్తరముకైనను, దక్షిణముకైనను వెళ్ళుటకు విఫలము కాకూడదు.

27 వారు అడుగవలెను, వారు పొందెదరు, వారు తట్టవలెను, అది వారికి తెరువబడును మరియు వారు ఎక్కడికి వెళ్ళవలెనో పైనుండి ఆదరణకర్త ద్వారా తెలుపబడును.

28 మరలా, తన కుటుంబమును పోషించవలసిన బాధ్యత గల ప్రతి మనుష్యుడు పోషించవలెను, అతడు తన కిరీటమును ఎంతమాత్రము కోల్పోడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను; అతడు సంఘములో సేవచేయవలెను.

29 ప్రతి మనుష్యుడు అన్ని విషయములందు శ్రద్ధ కలిగియుండవలెను. సోమరి పశ్చాత్తాపపడి, తన మార్గములను మార్చుకొనని యెడల సంఘములో స్థానము కలిగియుండడు.

30 కాబట్టి నా సేవకుడైన సిమ్యోన్ కార్టర్, నా సేవకుడైన ఎమర్ హారిస్;

31 మరియు నా సేవకుడైన ఎజ్రా థైర్, నా సేవకుడైన థామస్ బి. మార్ష్;

32 నా సేవకుడైన హైరం స్మిత్, నా సేవకుడైన రేనాల్డ్స్ కహూన్;

33 నా సేవకుడైన డానియెల్ స్టాన్టన్, నా సేవకుడైన సీమోర్ బ్రన్సన్;

34 నా సేవకుడైన సిల్విస్టర్ స్మిత్, నా సేవకుడైన గిడియన్ కార్టర్;

35 నా సేవకుడైన రగ్లెస్ ఏమ్స్, నా సేవకుడైన స్టీఫెన్ బర్నెట్;

36 నా సేవకుడైన మైఖా బి. వెల్టన్, నా సేవకుడైన ఈడెన్ స్మిత్ కూడా పరిచర్యలో ఐక్యము కావలెను. అలాగే జరుగును గాక. ఆమేన్.