84వ ప్రకరణము
1832, సెప్టెంబరు 22 మరియు 23 తేదీలలో కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. సెప్టెంబరు మాసములో పెద్దలు తూర్పుదేశములందు వారి పరిచర్యల నుండి తిరిగి వచ్చుట, వారి పనుల నివేదికలను తయారుచేయుట మొదలుపెట్టిరి. ఈ సంతోషకర సమయమందు వారు కలిసియుండగా, ఈ వర్తమానము పొందబడినది. ప్రవక్త దీనిని యాజకత్వమును గూర్చిన బయల్పాటుగా అభివర్ణించెను.
1–5, మిస్సోరిలో నూతన యెరూషలేము మరియు దేవాలయము నిర్మించబడును; 6–17, మోషే నుండి ఆదాము వరకు యాజకత్వ క్రమము ఇవ్వబడెను; 18–25, ఉన్నత యాజకత్వము దేవుని జ్ఞానము యొక్క తాళపుచెవులను కలిగియున్నది; 26–32, లఘు యాజకత్వము దేవదూతల పరచర్య యొక్కయు, సిద్ధపరచు సువార్త యొక్కయు తాళపుచెవులను కలిగియున్నది; 33–44, యాజకత్వపు ప్రమాణము మరియు నిబంధన ద్వారా మనుష్యులు నిత్యజీవమును పొందెదరు; 45–53, క్రీస్తు ఆత్మ మనుష్యులను వెలుగుతో నింపును, లోకము పాపమందున్నది; 54–61, పరిశుద్ధులు వారు పొందిన వాటిని గూర్చి సాక్ష్యము చెప్పవలెను; 62–76, వారు సువార్తను ప్రకటించవలెను మరియు సూచనలు వెంటవచ్చును; 77–91, పెద్దలు జోలెయైనను, సంచియైనను లేకుండా ముందుకు సాగవలెను, ప్రభువు వారి అవసరతల పట్ల శ్రద్ధ వహించును; 92–97, సువార్తను తిరస్కరించు వారి కొరకు తెగుళ్ళు, శాపములు వేచియున్నవి; 98–102, సీయోను విమోచన యొక్క క్రొత్త కీర్తన ఇవ్వబడినది; 103–110, ప్రతి మనుష్యుడు తన స్థానమునందు నిలిచియుండి, తన పిలుపునందు పని చేయవలెను; 111–120, ప్రభువు సేవకులు అంత్యదినముల యొక్క నాశనకరమైన హేయసంఘటనలను ప్రకటించవలెను.
1 తన సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. మరియు ఆరుగురు పెద్దలు తమ హృదయాలను ఏకముచేసి, తమ స్వరములెత్తి మొరపెట్టగా ఇవ్వబడిన యేసు క్రీస్తు యొక్క బయల్పాటు.
2 తన ప్రవక్తల నోటి మాట ద్వారా ఆయన మాట్లాడినట్లుగా తన ప్రజలను పునఃస్థాపించుటకు నూతన యేరూషలేము పట్టణముగానుండు సీయోను పర్వతముమీద నిలుచుటకై తన పరిశుద్ధులను సమకూర్చుటకు, అంత్య దినములలో స్థాపించబడిన తన సంఘమును గూర్చి ప్రభువు యొక్క వాక్కు.
3 ఆ పట్టణము మిస్సోరి రాష్ట్రపు పశ్చిమ సరిహద్దులలో ప్రభువు చేత నియమించబడి, ప్రభువు మిక్కిలి ఆనందించు జోసెఫ్ స్మిత్ జూ. మరియు ఇతరుల చేతులమీదుగా అంకితమివ్వబడిన దేవాలయపు స్థలము నుండి మొదలుకొని నిర్మించబడును.
4 నిశ్చయముగా ప్రభువు వాక్కు ఇదియే—ఈ స్థలము నుండి అనగా ఈ తరములో కట్టబడు దేవాలయము—ఆ దేవాలయపు స్థలము నుండి మొదలుకొని పరిశుద్ధులు కూడివచ్చుట ద్వారా నూతన యెరూషలేము పట్టణము నిర్మించబడును.
5 ఏలయనగా ప్రభువుకు ఒక మందిరము నిర్మించబడువరకు నిశ్చయముగా ఈ తరము గతింపదు, దానిపై ఒక మేఘము నివశించును, ఆ మేఘము ప్రభువు మహిమయైయుండును, అది మందిరమును నింపును.
6 మోషే కుమారులు, అతడు తన మామయైన యిత్రో చేతి క్రింద పొందిన పరిశుద్ధ యాజకత్వము ప్రకారము పొందిరి;
7 యిత్రో దానిని కాలేబు చేతినుండి పొందెను;
8 కాలేబు దానిని ఏలీహు చేతినుండి పొందెను;
9 ఏలీహు, యిర్మీయా చేతినుండియు;
10 యిర్మీయా, గాదు చేతినుండియు;
11 గాదు, యెషయా చేతినుండియు;
12 యెషయా దానిని దేవుని చేతినుండియు పొందెను.
13 యెషయా కూడా అబ్రాహాము దినములలో జీవించి, అతని వలన దీవించబడెను—
14 ఈ అబ్రాహాము మెల్కీసెదెకు నుండి యాజకత్వమును పొందెను, అతడు దానిని నోవహు వరకు నుండిన తన పితరుల వంశక్రమము నుండి పొందెను;
15 నోవహు నుండి హనోకు వరకు, వారి తండ్రుల వారసత్వము ద్వారాను;
16 హనోకు నుండి దేవుని ఆజ్ఞల వలన తన సహోదరుని కుట్రచే చంపబడిన, మొదటి మనుష్యుడును, అతని తండ్రియైన ఆదాము చేతినుండి యాజకత్వమును పొందిన హేబేలు వరకు—
17 ఆ యాజకత్వము అన్ని తరములలో దేవుని సంఘమందు కొనసాగును, దాని దినములకు ఆరంభమైనను, సంవత్సరాలకు అంతమైనను లేదు.
18 ప్రభువు అహరోను, అతని వంశమునకు ఒక యాజకత్వమును అన్ని తరములకు నిర్ధారించెను, ఆ యాజకత్వము కూడా దేవుని పరిశుద్ధ క్రమమును అనుసరించు యాజకత్వముతో కొనసాగును, నిరంతరము దానితో కలిసియుండును.
19 ఈ ఉన్నత యాజకత్వము సువార్తను నిర్వహించి, పరలోకరాజ్య మర్మముల తాళపుచెవులను అనగా దేవుని జ్ఞానము యొక్క తాళపుచెవిని కలిగియుండును.
20 కాబట్టి, దాని విధులయందు దైవత్వపు శక్తి ప్రత్యక్షపరచబడును.
21 దాని విధులు, యాజకత్వపు అధికారము లేకుండా శరీరమందు మనుష్యునికి దైవత్వపు శక్తి ప్రత్యక్షపరచబడదు;
22 ఏలయనగా ఇది లేకుండా ఏ ఒక్కడును దేవుడైన తండ్రి ముఖమును చూచి, జీవించియుండలేడు.
23 ఇప్పుడు ఈ మోషే ఇశ్రాయేలు సంతానమునకు అరణ్యమునందు స్పష్టముగా బోధించి, వారు దేవుని ముఖమును చూచునట్లు తన ప్రజలను పవిత్రపరచుటకు ఆసక్తితో వెదికెను;
24 కానీ వారు తమ హృదయాలను కఠినపరచుకొని, ఆయన సన్నిధిని నిలువలేకపోయిరి; కాబట్టి, వారు అరణ్యములోనుండగా ఆయన విశ్రాంతిలో ప్రవేశించరాదని, ప్రభువు తన ఉగ్రతయందు ప్రమాణము చేసెను, ఏలయనగా ఆయన కోపము వారిపై రగులుకొనెను, ఆ విశ్రాంతి ప్రభువు మహిమయైయున్నది.
25 కాబట్టి వారి మధ్య నుండి మోషేను, పరిశుద్ధ యాజకత్వమును ఆయన తీసివేసెను;
26 లఘు యాజకత్వము కొనసాగెను, ఆ యాజకత్వము దేవదూతల పరిచర్య యొక్క తాళపుచెవులను, సిద్ధపరచు సువార్తను కలిగియున్నది;
27 ఆ సువార్త పశ్చాత్తాపము యొక్కయు, బాప్తిస్మము యొక్కయు, పాపక్షమాపణ మరియు తల్లి గర్భమునుండి పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని చేత లేపబడిన యోహాను వరకు ప్రభువు తన ఉగ్రతయందు ఇశ్రాయేలు సంతానము మధ్య అహరోను గృహముతో కొనసాగునట్లు చేసిన లౌకిక ఆజ్ఞల యొక్క సువార్తయై యున్నది.
28 ఏలయనగా అతడు ఇంకను బాల్యమందే ఉండగా అతడు బాప్తిస్మము పొందెను, యూదుల సామ్రాజ్యమును పడద్రోయుటకును, ఆయన ప్రజల యెదుట ప్రభువు మార్గమును సరాళము చేయుటకును, ఎవరి చేతిలో సర్వాధికారము ఇవ్వబడెనో ఆ ప్రభువు రాకడకు వారిని సిద్ధపరచుటకు అతడు ఎనిమిది దినముల వయస్కుడైయుండు సమయములో దేవదూతచేత ఈ అధికారమునకు నియమించబడెను.
29 మరలా, పెద్ద మరియు బిషప్పుల స్థానములు ప్రధాన యాజకత్వమునకు సంబంధించిన ఆవశ్యకమైన అనుబంధ స్థానములు.
30 మరలా, బోధకుడు మరియు పరిచారకుని స్థానములు లఘు యాజకత్వమునకు సంబంధించిన ఆవశ్యకమైన అనుబంధ స్థానములు, ఆ యాజకత్వము అహరోను, అతని కుమారులపైన నిర్ధారించబడెను.
31 కాబట్టి, మోషే కుమారులను గూర్చి నేను చెప్పిన విధముగా—ఏలయనగా మోషే కుమారులు అహరోను కుమారులు ప్రభువు యొక్క మందిరములో అంగీకృత అర్పణలు బలులను అర్పించవలెను, ఆ మందిరము ఈ తరములో ప్రభువు కొరకు నేను నియమించిన ప్రతిష్ఠిత స్థలములో నిర్మించబడును—
32 మోషే, అహరోనుల కుమారులు సీయోను పర్వతముపైన, ప్రభువు యొక్క మందిరములో ప్రభువు మహిమతో నింపబడుదురు, వారి కుమారులు మీరే; నా సంఘమును నిర్మించుటకు నేను పిలిచి, ముందుకు పంపియున్నవారు అనేకులు ఉన్నారు.
33 ఈ రెండు యాజకత్వములను పొందుటలో వారి పిలుపును ఘనపరచుటలో విశ్వాసముగానుండు వారెవరైనను, వారి శరీరములు నూతనపరచబడుటకు ఆత్మవలన పవిత్రపరచబడుదురు.
34 వారు మోషే యొక్క, అహరోను యొక్క, అబ్రహాము సంతానము యొక్క కుమారులుగా, సంఘము మరియు దేవుని రాజ్యముగా దేవునిచేత ఎన్నుకోబడిన వారిగా అగుదురు.
35 ఈ యాజకత్వమును పొందువారందరు నన్ను చేర్చుకొందురని ప్రభువు సెలవిచ్చుచున్నాడు;
36 నా సేవకులను చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును;
37 నన్ను చేర్చుకొనువాడు నా తండ్రిని చేర్చుకొనును;
38 నా తండ్రిని చేర్చుకొనువాడు, నా తండ్రి రాజ్యమును పొందును; కాబట్టి నా తండ్రికి కలిగినదంతయు వానికియ్యబడును.
39 ఇది యాజకత్వమునకు చెందు ప్రమాణము మరియు నిబంధన ప్రకారము జరుగును.
40 కాబట్టి, యాజకత్వము పొందువారందరు నా తండ్రి యొక్క ఈ ప్రమాణము మరియు నిబంధనను పొందెదరు, దానిని ఆయన మీరలేరు, దానిని మార్చుటకు వీలుకాదు.
41 కానీ ఎవడైతే ఈ నిబంధనను పొందిన తరువాత దానిని మీరునో మరియు పూర్తిగా దానినుండి తొలగిపోవునో, అతడు ఈ లోకమందైనను, రాబోవు లోకమందైనను పాపక్షమాపణ కలిగియుండడు.
42 మీరు పొందియున్న ఈ యాజకత్వము యొద్దకు రాని వారందరికి శ్రమ, ఈ దినమున హాజరైన మీపై పరలోకము నుండి నా స్వరముచేత ఇప్పుడు దానిని నేను నిర్ధారించి, మిమ్ములను గూర్చి పరలోక సైన్యములకు, నా దూతలకు ఆజ్ఞాపించియున్నాను.
43 మిమ్ములను గూర్చి మీరు జాగ్రత్తపడుడని, నిత్య జీవపు మాటలకు శ్రద్ధతో చెవియొగ్గుడని ఇప్పుడు నేను మీకు ఒక ఆజ్ఞనిచ్చుచున్నాను.
44 ఏలయనగా దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటవలన మీరు జీవించెదరు.
45 ఏలయనగా ప్రభువు వాక్యము సత్యము, సత్యమైయున్నది ఏదైనను వెలుగైయున్నది, వెలుగైయున్నది ఏదైనను ఆత్మయైయున్నది అనగా యేసు క్రీస్తు ఆత్మయైయున్నది.
46 లోకములోనికి వచ్చు ప్రతి మనుష్యునికి ఆత్మ వెలుగునిచ్చును; ఆత్మ యొక్క స్వరమును ఆలకించు లోకములోనున్న ప్రతి మనిషిని ఆత్మ వెలుగుతో నింపును.
47 ఆత్మ స్వరమును ఆలకించు ప్రతి ఒక్కరు తండ్రియైన దేవుని యొద్దకు వచ్చెదరు.
48 తండ్రి ఆయన నూతనపరచి, మీపై నిర్ధారించిన నిబంధనను గూర్చి వానికి బోధించును, అది మీ నిమిత్తము, మీ కొరకే కాదు గాని సర్వలోకము నిమిత్తము మీపై నిర్ధారించబడినది.
49 సర్వలోకము పాపమందున్నది, అంధకారమందు, పాపపు చెరలో మూలుగుచున్నది.
50 దీనివలన, వారు నా యొద్దకు రాకుండెను గనుక వారు పాపపు చెరలో ఉన్నారని మీరు తెలుసుకొందురు.
51 ఏలయనగా నా యొద్దకు రానివాడెవడైనను పాపపు చెరలోనున్నాడు.
52 నా స్వరమును స్వీకరించనివాడు నా స్వరమును యెరిగియుండలేదు, వాడు నా వాడు కాడు.
53 దీనిని బట్టి దుష్టులనుండి నీతిమంతులను తెలుసుకొనవచ్చును మరియు సర్వలోకము పాపములో, అంధకారములో ఇప్పటికీ మూలుగుచున్నదని మీరు తెలుసుకొనవచ్చును.
54 అవిశ్వాసము వలన గతములో మీ మనస్సులకు చీకటి కమ్మెను, ఎందుకనగా మీరు పొందిన సంగతులను మీరు తేలికగా యెంచిరి—
55 ఆ అహంకారము మరియు అవిశ్వాసము సంఘమంతటికి నిందను తెచ్చెను.
56 ఈ నింద సీయోను సంతతిమీద, అనగా అందరిమీద నిలుచును.
57 వారు పశ్చాత్తాపపడి, నా నూతన నిబంధనయైన మోర్మన్ గ్రంథమును ఇంతకుముందు నేను వారికి ఇచ్చిన ఆజ్ఞలను జ్ఞాపకము చేసుకొనువరకు—చెప్పుట మాత్రమే కాదుగాని నేను వ్రాసియున్న దాని ప్రకారము చేయువరకు ఈ నిందతో వారు నిలిచియుందురు—
58 తద్వారా వారు తమ తండ్రి రాజ్యమునకు తగిన ప్రతిఫలమును తెచ్చెదరు; లేని యెడల సీయోను సంతానముపై క్రుమ్మరించబోవు తెగులు మరియు తీర్పు నిలిచియుండును.
59 రాజ్యసంబంధులు నా పరిశుద్ధ దేశమును అపవిత్రము చేయునా? చేయలేరు అని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను.
60 నా స్వరమైయున్న నా మాటలను ఇప్పుడు విను మీతో నేను చెప్పునదేమనగా, ఈ సంగతులను స్వీకరించిన యెడల మీరు ధన్యులు;
61 ఏలయనగా మీ పాపములను ఈ ఆజ్ఞతో నేను క్షమించెదను—అదేమనగా మీకు తెలుపబడిన సంగతులను గూర్చి సర్వలోకమునకు సాక్ష్యమిచ్చుటలో హృదయపూర్వకముగాను, ప్రార్థన యొక్క ఆత్మయందును మీ మనస్సులలో నిలకడగా ఉండవలెను.
62 కాబట్టి, మీరు సర్వలోకమునకు వెళ్ళుడి; మీరు వెళ్ళజాలని ప్రదేశములకు మీ నుండి సర్వలోకమునందు ప్రతి జీవికి సాక్ష్యము వెళ్ళునట్లు మీరు పంపవలెను.
63 నేను నా అపొస్తలులకు చెప్పిన విధముగా, మీకును చెప్పుచున్నాను, ఏలయనగా మీరు నా అపొస్తలులు, అనగా దేవుని ప్రధాన యాజకులు; నా తండ్రి నాకిచ్చినవారు మీరే; మీరు నా స్నేహితులు;
64 కాబట్టి, నా అపొస్తలులకు నేను చెప్పిన విధముగా, మీకును మరలా నేను చెప్పుచున్నాను, మీ మాటలయందు విశ్వసించి, పాప క్షమాపణ కొరకు నీటి ద్వారా బాప్తిస్మము పొందిన ప్రతి ఆత్మ, పరిశుద్ధాత్మను పొందును.
65 నమ్మువారికి ఈ సూచనలు కలుగును—
66 నా నామమందు వారు అనేక ఆశ్చర్యకార్యములు చేయుదురు;
67 నా నామమందు వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు;
68 నా నామమందు వారు రోగులను స్వస్థపరచుదురు;
69 నా నామమున వారు గ్రుడ్డివారి కన్నులు తెరిచెదరు, చెవిటివారి చెవులను విప్పెదరు;
70 మూగవాని నాలుక మాట్లాడును;
71 ఏ మనుష్యుడైనను వారికి విషమిచ్చిన యెడల, అది వారికి హానిచేయదు;
72 పాము విషము కూడా వారికి హానిచేయుటకు శక్తిని కలిగియుండదు.
73 కానీ వారికి నేనొక ఆజ్ఞనిచ్చుచున్నాను, అదేమనగా వారు ఈ సంగతులను గూర్చి గర్వించకూడదు, లోకము యెదుట వాటిని గూర్చి మాట్లాడకూడదు; ఏలయనగా ఈ సంగతులు మీ ప్రయోజనము కొరకు, రక్షణ కొరకు మీకు ఇవ్వబడినవి.
74 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, మీ మాటలయందు విశ్వసించక, పరిశుద్ధాత్మను పొందుటకు వారి పాపక్షమాపణ నిమిత్తము నా నామమందు నీటిలో బాప్తిస్మము పొందనివారు శిక్షింపబడుదురు, నా తండ్రి రాజ్యమునకు రానేరరు, అక్కడ నేనును, నా తండ్రియు ఉందుము.
75 ఈ బయల్పాటును, ఆజ్ఞయు మీకు ఇవ్వబడెను, ఈ గడియ నుండి సర్వలోకమునకు అమలు చేయబడును, దానిని ఎవరైతే పొందియుండలేదో వారందరికి సువార్త వెళ్ళును.
76 కానీ రాజ్యము ఇవ్వబడిన వారందరితో నేను నిశ్చయముగా చెప్పునదేమనగా—అది మీ నుండి వారికి ప్రకటించడవలెను, తద్వారా వారు గతములో చేసిన తమ చెడు కార్యములను గూర్చి పశ్చాత్తాపపడుదురు; ఏలయనగా వారు విశ్వాసము లేని తమ దుష్ట హృదయమును గూర్చి, నేను మిమ్ములను పంపిన సమయములో సీయోనులోనున్న మీ సహోదరులు మీకు విరోధముగా చేసిన తిరుగుబాటును గూర్చి గద్దింపబడవలెను.
77 నా స్నేహితులారా, నేను మరలా మీతో చెప్పుచున్నాను, ఏలయనగా ఇకనుండి నేను మిమ్ములను నా స్నేహితులని పిలిచెదను, తద్వారా నేను వారితోనున్న దినములందు నా శక్తియందు సువార్తను ప్రకటించుటకు ప్రయాణించిన నా స్నేహితులవలే మీరును అగునట్లు నేను మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుట యుక్తము.
78 ఏలయనగా సంచియైనను, జోలెయైనను, రెండు అంగీలనైనను కలిగియుండవద్దని నేను వారికి చెప్పితిని.
79 ఇదిగో, లోకమును పరీక్షించుటకు నేను మిమ్ములను పంపుచున్నాను, పనివాడు తన జీతమునకు పాత్రుడు.
80 రాజ్యము యొక్క ఈ సువార్తను ప్రకటించుటకు వెళ్ళు ఏ మనుష్యుడైనను, అన్ని విషయములందు విశ్వాసముగా కొనసాగుటకు విఫలము కానీ యెడల, మనస్సునందు చీకటికమ్మక, శరీరమందును, అవయవము మరియు కీలునందు అలయకయుండును; మరియు తండ్రి సెలవులేక అతని తలవెంట్రుకలలో ఒకటియైనను నేలరాలదు. అతడు ఆకలిగొనడు, దప్పిగొనడు.
81 కాబట్టి ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, యేమి ధరించుకొందుమో అని రేపటిని గూర్చి చింతింపకుడి.
82 అడవి పువ్వులు ఏలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు; అయినను తన సమస్త వైభవముతో కూడిన ఈ లోక రాజ్యములు సహితము వీటిలో నొకదానివలె అలంకరింపబడలేదు.
83 ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
84 కాబట్టి, రేపటి దినమును దాని సంగతులను గూర్చి చింతించనిమ్ము.
85 ఏమి చెప్పుదుము అని ముందే మీరు చింతింపకుడి; కానీ నిత్యజీవపు మాటలను ఎడతెగక మీ మనస్సులలో భద్రపరచుకొనుడి, ప్రతి మనుష్యునికి సరిపడే ఆ భాగము, ఆ గడియలోనే అది మీకనుగ్రహింపబడును.
86 కాబట్టి, ఈ పరలోకరాజ్య సువార్తను ప్రకటించుటకు వెళ్ళు మీలో ఎవడును ఈ గడియనుండి సంచియైనను, జోలెయైనను తీసుకొని వెళ్ళకూడదు, ఏలయనగా ఈ ఆజ్ఞ దేవునిచేత సంఘమునందు పరిచర్యకు పిలువబడిన విశ్వాసులందరికి వర్తించును.
87 ఇదిగో, అవినీతి కార్యములన్నిటిని గూర్చి లోకమును ఒప్పించుటకు, రాబోవు తీర్పును గూర్చి బోధించుటకు నేను మిమ్ములను పంపుచున్నాను.
88 ఎవరైతే మిమ్ములను చేర్చుకొనునో, అక్కడ నేనును ఉందును, ఏలయనగా నేను మీ యెదుట వెళ్ళెదను. నేను మీ కుడివైపున, మీ ఎడమవైపున ఉందును, నా ఆత్మ మీ హృదయములందుండును, మిమ్ములను ఎత్తుకొనుటకు మీ చుట్టూ నా దేవదూతలు కావలియుందురు.
89 మిమ్ములను చేర్చుకొనువాడు నన్నును చేర్చుకొనును; అట్టివాడు మీకు ఆహారమును, వస్త్రమును, ధనమును ఇచ్చును.
90 మీకు ఆహారమును, వస్త్రమును, ధనమును ఇచ్చువాడు ఎంతమాత్రము తన బహుమానమును కోల్పోడు.
91 ఈ సంగతులను చేయనివాడు నా శిష్యుడు కాడు; దీనివలన నా శిష్యులను మీరు తెలుసుకొందురు.
92 మిమ్ములను చేర్చుకొనని వాని యొద్దనుండి, మీయంతట మీరు దూరముగా వెళ్ళి, అది వేసవియైనను, శీతలమైనను నీటితో, స్వచ్ఛమైన నీటితో మీ పాదములను కడుగుకొనుడి, దానిని గూర్చి పరలోకమందున్న మీ తండ్రికి సాక్ష్యమియ్యుడి, మరలా ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్ళకుడి.
93 మీరు ప్రవేశించు ఏ పల్లెయైనను, లేదా పట్టణమైనను ఆ విధముగానే చేయుడి.
94 అయినప్పటికీ తాళక శ్రద్ధతో వెదకుడి; మిమ్ములను, మీ మాటలను లేదా నన్ను గూర్చి మీ సాక్ష్యములను తిరస్కరించు ఆ గృహము, పల్లె లేదా పట్టణమునకు శ్రమ.
95 మరలా నేను చెప్పుచున్నాను, మిమ్ములను, మీ మాటలను లేదా నన్ను గూర్చి మీ సాక్ష్యములను తిరస్కరించు ఆ గృహము, పల్లె లేదా పట్టణమునకు శ్రమ;
96 ఏలయనగా సర్వశక్తిమంతుడనగు నేను, జనముల దుష్టత్వము కొరకు వారిని కొట్టుటకు వారిపై నా చేతులెత్తితిని.
97 మరియు తెగుళ్ళు బయలువెళ్ళును, నేను నా కార్యమును పూర్తిచేయు వరకు అవి భూమి మీద నుండి తీసివేయబడవు, అది నీతితో సమాప్తమగుటకు క్లుప్తపరచబడును—
98 వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు మిగిలిన వారందరు నన్ను తెలుసుకొని, ప్రభువును గూర్చిన జ్ఞానముతో నింపబడి, కన్నులారా చూచి, వారి స్వరములెత్తి, కలసి ఈ క్రొత్త కీర్తన పాడెదరు:
99 ప్రభువు సీయోనును మరలా రప్పించెను; తన జనులైన ఇశ్రాయేలును ప్రభువు విమోచించెను, కృప ఏర్పాటు చొప్పున, విశ్వాసము వలన వారి పితరుల నిబంధన వలన అది సంభవించెను.
100 ప్రభువు తన జనులను విమోచించెను; అపవాది బంధింపబడెను, ఇక ఆలస్యముండదు. ప్రభువు సమస్తమును ఏకముగా సమకూర్చెను. పైనుండి సీయోనును ప్రభువు క్రిందికి రప్పించెను. క్రిందినుండి సీయోనును ప్రభువు పైకి తీసుకొనివచ్చెను.
101 భూమి ప్రసవవేదన పడి, తన సీయోనును కనెను; ఆమె కడుపునందు సత్యము నెలకొల్పబడెను; పరలోకములు ఆమెను చూచి చిరునవ్వు నవ్వెను; ఆమె తన దేవుని మహిమతో వస్త్రములను ధరించుకొనెను; ఏలయనగా ఆయన తన జనులమధ్య నిలుచును.
102 మహిమ, ఘనత, ప్రభావము, బలము, మన దేవునికి చెల్లించెదము; ఏలయనగా ఆయన కరుణతో నిండియున్నాడు, న్యాయము, కృప, సత్యము, సమాధానము నిరంతరము కలిగియున్నాడు, ఆమేన్.
103 మరలా, నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నా నిత్య సువార్తను ప్రకటించుటకు బయలువెళ్ళు ప్రతి మనుష్యుడును, వారు కుటుంబములను కలిగియుండి, బహుమానము వలన ధనమును పొందినయెడల, వారికి ప్రభువు నిర్దేశించిన ప్రకారము దానిని వారికి పంపవలెను లేదా వారి ప్రయోజనము కొరకు దానిని ఉపయోగించుట యుక్తము, ఏలయనగా ఇది నాకు మంచిదని తోచుచున్నది.
104 ధనమును పొంది, కుటుంబములు లేనివారందరు, సీయోనులోనున్న బిషప్పుకు లేదా ఒహైయోలోనున్న బిషప్పుకు దానిని పంపవలెను, తద్వారా అది బయల్పాటులను ముందుకు తీసుకొనివచ్చుటకు, వాటిని ముద్రించుటకు, సీయోనును స్థాపించుటకు సమర్పించబడును.
105 మీలో ఎవనికైనను ఒకడు కోటును లేదా సూటును ఇచ్చిన యెడల, పాతది తీసుకొని బీదలకు ఇచ్చివేసి, సంతోషముతో మీ మార్గమున వెళ్ళుడి.
106 మీలో ఎవడైనను ఆత్మయందు బలముగా ఉండగోరినయెడల, సాత్వికముతో అతడు ఆత్మీయాభివృద్ధి పొందునట్లు అతనితో బలహీనుడైన వానిని తీసుకొనివెళ్ళవలెను, తద్వారా అతడు కూడా బలవంతుడగును.
107 కాబట్టి, లఘు యాజకత్వమునకు నియమించబడిన వారిని మీతో తీసుకొనివెళ్ళుడి, కలుసుకొను సమయమును నిర్ణయించుటకు, మార్గమును సిద్ధపరచుటకు, మీకు మీరు పూరించలేని నియామకములను పూరించుటకు మీకు ముందుగా వారిని పంపుడి.
108 ఇదిగో, ఈ విధముగానే ప్రాచీన దినములందు నా అపొస్తలులు నా కొరకు నా సంఘమును నిర్మించిరి.
109 కాబట్టి, ప్రతి మనుష్యుడు తన స్థానమునందు నిలిచి, తన పిలుపునందు పనిచేయవలెను; పాదములు అవసరములేదని తల, పాదములతో అనకూడదు; పాదములు లేకుండా శరీరము ఏవిధముగా నిలబడగలదు?
110 అవయవములన్నియు వృద్ధిపొంది, శరీరమందు పరిపూర్ణమగునట్లు, శరీరమునకు కూడా ప్రతి అవయవము యొక్క అవసరము కలదు.
111 ఇదిగో ప్రధాన యాజకులు, పెద్దలు, లఘు యాజకులు కూడా ప్రయాణము చేయవలెను; కానీ పరిచారకులు, బోధకులు సంఘమును కనిపెట్టుకొనియుండుటకు, సంఘమందు నిలిచియుండి పరిచర్య చేయువారిగా ఉండుటకు నియమించబడవలెను.
112 బిషప్పు న్యూయెల్ కె. విట్నీ కూడా ధనికులను, గర్విష్ఠులను వినయముగా చేయుట ద్వారా బీదల అవసరతలను నెరవేర్చుటకు వారి కొరకు వెదకుచూ చుట్టుప్రక్కల సంఘములన్నింటికి ప్రయాణము చేయవలెను.
113 అధికారముతో పనిచేయుటకు అతడు నిర్దేశించిన ప్రకారము అతని లౌకిక కార్యమును చేయుటకు కూడా అతడు ఒక ప్రతినిధిని నియమించవలెను.
114 అయినప్పటికీ, బిషప్పు న్యూయార్క్ నగరమునకు, అలాగే ఆల్బేని, బోస్టన్ నగరములకు కూడా వెళ్ళి, ఆ నగరములలోనున్న ప్రజలు ఈ సంగతులను తిరస్కరించిన యెడల, వారికొరకు వేచియున్న నిర్జనమును, సంపూర్ణ వినాశనమును గూర్చి సువార్త శబ్దముతో, భీకర స్వరముతో వారిని హెచ్చరించవలెను.
115 ఏలయనగా వారు ఈ సంగతులను తిరస్కరించిన యెడల, వారి తీర్పు గడియ సమీపములోనుండును, వారి గృహములు వారి యెదుట నిర్మానుష్యము చేయబడును.
116 అతడు నా యందు నమ్మికయుంచిన యెడల అతడు సిగ్గుపరచబడడు; తండ్రి సెలవులేక అతని తలవెంట్రుకలలో ఒకటియైనను నేలరాలదు.
117 నా సేవకులలో మిగిలినవారైన మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను, మీ పరిస్థితులకు అనుగుణముగా, మీ అనేకమైన పిలుపులలో గొప్ప మరియు ప్రసిద్ధిచెందిన పట్టణములకు, పల్లెలకు మీరు వెళ్ళి, వారి అవినీతికరమైన, అపవిత్ర కార్యములన్నిటి గూర్చి, అంత్యదినములలో హేయకరమైన నిర్జనమును గూర్చి నీతియందు లోకమును గద్దించుచు, స్పష్టముగా అర్థమగురీతిలోను ప్రకటించవలెను.
118 ఏలయనగా నేను మీ చేత వారి రాజ్యములను పడగొట్టించెదను; భూమిని మాత్రమే కాక, నేను ఆకాశమును కూడా కంపింపజేతును.
119 ఏలయనగా ప్రభువైన నేను, పరలోక శక్తులను వినియోగించుటకు నా చేతిని చాచితిని; దానిని మీరిప్పుడు చూడలేరు గాని కొద్దికాలము తరువాత దానిని మీరు చూచెదరు, నేను ఉన్నవాడనని, మరియు నేను వచ్చి నా జనులను పరిపాలించెదనని తెలుసుకొందురు.
120 నేను అల్ఫాయు ఓమెగయు, ఆదియు, అంతమునైయున్నాను. ఆమేన్.