19వ అధ్యాయము
లమోనై నిత్యజీవపు వెలుగును పొందును మరియు విమోచకుని చూచును—అతని కుటుంబము పారవశ్యము పొందును మరియు అనేకులు దేవదూతలను చూచెదరు—అమ్మోన్ అద్భుత రీతిలో కాపాడబడును—అతడు అనేకులకు బాప్తిస్మమిచ్చి, వారి మధ్య ఒక సంఘమును స్థాపించును. సుమారు క్రీ. పూ. 90 సం.
1 రెండు పగళ్ళు మరియు రెండు రాత్రుల తరువాత వారు అతని శరీరమును తీసుకొని, తమ మృతులను పాతిపెట్టుటకు తయారుచేసిన ఒక సమాధిలో ఉంచబోయిరి.
2 ఇప్పుడు రాణి, అమ్మోన్ కీర్తిని వినియున్నందున అతడు తన వద్దకు రావలెనని కబురు పంపెను.
3 అమ్మోన్ తనకు ఆజ్ఞాపించబడినట్లు చేసెను మరియు రాణి యొద్దకు వెళ్ళి, తానేమి చేయవలెనని ఆమె కోరుచున్నదో తెలుసుకొనగోరెను.
4 ఆమె అతనితో ఇట్లు చెప్పెను: నీవు ఒక పరిశుద్ధ దేవుని ప్రవక్తవని, ఆయన నామమందు అనేక గొప్ప కార్యములు చేయుటకు శక్తి కలిగియున్నావని నా భర్త యొక్క సేవకులు నాకు తెలియజేసియున్నారు;
5 ఇది నిజమైన యెడల నీవు లోనికి వెళ్ళి, నా భర్తను చూడవలెనని నేను కోరుచున్నాను, ఏలయనగా అతడు రెండు పగళ్ళు మరియు రెండు రాత్రుల పాటు అతని మంచము మీద పడియున్నాడు; అతడు చనిపోలేదని కొందరు చెప్పుచున్నారు, కానీ ఇతరులు అతడు చనిపోయాడని, వాసనకొట్టుచున్నాడని, అతడు సమాధిలో ఉంచబడవలెనని చెప్పుచున్నారు; కాని, నాకైతే అతడు వాసనకొట్టుట లేదు.
6 ఇప్పుడు అమ్మోన్ కోరినది ఇదియే, ఏలయనగా రాజైన లమోనై దేవుని శక్తిచేత లోబరచుకొనబడెనని అతడు ఎరిగియుండెను; అవిశ్వాసము యొక్క అంధకారపు తెర అతని మనస్సు నుండి తీసివేయబడుచున్నదని, దేవుని మహిమ యొక్క వెలుగు అనగా ఆయన మంచితనము యొక్క అద్భుతమైన వెలుగు, అతని మనస్సును వెలిగించిన ఆ వెలుగు—అంధకారపు మేఘమును చెదరగొట్టి, నిత్యజీవపు వెలుగు అతని ఆత్మను వెలిగించునంతగా అతని ఆత్మ యందు సంతోషమును నింపెనని, ఇది అతని భౌతిక శరీరమును జయించెనని, అతడు దేవునియందు కొనిపోబడెనని అతడు ఎరిగియుండెను.
7 కావున, రాణి అతని నుండి కోరినదే అతని కోరిక అయ్యుండెను. అందువలన రాణి అతడిని కోరియున్న ప్రకారము, అతడు రాజును చూచుటకు లోనికి వెళ్ళెను; అతడు రాజును చూచెను మరియు అతడు మరణించలేదని ఎరిగియుండెను.
8 రాణితో అతడిట్లు చెప్పెను: అతడు మరణించలేదు, కానీ అతడు దేవునియందు విశ్రమించుచున్నాడు, ఉదయమున అతడు తిరిగి లేచును; కావున, అతడిని సమాధి చేయకుము.
9 మరియు అమ్మోన్ ఆమెతో—నీవు దీనిని నమ్ముచున్నావా? అనెను. అందుకామె అతనితో—నీ మాట, మా సేవకుల మాట తప్ప నేను ఏ సాక్ష్యమును కలిగిలేను; అయినప్పటికీ నీవు చెప్పిన ప్రకారమే జరుగునని నేను నమ్ముచున్నాను అనెను.
10 అప్పుడు అమ్మోన్ ఆమెతో—అధికమైన నీ విశ్వాసమును బట్టి నీవు ధన్యురాలవు; ఓ స్త్రీ, నేను నీతో చెప్పుచున్నాను, నీఫై జనులందరి మధ్య ఇట్టి గొప్ప విశ్వాసము ఎక్కడను లేదు అనెను.
11 ఆ సమయము నుండి అతడు లేచునని అమ్మోన్ నియమించిన ఉదయకాల సమయము వరకు ఆమె తన భర్త మంచము ప్రక్కన కనిపెట్టుకొనియుండెను.
12 మరియు అమ్మోన్ మాటల ప్రకారము అతడు లేచెను; అతడు లేవగానే తన చేతిని ఆ స్త్రీ వైపు ముందుకు చాపి ఇట్లనెను: దేవుని నామము స్తుతినొందునుగాక మరియు నీవు ధన్యురాలవు.
13 ఏలయనగా నీవు జీవించుచున్నంత నిశ్చయముగా నేను నా విమోచకుని చూచియున్నాను; ఆయన ఒక స్త్రీకి జన్మించి, ఆయన నామమందు విశ్వసించు సమస్త మానవజాతిని విమోచించును. ఇప్పుడతడు ఈ మాటలు చెప్పినప్పుడు అతని హృదయము ఉప్పొంగెను, అతడు సంతోషముతో మరలా పడిపోయెను; రాణి కూడా ఆత్మ చేత వశపరచుకొనబడి పడిపోయెను.
14 ఇప్పుడు వారి దుర్ణీతులు, ఆచారములను బట్టి, నీఫైయుల మధ్య లేదా దేవుని జనులందరి మధ్య అంత అధికమైన దుఃఖమునకు కారణమైయుండిన లేమనీయుల మీద తన ప్రార్థనల ప్రకారము ప్రభువు యొక్క ఆత్మ క్రుమ్మరింపబడుట చూచి అమ్మోన్ తన మోకాళ్ళపై నిలిచి, తన సహోదరుల కొరకు ఆయన చేసిన దాని నిమిత్తము దేవునికి ప్రార్థన మరియు కృతజ్ఞతాస్తుతులయందు తన ఆత్మను క్రుమ్మరించుట మొదలుపెట్టెను; అతడు కూడా సంతోషముతో వశము తప్పెను; ఆ విధముగా వారు ముగ్గురు నేలపై పడిరి.
15 ఇప్పుడు వారు పడిపోయిరని చూచినప్పుడు, ప్రభువును గూర్చి వారికి భయము కలిగినందున రాజు యొక్క సేవకులు కూడా దేవునికి మొరపెట్టసాగిరి, ఏలయనగా రాజు యెదుట నిలబడి అమ్మోన్ యొక్క గొప్ప శక్తిని గూర్చి సాక్ష్యమిచ్చినది వీరే.
16 మరియు లేమనీయ స్త్రీలలో ఒకతెతప్ప వారందరు నేలపై పడువరకు కూడా వారు తమ శక్తితో ప్రభువు యొక్క నామమున ప్రార్థించిరి. ఆమె పేరు ఏబిష్. తన తండ్రి యొక్క అసాధారణమైన దర్శనమును బట్టి, అనేక సంవత్సరముల ముందు ఆమె ప్రభువుకు పరివర్తన చెందియుండెను.
17 ఆ విధముగా ప్రభువుకు పరివర్తన చెందియుండి, ఎన్నడును దానిని తెలియజేయకయుండి, లమోనై యొక్క సేవకులందరు నేలపై పడియున్నారని, ఆమె యజమానురాలైన రాణి, రాజు మరియు అమ్మోన్ నేలపై సాష్టాంగపడియున్నారని చూచినప్పుడు, అది దేవుని శక్తియని ఆమె ఎరిగియుండెను; వారి మధ్య జరిగిన దానిని జనులకు తెలియజేయుట ద్వారా, వారు ఈ దృశ్యమును చూచుట ద్వారా, దేవుని శక్తి యందు వారు విశ్వసించునట్లు చేయుటకు ఇదే అవకాశమని ఆమె తలంచెను, కావున జనులకు దానిని తెలియజేయుచూ ఆమె ఇంటింటికి పరుగెత్తెను.
18 అంతట వారు రాజు యొక్క ఇంట కూడుకొనుట ప్రారంభించిరి. మరియు అక్కడకు ఒక సమూహము వచ్చి, నేలపై సాష్టాంగపడిన రాజు, రాణి మరియు వారి సేవకులు చనిపోయినట్లు అక్కడ పడియుండుటను చూచి ఆశ్చర్యపోయిరి. వారు నీఫైయుడైన అమ్మోన్‌ను కూడా చూచిరి.
19 ఇప్పుడు ఒక నీఫైయుడు దేశమందు ఉండునట్లు అనుమతించినందున వారిపైన లేదా రాజు మరియు అతని ఇంటిపైన ఈ గొప్పకీడు వచ్చెనని చెప్పుచూ వారిలో కొందరు జనులు తమలోతాము సణుగుట మొదలుపెట్టిరి.
20 కానీ ఇతరులు ఇట్లు చెప్పుచూ వారిని గద్దించిరి: రాజు ఈ కీడును తన ఇంటిపైకి తెచ్చియున్నాడు, ఏలయనగా సీబస్ జలముల యొద్ద తమ మందలు చెదరగొట్టబడినందున అతడు తన సేవకులను సంహరించెను.
21 మరియు సీబస్ జలముల వద్ద నిలబడి రాజుకు చెందిన మందలను చెదరగొట్టిన ఆ మనుష్యుల ద్వారా కూడా వారు గద్దింపబడిరి, ఏలయనగా రాజు యొక్క మందలను కాపాడుటకై సీబస్ జలముల వద్ద అతడు సంహరించిన తమ సహోదరుల సంఖ్యను బట్టి, వారు అమ్మోన్‌తో కోపముగానుండిరి.
22 ఇప్పుడు, తన సహోదరుడు అమ్మోన్ యొక్క ఖడ్గము చేత సంహరింపబడియుండిన కారణముగా వారిలో ఒకడు అమ్మోన్‌పట్ల మిక్కిలి కోపముగానుండి, అతడిని సంహరించుటకు తన ఖడ్గము దూసెను; అమ్మోన్‌ను చంపుటకు తన ఖడ్గమును ఎత్తగా, అతడు చచ్చిపడెను.
23 అయితే అమ్మోన్ సంహరింపబడలేదని మనము చూచుచున్నాము, ఏలయనగా ప్రభువు అతని తండ్రి మోషైయతో—నేను అతడిని బ్రతికింతును మరియు నీ విశ్వాసమును బట్టి అది అతనికి జరుగునని చెప్పియుండెను—కావున మోషైయ అతడిని ప్రభువుకు అప్పగించెను.
24 ఇప్పుడు అమ్మోన్‌ను సంహరించుటకు ఖడ్గమును ఎత్తిన ఆ మనుష్యుడు చచ్చిపడెనని సమూహము చూచినపుడు, వారందరికి భయము కలిగెను; అతడిని లేదా అక్కడ పడియున్న వారిలో ఎవరినీ తమ చేతులతో తాకుటకు వారు ధైర్యము చేయలేదు; ఈ గొప్పశక్తికి కారణమేమైయుండును లేదా ఈ విషయములన్నిటి అర్థము ఏమిటని వారిలో వారు ఆశ్చర్యపడసాగిరి.
25 అమ్మోన్ ఒక గొప్ప ఆత్మయని చెప్పిన వారనేకులు వారి మధ్య ఉండిరి, ఇతరులు అతడు ఒక గొప్ప ఆత్మ చేత పంపబడెనని చెప్పిరి.
26 కానీ అతడు వారిని హింసించుటకు నీఫైయుల వద్ద నుండి పంపబడిన రాక్షసుడని చెప్పుచూ ఇతరులు వారందరినీ గద్దించిరి.
27 మరియు వారి దోషములను బట్టి వారిని బాధించుటకు గొప్ప ఆత్మ ద్వారా అమ్మోన్ పంపబడెనని, అది నీఫైయులను ఎల్లప్పుడు కనిపెట్టుకొనియుండి, తమ చేతులలోనుండి ఎల్లప్పుడు వారిని విడిపించిన గొప్ప ఆత్మయని చెప్పిన వారు అక్కడ కొందరు ఉండిరి; వారి సహోదరులైన లేమనీయులలో ఎక్కువ మందిని నాశనము చేసినది ఈ గొప్ప ఆత్మయేనని వారు చెప్పిరి.
28 ఆ విధముగా వారి మధ్య వివాదము మిక్కిలి తీవ్రమవసాగెను. వారు ఆ విధముగా వాదించుకొనుచుండగా, సమూహము సమకూడునట్లు చేసిన ఆ సేవకురాలు వచ్చెను మరియు సమూహము మధ్య ఉన్న వివాదమును చూచినపుడు, ఆమె కన్నీళ్ళు వచ్చునంతగా దుఃఖించెను.
29 ఆమె వెళ్ళి, బహుశా నేలపై నుండి రాణిని లేపవచ్చునేమోయని ఆమెను చేతితో పట్టుకొనెను; ఆమె చేతిని తాకిన వెంటనే ఆమె లేచి తన కాళ్ళపై నిలబడి, బిగ్గరగా ఇట్లు చెప్పెను: భయంకరమైన నరకము నుండి నన్ను రక్షించిన, ధన్యుడవైన ఓ యేసూ! ధన్యుడవైన ఓ దేవా! ఈ జనులపై కనికరము చూపుము.
30 ఆమె ఇట్లు చెప్పినప్పుడు తన చేతులను జతచేసి సంతోషముతో నిండి, అర్థము కాని అనేక మాటలను పలికెను; దీనిని చేసిన తరువాత, ఆమె రాజైన లమోనైని చేతితో పట్టుకొనెను మరియు అతడు లేచి తన కాళ్ళపై నిలబడెను.
31 తన జనుల మధ్య వివాదమును చూచిన వెంటనే, అతడు ముందుకు వెళ్ళి వారిని గద్దించుచూ అమ్మోన్ నోటి నుండి అతడు వినిన మాటలను వారికి బోధించుట మొదలుపెట్టెను; అతని మాటలను వినిన వారందరు విశ్వసించి, ప్రభువుకు పరివర్తన చెందిరి.
32 కానీ అతని మాటలను వినని వారనేకులు వారిలో ఉండిరి; కావున వారి దారిన వారు వెళ్ళిరి.
33 అమ్మోన్ లేచినప్పుడు అతడు కూడా వారికి పరిచర్య చేసెను మరియు లమోనై సేవకులందరు కూడా పరిచర్య చేసిరి; అదే సంగతిని, అనగా వారి హృదయములు పరివర్తన చెందినవని, కీడు చేయుటకు వారికిక ఎట్టి కోరిక లేదని వారందరు జనులకు ప్రకటించిరి.
34 వారు దేవదూతలను చూచియున్నారని, వారితో మాట్లాడియున్నారని అనేకులు జనులకు ప్రకటించిరి; ఆ విధముగా వారు దేవునికి, ఆయన నీతికి సంబంధించిన విషయములను వారికి చెప్పిరి.
35 వారి మాటలయందు విశ్వసించిన వారు అక్కడ అనేకులుండిరి; విశ్వసించిన వారందరు బాప్తిస్మము పొందిరి; వారు నీతిమంతులైన జనులైరి మరియు వారి మధ్య ఒక సంఘమును స్థాపించిరి.
36 ఆ విధముగా లేమనీయుల మధ్య దేవుని కార్యము ప్రారంభమాయెను; ఆ విధముగా ప్రభువు తన ఆత్మను వారిపై క్రుమ్మరించుట మొదలుపెట్టెను; మరియు పశ్చాత్తాపపడి, ఆయన నామమందు విశ్వాసించు జనులందరికీ ఆయన బాహువు చాపబడియున్నదని మనము చూచుచున్నాము.